శర్మ కాలక్షేపంకబుర్లు-సిగరెట్టు పురాణం-నేను సిగరట్లు మానేశానోచ్!

సిగరెట్టు పురాణం-నేను సిగరెట్లు మానేశాను.

ఇతి ద్వితీయాధ్యాయ ప్రారంభః.

సిగరట్టు కాలుస్తూ కాని, మరేదేనా చెడ్డపని చేస్తూ కాని నాన్నగారి కంట పడలేదు 🙂 ఆయన ఒక ఋషి, ఏమీ పట్టించుకునేవారు కాదు అనవసరంగా, కనపడ్డామో తప్పు చేస్తూ, కావిడి బద్దతో పెళ్ళి చేసేరనమాటే. మళ్ళీ జన్మలో ఆ తప్పు ఛస్తే చెయ్యలేం, అందుకు బహు జాగ్రత్తలు తీసుకునేవాడిని, పెళ్ళి జరగకుండా 🙂 చిన్నప్పుడొక సారి చేసేరు పెళ్ళి, అప్పటినుంచే ఈ జాగ్రత్తలు.

ముక్కుపొడి పీల్చేవాడికి చుట్ట దమ్ము సరిపడదు, అది ఆనదు కూడా, చుట్టతో వచ్చే నికోటిన్ పరిమాణం చాలదు, ముక్కుపొడితో వచ్చేదానితో బేరీజువేస్తే. అలాగే మిగిలిన సిగరట్లు కూడా. వాటిలో డెక్కన్, చార్మినార్ లాటి వాటిలో పుగాకులోని కాడలలాటి వాటిని ఉపయోగించి తయారు చేస్తారు. వీటికి ఘాటెక్కువ. ఇక బర్కిలీ,సిజర్స్, వగైరా లాటి వాటిలో వాడే పొగాకు రెండవ రకం కావచ్చు. ఇక గోల్డ్ ఫ్లేక్ వగైరా లాటి వాటిలో వాడేది నాణ్యమైన పొగాకు. అన్నీ నికోటిన్ సరఫరా చేసేవే కాని కొద్ది హెచ్చు తగ్గులలో ఘాటు తేడా, వాసనలో కూడా. నేను సిగరట్టు కాల్చడం కూడా విలక్షణంగా ఉండేది. చూపుడు వేలు మధ్య వేలు మధ్య వెలుగుతున్న సిగరట్టు ఉంచి, గుప్పిడి మూసి గుప్పిడి నోటి దగ్గర పెట్టుకుని దమ్ము లాగితే, చూసే వాళ్ళకి బహు భయంగా ఉండేది, దీన్ని గంజాయి దమ్ము అంటారు. చిన్న చిటకా ఏమంటే, ఇలా దమ్ము లాగిన పొగని ఊపిరి తిత్తులలోకి కొద్దిగా మాత్రమే వెళ్ళనిచ్చి నోటిలో పొగ ఎక్కువగా ఆపి, నోటి దవడల ద్వారా నికోటిన్ ప్రవేశ పెట్టేవాడిని శరీరంలోకి. ఇలా సిగరట్టు కాల్చడం ఒక ధ్రిల్, మామూలుగా కాలిస్తే కాల్చినట్లు ఉండేది కాదు..

