శర్మ కాలక్షేపంకబుర్లు-మూఢ నమ్మకం.

మూఢ నమ్మకం.

నవంబర్ 20 ఉదయమే పూజ, టిఫిన్ తరవాత కంప్యూటర్ దగ్గర కూచున్నా, దగ్గరే ఉన్న ఫోన్ మోగింది, ఎత్తిమాట్లాడితే, “తాతా! ఎలావున్నావ”ంది మనవరాలు, “బాగున్నా! మీరంతా ఎలావున్నారం”టే, ఒక నిమిషం మాటాడలేదు, నోరు పెగల్చుకుని “తాతగారు ఉదయం కాలం చేసేర”ంది. ఉరుములేని పిడుగులాటి వార్త. ఒక్క సారిగా మెదడు మొద్దుబారి పని చెయ్యడం మానేసింది. “ఏమన్నావ”న్నా, మళ్ళీ చెప్పింది “ఉదయమే బాగోలేదంటే హస్పిటల్ కి తీసుకెళ్ళేరు మళ్ళీ, ఉదయం ఆరుకి తాతగారు….”అని భోరుమంది. ఏమనాలో ఎలా ఓదార్చాలో కూడా తెలియని స్థితిలో ఉన్నా,నేను. కొద్దిగా సద్దుకుని “భాధ పడకూడదు, ఇది సహజం, సృష్ఠి క్రమం” అని చెప్పేను. నామనసు మనసులో లేదు, ఇల్లాలి దగ్గరకెళ్ళి సంగతి చెప్పాను. ఆవిడ ఒక్క సారి నిర్ఘాంతపోయింది. ఇంతకీ వారెవరో చెప్పలేదు కదూ! వారు మా పెద్దమ్మాయి ( చెవిటి,మూగ అమ్మాయి )మామగారు, 91 సంవత్సరాల నిండు జీవితం గడిపి,70 సంవత్సరాల వైవాహిక జీవితం గడిపి, జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న ధీశాలి. నెమ్మదిగా ఆ భావోద్రేకం నుంచి బయటపడి, వెళ్ళడానికి తగు ఏర్పాట్లకోసం చూసి, టిక్కట్లు రిజర్వు చేయించుకోడానికి ప్రయత్నం చేస్తే, ఎక్కడా ఏ రయిలుకూ దొరక్కపోతే, పగలు వెళ్ళే జన్మభూమికి రిజర్వు చేయబోతే, అవి బేంకు దగ్గర పని చెయ్యక రెండు సార్లు డబ్బులు తీసుకోడం జరిగింది కాని, రిజర్వ్ కాలేదు. నిజానికి ఆయన వియ్యంకుడే కాని, బాంధవ్యం తోటి స్నేహం కలసి అది మరింత గట్టిపడిపోయింది. మా మొదటి కలయిక, ఒక వేసవిరోజు మిట్ట మధ్యాహ్నం, ఆక్షణం మొదలు మేము ఇద్దరం బంధువులమో, స్నేహితులమో, మాకే తెలియలేదు. ఆయన ఒక గురువు,స్నేహితుడు, బంధువు,మార్గదర్శి, మా పరిచయమైన మొదలు ఏరోజూ మేము భేదాభిప్రాయం వెలిబుచ్చుకునే సావకాశమే రాలేదు. ఎప్పుడేనా సమస్యవచ్చినా దానిని ఇద్దరం చర్చించుకుని పరిష్కారం కనుగొనేవాళ్ళం. అటువంటివారు లేరన్నమాట నన్ను నివ్వెరపాటుకు గురిచేసింది. మనిషిని ఇక్కడవున్నానుకాని మనసిక్కడలేదు. ఎంత తొందరగా వెళ్ళగలనా అక్కడికి అన్నదే నా అలోచన. అబ్బాయిని రిజర్వేషన్ కి వెళ్ళమని చెబుతుండగా ఒక స్నేహితుడు వస్తూ, “ఏంటి రిజర్వేషన్ అంటున్నారు, ప్రయాణమా” అన్నారు. సంగతి చెప్పేము, “మీరు వెళుతున్నారా” అన్నారు. “అవున”న్నా. “మీరెలా వెళతారు? మన సంప్రదాయం ప్రకారం వియ్యంకుడుపోతే సంవత్సరం పూర్తి అయ్యేదాకా, వియ్యంకుడు వెళ్ళకూడదు,వియ్యపురాలు పోతే వియ్యపురాలు కూడా సంవత్సరం దాకా వారింటికి వెళ్ళకూడదు కదా” అన్నారు. “ఎందుకు వెళ్ళకూడదన్నా, ఏదో వియ్యంకుడి జీడి,వియ్యపురాలి జీడి అంటారు, వెళితే, ఈ వెళ్ళినవారు కూడా గతిస్తారంటారు,” అన్నాడు. సందేహం వెలిబుచ్చారు, అప్పటికి రిజర్వేషన్ వాయిదా వేశాం, ఆయన తృప్తి కోసం. వారు వెళ్ళిన తరవాత మరల విషయం చర్చకు వచ్చింది. సంప్రదాయంగా వియ్యంకుడు పోతే, వియ్యంకుడు సంవత్సరంపాటు వెళ్ళనిమాట నిజమని నాకూ తెలుసు, కాని అది మూఢ నమ్మకమనుకుంటా. “ఏమయినా, ఈ విషయం మీద నీ అభిప్రాయం చెబితే అలాచేస్తాన”న్నా. అందుకు నా ఇల్లాలు, “గత ఏబది సంవత్సరాలుగా నా మనసు మీకు, మీ మనసు నాకు తెలుసు, నేనేమనుకుంటానో మీరే చెప్పండి” అంది. “బలే ధర్మ సంకటంలో పడేసేవని, ఐతే చెబుతున్నా విను,” అని మొదలెట్టా.

