శర్మ కాలక్షేపంకబుర్లు-ప్రయాణం-తుఫాను.

ప్రయాణం-తుఫాను.

మొన్న వచ్చిన నీలం తుఫాను నష్టం చదువుతూ ఉంటే గోదావరి జిల్లాలను వణికించిన తుఫానుల్లో ఒకటైన నవంబర్, ఆరు, 1996 తుఫాను గుర్తొచ్చింది. నా ప్రయాణాలకి తుఫానలకి సంబంధం ఉందేమోననిపించింది. నేనెరిగిన మొదటి తుఫానుకు, ఆఫీసులో ఉన్నా, రెండవ తుఫానుకి దివి సీమ ఉప్పెనకి నిజామాబాద్ లో ఉన్నా, మూడవది ఇది ప్రయాణంలో చిక్కుపడ్డా. ఇంకా కొన్ని తుఫాన్లొచ్చాయి కాని ఈ తుఫాన్లు కలిగించినంత బాధ మిగిలినవి కలిగించలేదేమో అనిపిస్తుంది. నాల్గవది మొన్న నీలం, దానికి హైదరాబాదులో చిక్కుపడ్డా.

ఇప్పుడు చెబుతున్న తుఫాను నాటికి పాలకొల్లు లో ఉద్యోగం చేస్తున్నా, జె.యి గా. నేను ఆ ఊళ్ళో జాయినయిన దగ్గర నుంచి, శలవు పెట్టుకుని ప్రస్తుతం ఉన్న ఊళ్ళో ఇంటికి మరమ్మత్తులు, మార్పులు చేసి, రెండు వాటాలుగా అద్దెకివ్వాలని ప్రయత్నం, ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది, నాలుగేళ్ళుగా. ఈ తుఫాను రోజుకు ముందు పదిహేనురోజులుగా శలవు పెట్టుకుని ఇంటి పనులు చేయించుకుంటున్నాము. బయటి విషయాలు తెలుసుకునే సమయం ఉండటం లేదు, పని వత్తిడి మూలంగా. అబ్బాయి కూడా తెచ్చిన చిన్న రేడియొ ఉంది, దాని మీదంత శ్రద్ధ చూపలేదు. 5 వ తారీఖు సాయంత్రానికి పనైపోవచ్చింది, బయటి గోడలికి వెల్ల వేస్తున్నారు.. “నేను వెళుతున్నా, ఈరోజు సాయంత్రంకి పాలకొల్లు చేరుతా, నువ్వూ అబ్బాయీ, రేపు సాయంత్రానికి వచ్చెయ్యండి, ఇక్కడన్నీ సద్దుకుని” అని ఇల్లాలికి చెప్పి బయలుదేరేను. అదృష్టం కొద్దీ తిన్నగా పాలకొల్లు వెళ్ళే బస్ దొరికింది నాలుగు గంటలకి.

