శర్మ కాలక్షేపంకబుర్లు-ఎందుకు వద్దన్నారు చెప్మా!

ఎందుకువద్దన్నారు చెప్మా!

వియ్యంకుడు వియ్యపురాలు కాలం చేస్తే సంవత్సరందాకా వియ్యంకుడు,వియ్యపురాలిని వెళ్ళద్దన్నారు, మూఢ నమ్మకమని మనం కొట్టి పారేసేం, కాని ఎందుకువద్దని ఉంటారని అలోచిస్తే నాకనిపించింది….

రామాయణంలో దశరధుడు మరణించినపుడెవరూ వచ్చినట్లు చెప్పలేదు. అలా వచ్చిఉంటే పరిస్థితి ఎలా ఉండేదీ ఇప్పుడు ఊహించడం కూడా పొరపాటే. సామాన్యులలో కూడా బహుభార్యాత్వం ఉన్న రోజులలో అందరు భార్యలకు పిల్లలున్నపుడు, అన్నదమ్ముల మధ్య ఆస్థుల దగ్గర కొట్లాటలకు, ఆ సందర్భంగా అత్తవారివైపునుంచి సహాయం అందకుండా చేయడానికే ఈ ఆచారం పెట్టిఉంటారు. అలాగే స్త్రీలకు కూడా చెప్పిఉండచ్చు. ఈ ఆచారం పరిపాలకులలోనే కాక ప్రజలలో కూడా వాడుకలోకి వచ్చి ఉంటుంది.

ఆ తరవాత నేటి కాలానికి చాలా మార్పులొచ్చిన సందర్భంలో,పిల్లనిచ్చిన చోట వియ్యంకుడు కాలం చేస్తే పిల్ల తండ్రి వెళితే అక్కడ జరిగేది:-
సామాన్యంగా పిల్లనిచ్చిన చోట గౌరవ మర్యాదలు తక్కువగానే ఉండేవి/ఉన్నాయి కూడా నేటికీ, అవి మరీ తగ్గిపోయి బాధాకరంగా ఉండచ్చు, అమ్మాయి తప్పించి మరొకరు పెద్దగా పలుకరించే పరిస్థితీ ఉండకపోవచ్చు, వీరు పలకరించబోయినా, వారే కష్టంలో ఉన్నారు కనక. ఇప్పటిలా ప్రయాణ సాధనాలు ఎక్కువగా లేని కాలం, దగ్గర దగ్గరలోనే వివాహాలు చేసేవారు, అందుకు అతి పరిచయదవజ్ఞతా అయికూడా ఉండచ్చు, వీరక్కడ బండ చాకిరీ చేయవలసి ఉండచ్చు. అదీగాక అక్కడ ఆ పరిస్థితులలో అమ్మాయి కష్టం లోనే ఉంటుంది, అది చూసి కూడా తట్టుకోవడం కొద్దిగా కష్టమే, అదీగాక వియ్యంకుడు లేనపుడు వియ్యపురాలిని వియ్యపురాలు పలకరించడానికి అంక్షలు లేవు కనక కుటుంబం నుంచి ఒకరు వెళితే చాలనుకున్నారేమో. మరొకటి ఈ వెళ్ళేవారు కూడా కొద్ది ఇంచుమించు ఒక వయసువారయి ఉంటారు కనక మనమూ ఇక ఈ స్థితికి వచ్చేమనే హెచ్చరిక కనపడి మానసికంగా ఇబ్బంది పడతారని వద్దని ఉండచ్చు. ఇక పిల్లను తెచ్చుకున్న ఇంటి కయితే, పెళ్ళయిన తరవాత వియ్యంకుడూ వియ్యపురాలూ వెళ్ళేది బహు కొద్ది సార్లు, ఇటువంటి సమయంలో వియ్యంకుడు పిల్లను తెచ్చుకున్న వారింటికి వేళితే గౌరవ మర్యాదలు తప్పని సరిగా జరగపోవడానికే సావకాశాలు ఎక్కువ. మనసు కష్టపెట్టుకునే సంఘటనలు కూడా ఉండచ్చు, జరగచ్చు. అదే ఈ సందర్భంగా వియ్యపురాలు వెళితే సాటి స్త్రీని ఓదార్చి రాగలుగుతుంది. మగవారుపోతే ఆడవారు పలకరించిరావడానికి, ఆడవారుపోతే మగవారు పలకరించి రావడానికి ఆంక్షలు పెట్టలేదు, ఇది ఒక రకంగా మిగిలిన మగ, ఆడవారిని రెండవవారు పలకరించడంగా అవుతున్నది. ఇది ఏ గ్రంధాలలోనూ, పెద్దలెవరూ నిర్ణయించలేదు, అనూచానంగా, అవసరంగా వస్తున్న ఆచారం. ఈ పరిస్థితులుంటాయి అనే అవగాహన లేక ఇబ్బంది పడతారని చెప్పివుండవచ్చు. కొంతమంది రోజులలో వెళ్ళకూడదనేవారు, సంవత్సరందాకా వెళ్ళకూడదనే వారు, రక రకాలుగా చెబుతారు, కాని ఇంత వివరించి చెప్పలేక వెళితే చస్తావనే మాట చెప్పి దీనిని ఒక మూఢాచారం చేసేశారు. నేటి కాలానికి దీనిని మనం అమలు పరచనక్కరలేదు, నాడు అవసరమై ఉండచ్చు, ఎంత చెప్పినా, నా ఉద్దేశం ప్రకారం నేటి కాలానికి ఇది మూఢాచారమే, మరింకా కారణాలున్నాయేమో చెప్పలేను, తెలిసినవారు చెప్పండి. ఒక సంశయం కనపడింది, అటువంటి సమవయస్కులు స్నేహితులు, ఇతర బంధువులలో కూడా ఉంటారు కదా అని, ఏమనుకున్నా వియ్యంకులు, వియ్యపురాండ్ర మధ్య సంబంధ బాంధవ్యాలు ఎప్పుడూ ఎక్కువగానే ఉండేవి, అందుకు, వైరభక్తి లాగ ఒక రంటే ఒకరికి ఆ రకమైన పోలిక కనపడేది.