“ఇది నిజంగా మూఢ నమ్మకం. మనకు కావలసినవారు కష్టంలో ఉన్నపుడు, అదీ అమ్మాయిని ఇచ్చినచోట కాని, అమ్మాయిని తెచ్చుకున్న చోట కాని ఇటువంటి కష్టం కలిగితే, వెళ్ళి ఓదార్చి రావడం కనీస ధర్మం. అందుచేత వెళ్ళి వద్దాం” “ఇదీ నీమాట” అన్నా. “నా మనసులో మాట సరిగా చెప్పేరు, నిజంగా ఏమయినా అభ్యంతరం ఉంటే అది నాకుండాలి, నాకా భయం లేదు. అదీగాక 70 సంవత్సరాల వైవాహిక జీవితం గడిపి, 86 సంవత్సరాల వయసులో సహచరుణ్ణి కోల్పోయిన వదిన గారిని పలకరించి రావడం మన ధర్మం. అబ్బాయిని పిలిచి రిజర్వేషన్ చెయ్యమనండి ఇద్దరమూ వెళుతున్నాం” అంది. అదండి, అలా నవంబర్ రెండవతేదీని జన్మభూమి కి హైదరబాద్ వెళ్ళి, చిన్నమ్మాయిని చూసి, ఆరోజు రాత్రికి మనవరాళ్ళ కబుర్లతో కాలక్షేపం చేసి, మరురోజు వియ్యాలవారి కుటుంబాన్ని ఓదార్చి, మరునాడు బయలుదేరబోయి, నీలం తుఫానుకు చిక్కిపోయాం.

ప్రకటనలు

21 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మూఢ నమ్మకం.

 1. “ఇది నిజంగా మూఢ నమ్మకం. మనకు కావలసినవారు కష్టంలో ఉన్నపుడు, అదీ అమ్మాయిని ఇచ్చినచోట కాని, అమ్మాయిని తెచ్చుకున్న చోట కాని ఇటువంటి కష్టం కలిగితే, వెళ్ళి ఓదార్చి రావడం కనీస ధర్మం. అందుచేత వెళ్ళి వద్దాం” “ఇదీ నీమాట” అన్నా. “నా మనసులో మాట సరిగా చెప్పేరు, నిజంగా ఏమయినా అభ్యంతరం ఉంటే అది నాకుండాలి, నాకా భయం లేదు. అదీగాక 70 సంవత్సరాల వైవాహిక జీవితం గడిపి, 86 సంవత్సరాల వయసులో సహచరుణ్ణి కోల్పోయిన వదిన గారిని పలకరించి రావడం మన ధర్మం. అబ్బాయిని పిలిచి రిజర్వేషన్ చెయ్యమనండి ఇద్దరమూ వెళుతున్నాం” అంది. అదండి, అలా నవంబర్ రెండవతేదీని జన్మభూమి కి హైదరబాద్ వెళ్ళి, చిన్నమ్మాయిని చూసి, ఆరోజు రాత్రికి మనవరాళ్ళ కబుర్లతో కాలక్షేపం చేసి, మరురోజు వియ్యాలవారి కుటుంబాన్ని ఓదార్చి, మరునాడు బయలుదేరబోయి, నీలం తుఫానుకు చిక్కిపోయాం.

