శర్మ కాలక్షేపంకబుర్లు-ఆధార్ కధ(మనవాళ్ళుత్త వెధవాయలోయ్ కి కొనసాగింపు)

అధార్ కధ.( మనవాళ్ళుత్త వెధవాయలోయ్ కి కొన సాగింపు)

మొన్నటి టపాలో మనవాళ్ళుట్టి వెధవాయలోయ్ అంటే స్పందనలొచ్చాయి. సమాధానాలివ్వాలి, దానికి గాను ఒక టపా రాస్తే సరిపోదా అనిపించి మొదలెట్టాననమాట.

ఒక జనాభా గణనలో ఈశాన్య రాష్ట్రాలలో ఎక్కువ జనాభా కనపడింది, దేశం కంటే, కారణాలన్వేషిస్తే, తేలిందేమంటే, పాత కాలపు తూర్పు పాకిస్తాన్ అనబడే నేటి బంగ్లాదేశ్ నుంచి వలసలెక్కువగా ఉన్నాయని తేలింది.  పక్క మరో దేశం, దీనికీ మనమే రోడ్డు కూడా వేశాం, అదే బర్మా.  మనం ఆరోడ్డున బయలుదేరి హాయిగా సింగపూర్ దాకా రోడ్డున ప్రయాణం చేయచ్చు ఓపికుంటే. ఈ బర్మా నుంచి వలసలు తక్కువే, కాదు లేవనే చెప్పాలి.  ఒకప్పుడు ఈ బర్మా కూడా భారతదేశ భాగమే.

వలసదారులకు అక్కడి రాష్ట్రప్రభుత్వాలు సకల సౌకర్యాలూ, రేషన్ కార్డులు కూడా మంజూరు చేశాయి, కారణాలు రాజకీయం, ఓటర్ల లిస్టులలో చేర్చేశారు, ఓటు బేంకు కోసం, అధికారం లో ఉండటం కోసం దేశాన్ని తాకట్టు పెట్టడానికీ సిద్ధమే మరి. వలసదారులు మూలంగా స్థానికుల అవకాశాలు తగ్గుతున్నందునా, స్థానికులపై వలసదారులు జులుం చేస్తున్నందునా, విదేశీయులను వెనక్కు పంపేయాలనే ఉద్యమం బలపడింది.  దీనికి విరుగుడుగా సరిహద్దు కాపలాతో పాటు ఇతర చర్యలు తీసుకోవాలని కోరడం, ప్రభుత్వం కూడా ఆలోచన చేయడంతో, విదేశీ చొరబాటుదారుల్ని అడ్డుకునేందుకు నేషనల్ సిటిజన్ షిప్ రిజిష్టర్ తయారు చేయాలనుకున్నారు.  విదేశాల్లో ఉన్న భారత పౌరులకీ పౌరసత్వం అందజేయాలనుకున్నారు. ముఖ్యంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉండే మన పౌరులు, ద్వంద పౌరసత్వం ఇవ్వాలనుకున్నారు.  ఆలోచన బాగుంది సై అంటే సై అన్నారు.

అప్పుడు చెప్పేరనమాట, ఒక బహుళప్రయోజన కార్డ్ అందించాలనుకున్నారు, ప్రతి పౌరునికీ. దీని పేరు ఆధార్ అని, ఒక వ్యకి యొక్క అన్ని వివరాలు ఒక మైక్రో ప్రోసెసర్ లో ఉంచి కార్డ్ తయారుచేసి ఇవ్వడానికి, అది లేని వారు విదేశీయులుగా పరిగణింపబడాలనీ అనుకున్నారు.  చక్కటి అలోచన.  అప్పుడే చెప్పేరు, ముందుగా విదేశీ భూభాగం దగ్గరలో ఉన్న ప్రాంతాలవారికి, ఇతర రాష్ట్రాలలో సముద్రం దగ్గరగా ఉన్నవారికి ముందు ఇద్దామన్నారు. రక్షణ ఏర్పాట్లలో ఇది కూడా భాగం అన్నారు. ఇప్పుడున్న అన్ని కార్డులతో అవసరం లేదనీ ఇదొక్కటుంటే చాలన్నారు. ఒక్కో కార్ద్ కి ఖరీదు లెక్కగట్టి వసూలు చెయ్యాలనుకున్నారు. తరవాత కాదనుకున్నారు. దీనిని అమలుకు ఒక ఐ.టి దిగ్గజాన్ని తెచ్చేరు, వారే నందన్ నీలేకని.

