శర్మ కాలక్షేపంకబుర్లు-మౌనం.

మౌనం

కృషితో నాస్తి దుర్భిక్షం
జపతో నాస్తి పాతకం,
మౌనేన కలహో నాస్తి,
నాస్తి జాగరతో భయం.

వ్యవసాయం చేస్తే కరువుండదు, తపస్సు చేస్తే పాపముండదు, మౌనంగా ఉంటే దెబ్బలాట ఉండదు, జాగ్రత్తగా ఉంటే భయం లేదు.

పంచభూతాలలో రసనేంద్రియం చేసే మరోపని మాటలాడటం. దీనిని మానేయడమే మౌనం, దీనిని వాజ్మౌనం అని, ఇంద్రియాలను నిగ్రహించడం అక్షమౌనమని, కాష్ఠమౌనం అంటే మానసిక మౌనమని అర్ధమట.. నిజానికి మాటాడటం మానేయడం మౌనం కాదేమో! మానసిక మౌనమే మౌనం కావచ్చని నా ఊహ. మానసిక మౌనమంటే మనసు చేసే ఆలోచనని అరికట్టడం. ఇది చాలా కష్టమయిన సంగతే. మహాత్ముడు కూడా మౌనవ్రతం పాటించినట్లుంది. మౌనం మాట్లాడుతుందంటారు. నిజమా? “మౌనమె నీ భాష ఓ మూగమనసా!” మంచి పాట బాలమురళి గారి గొంతులో. “మనసు మూగదే కాని బాసుండది దానికి, చెవులుండే మనసుకే వినిపిస్తుందా అది.” సినీ కవి చెప్పినా ఎంత గొప్ప ఊహ. నేటిరోజులలోని పాటలలో ఇంతటి శక్తి, అతిశయోక్తి.

మౌనం ఏమయినా చేయగలదా? నిజం! చేయగలదు, నా అనుభవం చెబుతా వినండి. కాకినాడలో ఉంటున్న రోజులు, మెయిన్ రోడ్డు నుంచి దేవాలయం వీధిలోకి వస్తున్నా, జైన దేవాలయం ఉన్న వీధిలోనుంచి, సైకిల్ మీద. నేను మెయిన్ రోడ్ దగ్గర మలుపు తిరిగేటప్పటికి ఆ వీధిలో ఒక అమ్మాయి జైన దేవాలయం దరిదాపులలో ఉంది, దేవాలయం వీధికి వెళుతూ. ఎదురుగా ఒక అబ్బాయి వస్తున్నాడు. ఈ అమ్మాయి ఎటు వెళితే అటు అడ్డు వస్తున్నాడు, ఏదో పిచ్చి పని చెయ్యాలనే ప్రయత్నం లో ఉన్నట్లు అనిపించింది నాకు,వీధి మొత్తం నిర్మానుష్యంగా ఉన్నచేత. నేను వస్తున్న సంగతి అమ్మాయికి తెలియదు, వెనక ఉన్నాను కనక, అబ్బాయి చూసే స్థితిలో లేడు, తమకం మీద ఉన్నాడు కనక. నేను సైకిల్ మీద వారి దగ్గర కొచ్చేటప్పటికి వీరిద్దరూ ఒకరికొకరు ఎదురెదురుగా, జైన దేవాలయం ఎదురుగా ఉన్నారు.అబ్బాయి అమ్మాయి మీద పడేలా అనిపించింది నాకు, అంత దగ్గరకొచ్చేసేడు. అమ్మాయి నిస్సహాయంగా బిక్కముఖం వేసుకుని, వాడు చేయబోయే వెధవపని ఏదయినా ఎదుర్కోడానికి సిద్ధ పడినట్లుంది. నేను సైకిల్ మీద వస్తూ బ్రేక్ వేసి, ఎడమ కాలు నేల మీద ఆన్చి, సైకిల్ మీదే కూచుని ఉన్నా, మౌనంగా, వారికేసి చూస్తూ. నా రాక అమ్మాయిలో కొద్దిగా శక్తి చేకూర్చింది, సైకిల్ మీద వచ్చి ఆగి ,కూచుని ఉండటం తో బాగా పుంజుకుంది, ఆత్మ స్థైర్యం. అబ్బాయీ నన్ను చూశాడు, ఏమనుకున్నాడో తెలియదు కాని ఒక చూపు, కౌశికుడు కొంగను చూసినట్లు నా కేసి చూసి మౌనంగా వెళ్ళిపోయాడు. అమ్మాయి బుర్ర ఎత్తకుండా వెళ్ళిపోయింది, కనీసం నాకేసి చూడనుకూడా చూడక, సిగ్గు పడిందనుకున్నా . ఈ అమ్మాయీ, అబ్బాయీ, చాల సార్లు ఆ తరవాత కూడా కనపడ్డారు, వేరు వేరుగా. నేను చేసినదేమీ లేదు, మౌనంగా నిలబడ్డానంతే. అవి పాత రోజులు కనక మౌనం పని చేసిందేమోననిపించచ్చు కాని, ఇది కూడా ఆయుధమే,నేటికీ, అనుమానం లేదు. ఆ కుర్రవాడు మరే పిచ్చి పనీ చేయకుండా ఆపింది కదా.

