లక్ష్మణ రేఖ.?
లక్ష్మణ రేఖ అంటారు, జన సామాన్యంలో ఒక నమ్మకం కూడా సినిమా వారి మూలంగా, లక్ష్మణుడు ఒక గీత గీసి అది దాటి రావద్దని సీతకు చెప్పినట్లూ, రావణుడు రావడంతో ఆమె గీత దాటివచ్చి బిక్ష వేయబోతే బలవంతంగా తీసుకుపోయినట్లు చెప్పుకుంటారు. అసలు నిజమేంటీ?
రాముడు మాయ లేడిని వేటాడటానికి వెళుతూ లక్ష్మణునికి ఇలా చెబుతాడు.
“అప్రమత్తేన తే భావ్యమ్ ఆశ్రమస్థేన సీతయా…రామా.. అర.కాం..సర్గ 43..శ్లో..48
ఆశ్రమంలో ఉన్న సీతను రక్షిస్తూ ఇక్కడే ఉండు”
“ప్రదక్షిణేనాతిబలేన పక్షిణా
జటాయుషా బుద్ధిమతా చ లక్ష్మణ!
భవా ప్రమత్తః పరిగృహ్య మైధిలీం
ప్రతి క్షణం సర్వత ఏవ శంకిత: రామా..అర.కాం. సర్గ..43..శ్లో..50
పక్షిరాజయిన జటాయువు మిగుల బలశాలి,ప్రజ్ఞావంతుడు,సమర్ధుడు. సీతా సంరక్షణ విషయమున అతని సహాయమున నీవు అప్రమత్తుడవై యుండుము. అనుక్షణము ఈ పరిసరములలో రాక్షసులవలన ప్రమాదము పొంచియుండును సుమా.”
ప్రతి కదలికా ప్రమాదకరమే జాగ్రత్త సుమా అని చెప్పి వెళ్ళేడు. కొంత సేపు తరవాత రాముని కంఠ స్వరాన్ని పోలి హా సీతా! హా! లక్ష్మణా అన్న కేకలు వినపడ్డాయి. కేకలు విన్న సీత లక్ష్మణునితో ” కేకలు వినపడినప్పటినుంచి నా మనసు మనసులో లేదు, మీ అన్నగారు ఆపదలో చిక్కుకున్నట్లుంది, రక్షించడానికి పరిగెట్టు అంది.” లక్ష్మణుడు కదలలేదు. సీతకి కోపం వచ్చి ఇలా అంది”సోదరుని పట్ల ప్రేమ నటిస్తున్నావు తప్పించి, నువ్వు ఆయనకి శత్రువువే, ఆపద సమయంలో రక్షణకి వెళ్ళక నా మీద కోరిక పడుతున్నటున్నావు. నిజంగా నీకు సోదరునిపై ప్రేమలేదు, ఆయన అవస్థలపాలయితే బాగానే ఉంటుందనుకుని నువ్వు నిమ్మకి నీరెత్తినట్లు కూచున్నావు. రాముడికి రక్షణకోసం నువ్వు అడవికి వచ్చావు, అవసరం పడినప్పుడు రక్షణకి వెళ్ళక ఇక్కడ నాకు రక్షణ ఏర్పాటు చేస్తున్నానంటున్నావు, ఇందులో అర్ధం ఉందా?”అని కటువుగా పలికింది. అప్పుడు లక్ష్మణుడు ” రాముడు అమిత బలశాలి, ఎవరూ ఆయనను ఆపద పాలు చేయలేరు,ఇది నిజం, నువ్వు ఇలా మాట్లాడటం భావ్యం కాదు, ఆ కంఠం రాముడిది కాదు, నువ్వు భయపడకు, శాంతంగా ఉండు. ఆ వినపడిన మాటలు మారీచుని ఇంద్రజాలం కావచ్చును. జన స్థానంలో రాక్షసులను నిర్జించినప్పటినుండి వారు మనపై కోపంతో ఉన్నారు, నీ రక్షణ బాధ్యత నాకు అప్పజెప్పి వెళ్ళేడు అన్న, నిన్ను ఒంటరిగా వదలి వెళ్ళను” అని చెప్పేడు. అందుకు సీత ఏమని తిట్టిందో చూడండి.
