శర్మ కాలక్షేపంకబుర్లు-పెళ్ళి కూతురుని ఎలా చేస్తారంటే…

పెళ్ళికూతురుని ఎలా చేస్తారంటే..

అమ్మాయి/ అబ్బాయికిపెళ్ళి కుదిరి తాంబూలాలు పుచ్చుకోగానే, ముహూర్తం పెట్టించుకోగానే మొదట చేసేపని విఘ్నేశ్వరునికి మీదు కట్టడం.

మీదుకట్టడం ఎలా, ఇది ఆడవారు, సాధారణంగా తల్లి కడుతుంది. ఇంట్లో పెద్దలుంటే కట్టిస్తారు,మంగళవారం, శుక్రవారం కాకుండా మంచిరోజు చూకుని, కనీసం ముగ్గురు పేరంటాండ్రని పిలిచి, పసుపు వినాయకుని చేసి, పూజించి, ఒక ఎర్రటి జాకట్ ముక్కలో ఐదు సోలల బియ్యం పోసి అందులో ఒక బెల్లం ముక్క వేసి ఉంచి, తిరగలి వేసి, దానికి పసుపు, కుంకుమ బొట్టు పెట్టి,శనగలు తీసుకుని దానిలో విసరాలి,వచ్చిన ముత్తయిదువుల చేత విసిరించి, వాటిని వేరుగా పొట్లం కట్టి, ఈ ఎర్ర గుడ్డలో పెట్టి, పసుపు వినాయకుడిని కూడా ఆ మూటలో పెట్టి గుడ్డని మూట లా కట్టి, లోపల బీరువాలో భద్రం చేస్తారు. దీనిని మీదు కట్టడం అంటారు. వినాయకుని, స్వామీ! ఈ కార్యక్రమం సాఫీగా అయ్యేలా అనుగ్రహించు, అని చెప్పి చేసేది. మరొక రకంగా చెప్పాలంటే, పాత రోజులలో ఇరుగుపొరుగువారికి పెళ్ళి పనులు మొదలుపెట్టినట్లు చెప్పడమే. మీదు కట్టే దాకా పెళ్ళికి సంబంధించిన పనులు చేయరు, బంగారు వస్తువులు చేయించడం సహా.మొత్తం కార్యక్రమం పూర్తయిన తరవాత ఈ మీదుకట్టిన మూట తీసి, బియ్యం విసిరి,శనగపప్పును అందులో వేసి ఉండ్రాళ్ళు చేసి వినాయకునికి నైవేద్యం పెట్టి, ప్రసాదంగా స్వీకరిస్తాం. పెళ్ళికి ఈ కార్యక్రమం పదహారురోజుల పండుగనాడు చేస్తాం. ( పెళ్ళయిన పదహారవ రోజు పండగ చేసుకుంటాం )
సాధారణంగా ఊరిలో పిలుపులు కార్యక్రమం ఈ రోజు పెట్టుకుంటారు, ఆ ఉదయమే, పెళ్ళి కూతురుని చేసే ముందు, ఎందుకంటే, ఆ రోజు మంగళ వాద్యాలు పెడతారు, వారితో ఊరిలో పిలిచి, పెళ్ళికుమార్తెను చేసే సమయం లో కూడా మంగళ వాద్యాలు వాయిస్తారు.

మంగళ వాద్యాలు

మంగళ వాద్యాలు

పిలుపులు

పిలుపులు

దీని తరవాత పెళ్ళి పనులు చేస్తూ, పెళ్ళికి ముందుగా పెళ్ళి కూతురుని/పెళ్ళి కొడుకుని చేస్తారు. ఈ సాంప్రదాయం చాలా రూపాల్లో మన దేశం లో పలు రకాలుగా ఉంది. తెనుగునాట పెళ్ళి కూతురు/పెళ్ళి కుమారుని చేయడమనే అంటాం. దీనికి ముహూర్తం సిద్ధాంతి గారిచేత పెట్టించుకోవాలి. వారు పెట్టిన ముహూర్తానికి, ఈ ముహూర్తం ఉదయమే ఉంటుంది. ఆ రోజు ఇంటిని అలంకరించి, బంధువులను, స్నేహితులను పిలుచుకుని,నట్టింట పెళ్ళి పీట వేసి, కఱ్ఱ రోలుకు తోరం కట్టి ,దానిని పెళ్ళి పీట ముందు వేసి ఉంచుతారు.( కఱ్ఱ రోలు దొరకటం లేదు పల్లెలో కూడా, వీటిని రోకళ్ళంటారు.)

రోకళ్ళు

రోకళ్ళు

పసుపు కొట్టడం

పసుపు కొట్టడం

ముహూర్తానికి కొద్ది సమయం ముందుగా, పెళ్ళి కుమార్తెను చేసే అమ్మాయిని, వారొతో పాటు, వారికంటే కొద్ది వయసు తక్కువ ఉన్న అమ్మాయిని పెళ్ళి పీటమీద కూచోపెట్టి, ముహూర్త సమయానికి, తల్లి ముందుగా, పిల్ల, తోడ పెళ్ళి కూతురు చేయబోయే అమ్మాయి తల పైన నూనె రాస్తూ, అమ్మ కడుపుచల్లగా, అత్త కడుపు చల్లగా, నీ ఇల్లు వెయ్యిళ్ళ మొదలవాలని దీవిస్తుంది. తోడ పెళ్ళి కూతురుని చేయడానికి, స్వంత చెల్లెలుకాని, బంధువులలో అమ్మాయినికాని, వారెవరూ లేని సందర్భంలో పైవారి అమ్మాయిని కాని తోడ పెళ్ళి కూతురుని చేయచ్చు. ఆ తరవాత ముత్తయిదువులు నూనె రాసి, దీవిస్తారు, పెద్దలు దీవిస్తారు. అప్పుడు పసుపుకొమ్ములు ఆ కఱ్ఱ రోట్లో వేసి, ముత్తయిదువులు దంచుతారు,అమ్మాయిలకి కొత్త బట్ట లిస్తారు, మంగళహారతిచ్చి పీటల మీదనుంచి లేవదీసి, తలంటుతారు. ఆ తరవాత తిలకం, కాని కుంకుమ కాని పొడుగుగా నామంలా పెడతారు,కొత్త బట్టలు కట్టించి, మళ్ళీ పీటల మీద కూచోబెడతారు. పసుపు కొమ్ములు వేసి రొట్లో, మళ్ళీ దంచుతారు, ఇప్పటినుంచి పెళ్ళి కూతురంటారు. పెళ్ళి కూతురుకి, తోడ పెళ్ళి కూతురికి మంగళ హారతిస్తారు. పీటల పైనుంచి లేవదీస్తారు.

