శర్మ కాలక్షేపంకబుర్లు-ఎందుకేనా మంచిది

ఎందుకే నా మంచిది.

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలపె
దమ్మ సురారులమ్మ కడుపాఱడి పుచ్చినయమ్మ తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాభ్ధి యీవుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్…భాగ…ప్రధమ స్క….8

హరికిన్ బట్టపుదేవి పున్నెములప్రో వర్ధంబు పెన్నిక్క చం
దురు తోబుట్టువు భారతీగిరిసుతల్ తోనాడు పూబోణి తా
మరలం దుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భా
సురతన్ లేముల్ బాపు తల్లి సిరియిచ్చున్ నిత్యకల్యాణముల్…….భాగ…ప్రధమ స్క….9

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మకు సాష్టాంగ నమస్కారం చేస్తూ, అందరికి ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, సుఖ, శాంతులు ప్రసాదించమని అమ్మని కోరుతూ…. మీ అందరికీ విజయదశమి శుభకామనలు.

వారం కితం ఒక రోజు పొద్దుటే తల తిరిగినట్లయ్యింది, ఒక వాంతి కూడా అయింది, రొంప చేస్తున్నట్లుంది, అప్పుడే శీతలం తిరిగింది. చూసిన ఇల్లాలు, “వద్దంటూ ఉంటే వినకుండా సీతాఫలాలు తినేసేరు, చెట్టు కాసింది కదాని, ఏమవుతుంది? రొంప పడుతుంది,దగ్గొస్తుంది, జ్వరం వస్తుంది, అన్నీ వస్తాయి, చెప్పిన మాటవినరు, తల తిరగదా మరి..” ఇలా అష్టోత్తరం, సహస్రం కలిపి చదివేస్తూ ఉంటే “ఎలాగా ఆపడం ఈ వరద” అని అలోచిస్తే ఒక ఆలోచనొచ్చి “కూచోవోయ్” అన్నా, చెయ్యి పట్టుకుని కూచో బెడుతూ, “చాల్లెండి సరసం, మీకేం! పనిలేక కూచున్నారు, నాకు కుదురుతుందా? ఉండండి, వస్తున్నా” అని లోపలికి పోయి ఒక పెద్ద చెమ్చా, దానితో పాటు ఒక సీసా తెచ్చి, ఆ సీసాలోది చెమ్చాలో వేసి “నాకండి” అంది. బుద్ధిగా చెప్పిన మాటవిని నాకుతూ “ఏంట”న్నట్లు కళ్ళెగరేశా. “ఏమీ లేదు, మాదీఫల రసాయనం, మీ జబ్బులన్నిటికీ మందు, మరి కొంచెంవెయ్యనా?” అంటే అవునన్నట్లు బుర్రూపుతూ “ఎక్కువైతే” అన్నా, “ఏం కాదు, మరొకసారి కడుపు ఖాళీ అయి, శుభ్రంగా ఆకలేస్తుంది, అంతే” అంది. “ఏదో చెబుతానన్నారు చెప్పండి” అని కూచుంది, తీరుబడిగా.

మొన్ననో సారి రాజమంద్రి వెళ్ళేనుకదా. ఆ రోజు ఒక మిత్రుడు కనపడ్డాడు, గోదావరి స్టేషన్ లో. నాకంటే ఒక మూడేళ్ళు పెద్దవాడులే, పేద వాడు మాత్రం కాదు, 75 ఉంటాయి,. “ఎలా ఉన్నారన్నా?” “బాగానే ఉన్నా, కానీ” అంటూ చెయ్యిపట్టుకుని పుష్కరాల రేవుకు తీసుకుపోయి అక్కడ మొదటి వంతెన కింద చతికిలబడ్డాడు. బాగానే ఉంది కాలక్షేపం అనుకుంటూ కూచున్నా. అతనిలా చెప్పుకొచ్చేడు.