పరామర్శకి వెళ్ళిన వారు పలకరించి వెళ్ళిపోయేటపుడు వెళుతున్నామని చెప్పకూడదంటారు. ఇందుకు కారణం మాత్రం కనపడుతోందనుకుంటా. అప్పటికే కష్టం లో ఉన్నవారిని విడిచి వెళుతున్నామని చెబితే వారి బాధ మరికొంచం పెరుగుతుంది కనక వద్దని ఉండవచ్చు. ఇలా కారణలను వెతుక్కుంటే అది మూఢాచారమని తేలిపోతుంది, ఇదేమి బ్రహ్మ విద్య కాదుకదా.

ప్రకటనలు

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఎందుకు వద్దన్నారు చెప్మా!

 1. * ఇలాంటి ఆచారాలు ఏర్పడటానికి వారసత్వ గొడవలే కాకుండా , ఇంకా అనేక కారణాలు కూడా ఉండవచ్చు.
  * లోకంలో కొందరు వియ్యంకుల మధ్య అంతగా స్నేహం ఉండదు. ఒకవేళ వారసత్వ గొడవలు కూడా ఉంటే, వీరు అక్కడకు వెళ్ళి మాట్లాడితే, వియ్యంకుల మధ్య సత్సంబంధాలు మరింత క్షీణించే అవకాశం ఉంది.
  * మెతకగా ఉండి , నిదానస్తులైన వియ్యంకులకు కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎవరితో ఏం మాట్లాడితే ఏం తప్పో తెలియక , అలాగని మాట్లాడకుండా ఉండలేక వీళ్ళు కూడా మాటలు పడే అవకాశం ఉంది.
  * ఇవన్నీ ఆలోచించి ఎవరికీ ఇబ్బందులు ఉండకూడదని ఇలా చెప్పి ఉంటారు.
  * అయితే ఈ ఆచారంలో ఉపయోగపడే అంశాలు ఉన్నాయి కాబట్టి , దీనిని మూఢాచారమని అనుకోనవసరం లేదేమోనండి. ఎవరి పరిస్థితిని బట్టి వారు ఆలోచించి నిర్ణయించుకోవచ్చు.