హారతి ఇవ్వడం

హారతి ఇవ్వడం

ఇంతతో కార్యక్రమం ముగుస్తుంది. తరవాత , ఆ రోజు భోజనాల కార్యక్రమం.

పెళ్ళికి పందిరి వేస్తాం ఇంటి ముందు, దీనిని వాసాలు, వెదురు, తాటియాకులతో వేస్తాం. పందిరి వేసేందుకు ముందు గుంజ పాతుతాం, మంచి ముహూర్తం చూసి.పాతబోయే గుంజకి పసుపురాసి, బొట్టుపెట్టి, దానికి,తోరం కట్టి ( తోరం అంటే పసుపుకొమ్మును కట్టడం ) మామిడాకుల తోరణం కట్టి, కొత్త తువ్వాలులో అక్షంతలు మూటగట్టి ఇలా గుంజని పాతుతాం.

పందిరి గుంజ పాతడం

పందిరి గుంజ పాతడం

దిష్టి తీసే కార్యక్రమమే మంగళ హారతి ఇవ్వడం అనుకుంటా. ఈ సమయంలో పాటలు కూడా. పాడుతారు. నేటి సమాజం లో పెళ్ళి చేసుకోడానికే సమయం లేకపోతే, పెళ్ళికొడుకుని/ పెళ్ళి కూతురుని చేయడం ఏమనే రోజులే. మన సంస్కృతిలో వివాహం, కంగారుగా జరిపే కార్యక్రమం కాదు.

12 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-పెళ్ళి కూతురుని ఎలా చేస్తారంటే…

 1. మిత్తి తియ్యదం అనేది ఒకటి ఉంటుందండొయ్!దీనర్ధం చాలా సరదాగా ఉంటుంది?అప్పటి దాకా ఆ అమ్మాయిలో ఉండి పురుషులకి ఆ అమ్మాయి పట్ల ఆకర్షణ కలిగించిన విష్వక్సేనుడ్ని మర్యాదగా పంపించెయ్యటం!!

  అందమయిన అమ్మాయిలకి లైన్లూ బ్రాకెట్లూ వేసే వాళ్లని వూరికే ఆడిపోసుకుంటాం గానీ అది విష్వక్సేనుల వారి పని కదా?!

  అలా విష్వక్సేనుడు జారుకోవదం వల్లనే పెళ్లయిన ఆదవాళ్ళపట్ల మనకి తెలియకుండానే గౌరవ భావం కలుగుతుందేమో?

 2. మా నాన్నగారు వాళ్ళు వస్తువుల పేర్లు మాట్లాడుకుంటుంటే నాకు తెలియదు అని బాధపడుతుండే వాడిని, మీరు కొన్ని పేర్లు చెప్పారు, అన్ని పేర్లు కొంచం చెబితే మేము ఎక్కించుకుంటాము బుర్రలోకి.

 3. బాగా రాసారు .మిగిలిన కార్యక్రమాలు కూడా రాయండీ ,ఉపయోగకరంగా వుంటుంది .మన పాత సంప్రదాయాలు ఇప్పటి తరానికి పరిచయం చేయాలనీ వాటిని కాపాడుకోవాలనే తపన తో మా అమ్మాయి పెళ్లి పూర్తిగా పూర్వపు రోజులలో లా చేసాము మా తాతయ్య గారికి వంద సంవత్సరాలు నిండాయి ఇప్పటికి ఆ రోజుల గురించి విపులంగా చెబుతారు వారి సలహాలు తీసుకుంటాము

  • @
   చిన్ని గారు,
   మీరు మీ అమ్మాయి పెళ్ళి చేసేరుకదా. మీరు చెబితే బాగుంటుందేమో ఆలోచించండి. మీ తాత గారికి నమస్కారాలు అంద చేయండి
   నూతన ఆంగ్ల వత్సర శుభకామనలు
   ధన్యవాదాలు

 4. భలే వారండీ శర్మ గారు,

  తాంబూలాలు ఇచ్చి పుచ్చు కోవడానికి సమయం చాలట్లేదు, మీరేమో ఇంత పెద్ద పద్ధతి చెబ్తున్నారు మరి ! మరి ఎప్పటికి పెళ్ళి అయ్యేను? కొత్త తరం జడుసు కో బేయేరు సుమీ, అహ నా పెళ్ళంటా, అంటే ఇంత కష్టమా అని పారి పోయేరు మరి?

  జిలేబి.

  • @
   జిలేబి గారు,
   పెళ్ళి అనేది జీవితంలో ఒక సారి చేసుకునే పండగా, దానికీ ఖాళీ లేదా? విచిత్రం.
   నూతన ఆంగ్ల వత్సర శుభకామనలు
   ధన్యవాదాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s