  • @అమ్మాయ్ జ్యోతిర్మయి,
   మీ రాష్ట్రం కూడా తుఫానులో చిక్కుకుంది మాలాగా, ఈ హడవుడిలో పలుకరించలేదు, ఇబ్బందులు లేవుకదా! మూఢ నమ్మకాని కాదని ఆచరించి చెప్పాలని, ఆచరించిన తరవాత చెప్పేను. అందరం దీన్ని పదిమంది చేత ఆచరింప చేద్దాం.
   ధన్యవాదాలు

   • @అమ్మాయ్ జ్యోతిర్మయి,
    ఇక్కడ నీలం తుఫాను మమ్మల్న్ అతలాకుతలం చేసింది, మీరు కులసాగా ఉన్నందుకు సంతసం.
    ధన్యవాదాలు.

 2. దీక్షితులు గారు,

  నమ్మకం లోనే మూడత్వం ఉన్నది. మరి మూడ (డ కెందుకో గూటం రావటం లే!, గూటం ఉంది మూడత్వం లో!) నమ్మకం మరీ ‘గూటం’ ! – ఢ!

  చీర్స్
  జిలేబి.

 3. బాబాయిగారు మీరు చేసినపని అందరికి ఆదర్శనీయం మీ పోస్ట్ చూస్తే నాకు ఒక విషయం గుర్తుకు వచ్చింది నా పెళ్ళైన నెలకే మా బామ్మ కాలం చేసారు చాలామంది తదనంతర కార్యక్రమాలు చేయకూడదంటూ నాన్నగారిని వారించడం జరిగింది ఐనా తల్లికి చేసే ఏ కార్యక్రమం చెడు ఫలితాన్ని ఈయదంటూ నాన్నగారే చేసారు ఈ విషయం లో ఆయన కూతురిగా చాలా గర్వపడతాను ఇపుడు మిమ్మల్ని చూసినా అదే ఫీల్ వస్తోంది

  • @అమ్మాయ్ వీణా!
   అచరించకుండా నోటితో చిలక పలుకులు వల్లించడం నాకిష్టం లేక ఇంతకాలం చెప్పలేదు.
   ధన్యవాదాలు

 4. మనకున్న మూఢనమ్మకాలూ చాదస్తాలూ అనేకం.వాటిల్లో ఇదొకటి. దుఖఃలో ఉన్నఆప్తులని పరామర్శించి రావడం మన కనీస కర్తవ్యం.ఈ దుర్మార్గపు నియమాలు ఏ ఋుషులు పెట్టారో ఏ శాస్త్రాలలో ఉన్నాయో ఎవరూ చెప్పరు.మన ఆచారం అంతే అంటారు. ఈ ఆ లోచనలు తప్పని తెలిసినా ఋుజువైనా కూడామారరు.ఇటువంటి మూఢనమ్మకాలను ఖండిస్తూ ఇంకా వ్రాయండి.ఈ ఆ విధంగానైనా మన రాతలకు ఒక ప్రయోజనం ఒనగూరుతుంది.

  • @మిత్రులు గోపాలకృష్ణగారు,
   ఇది ఋషులు పెట్టిన నియమం కాదండి, సమాజ అవసరాలకోసం నాడు పెట్టుకున్నారు, నేడది అవసరం లేదు, మానేద్దాం. ఇటువంటివి దురాచారాలు, ఖండించవలసినదే.
   ధన్యవాదాలు

 5. శర్మగారు,

  మంచి పని చేసారు.

