శర్మ కాలక్షేపంకబుర్లు-త్రికరణ శుద్ధి లోపం అనే ఆత్మ వంచన

త్రికరణ శుద్ధి లోపం అనే ఆత్మ వంచన

త్రికరణాలంటే? మనోవాక్కాయ కర్మలు, వీటినే త్రికరణాలంటాం. మనసుతో ఆలోచించేది, నోటితో చెప్పేది, చేసే పని మూడూ ఏకోన్ముఖంగా ఉన్నపుడు మాత్రమే ఏదయినా పని చేసిన దానికి సత్ఫలితం ఉంటుంది. ఒకటి చెబుతూ, మరొకటి చేస్తూ, మరొకటి ఆలో చించడమే త్రికరణ శుద్ధిలోపం, అదే అత్మ వంచన, దూరంగా ఉన్న కొండలు చూడటానికి నున్నగానే కనపడతాయి, పచ్చగా తివాసీలా ఉంటుంది, కాని అది నిజమా? కాదు, అలాగే మానవ మనస్తత్వం కూడా. నోరు మాట్లాడుతూ ఉంటుంది నొసలు వెక్కిరిస్తూ ఉంటుంది, ఇది సామెత కూడా.

సుబ్రహ్మణ్యస్వామి గుడికెళతాం, పాము కనపడితే చంపేదాకానిద్రపోం. గోవు అని పూజిస్తాం, పాలిచ్చినన్నాళ్ళూ ఉంచుకుని ముసలిదయితే కటికవానికి అమ్మేస్తాం, మేత దండగని. గురువని నమస్కారాలు చేస్తాం, వెనక ఎగతాళి చేస్తాం. బ్ర.శ్రీ. చాగంటి కోటేశ్వరరావుగారి ప్రసంగం విని జీవితం బుద్బుద ప్రాయం, దానం చేసి పుణ్యం మూట కట్టుకోవాలనుకుంటాం, బయట కొచ్చిన తరవాత అవసరంలో ఉన్న వాడికి రూపాయి విదల్చం, ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలం, రెండు మెతుకులు రాలితే కాకి తింటుందేమో, మనకి తగ్గిపోతాయఏమోననే భయంతో, దాహం తీర్చడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వం. వరకట్నం దురాచరమంటాం, లాంఛనాలు సరిపోతాయంటాం, ఆ ముసుగులో కట్నం కంటే ఎక్కువ గుంజుతాం. ఇప్పుడు ఎదురు కట్నాలిచ్చినా ఆడపిల్లలు దొరక్క ముదిరిపోయిన బెండకాయల్లా ఉన్నారులెండి. నీటిని దుర్వినియోగం చేయద్దంటాం, గెడ్డం గీసినంతసేపు, దంతధావనం చేసినంత సేపు కుళాయి లో నీళ్ళు పోతూనే ఉంటాయి, కట్టెయ్యం.

