శర్మ కాలక్షేపంకబుర్లు-జీవన వైవిధ్యం

జీవన వైవిధ్యం.

పదిహేను రోజుల కితం, టపా రాసిన మరునాడు వ్యాఖ్యలకి జవాబులిచ్చేశాను. ఆ రోజు మధ్యాహ్నం మనవరాలిని జ్వరంతో బడినుంచి తీసుకొచ్చా. డాక్టర్ కి చూపించాము. ఇంటికొచ్చినది మొదలు నా వడిలో, ఉయ్యాలలో గుండెల మీద పడుకుంది. కోడలు “దిగమ్మా” అన్నా “రాన”ని మొండికేసింది. జ్వరం తగ్గిన కాసేపులో” తాతా ఇంగ్లీషు మాటల అంత్యాక్షరి ఆడుకుందామా” అనేది. మళ్ళీ జ్వరం, మళ్ళీ డాక్టరు ఇలా వారం రోజులు ఒడిలో నుంచి మనవరాలు వదలిపెట్టలేదు, ఎవరు చెప్పినా వినలేదు. “అయ్యో! మనవరాలు బాధ పడుతోంది జ్వరంతో, ఆ జ్వరం నాకు వచ్చినా బాగుండును దానికి తగ్గి” అన్నా, ఇల్లాలితో. “ఆ! ఇప్పుడు అర్ధమయిందా?” అంది. వారం తర్వాత బడి కెళ్ళింది. మనవరాలు జ్వరంతో బాధపడుతోందని మనసు గిలగిలా కొట్టుకుంది. దూరంగా ఉన్న వాళ్ళ దగ్గరనుంచీ కబురులేదని కొట్టుకుంటుంది, ఎందుకిది? ఏమిటీ విచిత్రం, ఎందుకు చేస్తుందీ చిత్రాలు, మనసు? ఈలోగా 65  సంవత్సరాలుగా కూడా ఉన్నవారు, రెండు నెలలనుంచి సతాయిస్తున్నారు, నీతో ఇంక కుదరదయ్యా, మమ్మల్ని విడుదల చెయ్యమని. విడుదలకయినా పద్దతులున్నాయికదా. ముందు డాక్టర్ గారి దగ్గరకెళ్ళి సుగర్ అదుపులో ఉందనిపించుకుని వారి దగ్గరకెళీతే 374  రూపాయలుచ్చుకుని ముగ్గురునీ  ఊడకొట్టేరు.

. అసలు ఉన్నవారే ఆరుగురు అందులో ముగ్గురెళ్ళిపోయారు. ఇంకింతే, తప్పదుకదా. ఇంతకీ వారు నోట్లో పళ్ళు :). అదయిన తరవాత ఇల్లాలు కిస్తీలు చెల్లిస్తోంది, అయ్యో ఒక్కత్తే కిస్తీలు చెల్లిస్తోందని నేనుకూడా చెల్లించడం మొదలుపెట్టా. 🙂 ఆవిడొక నాలుగు, నేనొక మూడు చెల్లించుకున్నాం. ఇంతకి కిస్తీ అంటే ఏంటో తెలీలేదు కదూ. కిస్తు అనేది తెనుగు పదంకాదు. దీనికి వాయిదా అని అర్ధం. పల్లెలలో భూమి, నీటి పన్నును మూడు వాయిదాలలో చెల్లించవచ్చు, మొదటిది జనవరి, చివరిది మార్చి. పండకపోయినా, గోళ్ళూడకొట్టి పన్ను వసూలు చేసినట్లుగా, జ్వరం లంఘనం చేయిస్తుంది కనక దీనిని సరదాగా కిస్తీ అంటాం, మా పల్లెటూరివాళ్ళం. అన్నట్టు మరిచా లఖణం కాదు ఇది లంఘనమే, లంఘనం అనగా గెంతడం, భోజనాన్ని చేయకుండా ఉండటాన్ని లంఘనం( Skipping a meal ) అంటాం, కాని వాడుకలో దాన్ని లంఖణం అంటున్నాము. దారి తప్పేం కదా!. అమ్మయ్య! ఇప్పటికి ప్రజల్లో పడ్డాం, డాక్టర్ దయవల్ల. అబ్బబ్బ! ఏ డాక్టర్ దగ్గర చూసినా ఇసుక వేస్తే రాలనంతమంది ఉన్నారు. ఇదేమిటో రోగాలు ఇలా పెరిగిపోతున్నాయి.ఆఖరికి పళ్ళ డాక్టర్ దగ్గర కూడా పెద్ద క్యూ కనపడుతోంది.

