శర్మ కాలక్షేపంకబుర్లు- హనుమతో వెళ్ళాలా, వద్దా?-సీత విశ్లేషణ

హనుమతో వెళ్ళాలా, వద్దా?-సీత విశ్లేషణ

హనుమ సీతను వెతుకుతూ లంకచేరి అన్నిచోట్లా వెతకి సీతకనపడక నిర్వేదం చెంది, అంతలోనే మళ్ళీ ఉత్సాహం పుంజుకుని అశోక వనం లో వెదకబోతాడు. అక్కడ ఒక చెట్టు కింద సీత కనపడింది. ఆమెతో మాట్లాడటానికి మార్గంగా రామకధ గానం చేసి ఆమె దృషిని ఆకర్షించి మాట కలుపుతాడు. ఆమెకు రామ ముద్రికను ఇస్తాడు. ముద్రిక చూసిన సీత సిగ్గుపడి, 14,000 మంది రాక్షసులను ఒంటి చేతితో చంపిన రాముడు నిర్వేదం పొందుతున్నాడని తెలిసి ఖేదపడుతుంది.అప్పుడు హనుమ

అధవా మోచయిష్యామి సాగరమ్
అస్మాద్దుఃఖాపారోహ మమ పృష్ఠమనిందితే……రామాయణం…సుందర కాం…సర్గ37….21

త్వాం హి పృష్ఠగతాం కృత్వా సంతరిష్యామి సాగరమ్
శక్తిరస్తి హి మే వోఢుం లంకామపి సరావణామ్……రామాయణం…సుందర కాం…సర్గ .37….22

“తల్లీ! ఖేదపడకు నిన్ను ఈ రోజే ఈ దుఃఖాన్నుండి విముక్తి చేయగలను. నీవు నావీపుపై కూచో,నిన్ను వీపుమీద ఎక్కించుకుని, రావణునితో సహా ఈ లంకను పెకలించి తీసుకుపోగల శక్తి ఉంది” అన్నాడు. ఇంకా ఏమన్నాడంటే “దేవీ!ఆకాశ మార్గంలో నిన్ను తీసుకువెళ్ళేటపుడు ఈ లంకలో వారెవరూ నా వేగాన్ని అందుకోలేరు, నీవిక్కడికి ఆకాశ మార్గాన తీసుకు రాబడ్డావు, అలాగే నిన్ను ఆకాశ మార్గాన తీసుకు వెళ్ళి, బలశాలి అయిన రాముని ముందు నిలుపుతానమ్మా, నీవు ఈ రోజే రాముని చూడగలవు” అన్నాడు. హనుమ మాటలు విని ఆనందం, ఆశ్చర్యం కలగలిసిన గొంతుతో ’హనుమా! అంత దూరం నన్ను ఎలా మోసుకు తీసుకుపోగలవు,నీ శరీరమేమో చిన్నది, నీ కపి ప్రవృత్తిని ప్రదర్శించావు సుమా’” అంది. ఆ మాట, హనుమ తనకు అవమానంగా భావించాడు. అయ్యో! సీత నా బల పరాక్రమాలు ఎరుగదే,ఈమెకు నా బృహద్రూపం చూపాలనుకున్నాడు. ఒక గంతులో కొంత దూరం చేరి సీతకు నమ్మకం కలిగించడానికి తన దేహం పెంచాడు. ఆ పెరిగిన హనుమ మేరు, మందర పర్వతాలలా,అగ్ని జ్వాలలా వెలుగొందుతూ, భయంకర ఆకారంతో సీతతో ఇలా అన్నాడు.”పర్వతాలతో, వనాలతో, కోట బురుజులతో,ప్రాకారాలతో,ముఖ ద్వారాలతో ఉన్న లంకా పట్టణాన్ని,రావణునితో సహా నిన్నూ తీసుకుపోగల శక్తి నాకుంది, సందేహించద్దు,నా వీపు మీద కూచోవమ్మా, నిన్ను రామ లక్ష్మణుల దగ్గర దించి, వారి శోకాన్ని పోగొడతా” అన్నాడు.

