శర్మ కాలక్షేపంకబుర్లు-పోనీ ఎందుకేనా మంచిది.

పోనీ ఎందుకేనా మంచిది

కిందటిటి టపా తరవాయి

ఆయనలా బాధ పడుతూ ఉంటే,ఏంచేయాలో తోచలేదు, ఏదో ఒకటి చెప్పాలి కదా, “ఒక మాట చెప్పనా , పాత రోజుల్లో పేరు లేని జబ్బుకి పెన్నేరు మందు ( అశ్వగంధ, జిన్సింగ్ లాటిది ) సామెత చెప్పేవారు. ఇప్పుడు అటువంటివి వాడటం లేదనుకోండి. పోనీ ఎందుకేనా మంచిది, సైక్రియాటిస్ట్,అంటే పిచ్చి డాక్టరంటారు, వాళ్ళకి పిచ్చి కాదండి, ఎదుటివాళ్ళ పిచ్చి పోగొడతారు,వారిని చూడలేకపోయారా?, మంచి పేరున్నవాళ్ళున్నారు” అన్నా. “ఆయన దగ్గరకెళితే మంచి వైద్యం జరుగునేమో, మీరు ఆయన్ని ఒక్కణ్ణీ వదిలేశారు”, అన్నా, నాకు ఆయన చెప్పిన డాక్టర్ల పేర్లు తెలియవు, ఇదొక్కటి మాత్రం తెలుసు కనక, వాగేశాను. “ఎవరో అన్నారండి కాని ఎందుకో వెళ్ళలేదు”, అన్నాడు.” మరి ఇంతమంది డాక్టర్లని కలిసేరేమండీ అంటే”, “అబ్బాయి, పోనీలేనాన్నా ఎందుకేనా మంచిది అంటూ ఉంటే కాదనలేకపోయా, డాక్టర్లు కూడా ఎందుకేనా మంచిది మరొకరిని చూడమంటూ ఉంటే కాదన లేక పోయా” అన్నాడు. “మనలో మాట,ఏమాత్రం ఖర్చయ్యి ఉంటుంద”న్నా. “ఏమో నాకు తెలియదుకాని, అబ్బాయి చెప్పలేదు, నేను అడగలేదు, సుమారు పదివేల పైన అయి ఉండచ్చనుకుంటా. టెస్టులికి, డాక్టర్ ఫీజులికి,మందులికి కలిపి”.”ఒక్క మాటడగనా” అంటే. “అడగండి” అన్నాడు. “మనం ఎనభయ్యవ పడిలో ఉన్నాం కదా, బతికినన్నాళ్ళు బతుకుతామా? మంచాన పడకుండా ఉంటే చాలేమో” అంటే, దానికాయన, “నిజమే కానండి, నా భార్య పోయినప్పటినుంచి నేను, నా పిల్లలు చెప్పిన మాట కాదన లేకపోతున్నా. అది నా బలహీనత కావచ్చు. మరొక రహస్యం చెప్పనా? నవ్వద్దు మరి. నిజంగా చచ్చిపోతానేమోననే భయమే ఇది, అంతకుమించి లేదు. కాని ఇప్పుడర్ధమయింది, ఏమిచేసినా పోవలసిన ప్రాణం, పోయే సమయమొస్తే ఎవరూ ఆపలేరని. నాకో అనుమానమండి, ఇంత చదువుకొన్న డాక్టర్లు ఏం చెప్పలేకపోయారేమంటారు,” అన్నాడు. “టెస్టుల్లో ఏమీ కనపడలేదు కదండీ, అందుకు చెప్పలేకపోయి ఉంటారన్నా అక్కడికి నాకేదో తెలిసినట్లు.”