రెండునెలల కితం ఒక రోజు ఉదయమే కాఫీ తాగిన వెంటనే కళ్ళు తిరినట్లయి, వాంతి వెళ్ళి, ఒళ్ళు చెమటలు పడితే, మా పల్లెటూరులో ఉన్న డాక్టర్ వచ్చి చూసి, అంతా బాగానే ఉంది, ఎందుకేనా మంచిదని ఒక సెలైన్ ఎక్కించి, వెళ్ళిపోయాడు. మర్నాడూ అలాగే అనిపిస్తే, అబ్బాయికి తెలిసి ఇక్కడికి తీసుకొచ్చాడు, ఇప్పుడు బాగానే ఉందంటున్నా వినకుండా.. శంఖ, చక్రాలున్నాయి కదా, ( సుగర్,బి.పి. ) ఆరోజు సుగర్ డాక్టర్ని చూస్తే టెస్టులన్నీ చేయించి అంతా బాగానే ఉందండి, ఎందుకేనా మంచిది ఒక సారి న్యూరాలజిస్ట్ ని చూడండి అన్నాడు. మర్నాడు ఉదయం ఆయన దగ్గరకెళ్తే టెస్టులన్నీ చేయించి, సాయంత్రం చూసి అంతా బాగానే ఉంది అంటూ, మాత్రలు రాసిచ్చి పదిరోజులు వాడి రండి, అన్నారు. నాలుగు రోజులు మందులు వాడినా మళ్ళీ అలాగే అనిపిస్తే ఆయన దగ్గరకే వెళితే ఎందుకేనా మంచిది చెవి, ముక్కు, నోరు, డాక్టర్ ని చూడమన్నారు. ఆయనగ్గరకెళితే టెస్టులన్నీ చేయించి, సాయంత్రం వెళితే, మీకు కుడి చెవి వినపడటం లేదు, ఎడమ చెవి వినికిడి తగ్గింది, ఎందుకేనా మంచిది ఈ మందులు వాడమని రాసిచ్చేరు. షరా మామూలే తేడా కనపడక పోతే , మళ్ళీ వెళితే ఎందుకేనా మంచిది గుండె చెకప్ చేయించమన్నారు. మర్నాడు గుండె చెకప్ చేయిస్తే, టెస్టులు చేయించి, గుండె భేషుగ్గా ఉంది, ఎందుకేనా మంచిదని మాత్రలు పదిరోజులు వాడమని రాసిచ్చేరు. వారం ఇన్ని మందులు వాడినా, అలాగే తల తిరిగితే ఆయన దగ్గరకే వెళితే, ఏమీ లేదండీ అన్నీ బాగానే ఉన్నాయే, ఒక సారి బ్రెయిన్ స్కేన్ తీయించమన్నారు, ఆ ముచ్చటా అయింది, మందులు రాసిచ్చారు, మార్పులేదు, అన్నట్లు మరిచా ఈ మధ్యలో గేస్ట్రో ఎంట్రాలజిస్ట్ ను కూడా చూడటం, ఆయన పాత మందులే వేసుకోమనడం జరిగిపోయింది. ఎన్ని మందులు మింగినా తేడా కనపడక సుగర్ డాక్టర్ గారిదగ్గరకెళితే ,ఆయన న్యూరాలజిస్ట్, చెవి, ముక్కు, నోరు డాక్టర్, గుండె డాక్టర్, బ్రెయిన్ డాక్టర్, గేస్ డాక్టర్, అందరిని కాన్ఫరెన్స్ లో మాట్లాడితే ఎవరి మటుకు వారు అన్నీ బాగానే ఉన్నాయి, మరి ఈయన బుర్ర తిరుగుడుకు కారణం ఏమిటని చర్చచేసి, వారి వైద్యభాషలో మాట్లాడుకుని,ఈ పేషంట్ చాలా మంచివారు, చదువుకున్నవారు, తెలివయినవారు, గొప్పవారని పొగొడి, చివరికి కారణం తెలీదని తీర్మానించారు, తీరుబడిగా. అందరు రాసిచ్చిన మాత్రలు వాడి రండి చూద్దామన్నారు. ఇంటికొచ్చేకా మాత్రలు వాడుతున్నాను, గంట గంటకీ ఒక మాత్ర, రాత్రి పగలు భేదం లేదు. మొత్తం మాత్రలు పెద్ద కేరీ బేగ్ అంతయ్యాయి. తల తిరుగుతూనే ఉంది, ఎన్ని మాత్రలు మింగినా. ఏమీ అర్ధంకాలేదు. కబురు తెలిసి మిత్రులు, బంధువులు పరామర్శలు మొదలెట్టేరు.పిల్లలంతా వచ్చేశారు….నా పని, పని లేక, పనిలేని మంగలి పిల్లి తల గొరిగేడన్నట్లయింది.

ఎందుకేనా మంచిది మిగిలింది రేపు…..

ప్రకటనలు

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఎందుకేనా మంచిది

 1. ఈ టపాను ఈ రోజే చూసాను . మీకు మీ కుటుంబసభ్యులకు శుభాకాంక్షలండి..

  వారం క్రితం ఒక రోజు పొద్దుటే తల తిరిగినట్లయ్యింది, ఒక వాంతి కూడా అయింది, రొంప చేస్తున్నట్లుంది, అప్పుడే శీతలం తిరిగింది……. అని రాసారు. ఇప్పుడు ఆరోగ్యం కుదుటపడిందని అనుకుంటున్నాను.

  మేడం ఇచ్చిన మాదీఫలరసాయనం వంటివి అద్భుతమైన ఔషధాలు. ఇలాంటి చక్కటి ఔషధాలను గురించి టపా ద్వారా అందరికి తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు.

  • @అనూరాధ గారు,
   మనం వాడటం లేదు కాని మంచి మందులే ఉన్నాయి, ఆయుర్వేదం లో. ఇప్పుడు పడమటి దేశాల వారు వాడుతున్నారట.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s