అందుకు సీత ” హనుమా! నీ బలపరాక్రమాలు,వేగము,నీ తేజస్సు, తెలుసుకున్నానయ్యా! సామాన్యుడు, ఊహకు అందని సముద్రం దాటి రాగలడా? నీ శక్తి నేనెరుగుదును,నీ వేగంతో నన్ను తీసుకు వెళ్ళగలవని. మహాత్ములు కార్య సిద్ధికై ముందుగా బాగుగా ఆలోచిస్తారు. నేను కూడా ముందు వెనుకలు ఆలోచించాలి, నిర్ణయం తీసుకోవాలి. నేను నీతో ప్రయాణం చేయడం యుక్తం కాదు. ఎందుకంటే, నువు వేగంగా వెళుతూంటే, నేను కంగారు పడచ్చు, ఎంతో ఎత్తున వెళుతున్న నీ వీపుమీంచి జారి పడిపోవచ్చు,సముద్రంలో మొసళ్ళకి ఆహారం కావచ్చు. నీతో ప్రయాణానికి నాకు ధైర్యం చాలదు. నన్ను రక్షించే ప్రయత్నంలో, నీ భద్రతకే ముప్పు రావచ్చు. నువ్వు నన్ను తీసుకెళుతూంటే రావణుని మనుషులు మనల్ని వెంటాడుతారు. ఆయుధాలతో చుట్టుముడతారు.నన్ను రక్షించే ప్రయత్నంలో నీ పరిస్థితి ప్రమాదంలో పడుతుంది. నువ్వేమో ఒక్కడివి,నిరాయుధుడివి, రాక్షసులేమో ఎక్కువ మంది, ఆయుధాలు కూడా ఉన్నాయి, వాళ్ళ దగ్గర. ఆ పరిస్థితులలో నువ్వు ముందుకు ఎలా వెళ్ళగలవు. రాక్షసులతో నువ్వు యుద్ధం చేస్తూంటే నేను జారి పడిపోవచ్చు,వాళ్ళు ఎక్కవమంది, బలవంతులు, ఆయుధధారులు కనక నిన్ను ఏదో రీతిగా బంధించ వచ్చు, యుద్ధంలో జయించగలరు.లేకపోతే యుద్ధం చేస్తూ ఉండగా ఏమరు పాటున ఉంటే నేను పడిపోవచ్చు, అప్పుడు రాక్షసులు నన్ను తీసుకుపోవచ్చు, చంపెయ్యచ్చు,యుద్ధంలో జయాపజయాలు అస్థిరం కదా!. నేను రాక్షసుల వలన భయపడవలసిరావచ్చు. నువ్వే రాక్షసులను చంపి తీసుకెళితే రాముని కీర్తికి భంగం కావచ్చు. లేదా రాక్షసులు నన్ను తీసుకుపోయి ఎవరూ తెలుసుకోలేని ప్రదేశంలో దాచచ్చు,అందువల్ల నీ ప్రయత్నం విఫలమవుతుంది. మీ రాజు సుగ్రీవుడు, రామ లక్ష్మణులు జీవితాలు నా పై ఆధారపడి ఉన్నాయి.మరొక మాట పరపురుషుని శరీరం తాకను, రావణుడు ఎత్తుకొచ్చినపుడేమి చేసేవంటే, ఆ నాడు నేను అబలను,రావణుడు బలవంతంగా తీసుకు వచ్చాడు. రాముడు సైన్యం తో వచ్చి, రావణుని పరిమార్చి నన్ను తీసుకు వెళ్ళడమే రాముని స్థాయికి తగినపని, అందుచేత

స మే హరిశ్రేష్ఠ సలక్ష్మణం పతిం
సయూధపం క్షిప్రమిహోపపాదయ
చిరాయ రామం ప్రతి శోకకర్శితాం
కురుష్వ మాం వానరముఖ్య హర్షితం…రామా…సుం.కా…సర్గ 37…..68

హనుమా లక్ష్మణునితో, వానర సైన్యంతో నా స్వామిని ఇక్కడకు తీసుకురా. రామునితో వచ్చి నాకు ఆనందం కలగచేయవయ్యా” అని నిర్ణయించి చెప్పింది.” ఇక్కడికి ఆపుదాం.

