శర్మ కాలక్షేపంకబుర్లు-సీత అబద్ధం చెప్పిందా?

సీత అబద్ధం చెప్పిందా?

రావణుడు సీతను అపహరించి లంకలో అశోక వనంలో ఉంచాడు. మాటలతో హింసిస్తున్నాడు, తనకు భార్యవుకమ్మని. ఒక రోజు ఆమె విరక్తి కలిగి, తన కంఠానికి, తన జుట్టుతో ఉరిపోసుకోవానుకుంటుంది. ఆ సందర్భంగా తల ఎత్తి పైకి చూస్తే హనుమ కనపడ్డాడు, రామ కధ చెబుతూ. కలకంటున్నానా? అనుకుంటుంది. నిద్ర లేదుకదా కల ఎక్కడ అనుకుంటుంది.ఇప్పటి వరకు లంకలో కోతిని చూడలేదే, ఇదెక్కడినుంచి వచ్చిందని అని మధన పడుతుంది. తన చిత్త విభ్రాంతేమో అనుకుంటుంది. హనుమ రామ కధ చెబుతూ ఆమెను సమీపిస్తుండగా, ఇదొక రాక్షస మాయగా తలుస్తుంది, మూర్ఛపోతుంది. తేరుకున్న తరవాత రామ లక్ష్మణులు సుగ్రీవ మైత్రి చెప్పి, వాలి వధ చెప్పి అమెకు కొంత ఊరట కలిగిస్తాడు, హనుమ. రామ లక్ష్మణుల అంగాంగ వర్ణన చెబుతాడు, ఆమె కోరిక మీద. ఆ తదుపరి తానామెను మూపుపై మోసుకుని తీసుకుపోయి రాముని దగ్గర దింపుతానంటాడు. సీత, నీవు వేలెడంత ఉన్నావంటే, తన నిజ రూపం ప్రదర్శిస్తాడు. పరపురుషుని ముట్టనన్న దానికి పొంగిపోతాడు. ఆమె సందేహాలకి సమాధానాలిస్తాడు. లంకకి వానర సేన రాగలదని, సముద్ర తరణం సమస్య కాదని, తానే అందరిలో అధముడనని చెబుతాడు. ఇటువంటి దూత్య కార్యాలకి తక్కువ ప్రజ్ఞ కలవాళ్ళనే పంపుతారన్న సంగతి నీకు తెలిసినదేకదా అంటాడు. తాను తెచ్చిన రాముని అంగుళీయం అభిజ్ఞానం గా సీత చేత పెడతాడు. నీవేమయినా అభిజ్ఞానమిస్తే రామునికిస్తానంటే కాకాసురుని కధ చెప్పి రామునికి గుర్తు చేయమంటుంది, తన శిరోభూషణం అభిజ్ఞానంగా ఇస్తుంది. ఆ తరవాత హనుమ అశోక వనాన్ని పాడు చేయడం ప్రారంభిస్తాడు. అప్పుడు కావలి ఉన్న రాక్షస స్త్రీలు

కో యం కస్య కుతో వాయం కిన్నిమిత్తం మిహాగతః/
కధం త్వయా సహానేన సంవాదః కృత ఇత్త్యుత// రామా…సుం..సర్గ..42..శ్లో…6

ఈయన ఎవడు? ఏల ఈ ప్రదేశమునకు వచ్చినాడు? ఎచటినుండి వచ్చినాడు? ఏ విషయము గురించి నీతో మాట్లాడినాడు అని అడిగేరు. దానికి సీత ఇలా సమాధానం చెప్పింది.

అధాబ్రవీ న్మహాసాధ్వీ సర్వాంగ సుందరీ,
రక్షసాం భీమరూపేణాం విజ్ఞానే మమ కా గతిః..రామా..సుం కాం….సర్గ 42..శ్లో..8

యాయమే వాభిజానీత యో యం యద్వాకరిష్యతి,/
అహి రేవ హ్యహేః పాదా న్విజానాతి న సంశయః//…రామా..సుం కాం…సర్గ..42..శ్లో..9

సీత ఇలా అంది, భయంకర రూపముకల రాక్షసులనుగూర్చి తెలిసుకొను శక్తి నాకెక్కడిది?, అతడెవడో, ఏమి చేయుచున్నాడో మీరే తెలిసికొనుడు. పాముకాళ్ళు పామునకే తెలియును? ఇందు సందేహములేదు.