“విల్లు లాటిదేమయినా రాశారా?” అంటే, ఎప్పుడో రాశాను, కాని ఏం రాశానో ఎవరికీ చెప్పలేదు, రాశానని మాత్రం అందరికి తెలుసు,కొడుకులు కోడళ్ళు వచ్చేశారు. కూచోడానికి నుంచోడానికి ఖాళీ లేదు, ఇంట్లో. వంట వార్పు సరేసరి, కోడళ్ళకి ఖాళీ లేదు, నన్ను పట్టించుకున్న దిక్కులేదు,ఎందుకేనా మంచిదని కోడళ్ళ తరఫువారు కూడా వచ్చేసేరు. ఇలా జరుగుతూ ఉండగా మా తమ్ముడు,మరదలూ వచ్చారు, చూడటానికి. మరదలంతా గమనిస్తున్నట్లుంది, పలకరించి ఊరుకుంది. కాసేపు కనపడలేదు, లోపల కోడళ్ళ దగ్గర ఉండి ఉంటుందిలే అనుకున్నా, తమ్ముడూ నేనూ కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఒక సీసా, ఒక చెమ్చా పట్టుకొచ్చింది. అందులో మందు వేసి “నాకండి” అంది, “ఏమిటన్నా”. “చెబుతా ముందు నాకండి, భయం లేదు, ఏమీకాదు, అంది. భయపడుతూ నాకేను, పుల్లపుల్లగా తియ్య తియ్యగా బాగానే ఉంది, మరి కొంచెం వేసింది, నా వాలకం చూసి. అదీ నాకేసేను. ఇది మాదీఫల రసాయనం, మరేమీ కాదు, ఇది రోజూ మూడు పూటలా నాకండి, మీకు పైత్యం చేసింది, అంతే” అంది. “మాత్రలన్నీ మానెయ్యండి” అని మాత్రల సంచీ తీసేసింది. మరదలు మాత్రం రెండు గంటలకోసారి పుల్ల పుల్లగా తియ్య తియ్యగా ఉన్న మాదీ ఫలరసాయనం ఇస్తూనే ఉంది, ఉన్న మూడు రోజులూ. నా తమ్ముడు మరదలు వెళ్ళిపోయారు, మిగిలినవారున్నారు, ఇంటినిండా, గుసగుసలాడుకుంటున్నారు, “ఏంటీ ఈయన ప్రయాణం ఆగిపోయినట్లేనా, ఏం రాశాడో చెప్పిచావటం లేదు. ఏది ఎవరికి రాశాడో” అని. జరుగుతున్నది చూస్తూంటే, ఏంచేయడానికీ తోచక, కూచోడానికి, నుంచోడానికి చోటు లేక ఇలా రోడ్లంట తిరుగుతున్నా. ఇప్పుడు తల తిరుగుడు పూర్తిగా తగిపోయింది లెండి. అందుకే మందులాపేశా. అన్ని బుర్ర తిరుగుళ్ళూ మాదీ ఫలరసాయనం తో తగ్గుతాయనను కాని, మనం భయం అదుపులో ఉంచుకుంటే ఇన్ని ఇక్కట్లు ఉండవనుకుంటా. డాక్టర్ మాత్రం దేవుడుటండీ! వైద్యం చేయగలడు కాని ఆయుష్షు పోయలేడుగా. ఆయన పెళ్ళామూ ముండా మోస్తుంది, సమయమొచ్చినపుడు”. “అనుభవం ఐతే కాని తత్వం వంట పట్టలేదనమాట” అన్నా. “నిజమేనండి” అన్నారు.

ఈ లోగా ఒక టీ అమ్ముకునే కుర్రాడొస్తే టీ ఇమ్మన్నారు, నేను బయట ఎక్కడా మంచి నీళ్ళు తప్పించి తీసుకోను, అది నా నియమం, రెండు టీలు ఇచ్చేసేడు, నేను వద్దని చెప్పేలోగా, బాగోదని పుచ్చుకుని తాగేననిపించి, ఖాళీ కప్పు చేత్తో పుచ్చుకుని, ఆయన తాగిన తరవాత కప్పడిగేను. “ఇది మీకెందుకూ” అన్నారు. “చెబుతా”, అని కప్పు బలవంతాన తీసుకుని, రెండూ గోదావరిలో కడిగి తెచ్చి చేత్తో పట్టుకు కూచున్నా. కాసేపటికి ఆ కబురు, ఈ కబురు చెప్పుకుని బయలుదేరేము. ఆ కప్పుల్ని బయట చెత్త కుండీలో పారేసి వస్తుంటే “ఇందుకా తీసుకున్నారు” అన్నారు.అవును గోదావరిలో పడెయ్యడానికి ఇష్టం లేక” అన్నా…..

ఇది నిజంగా జరిగిన సంఘటన.

ప్రకటనలు

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-పోనీ ఎందుకేనా మంచిది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s