అమ్మ కంటే ఇల్లాలే ఈ విషయంలో ఎక్కువ సహనం వహించింది. ఈ అలవాటు మానుకోక పోడానికి కొత్త కారణాలు దొరికేయి. అది రాత్రి పగలు అని తేడా లేని ఉద్యోగం. అర్ధ రాత్రి ప్రారంభమయ్యే ఉద్యోగానికి, రాత్రి మేలుకు ఉండటానికి సిగరట్టు కాల్పు ఒక వంక, బాగానే పని చేసింది. ఆ తరవాత ప్రమోషన్ వచ్చినా, అదీ రాత్రి పగలు ఉద్యోగమవడం తో సాకు కొనసాగింది. ఆ తరవాత జె.యి ఐన తరవాత టెన్షన్ కి ఇది టానిక్ లా పని చేసింది. ఈ మధ్యలో ఒక సారి మానేయాలనే తీర్మానం గట్టిగా చేసుకుని బండెక్కా, జబల్పూర్ కి. ప్రతి సారి మానెయ్యాలని తీర్మానించుకోడం మళ్ళీ ఏదో సాకుతో మొదలెట్టేయడం జరిగిపోయింది. జబల్పూర్లో ఉన్న కాలంలో ట్రయినింగు సమయం, దానికితోడు అది నేను బాగా చేసిన పని, తెలిసిన విద్య కనక పెద్ద బాధ పడలేదు, మిగిలిన వారు శీర్షాసనాలేస్తోంటే, నేను విలాసంగా కాలక్షేపం చేసేవాడిని. హాయ్! హాయ్! అందుకు మానేసేను,సిగరట్టు రెండేళ్ళు, అమ్మయ్య బతికిపోయాననుకున్నా, టెన్షన్ లేక. ఆ తరవాత వస్తూ విజయవాడ స్టేషన్ లోనే సిగరట్టు అంటించా, కారణం పోస్టింగ్ దగ్గరేదో కిరికిరి జరుగుతోందన్న గాలి వార్త చెవిని పారేసేడో మిత్రుడు రయిల్లోనే, ఇంకేమిటి మళ్ళీ మొదలు. ఉద్యోగం పెరిగింది, హోదా పెరిగింది, ఆహ్వానాలు అందుతున్నాయి, కొంచెం జాగ్రత్త పడ్డా, సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చా, కాని ఒక చోట ఇబ్బందిలో చిక్కుకుపోయా, అది మొదలు మరొక దురలవాటు. ఆ తరవాత ఆహ్వానాలు తిరస్కరిస్తూ, ఒకచోటే కానిస్తూ కాలం గడిపేసేను.

ఐదారేళ్ళు ఆ అలవాటు, సిగరట్టు జమిలిగా స్వారీ చేసేయి, నా మీద. ఒక రోజు ఇల్లాలు నిలదీసింది, “ఏం చేస్తున్నారు, ఇది బాగుందా, పిల్లలు పెరుగుతున్నారు, ఆలోచించుకోనక్కరలేదా? పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకోరా? మీరే అందరికి చెబుతారు కదా! శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు లేదా మీ పరిస్థితి, నేను ఉన్న సంగతి చెప్పా, ఈ అలవాట్లు మంచివా? మీ ఇష్టం ఎలా ఉంటే అలా చెయ్యండి” అంది.( ఇది చాలా మంది ఇల్లాళ్ళ ఆలోచనే )”మరొక మాట మీరు ఇంటిదగ్గరుంటే సిగరెట్టు కాల్చరు, ఎన్నిరోజులు ఇంటి దగ్గరున్నా, బయటికెళితే కాలుస్తారు, ఇదేమి వింత కదా, ఇంటి దగ్గరే ఉన్నాననుకుని మానెయ్యచ్చు కదా” లా పాయింటు లాగింది. “మానేయాలని అనుకోవచ్చుగానీ…” సాగదీస్తే “సింగినాదం ఊరికే సాకు చెబుతారు” అంది, కరణేషు మంత్రి కదండీ 🙂 నిజంగా కూడా నా తల్లిగాని, ఇల్లాలు కాని, పిల్లలు కాని నేను సిగరెట్టు కాలుస్తుండగా చూడలేదు, ఎప్పుడూ, ఇదీ ఒక విచిత్రమే, మనసు చేసే చిత్రమే.

కొద్దిగా కదలిక వచ్చింది,నాలో, అది పూర్తి అవడానికి మరొక అవాంతరం సాయపడింది. ఒక మిత్రుడు చనువు తీసుకుని ఒక విషయం పీక మీదికి తీసుకొచ్చాడు, అప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి, గీతా సారం అర్ధమయ్యింది, పెద్ద అలవాటు, మందు అలవాటు వదిలిపోయింది, మొదటిది నిలిచిపోయింది :).జీవితంలో ఎదురు  దెబ్బ తగిలింది, నెమ్మదిగా కోలుకున్నా. అప్పుడు మూడు పెట్టెలు కాల్చడం నుంచి ,ఈ సిగరట్టు అలవాటు కనీస స్థాయికి అనగా రోజుకి ఐదు సిగరట్లు కాల్చే స్థాయికి పడిపోయింది. ఇలా నడుస్తుండగా కాలం కదలిపోయి నువ్వు బయటికెళ్ళిపోవచ్చన్నప్పుడు కూడా సిగరట్టు వదల లేదు, కాని బాగా తగ్గిపోయింది. రోజుకి అరపెట్టి కాల్చేవాడిని. రిటయిర్ అయిన తరవాత ఒక మిత్రుడు పిలిచి వ్యాపారం చేదామన్నాడు,చేసేం, లాభాలూ వచ్చాయి. అప్పుడు కూడా ఐదు సిగరట్ల తోనే సరిపెట్టేను.