  • @అనూరాధ గారు,
   విషయాన్ని లోతుగా చర్చించారు. కొద్ది మంది అవసరం అందరి నెత్తినా రుద్దడం, వారి నైతిక మద్దతు సంపాదించడం కోసమే. చర్చ చేసినందుకు,ఏమయినా మనం ఆచరించ వద్దు.
   ధన్యవాదాలు.

 2. శర్మ గారి ఆలోచనలు సక్రమమే అని అనుకుంటున్నాను.
  గొపాలకృష్ణగారు అన్నట్లు ఆస్తి గొడవలమూలంగా అన్నది నిజమే కాని తల దూర్చవలసివస్తుందేమొన్నని కాక తలదూరుస్తారేమోనన్న భయంతో అనుకుంటాను. ఎందుకంటే ఎవర్కి వారు వారి పిల్లల క్షేమం (వారనుకునే విధంగా) కోసం సమస్యలని ఏకరువు పెట్టటమో ఎత్తిచూపి మాట్లాడటమో జరుగుతుందేమోనని అనుకుంటాను.
  ఇందులో మత సంబధమైన విచారం కన్నా సామాజిక విచారమే ఎక్కువ.
  అందుచేత దీనిని మూఢాచారం అనేకన్న దురాచారం అనటం సబబేమో.
  పోతే కొన్నికులాలకే ఉంది కనుక మూఢాచరమన్న గోపాలకృఇష్ణగారికి ఒక చిన్నమనవి. సాంప్రదాయాలు ఆయా కులాల సామాజిక స్థాయినిపట్టి అలోచనా పరిధిని పట్టి వుంటుంది. ఇక్కడ పరోక్షంగా ప్రస్తావించబడిన కులంవారికి ఐకమత్యం తక్కువ కనుక ఆ ఆచారం వచ్చివుంటుంది.

  • @మిత్రులు jsnrao గారు,
   ఇది దురాచారమో,మూఢాచారమో అనుసరించ దగినదికాదన్నమాట అందరమూ ఒప్పుకుంటున్నాము, కొద్దిమంది అవసరం కోసం దీనిని అందరి నెత్తినా రుద్దినట్లే కనపడుతూ ఉంది.
   ధన్యవాదాలు.

 3. శర్మ గారూ, ఇది నిస్సందేహంగా మూఢాచారమే.ధీనికి మనం కారణాలు వెతుక్కోవడం అనవసరం.మీరు మర్యాదల గురించి వ్రాసేరు.ఆ సమయంలో మర్యాదలు జరగాలని ఎవరూ కోరుకోరుకదా?ఒక వ్యక్తి మరణిస్తే అతని వియ్యంకుడే కాదు వియ్యపురాలు కూడా పరామర్శకు వెళ్లకూడదనే ఆచారం మన ఆంధ్రదేశంలోనే కొన్ని చోట్ల ఉంది.మీరు ఇప్పుడు ఊహిస్తున్న కారణాలు గాని శ్యామల రావు గారు చెప్పిన కారణాలు గాని ఈ మూఢాచారాన్ని సమర్థించలేవు. ఎందుకంటే మిగిలిన కులాలకు లేని వర్తించని కారణాలు ఒక కులానికే వర్తిస్తాయనడం హేతుబధ్ధం కాదు.ఆ సమయంలో వెడితే వారిని ఆదుకోవాల్సిన బాధ్యతలు తమమీద పడతాయనే భీతితోనో, లేకపోతే ఆస్థుల పంపకం విషయంలో తామూ తలదుర్చాల్సి వస్తుందనో,ఇలాంటి కారణాలతో కొందరీ ఆచారం మొదలు పెట్టి ఉండవచ్చు.ఇటువంటి భయాలు లేని చోట ఈ ఆచారం పాటించడం సబబు కాదు. చెప్పాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి కాని ఇక్కడ కాదు.

  • @ మిత్రులు గోపాలకృష్ణ గారు,
   కారణాలేమయి ఉంటాయా అని అలోచించా, వాళ్ళు కారణాలు చెప్పకపోయినా ఇది మూఢాచారం. కొద్దిమంది అవసరానికి దీనిని అందరి నెత్తినా రుద్దినట్లుంది. చర్చ జరిగినందుకు ఆనందం.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s