శర్మ కాలక్షేపంకబుర్లు-ఔను వాళ్ళిద్దరూ విడిపోయారు, మళ్ళీ కలవడానికే :)

ఔను! వాళ్ళిద్దరూ విడిపోయారు, కలవడానికి.

Courtesy You tube

కితం వారం పట్టిసీమ వెళ్ళేము. ఈ వారం విశాఖ జిల్లాలో ఒక పల్లెటూరికి వేళ్ళేము,ఈ వేళ మద్యాహ్నం ఇంటికి చేరేము, టపాలు చూస్తూంటే మిత్రులు శ్రీబులుసు సుబ్రహ్మణ్యం గారి టపా ఔను! వాళ్ళిద్దరూ విడిపోయారు చదివిన తరవాత, ఈ టపా రాయడం అర్జంటయి, కార్తీక మాసం సందర్భంగా,వెళ్ళి వచ్చిన టపా వాయిదా వేసి 🙂

“నేను ఇప్పుడే ఊరునుంచి వచ్చి టపా చూశాను. వ్యాఖ్య పెడదామని రాసి మానేశాను. నా బ్లాగులో టపా రాస్తున్నా.”ఇదీ నా వ్యాఖ్య శ్రీబులుసుగారి బ్లాగులో.

ఇది రాయబోయి మానేసిన వ్యాఖ్య,
“ఒక చిన్న సలహా, ఉచితం, ఇద్దరికీ, మీరు తీసుకున్న నిర్ణయం మంచిదే,త్వరలోనే కలుస్తారు మళ్ళీ, విడిపోతే కొద్ది కాలం, నిజం, నిజం, నిజం..,విడిపోవడం తాత్కాలికం, కలిసి ఉండడం సత్యం. శుభం భూయాత్!!

శతంజీవ శరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి,
శతమేన మేన శతాత్మానం భవతి, శతమనంతం భవతి, శతమైశ్వర్యం భవతి, శతం దీర్ఘమాయుః
మరుతయేనా వర్ధయంతి.”

రామాయణం లో చూస్తే సీత దెబ్బలాడి రాముని వెంటపడి అడవులకి వెళ్ళి కష్టాలనే కొని తెచ్చుకుంది పాపం :). సీతను రావణుడు ఎత్తుకుపోతే యుద్ధం చేసి సీతను తెచ్చుకున్నాడు, రాముడు . ఇక లక్ష్మీ దేవి, భృగువు, విష్ణు వక్షస్థలం మీద తన స్థానాన్ని కాలితో తన్నేడని అలిగి వెళ్ళిపోయింది. స్వామి వారేం చేసేరు, వెనకపడి ఆమెను మరల వలచి, వలపించుకుని మనకు వెంకన్న బాబుగా దర్శనమిస్తున్నాడు.

అసలీ కోప తాపాలు, విడిపోడాలు, వేరుగా ఉండడాలు, మళ్ళీ కలవడాల్లోనే ఉంది అసలు మజా. రాముడూ విడిపోయాడు, విరహమూ అనుభవించాడు, వెంకన్న బాబూ విరహం అనుభవించాడు, లచ్చితల్లికి కోపంతో వచ్చేస్తే వెనకాలే పరుగెత్తుకొచ్చేడు, వైకుంఠంలో ఉండలేక, ఒంటరిగా. భార్య భర్త ఒకరికొకరు, సంపూరకాలు, పరిపూరకాలు. విడతీయలేని ఒకటి. రెండుగా కనపడే ఒకటి, ఒకటే అయిన రెండు.

