శర్మ కాలక్షేపంకబుర్లు-కళ్యాణం వచ్చినా…

కల్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు.

కళ్యాణం

కళ్యాణం

కల్యాణ సమయం వచ్చినా, కక్కు ఒచ్చినా ఆగదని మనకు తెనుగులో నానుడి ఉంది, కాని వాడుకలో కళ్యాణవచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు.. కక్కు ఒచ్చిందంటే ఎలాగా ఆగదు, సమయం, సందర్భం, స్థలం, కాలం చూసుకోదు, బయట పడాల్సిందే, తన్నుకొచ్చేస్తుంది. ఇక మొదటిదాని విషయంలోనే ఇదేమిటో ఇప్పటిదాకా అనుభవం లోకి రాలా 🙂 . ఇప్పుడు తెలిసింది, అనుభవమైతే కాని తత్వం ఒంట పట్టదంటారు కదా.

కిందటి నెల చివరలో అన్నయ్య గారితో మాట్లాడుతున్నపుడు “పెద్ద మనవరాలి పెళ్ళి చేసేస్తే బాగుంటుంది కదా” అన్నా. “నేనూ అదే అనుకుంటున్నా, ఏదయినా మంచి సంబంధం దొరికితే చేసేద్దాం, అంటూ మొన్న నొకరు ఒక సంబంధం చెప్పేరు, వివరాలుండాలి చూస్తానని, మళ్ళీ మాటాడుతా”నన్నారు. నేను నా గొడవలో పడిపోయా. ఆ రోజు సాయంత్రం మాటలాడుతూ,”పొద్దుట నీకు చెప్పిన సంబంధం గురించి మాట్లాడేను, పెళ్ళి కొడుకు వారితో మాటాడేను, జాతకం కావాలన్నారు, అబ్బాయిని ఇచ్చి రమ్మన్నాను, ఇచ్చి వచ్చేడు” అన్నాడు. ఆ మరునాడు మధ్యాహ్నం ఫోన్ చేసి “నువ్వు రేపు ఉదయం మరదల్ని తీసుకుని వచ్చెయ్యి, రాజమంద్రి, నేనిటునుంచి వస్తున్నా, పెళ్ళి వారిని, అమ్మాయిని చూసుకోడానికి రమ్మని చెప్పివద్దాం, వారికి జాతకాలు సరిపోయాయట,” అన్నాడు. ఇల్లాలిని కేకేసి సంగతి చెప్పా. “రేపు ఉదయం బయలుదేరుదా”మంది. ఆ రోజు వెళ్ళి చెప్పివచ్చాం, పిల్లను చూసుకోడానికి రమ్మని.

“డిసెంబరు ఒకటో తారీకున పిల్లను చూసుకోడానికి వస్తున్నారు, మీరూ రండి” అన్నారు, అన్నయ్య. “రాలేం, ప్రయాణం బడలిక చేస్తోంది, అమ్మాయిని చూపించండి, పిల్లకి, పిల్లాడికి నచ్చితే తరవాత సంగతి చూదా”మని ఇద్దరం చెప్పేం. పెళ్ళివారు రావడం చూడటం, పిల్ల, పిల్లాడు, ఇరివురూ మాటాడుకోవడం, నచ్చినట్లుగా పెళ్ళివారినుంచి కబురు రెండవ తారీకున వచ్చిందని, ఆ రోజు సాయంత్రం చెప్పేరు. “మరయితే ఏం చేయాల”న్నా. “మాటాడుకోడానికి తాంబూలాలు పుచ్చుకోడానికి ఎనిమిదవ తేదీ బాగుందయ్యా! వారికి చెప్పేను, అలాగే రండి, మా అమ్మాయి అల్లుడు ఆరోజుకివస్తారు అని చెప్పేరు” అన్నాడు. ఎనిమిదవ తారీకు కోసం ఎదురు చూపులో పడ్డాం. ఎనిమిదిన ఇల్లాలు నేను బయలు దేరి వెళ్ళేం, అన్నయ్య వచ్చేరు, అబ్బాయిలూ వచ్చేరు,మొత్తం పది మందిమి వాళ్ళ ఇంటికి దండయాత్రకి వెళ్ళినట్లు వెళ్ళేం. వారు చాలా మర్యాద చేసేరు, “మా అమ్మాయి, అల్లుడు రాలేదు,వారికి ఏదో అడ్డు వచ్చిందట” అన్నారు. వచ్చాం గనక తాంబూలాలు మార్చుకుందామనుకున్నాం, కొద్ది మాటల తరవాత. “ఈ తాంబూలాల వేడుక మరల పదిహేనున చేసుకుందాం, ఆరోజుకి అమ్మాయి, అల్లుడు వస్తా”రన్నారు. మళ్ళీ పదిహేనుకు ఎదురు చూపు. వారొచ్చారు పదిహేనున, మేమూ వెళ్ళేం, మా ఊళ్ళో తాంబూలాల వేడుక మళ్ళీ జరుపుకున్నాం, భోజనాలూ చేసేం అందరము కలసి. ఆ మరునాడు ముహూర్తాలెప్పుడున్నాయో అడుగుదామని సిద్ధాంతి గారి దగ్గరకెళితే “ఈ నెలఖరులో ఒక ముహూర్తం బాగుంది, వీరిద్దరికీ” అన్నారు. “అమ్మో ఇంత దగ్గరలో పెళ్ళి చేయగలమా” అని అన్నయ్య గారు సంప్రదించేరు, అందరం ఆలోచించి ఏకాభిప్రాయానికి వచ్చి, “చేసెయ్యడమే” అని నిర్ణయించాం, నలుగురూ నాలుగు మూలల ఉన్నా పోన్ సంప్రదింపులతో. పెళ్ళి వారికీ చెబితే, “ఇంత తొందరలో కష్టమేమో” అన్నారు. “మాకూ అలాగే అనిపించింది, ఇప్పుడు చేయలేకపోతే, తొమ్మిది నెలల దాకా ముహూర్తాలు లేవన్నారు, సిద్ధాంతి గార”ని చెప్పేం. “మీరు సద్దుకోగలిగితే మా అభ్యంతరం లేద”న్నారు. అది మొదలు హడావుడికి.