ప్రజలను ఇబంది పెట్టకుండా, వారికి ఉత్తరాలు రాసి, చోటు నిర్ణయించి, వివరాలు తీసుకుని కార్డ్ వారికి టపాలో పంపాలని, ఏరకమైన ఇతర అవగాహనలు వద్దని, చెప్పేరు. దీనిని అమలు చేయడానికిగాను స్వఛ్ఛంద సంస్థల సహాయం తీసుకోవాలనుకున్నారు. అంతా చూడడానికి బ్రహ్మాండంగా కనపడింది, కాగితం మీద. మొదలు పెడదామనుకునే లోగా ఎవరికో మరో అలోచనవచ్చింది. అమ్మో! ఇది సిటిజన్ షిప్ కార్డ్, అయితే ప్రమాదాలు చాలా ఉన్నాయి, మన ఓట్ బేంకుకి ఎసరొచ్చినట్లే అనుకున్నట్లుంది.  అబ్బే! ఇది సిటిజన్ షిప్ కార్డ్ కాదన్నారు. సూతోవాచా! ప్రారంభమయింది పలచబడటం. మరెందుకు ఇది ఇవ్వడం అని అనుమానం రాకుండా, ప్రభుత్వం అమలు చేసే అన్ని సహాయక చర్యలకు, బేంక్ అక్కౌంట్లు మొదలు పెట్టడానికి, ఇతర చోట్ల గుర్తింపు కార్డ్ గా ఉపయోగిస్తుందన్నారు.  అంతతో పూర్తిగా దీని రంగు, రూపు, రుచి మారిపోయాయి. దీని గురించిన వివరాల సేకరణ రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పచెప్పేరు, అమ్మయ్య! పూర్తి స్థాయిలో పలచబడిపోయింది, కుక్కలు చింపిన విస్తరయిపోయింది.  రాష్ట్రప్రభుత్వాలేం చేశాయీ, మనవాళ్ళకి కాంట్రాక్ట్ కి ఇచ్చాయి, వివరాల సేకరణకి, స్వఛ్ఛంద సంస్థలు సోదిలోకి కూడా రాలేదు.  ఒక్కొకచోట ఒక్కొకరు దీనిమీద అజమాయిషీ భారం పెట్టేరు.  అమ్మయ్య! పూర్తి స్థాయిలో నీరుగారిపోయింది, మొత్తం. ఎక్కడికక్కడ వివరాలు తీసుకున్నారు, ఒకటిన్నర సంవత్సరాలకితం, మా జిల్లా పైలట్ ప్రాజెక్ట్. వివరాలు తీసుకున్నారు, కొంతమందికొచ్చాయి కార్డులు. కొందరికి రాలేదు. సరే మిగతా విషయం నిన్న చెప్పుకున్నాంకదా.

మరో సంగతి, ఇది నిరంతర ప్రక్రియ, ఎందుకంటే, ఒక రోజునాటికి అందరికి కార్డులు ఇచ్చినా, తరవాత పుట్టేవాళ్ళకి ఇవ్వాలి కదా! పోయినవాళ్ళవి రద్దు చేయాలి కదా! దేశంలో లేనివారికి ఇంకా మిగిలినవారికి ఇవ్వాలికదా, ఇప్పుడే అందరికి ఈ గుర్తింపు కార్డులు ఇవ్వకుండానే ఎత్తికట్టేస్తూ ఉంటే ఎలా, అర్ధం కావటం లేదు, అసలు వారికి ఈ సమస్యలు తెలియవా? తెలుసు, కాని మాట్లాడరు, అంతే. ప్రజల బతుకింతే.

ఇక కొత్త అంకానికి తెర లేచింది. ఆధార్ కార్డ్ లేనివారికి బేంక్ అక్కౌంటు తెరవం, అంటే కనీసం మీరు ఆధార్ కోసం ఇచ్చినట్లు ఇచ్చిన రశీదయినా కావాలన్నారు, కొంత కాలం. ఇప్పుడేమంటున్నారూ, నగదు బదిలీ చేస్తాం మీ ఆధార్ నెంబరు ఆధారంగా, అంచేత ఆధార్ కావాలంటున్నారు.  ఇది ఆ పధకాల అర్హులకు వర్తిస్తుంది, దానికీ అభ్యంతరం లేదు. మా లాటి ఏ పధకాలూ వర్తించని వారి బతుకేంటీ? ప్రతివారూ ఇప్పుడు, ఆధార్ తెమ్మని సతాయిస్తున్నారు. సంవత్సరంన్నర కితం ఇచ్చిన వివరాలేమయ్యాయీ? సమాధానం లేదు. ఇప్పుడు మళ్ళీ వివరాలిమ్మంటున్నారు, చిత్రంగా నిన్న ఉదయమే నా టపా తరవాత స్థానిక టి.వీ. లో ఈ అరోజునుంచి మరలా మాలాటి దౌర్భాగ్యులకి వివరాలు తీసుకుంటారంటె పరిగెట్టేం. మొత్తానికి మా ముసలాళ్ళిద్దరికి తీసేరు,  నాలుగు గంటల కుస్తీతో, మళ్ళీ దరఖాస్థు నింపలాన్నారు, కిందటిసారిచ్చిన రశీదు జిరాక్స్ కావలన్నారు, కలిపి ఇచ్చాము, జిరాక్సుకి, దరఖాస్తుకి ఇటూ అటూ పరుగులెట్టి.  మొత్తానికి పని పూర్తయ్యింది.