శ్రీబులుసు గారి టపాలో ప్రభావతీ ప్రద్యుమ్నుల మధ్య చెప్పుకోతగిన తగాదా కాని, మాట పట్టింపుకాని కనపడదు. ఇది సద్దు బాటు మీద వచ్చిన విరక్తి. పాపం ప్రభావతి గారు పతియే ప్రత్యక్ష దైవం అనుకుని, నాన్న చెప్పిన మాట విని పెళ్ళి చేసుకుని, ప్రద్యుమ్నుడు కోల్కతా పాట్ ఫాం మీద ఒంటరిగా వదిలేసి బండెక్కేసినా సద్దుకున్న ఇల్లాలు. అలాగే ప్రద్యుమ్నుడు కూడా ప్రభావతి గారిని విడిచి ఉండలేనివాడే. విడిపోవాలనే నిర్ణయం కూడా ఏకగ్రీవంగానే తీసుకున్నట్లు కనపడుతోంది, ఒక రకంగా, ప్రభావతి గారు పతి మనసు తెలిసి, చదివిన ఇల్లాలు కనక, ఎక్కడికీ చెక్కెయ్యదని చెప్పగలిగింది, పిల్లలు వచ్చిన సందర్భంలో. పాపం ప్రద్యుమ్నుడు కూడా అల్ప సంతోషి, జీతం పట్టుకొచ్చి ప్రభావతిగారి చేతికిచ్చి, సిగరెట్లకి కూడా డబ్బులడిగిన పత్నీవ్రతుడు, మరే ఇతర చెడు అలవాట్లూ లేనివాడు. ఏంటండి ఈ సుత్తి అంటారా? ఆగండి మరి, అంతా బాగానే ఉంది మరెందుకు విడిపోడం అనే కదా మీ బాధ, ముందే చెప్పేను కదండీ ఇది “అతి పరిచయాదవజ్ఞతా” అని ఒకరిని ఒకరు విడిచి ఉండకపోవడం చేత వచ్చిన చిక్కు. అమ్మయ్య ఇప్పటికి గుండు గొమ్ముల అనుమానం తీరింది కదా.

“మన” అనుకున్న పిల్లలముందు వారిద్దరూ తీసుకున్న నిర్ణయం కనక ఇది తెలియకనే, అనుకోకుండానే మరల కలుసుకోడానికి ప్రాతి పదిక. ప్రభావతి గారిలో చిన్న సణుగుడుంది, అది ప్రద్యుమ్నుడుకీ అలవాటయిపోయింది, ఇక ప్రద్యుమ్నుడు కీ ఇంటిని ఇల్లాలిని పట్టించుకోని లక్షణం చిన్నప్పటినుంచీ ఉంది. ఇప్పటివరకూ ఇద్దరూ సద్దుకుపోయారు.ప్రభావతీ, ప్రద్యుమ్నులిద్దరూ త్యాగాలు చేసేరు వయసులో, కుటుంబం గురించి. అప్పుడు గృహమేకదా సర్గ సీమ అని పాటలూ పాడుకున్నారు, డ్యూయట్లు కూడా. తినగ తినగ వేము తియ్యనుండు అన్నాడు వేమన, ఇక్కడది తిరగబడింది. తీపి అదే పనిగా తింటే మొహం మొత్తుతుంది, అందుకు మధ్యలో కొద్దిగా కారం కూడా ఉండాలి. అది రోజువారీలో ఉంటే ఈ బాధలు రావు. సరే ఇప్పుడొచ్చేసేయి కనక ఇద్దరూ బుద్ధిగా వారి వారి ఓల్డేజ్ హోముల్లో విశ్రాంతి తీసుకోండి, ఒకరితో ఒకరు మాట్లాడకండి. వేరుగా ఉంటున్నారు కదా. ఒకరినొకరు తలుచుకోవద్దు, ఫోనూ చెయ్యద్దు. వీరిద్దరూ విడాకులు తీసుకునేటంత ధైర్యస్థులు కాదు, 🙂 ఆ భయమూ లేదు. ఒక వేళ తీసుకోవాలనుకున్నా సెక్షన్ 13A  ప్రకారం ఒక సంవత్సరం వేరుగా ఉండాలి, ఇది అందుకు పనికి వస్తుంది.

ఏబదేళ్ళ వివాహ జీఇతానుభవంతో చెబుతున్నా! ఇద్దరికీ,మళ్ళీ

విరహము కూడా సుఖమే కాదా? విరహపు చింతన మధురము కాదా?
వియోగ వేళల విరిసే ప్రేమల విలువను కనలేవా?
నీ కోసమె నే జీవించునది, ఈ విరహములో ఈ నిరాశలో, పాటలు మాత్రం పాడుకోవద్దు, పొరపాటున మాటాడుకోవద్దు.ఇహ మీరు మీపని లో ఉండండి. శలవు.