నవంబరు నెలకదా ఐదయ్యేటప్పటికి చీకటి పడుతోంది. బస్ రావులపాలెం చేరేటప్పటికి కొద్దిగా చినుకులు ప్రారంభమయ్యాయి. ఆరుగంటల ప్రాంతానికి మార్టేరు లాకు దగ్గరికి చేరింది బస్సు. ముందు చాలా వాహనాలు ఆగి ఉన్నాయి. కదలటం లేదు. అప్పటికి వర్షం జోరు పెరిగింది, గాలి కూడా పెరిగింది, ఈడ్చి కొడుతోంది. కొద్దిసేపటికి బస్సు కదిలింది అమ్మయ్య వెళ్ళిపొతున్నామనుకున్నా. సెంటరు దాటింది. బస్సునిండా సీటుకి ఒకరు చొప్పున పూర్తిగా జనం ఉన్నారు. వర్షానికి కరంటుపోయింది. జేబులో సిగరెట్లు ఉన్నాయి, అరపెట్టి. సరిపోతాయిలే అనుకున్నా. చాలినా చాలకపోయినా అంతే, కారణం కిందకి దిగే సావకాశం లేదు, గాలి వర్షం మూలంగా. ముందుకు కదిలిన బస్సు కొద్ది దూరం లో సొసైటీ ప్రాంతంలో ఆగిపోయింది, “ఏమయ్యా” అంటే “ముందు వాహనాలు కదలటం లేద”న్నాడు. అప్పటికే పక్క కర్టెన్లు దించేశాము, గాలి ఇంకా లోపలికి కొడుతూనే ఉంది. బస్సు ఉండి, ఉండి ఊగిపోతూ ఉంది. ఒక్కో సారి పక్కనున్న కాలవలో పడిపోతుందేమో బస్సు అన్నంత వేగంగా గాలి వీస్తోంది. నాకు వెనక సీటు దొరికింది, నెమ్మదిగా సిగరెట్టు ముట్టించి దమ్ము కొట్టేను. అందరూ అంతే చేస్తున్నారు, చలికి. సమయం గడుస్తోంది, కాని గాలి వాన తగ్గలేదు. నెమ్మదిగా సమయం గడుస్తోంది, పది, పన్నెండు, రెండు గంటలకి గాలి తగ్గింది, చినుకులున్నాయి. సిగరెట్లు అయిపోయాయి. ఏం చెయ్యాలో తోచలేదు. దిక్కులు చూస్తుంటే, సిగరట్లు అయిపోయాయి, దొరికే సావకాశం లేదని స్వగతంగా పైకి అనుకుంటే, పక్కవాడు సిగరట్టు ఇవ్వకపోతాడా, అని. రెండు గంటలుగా సిగరట్లు లేక తిక్కగా ఉంది, పక్క వాణ్ణి సిగరట్టు అడగలేక….కిందా మీదా పడుతోంటే… పక్క సీటతను చార్మినార్ ఉంది కాల్చండి అని ఇచ్చేడు. నాకు చిన్నప్పటినించి బర్కిలీ కాల్చడం అలవాటు. ఆ తరవాత అది గోల్డ్ ఫ్లేక్ ఫిల్టర్ చిన్నవాటికి మారింది. అది తప్పించి కాల్చలేను, బలహీనతలో మరో బలహీనత. లేనప్పుడేం చెయ్యాలి, “వద్దాన్నా”, “మీ బ్రాండ్ లేదు కదా, దొరకవు, రెండు దమ్ములు పీల్చి పారెయ్యండి పోనీ” అన్నాడు. కాదనలేని అవుననలేని బలహీన పరిస్థితి. ఛా! సిగరట్లు దొరకని జన్మ మెందుకని, బిచ్చమెత్తుకున్నా కాల్చే బ్రాండ్ సిగరట్టు దొరకని స్థితికి దేవుడిని తిట్టుకుంటూ …..మొత్తానికి సిగరట్టు ముట్టించా. ఒక దమ్ము లాగేటప్పటికి, అప్పుడే సిగరట్టు అలవాటు చేసుకుంటున్న వాడు పడినట్లు బాధపడి, దగ్గుతో, సిగరట్టు పారేసి చూస్తే, గాలి వాన తగ్గేయి.

డ్రయివరు, ముందు వాహనాలు కదిలితే కాని బస్సు కదలదని చెప్పేడు. జరిగిన సంగతి చూసి, చెట్లు పడిపోయి ఉంటాయని ఊహించి, ఏమయిందో చూదామని దిగేము, పక్కతను, నేనూ, సిగరట్లు దొరుకుతాయేమోనని చూస్తే అబ్బే! ఎక్కడా దీపం వెలుగే కనపడకపోతే…. ముందుకు చూసుకుంటూ నడిచేము, గుడ్డి వెన్నెలలో. ఒక చోట లారీ అడ్డం తిరిగిపోయింది రోడ్ కి, కొద్ది భాగం ముందు చక్రాలు కొద్దిగా దొల్లితే కాలవలో ఉంటుంది లారీ, అలా ఉంది. నడుచుకుంటూ ముందుకెళ్ళేం. మొదటి వాహనం ఆగిన దగ్గరనుంచి నేను దిగిన బస్సు రెండు కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. అక్కడొక చెట్టు పడిపోయింది, పెద్దది, రోడ్ కి అడ్డంగా. అక్కడొక చిన్న గుంపు చేరింది, ఒకరు “నడిచి వెళ్ళిపోదా”మన్నాడు. “వస్తావా కూడా” అన్నా. “నడవండ”ని, మళ్ళీ కనపడలేదు. ధైర్యే సాహసే లక్ష్మీ అని బయలు దేరా ఒక్కడిని. చెట్టు దాటాలి,”పాములుంటాయి” అన్నాడొకడు, వెనకనుంచి. కొమ్మలలోంచి దూరి మొదటి చెట్టు దాటాను. అది చింత చెట్టు. ఒక కొమ్మ విరవడానికి ప్రయత్నం చేశా, నా వల్ల కాలేదు. ముందుకు నడిచా. పదిగజాలకొక చెట్టు పడిఉంది. చెట్లు లోపలనుంచి దూరి, ఒక్కొకచోట మొదలు మీంచి దాటి ఇలా సర్కస్ చేస్తూ చెట్లు దాటేను. ఒక చోట చెట్టుకొమ్మ విరిచి సాయంగా పట్టుకు నడిచా. మొత్తం పదకొండు కిలో మీటర్లు దూరం. రెండు గంటలకి బయలు దేరినవాడిని ఉదయం ఆరు గంటలకి పాలకొల్లు చేరేను. కను చీకటి ఉంది. ఎక్కడా లైటు లేదు. నేను ఆఫీస్ క్వార్టరు లో ఉండటం చేత ఆఫీసుకి నడిచేను.ఈలోగా నా కాతా కొట్లు తీసుంటే సిగరట్లు దొరుకుతాయనుకున్నా. అబ్బే ఒక్కటీ తియ్యలేదు. అప్పుడు ప్రపంచమంతా సిగరట్లు బేన్ చేసినంత బాధ అనిపించింది. వాచ్ మన్ ని తాళాలు తీయమని నా సెక్షన్ కి వెళ్ళేను, కూడా వచ్చిన వాచ్ మన్ ని “సిగరట్లు దొరుకుతాయా” అన్నా, లేదండి, నిన్న సాయంత్రం కట్టేసేరు షాపులు, దొరకవండి, అన్నాడు..తలుపులు తీసి చూస్తే, ఏముంది అన్నీ పోయి ఉన్నాయి. కరంటు ఎప్పుడుపోయిందంటే సాయంత్రమే పోయిందన్నాడు. మరి బేటరీ దండుగెందుకని, అన్నీ ఆపేసి, ఇంటికెళ్ళి తలుపు తీసి చూస్తే, గాలికి, ఒక కిటికీ రెక్క తెరుచుకుని ఇంటి నిండా జల్లు కొట్టింది. అదృష్టం, కిటికి దగ్గరేమీ లేవు. ఇల్లు శుభ్రం చేశా,తెల్లారింది, ముందు చేసిన పని సిగరెట్లు తెచ్చుకోడం, వెతుక్కుని, ఒక కొట్టువాణ్ణి లేపి, ఎక్కువ రేటు చెప్పినా అర్జంటుగా సిగరట్లు కొనుక్కున్నా. వెంఠనే ముట్టించి దమ్ము పీలిస్తే అప్పుడు బుర్ర పని చేసింది, రాత్రంతా తిండిలేక కడుపు మాడుతున్నా బాధనిపించలేదు కాని సిగరట్లు లేక పడ్డ బాధ……పగవాడికి కూడా వద్దు అనిపించింది….