“అనార్యాకరుణారంభ! నృశంస! కుల పాంసన!
అహం తవ ప్రియం మన్యే రామస్య వ్యసనం మహత్…రామా…అర.కాం..సర్గ 45..శ్లో21.
దుశ్శీలుడా! కఠినాత్ముడా!! క్రూరుడా!!!వంశానికి చెడ్డపేరు తెచ్చేవాడా!!!! రాముడు కష్టాలపాలవడం నీకు ఇష్టం.” “నీవు మేక వన్నె పులివి,దుష్టుడవు,రాముడు ఒంటరిగా వచ్చుటచూచి నన్నుపొందవలెనని కపట బుద్ధితో నీవు కూడా వచ్చి ఉండవచ్చును, లేదా భరతుడు నిన్ను ప్రేరేపించి ఉండవచ్చును, ఎట్టి పరిస్థితులలొనూ నీదిగాని, భరతునిదిగాని పన్నాగం సాగనివ్వను, రాముని తప్పించి మరొకరిని కోరుకొనను, నా భర్త లేక నేను బతకను ఇపుడే నీ ఎదురుగా ఆత్మ హత్య చేసుకుంటూన్నాను” అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. ఇక లక్ష్మణుడు తట్టుకోలేకపోయాడు. సీతకు శిరసు వంచి నమస్కరించి ” సీతాదేవీ! నీవు నాకు పూజ్యురాలవైన దేవతవు. ఇక నీ ముందు మాట్లాడజాలను. స్త్రీలు ఇట్లు మిక్కిలి అనుచితముగా పలుకుట ఆశ్చర్యముకాదు. సాధారణముగా స్త్రీలు అయా సందర్భాలలో ఇట్లు పరుషోక్తులు పలకడం లోక సహజం. వారి మనసు చాంచల్యానికి గురి అవుతుంది, ఆప్యాయతకు, బంధు భావం విడిచిపెట్టేస్తారు. నీవు పలికినపలుకులు నాకు చెవులలో శూలాలు దింపినట్లున్నాయి, నీ మాటలకు తట్టుకోలేను. నీవు మాట్లాడిన మాటలు ఈ ప్రకృతి వింటూ వుంది. నేను నా అన్న ఆజ్ఞ పాటిస్తున్నాను, నీవు సాధారణ స్త్రీలా పొరపడుతున్నావు, నాకు అశుభ శకునాలు కనపడుతున్నాయి. నిన్ను వన దేవతలు రక్షింతురుగాక, నేను మా అన్నతో తిరిగివచ్చి నిన్ను చూసే భాగ్యం కలుగుతుందో లేదో చెప్పలేను.’ అన్నాడు. దానికి సీత రాముడు లేక ఒక క్షణం కూడా బతకను, గోదావరిలో దూకుతా, లేదా కొండ శిఖరం మీంచి దూకి ఆత్మ హత్య చేసుకుంటా, లేదూ విషం తాగుతా, లేదూ అగ్నిలో దూకుతా కాని పరపురుషుడిని ముట్టను” అంటే ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తున్న నెపంతో ఆలస్యం చేస్తున్నావని కోపగించింది. అప్పుడు లక్ష్మణుడు
“తతస్తు సీతామ్ అభివాద్య లక్ష్మణః
కృతాంజలిః కించిదభిప్రణమ్య చ
అన్వీక్షమాణో బహుశశ్చ మైధిలీం
జగామ రామస్య సమీపమాత్మవాన్. రామా..అర,కాం..సర్గ..45..శ్లో..40
సీతాదేవి మొండి వైఖరిని, ఆమె పలికిన తీవ్రవచనములకును నొచ్చుకొనిన వాడై, ఒక ప్రక్కగా నిలబడి ఆమెకు నమస్కరించెను. పిమ్మట ఈమెను ఒంటరిగా ఇచట విడిచి పెట్టి వెళ్ళుట ఎట్లు? అను తడబాటుతో పదే పదే ఆమెవైపు చూచుచూ ఎట్టకేలకు మనస్సు దిటవు చేసుకొని, శ్రీరాముని సమీపమునకు బయలుదేరెను.”