మనలో మన మాట అవును వీళ్ళీద్దరూ విడిపోయారు, మళ్ళీ కల్సుకోడానికే!!! 🙂 పొరపాటుగా కూడా ఉండలేరు,వేరుగా, ఇది సత్యం,సత్యం,సత్యం ముమ్మారు 🙂 మం.హా

శతంజీవ శరదో వర్ధమానా…….. అస్తు

ప్రకటనలు

7 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఔను వాళ్ళిద్దరూ విడిపోయారు, మళ్ళీ కలవడానికే :)

 1. శర్మగారికి ధన్యవాదాలు, నా టపా మీద టపా వేసినందుకు.
  నేను వ్రాసింది నిజంగా కధే.. కానీ వాస్తవం లో అలా కష్టపడుతున్న తల్లులు నాకు తెలుసు.

  అన్నట్టు, ప్రద్యుమ్నుడు వేరు సుబ్రహ్మణ్యం వేరు. కొంతమంది ఇద్దరూ ఒకరే అనుకుంటున్నారని బాగా అర్ధం అయింది నా ‘ఔను, వాళ్ళిద్దరూ విడిపోయారు’ టపాతో…..దహా.

  • @మిత్రులు బులుసు సుబ్రహ్మణ్యం గారు,
   మీ టపా చూసిన తరవాత రాయక ఉండలేకపోయా. మీ బ్లాగులో నవ్వులనదిలో పువ్వుల పడవ సాగుతో ఉంటుంది, ఇదేమబ్బా అని ఒకింత ఆశ్చర్య చకితుడనై, ఆలోచించి, పంకించి, యుంకించి…
   ప్రద్యుమ్నుడు శ్రీ బు.సు గారు వేరు వేరని నాకెప్పుడో తెలుసుగా 🙂
   అంత సుదీర్ఘ వైవాహిక జీవితం తరవాత విడిపోవడం, పాఠకులకీ ఇష్టం లేదు, మీరక్కడ వాళ్ళని వేరువేరు ఓల్డేజ్ హోముల్లో చేర్చేసేరు, నిర్ణయం కాలానికి వదిలేసేరు. నేను అక్కడే మొదలుపెట్టి, వ్యంగ్యం తో కలుస్తారని, వేరుగా ఉండలేరని, తప్పదని చెప్పేను. నేను పూర్తి స్థాయిలో ఆశా జీవిని 🙂
   నాకు ఒక టపా రాయడానికి ప్రేరణ కలిగించినందుకు.
   ధన్యవాదాలు.

 2. మనకు మూడు రకాల కాలాలు ఉంటాయి
  ౧. వేసవి
  ౨. వర్షాకాలం
  ౩. శీతాకాలం

  కానీ ప్రస్తుతం మనం కొంతమంది ధనదాహం కలిగిన వాళ్ళను చూసి ప్రతీరోజూ శీతాకాలం కావాలి అని కోరుకోవడం పెరిగిపోతుంది, ఇదికూడా అంతే.
  ప్రకృతితో వెళ్ళడమో లేదా బుర్రతో వెళ్ళడమో చూడాలి.

  • @ గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు గారు,
   అంతకాలం శీతాకాలం ఉండదండీ, ప్రకృతితోనే బతకాలి,మీ స్పందనకి,
   ధన్యవాదాలు.

  • మీ టపా ఉదయాన్నే చూసి ఈ టపా శీర్షిక ఎక్కడో చదివినట్టుంది కదా అనిపించింది. అక్కడ విడిపోయిన ప్రభావతి,ప్రద్యుమ్నుల్ని మీరు ఇక్కడ కలిపారని సంతోషంగా అనిపించింది చదివిన తర్వాత. ఇందాక బులుసు గారి బ్లాగులోని వ్యాఖ్యలు చూసి అదంతా కల్పితమని మనసు తేలికపడింది.

  • @శ్రీ గారు చిన్ని గారు,
   శ్రీ బు.సు గారు ఔను వాళ్ళిద్దరూ విడిపోయారని రాసి, వాళ్ళని ఓల్డేజ్ హోముల్లో చేర్చేసేరు. నాకు అక్కడే మొదలుపెట్టక తప్పలేదు. ఊహలో కూడా 42 సంవత్సరాల వైవాహిక జీవితం తరవాత విడిగా ఉండటం ఇష్టపడని సంస్కృతి మనది. విడతీయలేని బంధం. మీ స్పందనకి,
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s