గాడిద గుడ్డు….
ఉదయమే టపా రాద్దామని కూచుని ఒక పేరా రాసేను, కరంటు పోయింది. మళ్ళీ ఐదు నిమిషాల్లో వచ్చింది, చూస్తే రాసింది కాస్తా పోయింది, ఎమో! ఏంచేసేనో అనుకుని మళ్ళీ రాశా, మళ్ళీ పోయింది, కరంటు, ఛ! ఈ వేళ టపా మొదలెట్టిన ముహూర్తం మంచిది కాదనుకుంటూ ఉండగా ఇల్లాలొచ్చింది. “ఏంటి” అంది, చెప్పేను. “ఇది మూఢనమ్మకం కాదా, రోజూ చేసే దానికి ముహుర్తం ఏంటి, చెట్టుకు మొక్కితే మూఢనమ్మకమనే మీ జనం చూడండి ఫ్రాన్స్ లో అదేది కొండ “బుగరాష్” దగ్గరికి పరిగెట్టుకు పోయి రాళ్ళు తెచ్చుకుంటున్నారట, రేపు అనగా 21 వ తేదీన ప్రళయం ఏదో వచ్చేస్తుందని, ఆ కొండ రాళ్ళు తెచ్చుకుంటే బతుకుతామని, ప్రమాదం రాదని. దీన్ని ఏమంటారూ,చెట్టు నరికి, పుట్ట తవ్వి, కొండ తవ్వి, ప్రకృతి సమతుల్యాన్ని పోగొట్టుకుని ఏడుస్తున్న వారు మళ్ళీ ఆ ప్రకృతి ఎదురు తిరుగుతోంటే భయపడి, మూఢ నమ్మకాల పాలపడుతూ, మనల్ని మూఢనమ్మకాల వాళ్ళనడం బలేగా ఉందికదా! నిత్యమూ ఏదో ఒక మూల ప్రపంచంలో, ఒక చోట భూకంపం, మరొక చోట తుఫాన్ , మరొక చోట సునామీ ఇలా ఉంటూనే ఉంటాయి. ఇవి ఎక్కువగా ఎక్కడొస్తున్నాయని గమనిస్తే, ప్రకృతి సమతుల్యం ఎక్కడ ఎక్కువ దెబ్బతిందో అక్కడేనని తెలియటంలేదూ! దీనికి పి.హెచ్.డి లు అక్కరలేదు. బుర్రుంటే చాలు.”
“అలా అనకోయ్! వాళ్ళంతా అభివృద్ధి చెందిన దేశాలవారు, చదువుకున్నవారు, మనమేమో చదువుకోని వారం కదా” అన్నా. “గాడిద గుడ్డేం కాదూ! చదువంటే తెలుసా వాళ్ళకి, మనిషి మనిషిగా బతకలేని వాళ్ళ చదువు గురించి చెబితే ఎలా. నాలుగు వస్తువులు తయారు చేసి, అదే జీవితమంటే ఎలా?. అదిగో ఆ సంస్కృతి పెరిగే నడుస్తున్న బస్సు లో ఆడపిల్లని బలాత్కరించి చెరిచేరట, ఢిల్లీ లో.” “మనం మళ్ళీ జంతు యుగం లోకి పోతున్నామేమో, అడవి లో జంతువులకు కూడా ఒక న్యాయం ఉంది. సింహం ఆకలేసినపుడు మాత్రమే వేటాడుతుంది, మామూలు సమయాలలో మిగతా జంతువులు సింహం దగ్గర తిరుగుతున్నా ఏమీ చేయదు. నేటి మానవుడు అందునా పశ్చిమనాగరికత పెంచుకున్న మీ లాటి వారు,ఏం చేస్తారూ, చూస్తూ కూచుంటారు, అదే చేసేరు, మిగతా వారు కూడా అక్కడ ఉండి కూడా, అక్కడ తిరగబడితే వాళ్ళు ఆ పని చేయగలరా?. మీకు భయం, ఏమయిపోతామోనని, మనిషి నిత్యమూ చావడు, ఒక సారే చస్తాడు, ఒక ఆడ పిల్ల మానం కాపాడటానికి లేని మగతనం ఎందుకో!. శూరుడు ఒక సారే చస్తాడు, భీరువు నిమిష నిమిషం చస్తాడు, భయంతో. ఇది జనారణ్యమే, ఇక్కడ నీతి, న్యాయం లేవు, ప్రభుత్వం ఎందుకూ పనికిరాదు, ఆ వెధవ పని చేసిన వాళ్ళలో నలుగురే దొరికారా, మిగిలిన వాళ్ళు దొరకలేదా! ఏం ప్రభుత్వమండి మీది,” అని నిప్పులు చెరిగేసింది. మరేమయినా మాటాడితే ఇంకేమంటుందోనని నోరు మూసుకుని ఉయ్యాలలో కూచుంటే గాడిద గుడ్డు అంది కదా, గాడిద గుడ్డు పెడుతుందా అని అనిమానమొచ్చింది.