ఒక రోజొక చిత్రం జరిగింది. అక్కడ ఉన్న ఒక తోటి వారితో మాట్లాడుతుండగా” బాబాయ్! ఏం మందు కొట్టేవు, అంత ఘాటు వాసనొస్తోంది” అన్నాడు. “లేదబ్బాయ్! మందు మానేసి చాలా ఏళ్ళయయింది, ఇప్పుడు మందు కొట్టటమేంటి, సిగరట్టు కాల్చాను” అన్నా. “ఏం బ్రాండు బాబాయ్ అంతలా ఉంది” అన్నాడు. “నేను మామూలుగా కాల్చేదే గోల్డ్ ఫ్లేక్ ఫిల్టర్” అన్నా. ఈ సంభాషణ తరవాత నాలో ఒక రకమైన భావన బయలుదేరింది. మనం చేస్తున్న పని బాగో లేదని అంటున్నారు, పదిమంది వద్దన్న పని చెయ్యడం మంచిదా? దానికి తోడు ఇది ఆరోగ్యాన్ని కూడా ఇబ్బంది పెడుతుంది కదా అనుకుని ఎవరికీ చెప్పకుండా నా మటుకు నేను నిర్ణయం తీసుకుని, మానేశాను. దగ్గరగా ఏభయి సంవత్సరాల అలవాటుకు స్వస్తి చెప్పేను, ఇదివరకే చెయ్యచ్చుగా అనచ్చు, సమయం కలసిరావాలి, మనసుకు పట్టాలి. చాలా కాలం ఎవరూ గుర్తించనూ లేదు. ఇల్లాలు గుర్తించింది, కాని మాటాడలేదు, ఇటువంటి ప్రతిజ్ఞలు చాలా సార్లయ్యాయి కనక. కాని అభినందన చూపులోనే చెప్పేది, మనసెరిగిన నెలత అభినందన మంచి నిషా ఇచ్చింది, వాటికంటే. ఆ గుర్తింపు చాలనిపించింది. 🙂 ఒక సారి ఒక రాత్రి మేలుకుని ఉండాల్సి వచ్చింది. అప్పుడు ఆ స్నేహితుడే తన కోసం సిగరెట్లకి పంపుతూ “నీకూ కావాలా బాబాయ్” అన్నాడు. అప్పుడు చెప్పేను, “సిగరట్లు మానేసేను, ఒక సంవత్సరమయిందని,” ఒక్క సారిగా అందరూ ఆశ్చర్య పోయారు. “నువ్వనబట్టే మానేశాన”న్నా. “నువు మానేశావుగాని నన్నొదలలేదు,” అన్నాడు. అంతే మళ్ళీ సిగరెట్టు ముట్టలేదు. దగ్గరగా ఎనిమిదేళ్ళు పై మాట, మానేసి. ఇది దుర్గుణం, మానేస్తే ఏమీ కాదు, మనసు ను నిగ్రహించుకుంటే సాధించలేనిది లేదని నా మటుకు నేను నిరూపించుకున్నా.

శ్రీ శర్మ విరచిత సిగరట్టు పురాణే ద్వితీయాధ్యాయః సంపూర్ణం.

ఫలశృతి:- ఈ అలవాట్లున్న వారు ఇది చదివిన, ఆచరించిన ఇష్టసఖీ పొందు, పొగడ్త దక్కునని, అది ఈ అలవాటులిచ్చే కిక్ కంటే, ఎక్కువ కిక్ ఇస్తుందనీ అనుభవపూర్వక ఉవాచ.
స్వస్తి

ప్రకటనలు

7 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-సిగరెట్టు పురాణం-నేను సిగరట్లు మానేశానోచ్!