  కొన్ని నమ్మకాలకు, ఆచారాలకు సంబంధించి మనకు తర్కం ఒక పట్టాన బోధపడదు. అంత మాత్రాన అవి నిష్కారణాలు మూఢములు కానవుసరం లేదు. ప్రస్తుత విషయానికి వస్తే నాకు కొంత హేతుబధ్దత కనిపిస్తోంది. ఈ‌మధ్య కాలంలో శాస్త్రీయమైన ఒక పరిశీలనలో తేలిన ఒకానొక విషయం యేమిటంటే భార్యావియోగం అనేది పురుషులలో తరచుగా మరణానికి దారితీస్తోందనేది. విశ్లేషించబడిన అనేక కారణాలలో వియోగదుఃఖం అనేది ప్రధానభూమిక పోషిస్తోందని తేలింది. ఇది యెందుకు ప్రస్తావించానంటే, తీవ్రమైన నైరాశ్యం, దుఃఖం అనేవి మారకాలుగా ఉన్నాయని తెలుస్తోందని విన్నవించటానికే. వియ్యంకులు వియ్యపురాండ్రు సాధారణంగా సమవయస్కులై ఉంటారు, కొంచెం యించుమించుగా. వారిమధ్య అనుబంధమూ దైర్ఘికమూ మానసికమూ అయి ఉండే అవకాశాలూ‌ హెచ్చు. ఒకరి మృతి మరొకరికి హెచ్చరికలాగానూ‌ నిరాశాదుఃఖాలను కలుగజేసేదిగానూ‌ ఉంటుంది. అటువంటి సందర్భంలో మృతబంధువు అత్మీయులతో శోకం పంచుకోవటం మానవీయ కోణంలో అభిలషణీయమే అయినా, దానివల్ల, ఆ వాతావరణ ప్రభావం‌కారణంగా యేర్పడే దుఃఖాతిరేకత మారకంగా‌ పరిణమీంచే‌అవకాశాలు తప్పక ఉన్నాయి. అంటే అప్పటికే ఉన్న మరణావకాశం మరొక 20 లేదా 30శాతం పెరుగుతుందన్న మాట. ఈ‌విషయంలో హెచ్చరించేందుకే ఒక అభిప్రాయం సమాజంలో నానుడిగా స్థిరపడి ఉండవచ్చును. అంతకంటే మరేమీ లేదు. అయితే మానవీయకోణంలో ఇటువంటి హెచ్చరికలను త్రోసిపుచ్చటాన్ని తప్పుపట్టనవుసరం లేదు – తప్పక అబినందనీయం కూడా.

  • సమవయస్కులు ఇతర బంధువుల్లో ఉంటారు, స్నెహితుల్లోనూ ఉంటారు. మరి, ఈ నమ్మకం వియ్యంకుల మధ్యే ఎందుకు.

   • ఈ ఆచారం రావటానికి వెనుక అనేక కారణాలు ఉంటాయి. వాటిలో కొన్ని కారణాలు…….

    పూర్వకాలంలో రాజ్యాన్ని పాలించే రాజుగారు ఏ కారణం వల్లనైనా పరమపదించితే, సహజంగా పెద్ద కుమారునికే రాజ్యపాలనార్హత లభిస్తుంది. అయితే, కొన్ని సార్లు పెద్దరాజు గారి పుత్రుల మధ్య వారసత్వం కోసం గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది. ఇలాంటప్పుడు వియ్యంకులు కూడా వస్తే ఇక ఆ తగవులు తారాస్థాయికి వెళ్ళే అవకాశం ఉంది.

    కొందరు పాలకులకు కొన్ని కారణాల వల్ల బహు వివాహాలు జరిగేవి. వారి పిల్లలకు కూడా వివాహాలు జరిగిన తరువాత పెద్దరాజు గారు పరమపదించితే వారసులుగా పట్టపురాణిగారి కుమారుడే రాజు అవుతారు . అయితే, కొన్నిసార్లు మిగతా రాణులు కూడా తమ సంతానానికి రాజ్యాధికారం కావాలని పోటీ కొస్తారు. పెద్ద రాజుగారు మరణించిన సందర్భంలో వారసత్వ తగాదాలు జరిగే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు వియ్యంకులు కూడా వస్తే ఇక ఆ తగవులు తారాస్థాయికి వెళ్ళే అవకాశం ఉంది.

    సామాన్య కుటుంబాల్లో కూడా ఇంటి పెద్ద మరణించినప్పుడు కొడుకుల మధ్య ఆస్తి పంపకాల గురించి గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఇంటి పెద్ద అయిన స్త్రీ మరణిస్తే ఆభరణాల పంపకాల విషయంలో ఆడపిల్లలు, కోడళ్ళ మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు వియ్యంకులు కూడా వస్తే ఇక ఆ తగవులు తారాస్థాయికి వెళ్ళే అవకాశం ఉంది.

    బహుశా ఇవన్నీ ఆలోచించే కాలక్రమేణా ఇలాంటి ఆచారం ఏర్పడిందేమో ….

  • @మిత్రులు శ్యామలరావు గారు, అనూరాధ గారు, కిషోర్ గారు,
   కిషోర్ గారికి నా బ్లాగుకు స్వాగతం.
   విషయాన్ని బాగా చర్చించినందుకు ఆనందం కలిగింది.ఈ రోజు మరొక టపా రాశాను చూడగలరు.
   ధన్యవాదాలు

 6. దుఖపు చాయలు ఉన్న వారి ఇంటికి వెళ్లి. కొంత ఓదార్పు మాటలు చెప్పి..దైర్య వచనాలు చెప్పడానికి వెళ్లి రావడం మనిషి తనం మనుసు తత్త్వం కదండీ!
  ఇటువంటి మూడ నమ్మకాలని త్రోసి పారేయడం బాగుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s