జీవితంలో ఏదీ స్థిరం కాదు, నిలిచిపోదు. సుఖమూ ఉండిపోదు, కష్టమూ ఉండిపోదు. ఇదీ అదీ కూడా అనుభవించవలసినదే! తప్పదు,కాదు తప్పించుకోలేము. చిత్రం ఏమంటే నెల రోజుల నుంచి ఛంపుతున్న నడుంనెప్పి మనవరాలి జ్వరం సందడిలో ఎప్పుడో జారుకుంది, తెలియకుండా. ఒకటి పోతే మరొకటి, పెద్ద కష్టమొస్తే చిన్న కష్టం కనపడదేమో! ఇది మన భారత ప్రభుత్వం వారికి మంచి అనుభవం. మసిగోల వదిలించుకోడానికి ప్రజలనెత్తిన పెట్రోల్, గేస్ బండ పారేసేరు, మసిగోల సమసిపోయింది, ప్రస్తుతానికి. జీవితమంతా ఆశ, నిరాశ, సంతోషం, విచారాలలో గడచిపోతుంది.

ఇలా అనుకుంటూ చాలా రోజులయింది కదా మెయిళ్ళు చూడలేదు, బ్లాగు చూడలేదని మొదట మెయిళ్ళు చూడటం మొదలు పెట్టేను. అబ్బో చాలా ఉన్నాయి, పదిహేనురోజులయింది కదా!. ఇందులో అక్కరలేనివి ముందు తీసేస్తే కావలసినవి చదువుకోవచ్చని మొదలెట్టేను. అసలు నాకో అనుమానమొస్తుంది, ఈ క్రెడిట్ కార్డులిస్తాము, ఉద్యోగావకాశాలున్నాయి, మీకు ప్రయిజొచ్చింది వగైరా, వగైరా అక్కర లేని మెయిళ్ళు మన మెయిల్ అడ్రస్ కి ఎలా వస్తాయో తెలీదు. మన మెయిల్ అడ్రస్ వాళ్ళకి ఎలా తెలుస్తుందో మరి. మెయిళ్ళకి సమాధానలివ్వవలసినవి ఇస్తున్నా, వ్యాఖ్యలకి సమాధానాలిచ్చా. అప్పుడు కనపడిందొక మెయిలు. అది తెంగ్లీష్ లో ఉంది నెమ్మదిగా కూడబలుక్కుని చదివేను. ఒక్క సారి ఆశ్చర్యం, ఆనందం ముప్పిరిగొన్నాయి. అదేమిటో చెప్పచ్చుగా అంటారా? మరి టపా రాయవలసినదానిని చెప్పేస్తే ఎలా, ఇప్పుడే. టపా రాస్తున్నా. అప్పటిదాకా విచారం, అప్పటిలో సంతోషం, మనసు చేసే చిత్రం చూశారా!!

ఈ సందర్భంగా ప్రహ్లాదుడు తండ్రికి చెప్పిన విషయం పోతనగారి పద్యం భాగవతం లోది గుర్తొచ్చింది.

లోకములన్నియున్ గడియలోన జయించినవాడ వింద్రియా
నీకము జిత్తముం గెలువ నేరవు నిన్ను నిబద్ధు జేయు నీ
భీకర శత్రు లార్వుర బ్రఖిన్నుల జేసిన బ్రాణికోటిలో
నీకు విరోధి లే డొకడు నేర్పున చూడుము దానవేశ్వరా!…భాగవతం..స్కం.7…267

లోకాలన్నీ క్షణంలో గెలిచావు, ఇంద్రియాలను, అరిషడ్వర్గాన్ని మనసును  జయించితే నీకు లోకంలో శత్రువే లేడు సుమా అన్నాడు.
నేనూ హిరణ్యకశిపుడిలాగానే ఉన్నాను,మనసును జయించలేకపోతున్నా కదా!

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-జీవన వైవిధ్యం

  1. తాతగారు నాకు తెలిసి ఇంద్రియాలు జయించడం అంటే నా కోసం నేను బ్రతికితే చాలు అనే విధానం వదిలిపెట్టడం. మరి మీరు అలా అనుకోవడం నాకు నచ్చలేదు.

    • @గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు
      కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఆరూన్నూ అరిషడ్వర్గాలు. ఇవ్వి మనసును పట్టి బంధిస్తాయి. వీటిని గెలవడం అసాధ్యమే!
      Thank u

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s