ఆవిడ పతియే ప్రత్యక్ష దైవం అంటుంది, మహిళా సంఘాలలో లెక్చర్లిస్తుంది, చప్పట్లు కొట్టించుకుంటుంది, ఇంటికొస్తే మొగుడు ముఖం కూడా చూడదు. అదేదో సినిమాలో అన్నపూర్ణ చిరు వాల్ పోస్టర్ మీద పడి విరహం ప్రదర్శించినట్లు ఉంటుంది ప్రవర్తన. మరొక మహానుభావుడు తల్లి తండ్రులే ఇలలో దైవాలంటాడు. రోజూ దేవాలయాల చుట్టూ తిరుగుతాడు, బాబాల చుట్టూ తిరుగుతాడు, దణ్ణాలు పెడతాడు, మొక్కులు కడతాడు, యాత్రలు చేస్తాడు, ఇంటి దగ్గర తల్లి తండ్రులు కాపలా దారుల కంటే హీనంగా బతుకుతూ ఉంటారు. మరొక అమ్మాయి బాగా కబుర్లు చెబుతుంది, అంతా అధునికతే చూడ్డానికి, కాని పెద్ద దైవ భక్తురాలు, పైకి చెప్పడం ఇప్పటికీ గురువూ నై, దేవుడూ నై, ఏం లేదనే అంటుంది, అదేమంటే స్నేహితురాళ్ళు ఏడిపిస్తారని భయం. ఆయనో సంఘ సంస్కర్త, ఆడపిల్ల పుట్టిందని భార్యని వదిలేశాడు. మాటాడితే స్త్రీ జనోద్ధరణ లెక్చర్లు మాత్రం దంచుతాడు. ఒక్కతే అమ్మాయి/అబ్బాయి విదేశాల్లో చదువుకొంటున్నారు, తాతా అమ్మమ్మా, ఏలా ఉన్నావన్న ప్రశ్నకి సమాధానం చెప్పరు, వారానికి ఒకసారి కూడా మాటాడరు, బిసీ, బిసీ ఊపిరి పీల్చుకోడానికి సమయం లేదంటారు, కాని ఫేస్ బుక్ లో బ్లాగుల్లో ట్విట్టర్ లో కబుర్లు చెప్పడానికి సమయం మాత్రం దొరుకుతుంది. ఏమంటే మెయిళ్ళు చూడలేదంటుంటారు.ఆయనో వీర సామ్యవాది, చేలో పని చేసిన వాడికి డబ్బులివ్వడు, కనబడడు, కనబడితే రేపురా అంటాడు, మర్నాడు మనిషి దొరకడు.

ప్రభుత్వాలు పొగపీల్చడం హానికరం అంటాయి, సిగరెట్ ఫేక్టరీలకి లైసెన్స్ లిస్తాయి. ప్రభుత్వాలది మరీ చిత్రం, తాగుడు మానిపించడానికి ఒక పధకం, తాగుడు నేర్పించడానికొక పధకం అమలులో ఉంటుంది. అలాగే పొగపీల్చడం హానికరమని ప్రకటనలిస్తారు, ఆ పక్కనే సిగరట్టు కంపెనీల ప్రకటనలుంటాయి, ప్రభుత్వం పొగాకు కు సంబంధించిన లైసెన్స్ లు ఇస్తూ ఉంటుంది.తెనుగు భాషాభివృద్ధికి సంఘాలేస్తారు, ప్రభుత్వం సామాన్యునితో ఇంగ్లీషులో ఉత్తర ప్రత్యుత్తరాలు చేస్తుంది. మేనిఫెస్టో లో ఫలానా పని చేస్తామన్నారు చెయ్యలేదేమంటే “చెప్పినయ్యన్నీ చేసేత్తారేటి?” అని ప్రశ్నిస్తున్నారు. ఠాగూర్ వి చౌకబారు రచనలని గిరీష్ కర్నాడ్ అన్నా, రాముడు మంచి భర్తకాదు, లక్ష్మణుడు చూస్తుండగా రావణుడు సీతనెత్తుకుపోయాడని రాం జెఠ్మలాని వాగినా, విదేశాలలో నల్లడబ్బు దాచుకున్న వారి ఏడు వందల పేర్లు కేజ్రివాల్ క్రేజీగా బయట పెట్టినా, ఏం లేదు అని పెదవి విరిచారే తప్పించి నీమీద కేస్ పెడతామని అల్లుడుగారిదగ్గరనుంచి, నేటి అంబానీ దాకా ఎవరూ అనలేదు, అనలేకపోయారు. చిత్రం. మాకక్కడ డబ్బులేదన్నారు, సరిపోయింది, ప్రభుత్వం వారూ మాట్లాడరు, మరీ చిత్రం, వారూ వారూ ఒకటే కదా. రాముడు మంచి భర్త కాదన్నవాడు రాముడి పేరెందుకుపెట్టుకున్నట్లో, తనకి తెలియదు తల్లితండ్రులు ఇంత బుద్ధిమంతుడవుతాడనుకోలేదు, ఆ పేరు పెట్టేరు, ఇప్పుడు రావణ జఠ్మలానీ అని మార్చుకోవచ్చుగా. మరొకరు రావణుడే దేవుడంటున్నారు, వెధవ పనులు పుట్టినప్పటినుంచి చేసిన వాడు దేవుడెలా అయ్యాడో…….ఏంటో అంతా ఆత్మవంచన.