అహమ వ్యస్య భీతాస్మి నైనం జానామి కో న్వయమ్/
వేద్మి రాక్షస మేవైనం కామారూపణ మాగతమ్..రామా..సుం. కాం..సర్గ..42..శ్లో…10

ఇతనిని చూసి నేను భయపడ్డాను. ఇతనెవరో నేనెరుగను. ఇతడు ఇచ్చవచ్చిన రూపముతో వచ్చిన రాక్షసుడని తలుస్తాను.

ఇతనెవరో నేనెరుగను. ఇతడు ఇచ్చవచ్చిన రూపముతో వచ్చిన రాక్షసుడని తలుస్తాను. ఇదండి సీత అబద్ధం చెప్పిందనడానికి ప్రాతిపదిక. వాల్మీకి మహర్షి తాను దర్శించినది దర్శించినట్లు చెప్పేరు. దీని మీద ఒక వాదం చెప్పేరు అది వాడుకలో ఉంది. అవును ఆమె అబద్ధం చెప్పింది. శుక్రనీతి ప్రకారం ఆమె అబద్ధం చెప్పడం తప్పుకాదు. నాకయితే ఈ వాదం నచ్చలేదు. నా ఉద్దేశం,

సీత నిజమే చెప్పిందన్నది నా పరిశీలన. సీత మొదట హనుమను చూసి భయపడింది. అదే మాట చెప్పింది కూడా. హనుమ ఆమెను నమ్మించేడు, తన మాటల ద్వారా.మరి అంగుళీయం సంగతేమనవచ్చు కామరూప విద్యలు తెలిసినవారికి అంగుళీయం తయారు చేయడం పెద్ద పనా. రాముడు అభిజ్ఞానం గా ఏమీ చెప్పలేదు, కనుక హనుమను నమ్మడానికి ఎంత సావ కాశం ఉందో నమ్మకపోడానికీ అంతే ఉంది. మరి చూడామణి ఎందుకిచ్చిందీ అడగచ్చు, నమ్మింపచేసేడు కనక ఇచ్చింది. వనం పాడు చేస్తున్నాడు కదా అది సీతకు అనుకూలం కదా అడగచ్చు. ఇదికూడా ఒక పెద్ద ప్రణాళికలో భాగం కావచ్చు కదా.

ఇతనిని చూసి నేను భయపడ్డాను. ఇతనెవరో నేనెరుగను. ఇతడు ఇచ్చవచ్చిన రూపముతో వచ్చిన రాక్షసుడని తలుస్తాను. ఈ సమాధానం పై సందర్భంలో నిజమేకదా. సీత హనుమను చూసి భయపడిన విషయమూ నిజమే, హనుమను ఎరుగకపోవడమూ నిజమే కదా, అంతకు ముందు హనుమతో సీతకు పరిచయం లేదు కదా.

ప్రకటనలు

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-సీత అబద్ధం చెప్పిందా?

 1. మనం ఎన్ని విధాల సర్ది చెప్పడానికి ప్రయత్నించినా ఇక్కడ సీతమ్మ వారు చెప్పినది అబధ్ధం కాకుండా పోదు.రాక్షస కాంతలు సీతమ్మని ఎవడతడు అని అడిగి నప్పుడు,జరిగినది జరిగినట్లుగా చెప్పక పోతే అది అబధ్ధమే అవుతుంది. కాని ఇక్కడ ఆమె అబధ్ధం చెప్పడం తప్పా రైటా అన్నదే ప్రశ్న. నిస్సందేహంగా ఆమె చెప్పినది అబధ్ధమే అయినా సమర్థనీయమే.సత్పురుషులతో మనం అసత్యం పలుక రాదు కానీదుర్మార్గులతో అన్ని సమయాలలోనూ సత్యమే పలుక వలసిన అవసరం లేదు.ఉదాహరణకి దొంగ ఇంట్లోకొచ్చి మీ ధనము నగలు ఎక్కడెక్కడున్నాయో చెప్పమంటే మనకి తెలిసినా నిజం చెప్పాల్సిన పని ఉందంటారా?

