శర్మ కాలక్షేపంకబుర్లు-అయ్యో! పాపం.

అయ్యో పాపం.

ఈ మధ్య నడక చెట్టెక్కేసింది.శీతాకాలం ఉదయం నడకకి వెళితే మంచు, అదీగాక రొంప పట్టి బాధపెడుతుందని భయం. సాయంత్రం నాలుగుకి మనవరాలిని తీసుకురావడానికి కాలేజికి వెళ్ళాలి. నాలుగున్నరకి నడకకి వెళ్ళి ఐదున్నరలోగా తిరిగొచ్చెయ్యాలి, చలి తిరగకుండా. ఒక్కోరోజు ఎగేస్తూ వస్తూ ఉంటే, నడక వెనకపడుతూంది.మొన్న ఐదవుతుండగా బయలుదేరా. నేను నడిచేటప్పుడు దిక్కులు చూస్తూ నడవను, పెళ్ళివారి నడక నడిస్తే, దాని ఉపయోగం ఉండదని, కర్ర పుచ్చుకుని కొంచం తొందరగానే అడుగులేస్తున్నా, అప్పుడు కనపడ్డాడు, పాతికేళ్ళకితం ఈ ఊళ్ళో నాతో పని చేసినతను.  కుశల ప్రశ్నల తరవాత,ఎక్కడుంటున్నావన్నా.

“మీకు తెలియదు కదూ, మీరిక్కడినుంచి వెళ్ళిన తరవాత నేనిక్కడ ఇల్లు కొనుక్కున్నా. ఆ తరవాత ఎక్కడెక్కడో తిరిగా, ఇక్కడికి ఒక సంవత్సరం కితం వచ్చేను, మొన్న నెలాఖరుకి రిటయిరయ్యా”నన్నాడు. “మీరిక్కడ ఉంటున్న సంగతి తెలియదు.” అన్నాడు. “బాగుంది” అన్నా. “రావలసిన డబ్బులొచ్చేయి, కొన్ని రావాలి. వచ్చిన డబ్బులేంచేయమంటార”న్నాడు. ఇదేమిటి ఇంత అమాయకులున్నారా అనుకుంటూ, “నీ భార్య పేర కొంత, పిల్లలికి కొంత ఇచ్చెయ్యి, సరిపోతుంది. కొద్దిగా దగ్గరుంచుకో” అన్నా. “అయ్యో! పిల్లలు లేరు, ఆమె ఇల్లు కొనుక్కున్న మరు సంవత్సరం కాలం చేసింది,” అన్నాడు. “మరైతే ఎవరినేనా దగ్గరకి తీసుకోలేకపోయావా” అన్నా, సందిగ్ధంగా. “అదీ అయ్యిందండి, ఆమె పోయిన తరవాత ఒకామెను వివాహం చేసుకున్నా. కొద్ది రోజులు బాగానే ఉంది. ఇంటిలో ఎక్కువ మొత్తంలో సొమ్ము పెట్టా ఒకసారి, దగ్గరగా పది లక్షలు ఉండచ్చు. అది పుచ్చుకుని ఆవిడ చెక్కేసింది. చాలా ప్రయత్నాలు చేశా. పోలీస్ కంప్లయింటూ ఇచ్చా, బంధువులలో వాకబు చేశా, ఆమె ఆచూకీ తెలియలేదు. అప్పటినుంచి ఇలా ఒంటరిగా ఉంటున్నా. డబ్బులున్నాయి, ఒంటి వాడిని ఖర్చు తక్కువ, భార్య, పిల్లలూ లేరు. డబ్బులేమి చెయ్యను” అన్నాడు. “నీకు పెన్షన్ వస్తుంది కనక ఉన్న సొమ్ము బేంక్ లో పడెయ్యి. బంధువుల తాలూకు ఎవరూ చూడరా” అన్నా. “దానికేం భాగ్యమండి, చాలా మంది ఉన్నారు, నన్ను వచ్చెయ్యమంటున్నారు, “అన్నాడు . “పోనీ వెళ్ళిపోవచ్చుకదా” అన్నా. “రమ్మనమంటారు, తీరా వెళితే చేతిలో సొమ్ము ఊడపెరుక్కుని,బయటికి తన్ని తగిలేస్తారండి, అక్కడికి వెళ్ళలేనండి” అన్నాడు. రావలసిన డబ్బులన్నీ సరిగా వచ్చాయో లేదో తెలియటం లేదన్నాడు. రేపురా, ఇంటి దగ్గర లెక్కలేసి చెబుతా అని ముందుకు సాగిపోయా.