ఇలా చెప్పేదొకటి చేసేదొకటిగా మనుషులు ఎందుకుంటున్నారో తెలియదు. మనోవాక్కాయ కర్మలకి పొంతన ఉండటం లేదు. ఎందుచేతా?……

ప్రకటనలు

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-త్రికరణ శుద్ధి లోపం అనే ఆత్మ వంచన

 1. /ఠాగూర్ వి చౌకబారు రచనలని గిరీష్ కర్నాడ్ అన్నా/
  గిరీష్ కర్నాడ్ అన్నది వక్రీకరించారు. అతను అన్నది, “టాగోర్ గొప్ప కవే, కాని అతని నాటకాలు అంత సాధారణగా వుంటాయి, అన్నారు. డైరెక్ట్‌గా వింటే, మనకు నచ్చకపోయినా అంత మహాపరాధం చేసినట్టనిపించలేదు. టైంస్ ఆఫ్ ఇండియా లాంటి జాతీయ Tv9లాంటి పత్రిక వక్రీకరణ అలాంటిది. ” మనో వాక్కులతో నేనేమీ‌తప్పు చేయలేద’ అయితే మరో తప్పు చేశావా? అని ఖచ్చితంగా చూసినట్టు తేల్చి పారేసినట్టుంది. 🙂
  రాం జఠ్మలాని వ్యక్తిత్వానికి రాముడు నచ్చలేదంట, పోవచ్చు. కరుణానిధి లాంటి చవకబారు మనుషుల నచ్చలేదన్న నిజాయతీని అభినందించాలి. 😀 రాముడు మా ఆరాధ్యుడు బాగా నచ్చాడు అంటూ నమ్మించి, రావణ చేష్టలు చేసేవారితోనే తంటా.

  • @ Snkr గారు,
   కర్నాడ్ అలా అనిఉండకపోతే, పొరపాటే అనుకోడం.చవకబారు మనుషులే ఎక్కువైపోయారు, నేడు.
   ధన్యవాదాలు.

 2. మనోవాక్కాయ కర్మలకి పొంతన ఉండటం లేదు. ఎందుచేతా?

  నిజానికి యీ ప్రశ్న నన్నూ‌వేధిస్తూనే ఉంటుంది. అనేక సమాధానాలు కనబడవచ్చు. కాని అంతిమంగా‌ మానవప్రవృత్తి అంతే నన్నదే కారణం అనిపిస్తూ‌ ఉంటుంది. అలా సరిపెట్టుకుంటున్నామేమో!

  నేను అనే‌భావనకు అనుసంధానమై నాది అనే భావనా ఉంటుంది. జంతువులకు సహజాతాలు (అంటే ఆహార, భయ, నిద్రా, మైధునాలు) నాలుగే జీవితం. కాని మనిషికి బుధ్ధి అనేది వృధ్ధి చెంది ఉంది జంతువులతో‌ పోలిస్తే. దురదృష్టవశాత్తు మానవసంఘం దానిని స్వార్థప్రయోజనాలుకు వాడుకుంటున్నదే కాని ఔన్నత్యసాధనకు పరికరంగా వినియోగించుకోవటం లేదు. మానవులకు నేను, నాది అనే భావనలను తృప్తిపరచటానికి జీవితం సరిపోవటం లేదు. ఈ భావనలను సంతృప్తంగా ఉంచే యావలో సాటి మానవులను వంచించటనికి మనిషికి సంకోచం యేమీ ఉండటం లేదు. వేదాంతం సర్వమూ ఆత్మశుధ్ధి కోసమే. కాని పురాణం విన్న కుక్కలా, యెంత విన్నా యెంత నేర్చినా యీ నేను-నాది భావనలను విడవలేక ఆత్మశుధ్ది అటుంచి ఆత్మద్రోహం చేసుకుంటూనే మానవజీవితాలు గడుస్తున్నాయి.

