శర్మ కాలక్షేపంకబుర్లు-అందితే జుట్టు లేకపోతే కాళ్ళు.

అందితే జుట్టు లేకపోతే కాళ్ళు (దుర్యోధనుడు కూతురు కృష్ణుని కోడలు.)

చాలా కాలం తరవాతొచ్చాడు మా సత్తిబాబు. వస్తూనే “ఏంటి పంతులుగారు చదువుతున్నారు, ఏంటి విశేషాల”న్నాడు, చేతిలో పుస్తకం చూసి. “ఏముంది, ఇది భాగవతం, సంగతేమంటే దుర్యోధనుని కూతురు శ్రీకృష్ణుని కోడలు”అన్నా. దానికి అతను “పంతులుగారు మరీ చెవులో పువ్వులెట్టేస్తున్నార”న్నాడు. “కాదయ్యా! నిజమే చెబుతున్నా” అన్నా. “అలాగయితే వియ్యంకుడికి సాయం చేయాలి కాని మేనత్త కొడుకులికి సాయం చేసేడేమండి” అంటూ “మరిచిపోయాను, చెల్లెలు సుభద్రని అర్జునుడు పెళ్ళి చేసుకున్నాడు కదండి, అందుకు వాళ్ళకి సాయం చేసేడంటారా” అన్నాడు. “సత్తిబాబూ! ఇటువంటి ఆలోచనలు ఈ మధ్య చాలా మందికి చాలా విషయాలమీద వస్తున్నాయి కాని, పరమాత్మకి మేనత్త కొడుకు ఎక్కువ, కోడలు, వియ్యంకుడు తక్కువ ఉండదయ్యా! ఆయనకి అందరూ సమానమే, ఆయన ధర్మ పక్షపాతి, బంధుత్వ పక్షపాతి కాద”న్నా. “నిజమేనండి, కాని మీరు చెప్పిన దుర్యోధనుడి కూతురు శ్రీకృష్ణుని కోడలన్న సంగతి నాకు తెలియదు కనక, వినలేదు కనక, చెప్పండి” అన్నాడు. మీరూ వినండి.

“కోరి సుయోధను కూతురి సర్వలక్షణములు గల్గి లక్షణ యనంగ
మహినొప్పు కన్యకామణి వివాహంబున జక్రహస్తుని తనూజాతు డైన
సాంబుడు బలసాహసమున నెత్తుకపోవ గౌరవు లీక్షించి కడగి క్రొవ్వి
పడుచువాడొక డదె బాలిక గొనిపోవుచున్నాడు గైకొన కుక్కు మిగిలి

ఇట్టి దుర్మదు గయిముట్టి పట్టి తెచ్చి
జనులు వెఱగంద జెఱబెట్టి యుంతుమేని
యదువులు మనల నేమి సేయంగ గలరొ
యనుచు గురు వృద్దజనముల యనుమతమున….భాగవతం….స్కం. ౧౦ ఉత్తర భా….౫౫౬

దుర్యోధనుడి కూతురు లక్షణ అనే పేరుగల కన్యను శ్రీ కృష్ణుని కొడుకైన సాంబుడు వివాహం చేసుకోడానికి తీసుకొస్తూ ఉంటే, కౌరవులు చూసి, కుఱ్ఱాడొకడు పిల్లని తీసుకుపోతున్నాడు, ఇటువంటి వాణ్ణి పట్టుకుని, పెద్దల అనుమతితో, బంధిస్తే యాదవులేమి చెయగలరో చూద్దామనుకున్నారు.”

ఇలా అనుకుని “దుర్యోధనుడు, కర్ణుడు,శల్యుడు, భూరిశ్రవ, యజ్ఞకేతులు బయలుదేరి సాంబుడిని అడ్డుకున్నారు. సాంబుడు వీరత్వంతో యుద్ధం చేసేడు అందరితో, వీణ్ణి ఇలా గెలవలేమని అందరూ కలిసి ఒక్క సారిగా దాడి చేసి లక్షణతో సహా పట్టుకున్నారు.” “ఈ సంగతి నారదుని ద్వారా యాదవులకి తెలిసింది.రాజు ఉగ్రసేనుని అనుజ్ఞతో యుద్ధాని బయలుదేరుదామన్నారు యాదవులు. అంతలో బలరాముడు అడ్డుపడి కౌరవులు మనకు బంధువులు వాళ్ళతో గొడవ వద్దు అని ఆపేడు. అప్పుడు యుద్ధం చేద్దామన్నావాళ్ళతో కూడా కలిసి కరిపురం చేరి, కోట బయట విడిసి ఉద్ధవుడిని దూతగా పంపేడు, బలరాముడే వచ్చేడని కౌరవులు బయలుదేరి వెళ్ళి అర్ఘ్య, పాద్యాలిచ్చి గౌరవించారు. ఆప్పుడు బలరాముడు దుర్యోధనుని చూసి, మా రాజు ఆజ్ఞ ప్రకారం వచ్చేం, మీరందరూ కలిసి, ఒక్కణ్ణి చేసి సాంబుడిని బంధించడం తప్పు, ఐనా సరే మా రాజు బంధుత్వం తలచి ఆ తప్పు సైరించేడని చెప్పేడు. అందుకు సుయోధనుడు,