ఈ రోజు అక్కడి పరిస్థితి,  దరఖాస్తు ఫారాలయిపోయాయట. రోజుకి వందే ఇస్తారట.  మళ్ళీ వివరాలు తీసుకోవలసినవారు వేలలో ఉన్నారు. రోజూ దరఖాస్తు కోసం తిరగడం తోనే సరిపోయేలా ఉంది.,వివరాలివ్వవలసిన వారికి.  ఇక నిరక్షరాస్యుల పరిస్థితి మరీదారుణం. కాకినాడలో ఈ దరఖాస్తు ఫారాలు చిల్లర కొట్లో అమ్ముతున్నారట.  మా కలెక్టర్ మేడం చర్య తీసుకోమన్నారట, ఏమో ఏంజరుగుతుందో తెలీదు. మరొక సంగతి, ఈ ఆధార్ కార్డ్ కోసం, దరఖాస్తు ఇవ్వడం దగ్గరనుంచి, వివరాలు తీయించి ఇచ్చేదాకా ఇవ్వవలసిన లంచం రెండు వందలుగా ఉందని ఉవాచ.  అబ్బాయి ఈ వేళ వెళ్ళి దరఖాస్తు ఫారాలు లేవంటే తిరిగొచ్చాడు, ఎన్నాళ్ళు తిరగాలో తెలియదు, లేక ఇక్కడ కూడా కొనుక్కోవాలో తెలియదు. ఇప్పుడు చెప్పండి మనవాళ్ళుత్త……….

ఇప్పుడే తెలిసిసిన వార్త, మరొక కొత్త అంకానికి తెరలేచింది ఆధార్ తో. అదెలాగంటే, మొన్న మన ముఖ్యమంత్రిగారు గొల్లప్రోలు మండలంలో ఆధార్ పరంగా నగదు బదిలీ ప్రారంభించారు. ఇలా నగదు బదిలీ అయిన వారిలో కొంతమంది సొమ్ము తీసుకోడానికి వెళితే, కొంతమందికి సొమ్మేరాలేదని చెప్పేరట,బేంక్ వారు.  మరి సొమ్మొచ్చినవారి వేలిముద్రలూ, బేంకుకి వీరివని వచ్చిన వేలి ముద్రలూ సరిపోవటం లేదట, బేంక్ వారు సొమ్మివ్వమంటున్నారు. తప్పు బేంక్ వారిదా?ఇందులో ప్రస్తావించిన విషయాలు పత్రికా వార్తల ఆధారంగా.

ఇప్పుడు చెప్పండి మనవాళ్ళుత్త………

20 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఆధార్ కధ(మనవాళ్ళుత్త వెధవాయలోయ్ కి కొనసాగింపు)

 1. @ గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు గారు,
  మీరు కొంత వరకు అదృష్టవంతులే. ఎలెక్షన్ కమిషన్ వారు దయతో ప్రసాదించిన కార్డు లో నా పేరు
  ఇంగ్లిష్ లో — SUBRAYANAM, తెలుగులో — సుబ్రయనరాం
  మొత్తుకున్నాను. మొరపెట్టుకున్నాను. పనులు మానుకొని వారి ఆఫీసు చుట్టూ తిరిగి రెండు మాట్లు వారు ఇచ్చిన ఫారం లలో అప్లికేషన్ ఇచ్చాను. రెండేళ్లు అప్పుడప్పుడు వెళ్ళి అడుక్కున్నాను. విసుగొచ్చి మానేసాను. ఇప్పటిదాకా ఏమీ కాలేదు.
  ఓటు వెయ్యలేను . ఐడెంటిటి గా ఉపయోగించలేను. పర్మనెంట్ అడ్రెస్ లేని వాడిని. అందుకనే BSNL ని నమ్ముకున్నాను. డ్రైవింగ్ లైసెన్స్ అయిపోయి ఏడాది కావస్తోంది. సైకిల్ కూడా లేదు కదా అని ఊరుకున్నాను. అది పనికి రాదు. పాస్ పోర్ట్ కూడా అదే పరిస్థితి. ఎవడికో ఒకడికి ఎంతో కొంత చదివించుకుంటే తప్ప సులువుగా ఏది కాని పరిస్థితి.

