నీలం-ఆక్రోశం
అయ్యో నీలం – చేశావే బతుకున మానని గాయం,చేశావు బతుకు కల్లోలం,
ఎక్కడచూసినా జలం జలం- బతుకు వలయం లో విలయం,
గోకేశావు పూర్తిగా ఇళ్ళూ వాకిళ్ళూ-మిగల్చలేదు మాకు కన్నీళ్ళూ,
తాగుదామంటే లేవు నీళ్ళు- బతుకున మిగలలేదు కన్నీళ్ళూ,
తిందామంటే లేదు కూడు- ఉందామంటే లేదు గూడు,
మొదటి పంట పట్టుకుపోయింది నీలం-రెండవ పంటకయినా, లేవంటున్నారు నాయకులు,నీళ్ళు,
జీవఛ్ఛవాల్లా బతుకుతున్నాం-బతుకున దారి కనలేకున్నాం.
లేదు, లేదు మాకు బతుకున దారి- మిగిల్చావు మాకు ఎడారి,
మాకూ బతకాలని ఉంది – కానీ ధైర్యం లేకుంది,
చావాలంటే లేదు మాకు ధైర్యం-బతుకేమో భయం భయం,
ఊరంతా అప్పులే-బతుకంతా తిప్పలే,
పది సంవత్సరాలనుంచి తిప్పలు పడుతున్నాం- ఇంక పడలేకున్నాం,
లేదుమాకు బతుకున సాయం-వ్యవసాయం చేయలేకున్నాం,
కాడీ మేడీ పారేస్తున్నాం-మేమూ మీలాగే బతకాలనుకుంటున్నాం,
ఎవరొచ్చినా మా బతుకింతే- ఇది నిత్యం జరిగేతంతే,
ఎవరికయినా ఇస్తారు, పనికితగ్గ ప్రతిఫలం- కాని మాకు మాత్రం లేదంటారు, ఇది నిజం,
చెబుతారు తీయని మాటలు-తీస్తారు నిలువులోతు గోతులు,
చేయలేమింక వ్యవసాయం- అయింది బతుకున మానని గాయం,
నిన్నటిదాకా మీబువ్వ గురించి అలోచించాం-నేటినుంచి మాబువ్వ గురించి అలోచిస్తాం.
అత్యవసర పనిపై హైదరాబాదు వెళ్ళి నీలం తుఫానుకు అక్కడ చిక్కుకుని, తిరిగొస్తూ నేను చూచిన గోదావరి జిల్లాల తోటి రైతుల వ్యధ.
nijame baabai garu hrudaya vidaarakam vaari badha
@అమ్మాయ్ వీణా,
గోదావరి జిల్లాల రైతు పరిస్థితి చాలా దిగజారిపోయింది. ఇక ముందు వ్యవసాయం చేయలేడు. ఆంధ్రదేశపు అన్నపుగిన్ని నిండుకుంటోందమ్మా. నీ అభిమానపూర్వక పలకరింపుకు,
ధన్యవాదాలు.
శర్మగారూ,
నీలం మిగిల్చిన నీలిఛాయలగురించి హృదయానికి నాటుకునేలా చెప్పారు.
@మిత్రులు ఫణిబాబుగారు,
తాడేపల్లిగూడెం-నిడదవోలు మధ్య ఎర్రకాలవ పొంగడం మూలంగా రయిలుగట్టుకు రెండుపక్కలా కనుచూపు మేర నీరు మాత్రమే కనపడినపుడు నాలో కలిగిన వేదన, ఇంటికొచ్చాకా మీతో మాట్లాడిన తరవాత అక్షర రూపం ఇచ్చా.ఇక్కడి పరిస్థితి మరీ ఘోరంగా ఉందిట. ఇప్పటికి చేనిలో నీరు తీయలేదని, పంట కుళ్ళిపోతుందని, పనికి రాదని పెద్దబ్బాయి నిన్న చెప్పేడు. రైతు పరిస్థితి సరిగా చెప్పలేకపోయాననుకుంటా.మీ అభిమాన పూర్వక పలకరింపుకు
ధన్యవాదాలు.