ఇదేమిటీ ఎంత చూసినా లక్ష్మణ రేఖ కనపడలేదే రామాయణంలో.
లక్ష్మణుని చూచిన రాముడు మాట్లాడిన మొదటి మాట.
అహో లక్ష్మణ! గర్హ్యం తే కృతం యస్త్వం విహాయతామ్/ రామా…అరణ్య కాం…సర్గ 57..శ్లో.18.
ఓ లక్ష్మణా! నీవు సీతను ఒంటరిగా విడిచివచ్చి తప్పు చేశావు సుమా, అన్నాడు
పాపం! లక్ష్మణుడు వెంటనే వెళ్ళనందుకు వదినతోను, సీతను వదలి వచ్చినందుకు అన్నతోను మాటపడ్డాడు. అనవసరంగా మాట పడినపుడు నా రేఖ బాగోలేదంటాం, అలాగే లక్ష్మణుడు మాటపడి రేఖ బాగోలేదనుకున్నాడు,రేఖ అంటే అదృష్టం అని కూడా అర్ధం ఉంది. అదీ లక్ష్మణ రేఖ, లక్ష్మణుని దురదృష్టం.
ఎవరు చేర్చారో ఎప్పుడు చేర్చారో తెలీదు కాని మన రామాయణం లోనూ భారతంలోనూ అనేక మైన కట్టుకథలు వచ్చి చేరాయి.అర్వాచీన కవుల్లో కొందరు పురాణ పాత్రలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనే కోరికతోనో మరో కారణం చేతనో ఎన్నో కల్పనలను జొప్పించారు. వాల్మీకి మూలాన్ని చదివి అర్థం చేసుకునే అవకాశం అందరికీ ఉండదు కనుక అసలు కథేమిటో తెలియని గందర గోళం లో ప్రజలున్నారు.దీనికి మన సినిమాల వారి పైత్యం మరికొంత తోడయ్యింది. వాల్మీకి మూల శ్లోకాలను ఉటంకిస్తూ మీరు చెప్పిన లక్ష్మణ రేఖ కథ దీనికి చక్కటి ఉదాహరణ. చాలా మంచి పోస్టు.అభినందనలు.
@మిత్రులు గోపాల కృష్ణ గారు,
టపా రాసేటపుడనుకున్నా అసలు అవసరమా అని. తరవాతనిపించింది రాద్దాం తప్పు కాదుకదా అని చెప్పేను. తెలియని వారికి నిజం తెలుస్తుందని ఆశ.అపోహలు తొలగుతాయి కదా.
ధన్యావాదాలు.
>లక్ష్మణ రేఖ కనపడలేదే రామాయణంలో.