 1. దురలవాట్లు/ఆరోగ్యానికి హాని కలిగించే అలవాట్లని వదిలించుకోవటం అంత తేలికైన విషయమేమి కాదండి. అలాంటిది ఎలాగో ఒక లాగ, అవన్ని వదిలించుకున్న మీకు అభినందనలు.

  • @శ్రీ గారు,
   నిజానికి ఇటువంటి అలవాట్లు ఎక్కువగా మగవాళ్ళవే ఇప్పటిదాకా 🙂 , దాని ద్వారా బాధపడేది ఇద్దరు, భార్యా, భర్త కూడా. నా అదృష్టం కొద్దీ నన్ను పట్టుకున్న అన్ని వ్యసనాలూ వదిలేయగలిగా, అమ్మ దయ.వదిలించుకోడానికి దగ్గరగా ఏభయి ఏళ్ళు పట్టిందంటే చూడండి. ఇప్పుడు ఆడవారు కూడా ఇలా తయారవుతున్నారంటున్నారు, భయంకరం.
   ధన్యవాదాలు.

 2. ఇప్పటికైనా మంచిపని చేశారు. మాకు కావలసినవారొకరు ఇలాగే రోజుకు 2 – 3 పెట్లు కాల్చేవారు – ఫ్రీగా వస్తున్నాయికదా అని. చివరికి మూత్రాశయంలో కాన్సర్ వచ్చింది. మెడికల్ పుస్తకాలు తిరగేస్తే సిగరెట్లు కాల్చడం ఒక కారణం కావచ్చు అని ఉంది. చేతులు కాలాయి. తర్వాత ఆరు నెలలకే కాలంచేశారు.

  • @వేణు గోపాల్ గారు,
   స్వాగతం, నేను పొరబడి ఉంటే పునఃస్వాగతం నా బ్లాగుకి. మొత్తానికి నాకు ఈ అలవాటు తప్పిందంది గత ఎనిమిదేళ్ళు పై బడి. అయ్యో అనడం తప్పించి ఏం చెయ్యలేమండి.
   ధన్యవాదాలు.

 3. ఈ వేళ మీ టపా చూసాను. కింది కామెంటు పెడదామనుకున్నాను. కానీ అనవసర చర్చలకి దారి తీస్తుందేమో నని మానేసాను. వ్రాసి పోస్ట్ చెయ్యడం మానేసినది మీ దాకా చేరాలని ఈ మెయిల్.

  ఇష్టసఖి పొందు, పొగడ్తలకి ఆరాట పడే వయసు కాదు కాబట్టి నేను ఇలా కంటిన్యూ చేసేస్తా. ఏభై మూడేళ్ళ పాటు నిరాఘాటంగా, నిర్విఘ్నం గా సాగిపోతోంది. మధ్యలో నాకు గుర్తుండి ఒక 12 రోజులు హాస్పిటల్ లో ఉన్న కాలం తప్ప. ఒకప్పుడు ఐదారు పేకట్లు రోజుకి. ఇప్పుడు నాలుగే.

  ఓ చిన్న కధ చెబుతాను. ఒక ఆదివారం యధావిధిగా మా ఆవిడ నోము నోచింది. అంటే సిగరెట్టు దుర్వ్యసనం, సైన్స్, సింగినాదం అంటూ మొదలు పెట్టి ఉపన్యాసం కంటిన్యూ చేస్తోంది. మా బాసు గారు టెలిఫోన్ చేసారు. మా అమ్మాయి ఫోన్ ఎత్తింది. మీ నాన్న ఏంచేస్తున్నారమ్మా అని అడిగారు.

  In spite of being a scientist, in spite of irrefutable scientific evidence, in spite of strong protests, my father is smoking merrily sitting in the balcony.

  అని చెప్పింది. ఆయన ఒకటే నవ్వు. కనిపించిన వాళ్ళందరికీ చెప్పి మరీ నవ్వాడు ఆ రోజు.

  కాబట్టి ఈ జీవితానికి ఇంక ఇంతే…….

  మిత్రులొకరు టపా మీద రాసిన ఉత్తరం, వారు అనుమానపడినందున పేరు చెప్పటంలేదు.

  మిత్రులకి ధన్యవాదాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s