  మానవప్రవృత్తిలోని యీ‌ లౌల్యమే సమస్త దుఃఖాలకూ కారణం. గురుబోధ వలని మార్పు తరచుగా ఉపరిస్పర్శయే. బుధ్దుడు పరమపదించగా ఆనందుడు విలపించాడు. గురువు చనిపోగా శిష్యు దేడ్చినాడు. ఇర్వురూ బోధను వ్యర్థ పరిచారు!

  ఇదీ మౌలికంగా మనిషితత్వం. మనో వాక్కాయకర్మలకు పొంతన ఉండటం బహుజన్మల సంస్కారఫలం. సాధారణంగా అటువంటిది అరుదు.

  రాముడిపై నిందలూ సీతపై నిందలూ, రావణ ప్రశంశలూ కొత్తవి కావు. వాలివధలోని ఔచిత్యం గురించి బోలెడు చర్చ జరిగింది. భారతిలో చదవవచ్చు కొంత చర్చను. కంబరామాయణంలో ఒక పద్యంలో ‘మనత్తినాళ్ వాక్కినాళ్ ములైవ పోవళై’ అంటూ సీత చెబుతుంది – అంటే మనో వాక్కులతో నేనేమీ‌తప్పు చేయలేదూ‌ అని. అది పట్టుకుని, సీత శరీరంతో‌ తప్పు చెసినట్లు ఒప్పుకుంటున్నదీ అనీ బోలెడు రగడ చేసారు లోగడ. రామాయణం ఒక విషవృక్షం అని పుస్తకమే వ్రాసిందొకావిడ. ఇంకా చాలామంది రామాయణం వ్రాసారూ, వాల్మీకి ఒక్కడే ప్రమాణం అంటే యెలా అని కొందరు అడ్డదిడ్డంగా వాదిస్తున్నారు. ఇలాంటి వన్నీ‌మనుషులు యెందుకు చేస్తున్నారూ‌ అంటే యెవరి లాభాలు వారివి. వివాదం రేకెత్తించటం ద్వారా ప్రచారం‌పొందే అవకాశాన్ని చేజిక్కించుకుంటున్నారు. వారి అహమిక తృప్తి పొందుతుంది. అటువంటి వారికి అదే ముఖ్యం. ఈ‌ కాలంలో‌ పేరూ, డబ్బూ మాత్రమే ముఖ్యం – అవి యెలా సమకూరినా సరే. అవి సంపాదించే సమర్థత లేనివారే నీతులూ సమజమూ‌ అని గోల పెడుతున్నారని అటువంటి వారి ఆక్షేపణ. త్రికరణశుధ్దిగా జీవిస్తే యేమొస్తుంది? ఆత్మతృప్తి తప్ప. ఆత్మను నమ్మని వారికా అవసరమే లేదుగదా!

  ఆత్మోధ్దరణకోసం తపించే వారు నిరభ్యంతరంగా త్రికరణశుధ్దిగా జీవించ వచ్చును.

  ఈ‌ రెండు రకాలవారూ పరస్పరం ఆక్షేపించుకుంటూనే ఉంటారు. సంఖ్యాబలం‌ యెటు వైపున ఉన్నదో‌ విజ్ఞులు తమకు తెలియనిది కాదు.

  విచారం వీడండి.

  • @మిత్రులు శ్యామలరావు గారు,
   లోతయిన చర్చ చేశారు, ఎప్పటికయినా త్రికరణ శుద్ధి సాధించలేమా అని నా ప్రయత్నం,
   ధన్యవాదాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s