రామాయణమహాకావ్యం వాల్మీకి అనే ప్రసిధ్ధనామం కల ప్రాచేతసమహర్షి నిర్మించినది. ప్రచేతసఋషి పుత్రుడు కాబట్టి యీయన ప్రాచేతసుడు – ప్రచేతస్యాపత్యః ప్రాచేతసః అన్నమాట. ఈ కావ్యకథ జనంలోకి చొచ్చుకుపోయింది. కాలక్రమేణా జనం మనస్సులలో ఊడలు వేసిన యీకథలో వారి నోళ్ళవెంట కొత్తకొత్త ఉపకథలు జోడించబడ్డాయి. కొన్ని పండితసృష్టి అయితే కొన్ని పామరసృష్టి కావచ్చును. లక్ష్మణరేఖ, ఉడతాభక్తి, సులోచనావృత్తాంతం, రావణగర్భంలో అమృతభాండంవంటి జనరంజక మైన కథలు రంగనాథరామాయణంలోని వనుకుంటాను. ఇవీ, ఇలాంటివి మరికొన్నీ గోనబుథ్థారెడ్డిగారే కల్పించారనుకోవటం కన్నా ప్రజలనోళ్ళలో నానుతున్న చిత్రవిచిత్రరామాయణ కథలకు ఆయన కావ్యగౌరవం కల్పించారనుకోవటం సబబుగా తోస్తుంది. దీని వలన కలిగిన ప్రయోజనం యేమిటయ్యా అంటే, రంగనాథరామాయణం జనామోదాన్ని బహులెస్సగా సాథించింది.
కొసమెరుపు: మనం సాంస్కృతిక పతనం యెంత ఘనంగా ఉందంటే మొన్నటి కౌన్ బనేగా కరోర్పతీ కార్యక్రమంలో ఒక వ్యక్తికి ఇవ్వబడిన ప్రశ్న యేమిటంటే “బాలకాండ, ఉత్తరకాండ” అనే భాగాలు కలిగిన గ్రంధం యేమిటి? ఎ) మహాభారతం బి) రామాయణం సి) గీతగోవిందం డి) (నాకు గుర్తులేదు..). ఆ వ్యక్తి దీనికి లైఫ్లైన్ కావాలని అడిగాడు. ఆ తర్వాత అమితాబ్ బచ్చ్న్ వివరణ చెబుతూ కాండల పట్టి చదివారు – అయితే యుధ్దకాండకు బదులుఆయన లంకాకాండ అని అన్నారు – మానస్ గ్రంధంలో అలాగ ఉందో లేదా అమితాబ్ గారికీ సరిగా తెలియదా. నా కెరుక లేదు.
@మిత్రులు శ్యామలరావుగారు,
మీ వ్యాఖ్య ఎందుకో స్పాం లోకి వెళ్ళిపోయింది. యాధృచ్చికంగా పట్టుకున్నా.మన సంస్కృతిని ఎంత ఎగాతాళి చేస్తే అంత గొప్పవారమనుకుంటున్నారు, మనవారే.
ధన్యవాదాలు.
,
లక్ష్మణ రేఖ కనబడిందో లేదో గానీ శర్మ గారికి గోదావరి కనబడింది !
ఎంతైనా మేము గోదావరీ తీరం వాళ్ళం సుమీ! రామాయణం లో గోదావరి ని వదలం మరి !
(మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిలా, మాది కృష్ణాతీరం అంటారు చూడండీ మరి అలా అన్న మాట)
చీర్స్
జిలేబి.
@జిలేబి గారు,
అయ్యో! రామాయణం లో గోదావరి ప్రస్తావన సీత చేసిందని వాల్మీకి చెప్పేరండి,
గోదావరీం ప్రవేక్ష్యామి వినా రామేన లక్ష్మణ!
అంబధిష్యే ధవా త్యక్ష్యే విషమే దేహాత్మనః/ రామా…అరణ్యకాం…సర్గ 45..శ్లో..36
దయచేసి చూడండి.
గోదావరి వాళ్ళం కదండీ, మాకు పులకరింతెక్కువ 🙂
నా సొంత పైత్యం కాదండి 🙂
ధన్యవాదాలు
ఫేట్. ప్చ్! 🙂
@వర్మ గారు,
మరదేనండి లక్ష్మణరేఖ.
ధన్యవాదాలు
morning coffeee tho manchi katha chadvinaanu… bavundi…
suma
@సుమ గారు,
స్వాగతం, సుస్వాగతం.
కధ రామాయణంలోదే, నచ్చినందుకు
ధన్యవాదాలు