ఇప్పుడు సమీక్షిద్దాం.

బలవంతుడయిన హనుమ తీసుకెళ్ళిపోతాను రా అమ్మా! నా వీపు మీద కూచో తీసుకెళ్ళిపోతానంటున్నాడు. తీసుకుపోలేవేమో అంటే తన నిజ రూపం చూపాడు. నమ్మకం కుదిరింది. ఇప్పుడు వెళ్ళాలా? వద్దా? ఇది ద్వైదీభావం.ఇప్పుడేం చెయ్యాలీ? రాను అంది, రాకపోవడానికి కారణాలు విశ్లేషించింది. ఆలోచన అన్ని విధాలా చేసి చివరికి మొదట తీసుకున్న నిర్ణయానికి వచ్చి, రాముణ్ణి తీసుకు రావయ్యా! లక్ష్మణ, సైన్య సమేతంగా అని చెప్పింది. ఆలోచన చూడండి ఒక క్రమం లో లేక ముందు వెనుకలున్నాయి. ఆలోచనల దొంతర, వేగం కనపడుతుంది., చెప్పినదే మళ్ళీ కూడా చెబుతుంది. ఇది మనమూ చేస్తాం కదా. సమస్యని ఎన్ని కోణాలలో తర్కించిందో చూడండి,తన క్షేమం, హనుమ క్షేమం, జరగరానిది జరిగితే వచ్చే పరిణామాలు, పర్యవసానాలు కూడా. ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది? ఇటువంటి సంఘటనలు మన నిజ జీవితం లో కూడ వస్తాయి, అంటే ద్వైదీభావ పరిస్థితి, ( to be or not to be ). మనకో పని కావాలి బలవంతుడయినవాడు చేసి పెడతానంటున్నాడు. సమర్ధుడే కాని ఇది అడ్డతోవ. పని జరిగేటపుడు కష్టాలొస్తే,అతనే నిస్సహాయ పరిస్థితిలో పడితే, మనను మధ్యలో వదిలేస్తే,అనుకోని అవాంతారాలొస్తే, మనం ఎటూ కాకుండా పోతాం. అదే సవ్యమైన దారిని వెళితే మన పని తప్పక అవుతుంది, కాని ఖర్చు, సమయం తీసుకోవచ్చు. మనం తొట్రు పడక ఇటువంటి సమయాలలో సీత  విశ్లేషించినట్లు విశ్లేషించుకుని, పర్యవసానాలు సీత తర్కించినట్లు తర్కించుకుని, రంగం లోకి దిగితే నష్టాలుండవు. కొన్ని సమయాలలో కొన్ని సర్గలని పారాయణ చేయమంటారు, పారాయణ చేయడమంటే, మననం చేయడం, మననం చేస్తే మనసుకు పడుతుంది.ఎందుకూ?  మనసుకు పడితే తప్పు జరగదు,తొందరపాటు ఉండదు. మన కష్టం నుంచి బయట పడే ఆలోచన పుడుతుంది. మంచి చెడ్డలు కూలంకషంగా చర్చిస్తాం, కష్టం గట్టెక్కుతాం, అదన మాట. మానవ మనస్తత్వాన్ని ఎంత కాచి వడపోసి చెప్పేడు వాల్మీకి. ఇది మత గ్రంధమా మానవ గ్రంధమా? మనస్తత్వ శాస్త్రమా?

ప్రకటనలు

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- హనుమతో వెళ్ళాలా, వద్దా?-సీత విశ్లేషణ

  • @ఫాతిమా గారు,
   ఈ విశ్లేషణ మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
   మీరు పొరపాటుగా ఎప్పుడూ మాటాడలేదు, అలా ఎందుకనుకుంటున్నారో తెలియదు.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s