మగ పెళ్ళివారి అనుమతి రాగానే రాజమంద్రిలో పెళ్ళి చేయడానికి వసతి దొరుకుతుందేమోనని చూస్తే అబ్బే! ఎక్కడా ఖాళీ లేదు. “మన ఊళ్ళో చేసేదామన్నయ్యా” అన్నా. “బాగానే ఉంటుందికాని కొన్ని ఇబ్బందులున్నాయయ్యా,” అని అన్నయ్య ఆలోచన చేసి, మన ఊరు పక్క ఊరిలో ఒక కల్యాణమండపం ఉంది దొరుకుతుందేమో చూస్తానని, తన శిష్యుడికి ఫోన్ చేసి “కల్యాణ మండపం కావాలయ్యా! ఎవరినడగాలంటే, ఎవరికన్నాడు, మాకే మనవరాలి పెళ్ళి, ఫలానా రోజ”న్నారు. “నేనేనండి, ఆ కల్యాణమండపం ఇచ్చేది, మీకోసం ఉంచేస్తున్నా, కట్టవలసిన డబ్బులు కూడా కట్టేస్తా. మీరు నిశ్చింతగా మిగిలిన సంగతులు చూసుకోండి” అన్నాడు. బాగుందనుకుని వంట బ్రాహ్మలకోసం ఫోన్ చేస్తే, “ఆ రోజు ఇప్పటికే పని ఒప్పుకున్నానండి. భయం లేదు, మా వాళ్ళని అక్కడికిపంపి నేనిటు వస్తున్నా, మీ పని కాదనగలనా” అన్నాడు, “ఎంతయ్యా అంటే, మనవారాలి పెళ్ళి అంటున్నారు కదా, మీకు తోచింది ఇవ్వండి, ఇంతని నేను చెప్పను” అన్నాడు. “అదెలా” అంటే “మీకు ఉపకారపడటమే నాకు దొరికిన మంచి సావకాశం, మీరు దీని గురించి ఆలోచించకండి, మిగిలిన పనులు చూసుకో”మని మరి మాటాడటానికి సావకాశం ఇవ్వక ఫోన్ పెట్టేసేడు. రెండవ ముఖ్యమైన పని అయింది, మరి మూడవ అతి ముఖ్యమైనది బ్రహ్మగారు, ఫోన్ చేస్తే “నేను రెడీ” అన్నారు, ఈలోగా వియ్యాల వారు ఫోన్ చేసి “మా బ్రహ్మగారికి ఏదో అవాంతరం వచ్చింది, బ్రహ్మ గారిని చూసిపెట్టరా” అన్నారు. మళ్ళీ మా బ్రహ్మగారికి ఫోన్ చేస్తే “అలాగే ఏర్పాటు చేస్తా”నన్నారు.అమ్మయ్య! ఏర్పాట్లయ్యాయి, అసలుదేదీ,చిన్నతల్లి, ఏరా అంటే ఏరా అనుకుంటే సరిపోయింది, ఒక గంటలో, ఇదీ గట్టెక్కేం. ఇంకేంటి, బట్టలు మిగిలినవి కొనుక్కోడం, మంగళసూత్రం వగైరా, డబ్బులట్టుకెళితే అన్నీ అయిపోయినట్లే. కిరాణా సరుకులు చీటీ రాసుకుని వెళ్ళి కొట్లో ఇచ్చేస్తే ఇంటికి పంపేస్తాడు. ఇక మిగిలిన చిన్న పనులు కదా. పెళ్ళి నాటికి, మంగళ వాద్యాలు పురమాయించాలి, మగ పెళ్ళివారడిగితే, ఎందుకంటే అన్నీ ఏర్పాటు చేసి ఇస్తే, పెళ్ళి సవ్యంగా చేసుకోవడం, మగ పెళ్ళివారి వంతు, మంగళవాద్యాలు వారే ఏర్పాటు చేసుకోవాలి, కాని వారి కోరిక మీద మనం ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు పెళ్ళి కూతురుని చేయడం, పెళ్ళి రోజుకు ఎదురు చూస్తున్నాం. అన్ని పనులూ రోజూ తిట్టుకుంటున్న బూచాడు చేసి పెట్టేసేడు, కాలు కదపక్కర లేకుండా. చివరి వారంలో పెళ్ళండి బాబూ!