  • @మిత్రులు గోపాల కృష్ణ గారు,

   నేను ముందే చెప్పేను. సీత అబద్ధమే చెప్పిందీ అని చాలా మంది పెద్దలు అన్నారు. దానిని సమర్ధించేరు, తప్పుకాదని. నాకది నచ్చలేదని ముందే మనవి చేసేను. ఏమయినా సీత నిజమే చెప్పినా, అబద్ధమే చెప్పినా, రెండూ సమంజసమే అని నాఉద్దేశం.
   ధన్యవాదాలు.

 2. శర్మగారూ,

  అసలు అబధ్దం అన్న మాటకు అర్థం యేమిటండీ? బద్ద్హం కానట్టిది అని. అంటే కట్టుబడి లేనిది అని. అవును కదా? అయేతే దేనికి బధ్ధం కానిది అని ప్రశ్న వెంబడే వస్తున్నది. కదా? సమాధానం యేమిటంటే, ధర్మం అనే దానికి బధ్దం కానిది అని. ఏతావాతా తేలుతున్నది యేమిటంటే, ధర్మానికి కట్టుబడని పలుకు అబధ్ధం అని.

  ఇక్కడ సీత యొక్క పరమధర్మమేమిటి అన్నది కొంచెం యోచించుకుంటే, ఆవిడ అబధ్దం చెప్పినదా అలా చేయలేదా అన్నది స్పష్టపడుతుంది. ప్రతి ప్రాణికి ప్రాణ, మాన రక్షణ ప్రరమధర్మం. సతిగా స్త్రీకి పతియొక్క ధర్మబధ్దమైన ప్రయోజన్నాన్ని నెరవేర్చటమూ, పరిరక్షించటమూ పరమధర్మాలు. అయోగ్యులైన వారికి ఉపకృతి చేయటం అసమంజసం అని మీరరాని సాధారణ సామాజిక ధర్మం. తనపైన నమ్మకముంచిన వారికి సర్వాత్మనా మేలు తలచటం, వారికి వీలయినంత మేలు చేయటం సాధుజనులకు పరమధర్మం. దేశకాలపాత్రోచితంగా ఇతరులతో భాషించటం వివేకవంతుల పద్ద్హతి. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని చూడండీ సీతమ్మ యెంత చమత్కారంగా‌ మాట్లాడిందో. అందులో ఆవంతైనా దోషం లేనే లేదు.

  సీతమ్మ హనుమంతులవారిని ఒక పట్టాన నమ్మలేదు. అంగుళీయకం చూసినంతనే త్వరపడలేదు. శ్రీరామలక్ష్మణుల సాముద్రిక లక్షణాలను హనుమంతుడు స్పష్టంగా‌ నిర్దుష్టంగా ఏకరువు పెట్టిన పిదపనే నమ్మింది.

  భారతంలో‌ ఒక పిట్టకథలో వేటగాడితో ఒక ముని తన ఆశ్రమంలో లేడి దూరిందో‌ లేదో తెలియదని చెప్పటం‌ ద్వారా, నిజం దాచినా‌ అందులో అసత్య దోషం లేక పోయిందనీ, ప్రాణీరక్షణం అనే‌పరమ ధర్మానికి బధ్దుడై ఆయన మంచి పనే చేసాడనీ‌ తెలుస్తున్నది కదా.

  అందు వలన ఏర్పడుతున్నది యేమంటే సీతమ్మ మంచి వివేకవంతురాలనీ, రాముని వలనే మంచి ధర్మమర్మజ్ఞురాలనీ. ఈ‌విషయంలో‌ సందేహించనవుసరం లేదు. సీతమ్మ అబద్ద్హం యేమీ చెప్పలేదు. చింత మానండి.

  స్వస్తి.

  • @మిత్రులు శ్యామలరావు గారు,
   ఈ ప్రశ్న, సందేహం రామాయణమంత పాతది.
   వివరణ చాలా బాగా ఇచ్చారు. అసలు ఈ చర్చ నేనే చెద్దామనుకుని మానేశాను. దాన్ని మీరు పూరించారు.

   భారతం లో కధలో చిత్రమైన సమాధానం నిజం చెబుతాడు ముని. చూసేది పలుకలేదు, పలికేది చూడలేడని. వేటగాడికి అర్ధం కాదు, చెప్పినది.అలాగే సీతమ్మ సమాధానం కూడా అనుకోవచ్చు.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s