మన సంప్రదాయం లో మూగ నోము కూడా ఉన్నది. దీని వల్ల ఆ రోజు వారు మౌనం అభ్యాసం చేసినట్లు, ఓర్పు, సహనం అలవడతాయనుకుంటా. ఒక్కొక సందర్భం లో ఇది ఆయుధాన్ని మించి పని చేస్తుంది. ఇల్లాలు కాఫీ తెచ్చి మౌనంగా కంప్యూటర్ దగ్గర పెట్టేసి వెళ్ళిపోయిందంటే, రోజూ మాటాడేవారు ముఖం చాటేశారంటే, కనపడీ మనతో మాటాడక వెళ్ళిపోయారంటే,మనతో మాటాడక పక్కవారితో మాటాడి ఎళ్ళిపోతే, ఎంత బాధ? కత్తి పుచ్చుకుని పొడిచేసినదానికంటే, నెమ్మదిగా చుర కత్తితో కోసినదాని కంటే ఎక్కువ బాధ.అనుభవిస్తే కాని తెలియదు. మరొక రకం కూడా ఉంది మౌనం లో, దీన్నే సాధింపు అనచ్చేమో కూడా. నా మనవరాలికి కోపం వస్తే మాట్లాడదు, “ఏరా! చిట్టితల్లీ కోపమా” అంటే, “నాకెందుకూ కోపం, నాకస్సలు కోపం రాదు తెలుసా” అంటుంది, కాని మాటాడదు, బతిమాలితే, కోపం పోయినతరవాత నోరు విప్పితే, వరద గోదారే :).

నేడు రాజకీయాలలో కూడా మౌనం బాగా పని చేస్తున్నట్లుంది. మౌన బాబా అని పి.వీ గారిని ఆ తరవాత “గూంగీ” అని మరొకరిని అనేవారు. ఆవిడిప్పుడు దెబ్బలాటకి పెద్ద కూతురులా ఉందిట. ఇప్పుడు పెద్దవారు మౌన బాబా అవతారమెత్తితే, మౌనేన కలహం నాస్తి అవుతుందనుకుంటే, బొగ్గు మసి ఎంత తుడిచినా పోటంలేదే!!!

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మౌనం.

 1. దీక్షితులు గారు,

  ఆ సైకిలు అమ్మాయి అబ్బాయి ‘ఈయన ఎవరండీ బాబు, పోద్దస్తమాను పానకం లో పుడకలా ‘ అని మౌనం గా వెళ్లి పోయారేమో సుమీ!

  జోక్స్ అపార్ట్, శర్మ గారు, మంచి వ్యాసం.

  జిలేబి.

  • @జిలేబిగారు,
   బహుకాల దర్శనం. మరీ నల్లపూసయిపోయారు.మీరు చెప్పినదీ నిజమై ఉండచ్చేమో! మంచి రసకందాయంలో అడ్డొచ్చాడని 🙂
   ధన్యవాదాలు.

 2. మనం మన మనస్సు నిశ్చలంగా ఉంచగలిగితే విజయం మనదే అని భలే చెప్పారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s