ప్రకటనలు

20 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కళ్యాణం వచ్చినా…

 1. బూచాడు అప్పుడప్పుడు ఇలా మంచి పనులు చేయబట్టే కదా బాబాయి గారు మనం నెత్తిన పెట్టుకుంటున్నాం. ఈ నేలాఖర్న పెళ్లి హడావిడన్నమాట. బావున్నాయి కబుర్లు.

  • @అమ్మాయ్ జ్యోతిర్మయి,
   నిజమే! అందుకే నెత్తిన పెట్టుకుంటున్నాం, మరీ ఎక్కువ ముద్దు చేస్తేనే తంటా.
   నెలాఖరుకి పెళ్ళి హడావుడే.
   ధన్యవాదాలు.

 2. మూడు రోజులుగా మీరు కళ్యాణం కబుర్లే చెప్తున్నారు:) బాగుంది..
  ఇద్దరికీ వివాహ మహోత్సవ శుభాకాంక్షలు.. ఒక చిన్న మనవి, మీరు నన్ను గారు అని సంభోదించకండీ, వయసులో మీరు చాలా పెద్దవారు. మీ మనవరాలనుకోండీ.

  • @అమ్మాయి చిన్ని,
   మరో మనవరాలు, కుటుంబం పెరుగుతోంది. అమ్మాయి, నీ బ్లాగులో వర్డ్ వెరిఫికేషన్ తీసెయ్య కూడదూ, చాలా ఇబ్బంది పెడుతోంది. నీ శుభకామనలు కొత్త దంపతులకి అందిస్తా.

   ధన్యవాదాలు

 3. ఎంత బాగ వ్రాసేరు. జీవితాలలో దూరమై పొయింది అనుకున్న మంచితనం ఇంకా బ్రతికే వుంది. చాల సంతోషం. శుభం భూయాత్ !!

  • @హేమ మురళి గారు,
   చాలా రోజుల తరవాత కనపడ్డారు, బాగున్నారా!మంచితనం బతికే ఉందండి.మీ శుభకామనలు కొత్త దంపతులకు తెలియ చేస్తా.
   ధన్యవాదాలు

   • కులాసాయే నండి.రోజూ వస్తూనే ఉంటా. మంచితనం ఉందండి,కాని ఇదివరలో ప్రతీ నిమిషం కనిపించేది. ఇప్పుడు ఇదుగో మీ లాంటి వాళ్ళ దగ్గిరే చూస్తున్నాం.
    ఒక చిన్న మనవి, మీరు నన్ను గారు అని సంభోదించకండీ, వయసులో మీరు చాలా పెద్దవారు.అమ్మాయి లాంటి దాన్ని నేను.

   • @అమ్మాయ్ హేమ,
    రోజూ చూస్తున్నా, పలకరిస్తే కాని తెలియదు కదా! నా కుటుంబ సభ్యులు పెరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది.
    ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s