ఇంకా ఉంది…..

ప్రకటనలు

12 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ప్రయాణం-తుఫాను.

 1. :)) బర్కిలి, గోల్డ్‌ఫ్లేక్ లలో వునందై చార్‌మినార్లో లేనిది ఏంటి? అంతా పొగాకే కదా? లంక చుట్ట ఘాటు ఎక్కువ అనుకుంటా. చుట్ట అలవాటున్నోళ్ళకి సిగరెట్లు ఎలా అనిపిస్తాయి?
  సిగరెట్ ఎందుకు మానేశారు? ఎలా మానేశారు?
  ఇలా… ఎన్నో ప్రశ్నలు.

 2. మేంకూడా ఆరోజు తుఫాను బీబత్సంలో చిక్కుకొన్నాం శర్మగారు. బంధువులు ఊరినుంచి వచ్చి బస్‌కాంప్లెక్స్‌లో ఉండిపోతే, వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి సాయంత్రం ఆరుగంటలకి వెళ్ళి, అక్కడికి అర కిలోమీటరు దూరంలో ఉన్న మాఇంటికి తిరిగి వెళ్ళడానికి తెల్లవారుజాము 2గంటలవరకూ వేచిఉండాల్సి వచ్చింది. ఆఖరికి, మొలలోతు నీళ్ళలో, కూలిన చెట్లను, కరెంటు స్తంభాలనూ దాటుకొంటూ ఇంటికి చేరాం.

 3. మీ బాధకి :(.

  పొగ తాగని వాడు దున్న పోతై పుట్టును. 🙂 కోటి రూపాయలు చేతిలో ఉన్న వేస్టే .. ఒక్క సిగేరేట్ అయినా చేతిలో లేక పోయాక ..అంటారు.
  నేను కాదండి.. మావారు 🙂 🙂

 4. మాకు చక్కగా వారం రోజులు చదువులకు సెలవులు.
  క్షమించాలి అప్పట్లో నేను ౬ వ తరగతి, అమ్మని చాలా ప్రశ్నలు అడిగింట్టు గుర్తు, మాకు సెలవులు ఇచ్చారు కానీ నాన్నగారికి సెలవులు ఎందుకు లేవు అని.
  చెప్పానుగా మాది రాజోలు అని, నిజానికి ఊళ్ళో పెద్దగా నష్టం జరగలేదు కానీ మా పాఠశాల పెంకులు మొత్తం విరిగిపోయాయి అందుకని వారం రోజులు సెలవులు.

  • @ గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు గారు,
   తుఫానొచ్చి మీకు శలవిచ్చిందనమాట, నాకేమో పనిచ్చింది 🙂
   ధన్యవాదాలు.

  • @అమ్మాయ్ జ్యోతిర్మయి,
   సిగరట్టు కాల్చేవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ.చాలా కాలమయిందిలే మానేసి.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s