మర్నాడు వచ్చాడు. లెక్కలు కట్టి ఇంత సొమ్ము రావాలి, వచ్చిందా అంటే కాగితాలు తీసిచూసి, సరిగా అంతే వచ్చిందండి, మిగిలనవి కొద్దిగా రాలన్నాడు. మళ్ళీ విషయం అతని పరిస్థితి మీదకి వచ్చి అగింది. “దగ్గర వారిని ఎవరైనైనా ఇక్కడికి వచ్చి ఉండ మనచ్చు కదా” అన్నా. “అదీ అయిందండి. కావల్సిన కుర్రాడే! అక్కడ చేసే పనీలేదు, రోడ్లు కొలవడం తప్ప. పెళ్ళి కూడా అయింది, ఒక పిల్లాడు. వాడిని భార్యని తీసుకు వచ్చేసి నా దగ్గరుండిపొమ్మన్నా. ఆ కుర్రాడికి ఇక్కడ ఒక చిన్న ఉద్యోగం కూడా ఏర్పాటు చేశా, ఉన్న సొమ్ము నా తరవాత నీకే ఇస్తానని చెప్పా. జాగ్రత్తగా బతుకు, సంపాదించుకున్నది దాచుకో, నేను మీకు తిండీ, గుడ్డా ఇస్తాను, నన్ను చూడండి, ఇల్లు ఇచ్చేస్తా నా తరవాత. మీ సంపాదన మీరు చేసుకోండని చెప్పేను. సరేనని వచ్చి ఉన్నారు. కుర్రాడి భార్య మిషన్ కావాలంటే కొనిచ్చా. కుట్టు కుట్టేది. ఒక సంవత్సరం బాగానే ఉన్నారు. సంపాదించుకున్న డబ్బూ దగ్గరగా లక్ష అయింది, వాళ్ళది. సొమ్ము జాగ్రత్త పెట్టుకోమన్నా. ఒక రోజు ఉదయమే ఇద్దరూ మేము వెళ్ళిపోతున్నామ”న్నారు. “ఏమయింది” అని అడిగా. ఒక్కరూ సమాధానం చెప్పలేదు,”నా వల్ల బాధ కలిగిందా” అని అడిగా. “లేదు, నిజానికి మేము బాగున్నామ”న్నారు. “అటువంటప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నా”రన్నా. “ఇక్కడ ఉండలేము, వెళ్ళిపోతున్నామని వెళ్ళిపోయారు. ఆ తరవాత మరి ఇటువంటి ప్రయత్నం చేయలేదు.”అన్నాడు

నాకు మనసులో కలుక్కుమంది. బాధ కలిగింది,ఎందుకు అలా జరిగిందబ్బా అనుకున్నా. ఏంటి ఇన్ని విధాలుగా దెబ్బతిన్నాడనుకుని, “ఐతే ఒక పని చెయ్యి, ఇది నా సలహా, నీకు బాగుంటే అమలు పరచుకో. ఇక్కడికి దగ్గరలోనే ఓల్డేజ్ హోమ్ లు ఉన్నాయి. వాటి వివరాలు నాకు తెలుసు, ఇస్తాను, వెళ్ళి చూడు, బాగుంటే ఏదో ఒక దానిలో చేరిపో, నీలాటి వారికి చాలా సౌకర్యంగా ఉంటుంది. నీ దగ్గరుండి వెళ్ళినవాళ్ళు, బహుశః నువ్వు మళ్ళీ బతిమాలుతావనుకున్నారేమో! నోటి దగ్గర, తినే అన్నం కూలదోసుకున్నారు. కారణం చెప్పలేనంటున్నావు. ఓల్డేజ్ హోమ్ లో నీవు డబ్బులిచ్చెయ్యచ్చు, బాధపడక్కరలేదు. అక్కడ మన వయసువారే ఉంటారు, బాధా పంచుకుంటారు. సహాయం హోమ్ వారూ చేస్తారు, ఆరోగ్యం కొరకు ఏర్పాట్లు ఉంటాయి, అనారోగ్యం చేస్తే డాక్టర్ని పిలిపిస్తారు.మంచి చేయూత దొరుకుతుంది, సత్కాలక్షేపమూ ఉంటుంది, పుస్తకాలుంటాయి చదువుకోవచ్చు, పనిలో సాయ పడచ్చు, చేయలేకపోతే మానెయ్యచ్చు, నీ తరవాత నీ సొమ్ముకు తగిన ఏర్పాటు చేసుకోవచ్చు, వీలునామా అప్పుడు రాసుకోవచ్చు,” అని చెప్పి వివరాలిచ్చి పంపేను. ఏంటో “అయ్యో! పాపం” అనిపించింది, ఒక్కొకప్పుడు నిజం కల్పనకంటే విచిత్రంగా ఉంటుంది కదూ.

ప్రకటనలు

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అయ్యో! పాపం.

 1. చాలా దయనీయంగా ఉందండీ చదువుతుంటే. కానీ ఒకరకంగా ఇతరుల దగ్గర ఉంటూ, డబ్బూ, మనుషులూ రెండూ పోగొట్టుకునే కన్నా ఓల్డ్ ఏజ్ హోమే బెటర్ మజిలీ….

 2. మనదేశంలో అభాగ్యులకేం తక్కువ?
  ఎవరో ఒకరిని చేరదియ్యవచ్చు.
  బహుశా ఇతనివైపు నుంచి కూడ ఏదో సమస్య ఉండి ఉంటుంది.

  • @మిత్రులు బోనగిరి గారు,
   నాకూ ఆ అనుమానం వచ్చిందండి. ఏమయినా దెబ్బ తిన్నవాడు కదా, సానుభూతి చూపా, మరొకరిని తెచ్చుకున్నా, ఇతనిలో తేడా ఉంటే మళ్ళీ కధ మొదలేకదా. నాకు తోచిన సలహా చెప్పేను.
   ధన్యవాదాలు.

 3. మీరు సరి అయిన సలహా ఇచ్చారండి. ఆతన్ని చూస్తే జాలి వేసింది.
  జీవితం లో తన వారంటూ ఎవరు లేకపోవటం దురదృష్టం కదండి..

  • @ శ్రీగారు,
   మిత్రులు బోనగిరి గారు వెలిబుచ్చిన అనుమానం నాకూ వచ్చింది, ఏమయినా కష్టంలో ఉన్నవాడు, ఒక సలహా ఇచ్చా, అది అమలుపరచుకుంటే బాగుంటాడు. నేను మంచి సలహా ఇచ్చానన్నారు
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s