అనుమాటలు విని కౌరవ జననాయకుడాత్మ గలగి చాలు బురే! యే
మనగలదు కాలగతి చక్కన గాలం దొడుగు పాదుకలు దలకెక్కెన్…..భాగ…దశ స్కం.ఉత్తర…౫౭౨

ఆ మాటలకి సుయోధనుడు కోపించి కాళ్ళకి తొడుక్కునే చెప్పులు తలమీదపెట్టుకున్నట్లుంది, కాలం, ఏం చెప్పను, యాదవులతో సంబంధం సఖ్యం చాలు,భీష్ముడు, ద్రోణుడు,కర్ణుని లాటి వీరులకు దొరికినవాణ్ణి, దేవేంద్రుడయినా విడిపించగలడా, వృధా మాటలెందుకు అంటూ దుర్భాషలాడుతూ దిగ్గునలేచి మందిరానికి వెళ్ళిపోయాడు.”

ఇప్పుడు బలరాముడికి కోపం వచ్చి “రాజ్యవైభవ మధాంధుల మాటలు విన్నారు కదా అని కూడా వచ్చిన వారితో అని” ఇంకా ఇలా అన్నాడు.

“శ్రీ మధాందులు సామముచేత జక్క
బడుదురే యెందు బోయడు పసుల దోలు
పగిది నుగ్ర భుజావిజృంభణ సమగ్ర
సుమహితాటోప మనిలోన జూపకున్న….భాగ…..దశ.స్కం.ఉత్తర.భా….౫౭౬

డబ్బు మదంతో కొట్టుకుంటున్నవాళ్ళకి మంచిమాటలు పనికిరావు, బోయవాడు పసువుల్ని తోలినట్లు, యుద్ధంలో బుద్ధి చెప్పాలిసిందే, అని, కృష్ణుడు, మిగిలినవారిని రావద్దని వారించి వచ్చాను,దేవ దేవుడయిన కృష్ణుని కాదంటారా” అంటూ,ఇంకా

“తామట తలపగ దలలట యేమట పాదుకలమట గణింప రాజ్య
శ్రీ ముదమున నిట్లాడిన, యీ మనుజాధముల మాటలేమనవచ్చున్….భాగ…దశ.స్కం. ఉత్తర….౫౮౧

తమరేమో తలలా మేమేమో చెప్పులమా! రాజ్యమదం తో మాట్లాడే వాళ్ళని ఏమనగలమని, భూమి మీద కౌరవులను లేకుండా చేస్తానని, చేతిలో నాగలి హస్తినాపురానికి సంధించి గంగలో కలిపేసే ప్రయత్నం చేస్తూంటే నగరం అతలాకుతలమై పోయింది.” అప్పుడు …” దానికి ప్రతీకారంబు లేమిని గలవళంబున భయాకుల మానసులయి, పుత్ర మిత్ర కళత్ర, బంధు, భృత్య, పౌరజన సమేతంబుగా భీష్మ సుయోధనాది కౌరవ్యులు, వేగంబున నతని చరణంబులు శరణంబుగా దలంచి, సాంబునిం గన్యకాయుక్తంబుగా ననేక మణిమయ భూషణాంబర జాలంబులతో దోడుకవచ్చి దండప్రణామంబులాచరించి, కరకమలంబులు మోడ్చి, యిట్లనిరి…..”..భాగ..దశ.స్కం.ఉత్తర….౫౮౪

బంధు,మిత్ర, భార్యలతో సహా అందరూ చీని చీనాంబరాలూ పట్టుకుని సాంబుని లక్షణను తీసుకువచ్చి బలరాముని కాళ్ళు పట్టుకుని రక్షించమని వేడుకుని, సాంబుని, లక్షణ సహితంగా లక్షణంగా అప్పజెప్పి శరణు వేడేరు. బలరాముడు కొడుకుని, కోడలిని తీసుకుని తమ రాజ్యం చేరుకుని, అక్కడి వారికి జరిగిన కధ చెప్పేడు”. అందుకే ఇప్పటికీ హస్తినాపురం దక్షణం వైపు కొద్ది ఎత్తుగా ఉంటుంది, బలరాముడు నాగలితో పెళ్ళగించడానికి ప్రయత్నించడం చేత.