జీవులు మూడు రకాలట, ఇది జీవ శాస్త్రజ్ఞులు చెప్పవలసింది. క్షీరదాలు, అండజాలు, స్వేదజాలు అన్నారు. వాటిని, పాలిచ్చి పెంచేవి, గుడ్డు పెట్టి దానినుంచి పిల్ల బయటికొచ్చేది, చెమట ద్వారా పుట్టేవి అని అర్ధమట. మరి గాడిద పిల్లను పెడుతుందిగా మరిదేంటీ, అంటే అసంబద్ధమని అర్ధం. ఇదెలా వచ్చిందబ్బా అని ఆలోచిస్తే, ఇది ఈ మధ్య కాలంలో అనగా రెండు వందల సంవత్సరాలలో మన భాషలో చేరినట్లనిపించింది. నాకిలా అనిపించింది. తెనుగునాట, తెనుగు నోట ఒక ఆంగ్లేయుడు వాడిన మాటలు ఇలా అయ్యా యనుకున్నా. అది అసలు “GOD the good, conquer pass.” దీని వెనక ఒక కధ ఉండచ్చు. ఆంగ్లంలో, pass అంటే కనుమ అని అర్ధం. కనుమ అంటే చెప్పాలేమో, అందుకే చెబుతున్నా, రెండు ఎత్తయిన పర్వతాల మధ్య కల సన్నని దారిని కనుమ అంటారు, తెనుగులో. దేశాన్ని ఆక్రమిస్తున్న సమయంలో ఒక కనుమను పట్టుకుని స్వాధీనం చేసుకోవడం ఆ అంగ్లేయుడికి అసాధ్యమయి, తన సైనికులతో గాడ్ ది గుడ్ కాంకర్ పాస్ అని ఉంటాడు, అప్పుడు ఆ పని అసంబద్ధమయి ఉంటుంది, అందుకు తరవాతి కాలాంలో ఇది అసంబద్ధ ప్రేలాపనకి గుర్తుగా గాడిదగుడ్డు కంకరపీసు అయిందనుకుంటా.
మా మిత్రుడొకడు అది “GOD the good, concur peace.” అన్నాడు. Conquer అన్నదానికి అర్ధం జయించడం, Concur అన్నదానికి అర్ధం అంగీకరించు అని కదా.అందు చేత అది గాడ్ ది గుడ్, కాంకార్ పాస్ కాస్తా గాడిద గుడ్డు కంకరపీసు అయ్యింది, నిజమే. మరి తెల్లవాడికి అందునా దేశాన్ని కొల్లగట్టడానికి వచ్చిన వాడికి శాంతి ఏంతెలుసు. దాని ప్రకారం అర్ధం దేవుడు మంచివాడు,శాంతితో ఏకీభవించు అని కదా! భారత దేశ సంపదని కొల్లగొట్టి ఓడలకెత్తి పట్టుకు పోయి, నిర్లజ్జగా ప్రదర్శించుకుంటూ ఉంటే, మనదైన గోలుకోండ జాతి రత్నం వారి రాణి మకుటం లో, సిగ్గులేక, దొంగ సొత్తుని బహిరంగంగా ప్రదర్శించుకుంటున్న వాళ్ళ నీతి ఎంత? నేటికీ మన ప్రభువులు అదే దారిన నడుస్తూ,దేశ చరిత్రను తిరగరాయలేని దుస్థితిలొ ఉన్నారంటే ఏమనుకోవాలి. నేటికి 1857 ను సిపాయిల తిరుగుబాటుగా వర్ణిస్తున్న చరిత్ర పుస్తకాలనేమనాలి. ప్రధమ స్వాతంత్ర సంగ్రామమనలేని వారి పాల పడిన నా జాతి ఏనాటికయినా శివాజీలాటి దేశ భక్తుడి పరిపాలనలోకి రాదా! నేను చూడలేకపోవచ్చు, కాని ఆరోజు వస్తుందని నమ్ముతూ నయినా కన్ను మూస్తా.
” గాడ్ ది గుడ్డు “-వివరణ చాలా బాగుంది.
గాడిద గుడ్డే మీ కాదూ? ఏమీ కాదని తెలిసింది.
@మోహన్జీ
ధన్యవాదాలు
చదివేస్తే ఉన్న మతి పోయే!
చదువు రాకుంటే.. అన్నింటా మంచిగానే మనసుతోనే ఆలోచించే!
ఇంతకన్నా ఋజువు ఏం కావాలి .
సిగ్గులేని భీరువులైన జాతి అయిపోతుంది.ఆశావాడంతోనే బ్రతుకుతూ..చస్తూ…
@వనజ గారు,
చదువుకోక ముందు కాకరకాయ, తరవాత కీకరకాయ అన్నట్లున్నాయి.నిజమే జాతి సిగ్గు లేనిదయిపోతూ ఉంది, ఎవరి మటుకు వారు, ఎవరెలాపోతే నాకేం అనుకుంటున్నారు.
ధన్యవాదాలు.
అద్గది మరి ….:-)
She is too smart like you sir:-)
@పద్మ గారు,
ఎప్పటిది 50 ఏళ్ళనాటి మాట. వలచి, వలపింపచేసుకుని, గుండెలో దాచుకున్నది, అందుకే 🙂 మరో చిన్న మాట సర్ పదం ఎందుకోనాకు నచ్చదు, అనడం మానెయ్యలేరూ
ధన్యవాదాలు.
హమ్మయ్య,
శ్రీమతి గారు ‘conquer’ చేస్తే, శ్రీవారు ‘concur’ అయిపొయారన్న మాట !
జిలేబి.
@జిలేబి గారు,
ఎప్పుడూ అంతే మరి 🙂
ధన్యవాదాలు.
పిన్నిగారు చక్కగా సెలవిచ్చారు. అమెరికాలో ఉన్నట్లు ఇండియాలో కూడా జూరీ ఉండి, పిన్నిగారు లాంటి వాళ్ళు అందులో వుంటే బావుణ్ణు. ఆ నేరస్తులకు సరైన శిక్ష పడుతుంది.
@అమ్మాయ్ జ్యోతిర్మయి,
మనకి సాతంత్ర్యం రాక ముందు జూరీ ఉండేది, కోర్టుల్లో, తరవాత తీసేసేరు. నిజం జూరీ కావాలమ్మాయ్.
ధన్యవాదాలు.