శర్మ కాలక్షేపంకబుర్లు-గఱిక తిన్న గాడిదే…..

గఱిక తిన్న గాడిదే…

గఱిక తిన్న గాడిదే చస్తుందని ఒక నానుడి మన తెనుగునాట ఉంది. గఱికేంటి గాడిదేంటంటారా వస్తున్నా! వస్తున్నా!! గఱిక చూశారా ఎప్పుడేనా? చూసి ఉండరు లెండి పట్నవాసం వారు కదా!!! ఇదిగో చూడండి.

ఏపుగా పెరిగిన గఱిక


                       ఏపుగా పెరిగిన గఱిక

దీనిని గఱిక అంటారు. దీన్ని ఎప్పుడో చూసినట్లుందంటారా? నిజమే మీకు బాగానే గుర్తుంది. వినాయక చవితి చేసుకున్నారు కదూ, అప్పుడు ఆయననకు పూజ చేశారు దీనితో, అవునవును గుర్తొచ్చింది. ఇది గఱికా, గఱికని చెప్పలేదే ఎక్కడా ఆ వినాయకపూజలో అంటారా? నిజమే దీనిని అక్కడ దూర్వారం అని సంస్కృతం లో చెప్పేరు లెండి. అసలింతకీ  విషయమేంటి? అంటారా.గఱిక నేల మీద పాకుతూ వ్యాప్తి చెందుతుంది. ఒక కుదురు, దానికి నాలుగు వేపులా కాడలులా ఇది పెరుగుతుంది. ఆ కాడలకి కణుపులుంటాయి. ఆ కణుఫులకి కూడా నేలలోకి వేళ్ళుంటాయి. ఇది అలా పెరుగుతుందన మాట.

గాడిదను చూశారా? చూసిఉంటారు లెండి. గాడిద గడ్డితినడం చూసి ఉండరు. అది గడ్డి ఎలా తింటుందంటే? ఏంటి గాడిద గడ్డి తినడం కూడా వర్ణించాలా? అనకండి. మరి మీరు చూడలేదు కనక చెప్పక తప్పదుకదా 🙂 గాడిద పై పళ్ళతో గడ్డి పట్టుకుని కింది పళ్ళతో గడ్డి పీకి తింటుంది. ఈ సారి ఎప్పుడేనా గాడిద గడ్డి తినడం చూసినపుడు నా మాట గుర్తు చేసుకోండి. అబ్బే ఇప్పుడు చాలా గాడిదలు గడ్డేం ఖర్మా ఏదిదొరికితే అదే తినేస్తున్నాయంటారా? నిజమేనేమో! ఈ గాడిద,ఆ గఱిక గడ్డిని నోటితో పీక్కుని తింటుంది. గాడిద బతికేకాలం ఎంతా? మహా ఐతే పాతిక లేక ముఫై ఏళ్ళు, ఆ తరవాత ఛస్తుంది. కానీ ఈ గరికో చచ్చినా చావదు. అదేం గాడిద తినేసింది కదా అంటారా? నిజమే గాడిద పీక్కుని తిన్న తరవాత కూడా ఎక్కడో ఒక కణుపు ఉండిపోతుంది నేలలో, లేదా కుదురు ఉండిపోతుంది. దీనికి పెద్ద ఆశలు లేవు నీరే ఉండాలీ బతకడానికి అని, నీరుంటే ఏపుగా పెరుగుతుంది, మరో పది గాడిదలు తినడానికి. లేకపోతే గాలిలో తేమ, మంచుకి కూడా ఇది బతుకుతుంది, మళ్ళీ నాలుగు చుక్కలు వర్షం పడితే మొలిచేస్తుంది రప్ రప్ మని.అందుకే గఱిక తిన్న గాడిద చస్తుంది కాని గఱిక చావదని నానుడి.

మరో సంగతి, గఱిక మందుగా పనికొస్తుంది తెలుసా! మూత్రం కనక బంధిస్తే గఱిక రసం తీసుకుని తాగితే వెంటనే మూత్రం వెళిపోతుంది. గఱికపాటి చెయ్యమా అని అంటారు, గఱికపాటివారు మన్నించాలి.గఱికలో చాలా పోషక పదార్ధాలున్నాయట, నిజమండి, మీరు నమ్మకపోతే ఎలా! పోనీ నా మాట మీద నమ్మకం లేదు, తెలిసిన వారిని అడగండి. ఇది తిన్న ఆవు పాలు సమీకృతాహారం కదా! అంచేత గఱికే…..తిం….

ఈ ప్రక్రియనేమంటారూ? ఆన్యాపదేశం, తెనుగులో. ఇంగ్లీషులో ఏమంటారో నాకు తెలియదనుకోండి, తెలిసినవారు చెబితే సంతసం.ఇంతకీ సంగతి ఏంటంటారా? తెలిస్తే మీరు గఱికే….చెప్పుకోండి చూద్దాం. అర్ధం చేసుకోరూ….. (భాను ప్రియలాగ)

ప్రకటనలు

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-గఱిక తిన్న గాడిదే…..

  • @మిత్రులు బులుసు సుబ్రహ్మణ్యం గారు,
   అయ్యో! మన దేశంలో గఱిక కూడా మిగల్చటం లేదు కదండీ! మన దాకా ఎక్కడండి…. పోషక పదార్ధాలున్నాయని పెద్దలెప్పుడో లాగించేసేరు కదండి.
   ధన్యవాదాలు.

 1. హా హా ..హా..కాదేదీ పోస్ట్ కి అనర్హం… అన్న వాఖ్య రాయాలనిపించిందండి.
  గఱిక గురించి గాడిద గురించి మీరు పోస్ట్ రాసేసారు. (ఏదో ఇలా వాఖ్య రాసాను అని, నాకు ఈ పోస్ట్ లో మీరు రాసిన విషయాలన్ని తెలుసని అనుకునేరు…ఊహు! కొన్ని తెలుసు, కొన్ని తెలీదు అన్న మాట)…

  • @శ్రీగారు,
   అన్నీ పూర్తిగా తెలిసేసుకోడం కూడా మంచిది కాదేమోనండి.

   తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
   దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
   జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
   తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

   ఇలా ఉండటం బాగుంటుందేమోనండి.
   ధన్యవాదాలు

  • @మిత్రులు శ్యామల రావు గారు,
   మా కుటుంబాలలో అనుశృతంగా వస్తున్న కధ ఒకటి ఉంది. “గరికెల మాన్యం”టపా త్వరలో విడుదల. ఆ కధ ఇక్కడ చెప్పడం ఇష్టం లేక మానేశా.
   ధన్యవాదాలు

 2. 🙂 🙂 బావుంది మాస్టారూ.. బాగా అర్ధం అయింది. గఱిక గురించి ఇంత చెప్పాక కూడా భానుప్రియలా మీరు అడగాలా?
  ఇకపోతే గఱిక ని ఇతర భాషల్లో ఏమంటారో..అని మీకు తెలియక అడిగి ఉంటారని నేను అనుకోను.

  ఇంగ్లీష్ లో అయితే HURIALLEE GRASS అని ,హిందీలో durba, kabbar, అని అంటారని ఇప్పుడే అంతర్జాలంలో వెతికి పట్టుకొచ్చాను.

  • @వనజ గారు,
   అసలు విషయాన్ని చెప్పక మరొకటి చెప్పి విషయాన్ని సూచించే రచనా ప్రక్రియని తెనుగులో అన్యాపదేశం అంటారు, దానికి ఇంగ్లీషు పేరడిగానండి. 🙂 నా కోసం మీరు అంతర్జాలంలో వెతికి పెట్టినందుకు
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s