బాజాభజంత్రీలతో పెళ్ళికి విందుభోజనానికి పిలిస్తే, కాదని, మూకుడు పట్టుకుని పెళ్ళివారింటికి పులుసుకి వెళ్ళిందని సామెత.బలరాముడు సౌమ్యంగా సాంబుని, లక్షణను వదిలిపెట్టమంటే కాదని టెక్కుపోయి, చెప్పులలాటివారని హేళనచేసిన నోటితోనే, కొద్ది సేపటిలోనే, రక్షించమని కాళ్ళు పట్టుకోవడం ఏమంటారు? దీన్ని అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకోడమే అంటారుగా, నిజంగా జరిగింది కూడా ఆదే కదా. ఇటువంటి పాలకులున్న రాజ్యాలవారికి సౌమ్యంగా చెబితే కుదరదు,బలరాముడు చేసిన పని చేయాలి, ఇటువంటిది నేటికీ నిజమే కదా! పూర్వ కధలు నేటికీ అన్వయిస్తాయి కదూ!

ప్రకటనలు

7 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అందితే జుట్టు లేకపోతే కాళ్ళు.

 1. @వనజ గారు,
  ఏమయిందో మరి. నా బ్లాగు బాగానే ఉంది. మీ బ్రవుజర్ ఇబ్బంది పెడుతోందేమో.మీరు పంపిన లైక్ వచ్చిందిగా. 🙂 ఈ వేళ ప్రయత్నించండి.
  ధన్యవాదాలు.

 2. బాజాభజంత్రీలతో పెళ్ళికి విందుభోజనానికి పిలిస్తే, కాదని, మూకుడు పట్టుకుని పెళ్ళివారింటికి పులుసుకి వెళ్ళిందని సామెత… హ హ హ సామెత భలే ఉంది తాత గారూ 🙂 .. కథ నేనెప్పుడూ వినలేదు. కొత్తగా వింటున్నా.

  • @అమ్మాయ్ సుభ!
   భాగవతం లోదేనమ్మా ఈ విషయం. అంతగా పట్టించుకోము, మనం. ఈ సామెత బాగా తెలిసుండాలే నీకూను, ఎలా తెలియకుండా పోయిందబ్బా 🙂
   ధన్యవాదాలు.

 3. దుర్యోధనుడి కూతురు శ్రీకృష్ణుని కోడలన్న సంగతి నాకు తెలియదండి.

  మీరన్నట్లు, పరమాత్మకి …. అందరూ సమానమే, ఆయన ధర్మ పక్షపాతి, బంధుత్వ పక్షపాతి కాదు.

  బలరాముడు సౌమ్యంగా సాంబుని, లక్షణను వదిలిపెట్టమంటే కాదని టెక్కుపోయి, చెప్పులలాటివారని హేళనచేసిన నోటితోనే, కొద్ది సేపటిలోనే, రక్షించమని కాళ్ళు పట్టుకోవడం ఏమంటారు? దీన్ని అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకోడమే అంటారుగా…………., బాగా వ్రాసారు.

  • @అనూరాధ గారు
   భాగవతం లో దశమ స్కంధం ఉత్తర భాగం తక్కువ గా చదువుతాము. అందులో ఉంటుంది. చూడండి.
   ధన్యవాదాలు.

   • * నేను రామాయణం, భారతం గ్రంధాలను చదవలేదండి.
    * ఆ గ్రంధాలను చదివిన వ్యక్తులు తెలియజేయటం ద్వారా నేను చాలా విషయాలను తెలుసుకున్నాను.
    * దుర్యోధనుడి కూతురు శ్రీకృష్ణుని కోడలన్న విషయం మీ ద్వారా తెలుసుకున్నాను.
    * నేను ఎన్నో విషయాలను తెలుసుకోవటానికి కారకులైన అందరికి కృతజ్ఞతలండి.

   • @అనూరాధ గారు,
    ఒక్క మాట. రామాయణ, భారత, భాగవతాఅలు, శ్రుత పాండిత్యం మంచిదేకాని, మనకుగా మనం చదివి తెలుసుకుంటే చాలా విషయాలు తెలుస్తాయి. ప్రయత్నించండి. ఈ మూడు పుస్తకాలు ప్రతి ఇంట్లో ఉండాలని నా అభిప్రాయం.
    ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s