 2. శర్మ గారు,

  ఆధారము లేని వారలకు ‘ఆధార్’ కావలె. జగమెరిగిన బ్రాహ్మలైన మీకు ‘ఆధార్’ ఏల?
  ఏ ‘దారీతెన్నూ’ లేని భారీ భారత్ కు ఆధార్ ఏల?

  మా మనమోహనుల వారు శపథం పట్టేరు. దేశం లో అందరికీ ‘ఆధార్’ వచ్చేంత దాకా తనకు ఆధార్ వద్దని. కాబట్టి మీరు భరోసా గా ఉండ వచ్చు, మీకు ఆధార్ వచ్చును, ఇప్పుడు కాకున్నను ఎప్పుడో ఒకప్పుడు

  చీర్స్
  జిలేబి.

  • @జిలేబిగారు,
   ఎప్పటికో ఒక రోజుకు ఏదో రూపంలో ఒక గుర్తింపు ఇస్తారండి, తప్పక. లేకపోతే మాకు ….అక్కడికి పంపుతారు 🙂

 3. నా రేషన్ కార్డ్ లో ఒక అడ్రెస్, వోటర్ కార్డ్ లో మరోటి, ఇక్కడ తీసుకున్న ఆధార్ కార్డ్ లో మరోటి. అడ్రెస్ ప్రూఫ్ కావాలంటే BSNL లాండ్ లైన్ తప్ప మరొకటి దొరకటం లేదు. నేనుట్టి ……. అని అనకండే…..దహా.

  • మీరు కేవలం పాతా గురించి బాధ పడుతున్నారు నేను నా పేరు గురించి బాధ పడుతున్నాను
   తెలుగును తెలుగులో కాకుండా ఆంగ్లంలో వ్రాస్తే ఎలా ఉంటుందో అలా అయ్యింది నా పేరు
   Gelli Phanindra Viswanadha Prasad – Date of birth Certificate
   Gelli Phaneendra Viswanadha Prasad – Voter ID.
   ఇక Ration card సంగతి సరే అక్షరాలూ సరిపోక ఇంటి పేరు ఎత్తేసారు.

   • @ గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు గారు,
    కార్డ్ దొరకడమే గొప్ప మళ్ళీ ఇందులో ఇన్ని తిరకాసులంటే ఎలా? అంత పొడుగు పేరు ఎందుకుపెట్టుకున్నారు? అందుకే ఇంటిపేరెత్తేశారు, సంతోషించండి,అసలు పేరు ఎత్తెయ్యలేదు 🙂

 4. నేను ఆధార్ పకటించినప్పుడు ఒక చిన్న వ్యాసం వ్రాసాను
  http://gpv-buddha.blogspot.in/2011/11/blog-post_3879.html
  ఆ వ్యాసం నిజం అవ్వదు అనుకున్నాను, నాలో ఒక భ్రమ నేను అనుకున్నది ఖచ్చితంగా జరగదు అని కానీ అది నిజం చేసేరామో అని నా అనుమానం.
  నాకు ఆధార్ పత్రం వచ్చింది(నాకన్నా ముందు వెళ్ళిన అమ్మా నాన్నగారికి నాతరువాత వచ్చింది అది వేరే సంగతి), ఇప్పుడు నాకో అనుమానం తలెత్తింది దానిలో నిక్షిప్తమై వున్న సమాచారం నాదో కాదో తెలియదు ఒక్క చిత్రం తప్పించి అవి నావో కావో ఎలా తెలుసుకోవాలి?

  • @ గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు గారు,
   మీరు బాగానే ఊహించారండి. మేమే 🙂
   మీ వివరాలు మీకు తెలిసే సావకాశం లేదనుకుంటానండి, ఇతరులకి తప్పించి, అనగా బేంకులు, ఎల్.ఐ,సి, ఇతర ఋణ సదుపాయాలిచ్చేవారి దగ్గర మీ వివరాలుంటాయి, మీరెక్కడేనా ఋణానికి దరఖాస్తు చేసి చూడండి వారు చెప్పచ్చు, మీ వేలి ముద్రలు మీవి కావని 🙂
   మీరు మీరు కారని కూడా, ఫోటో తప్పించి.

   • ప్రభుత్వాలు వ్యర్ధ పదార్ధాలు వదలడం అతి సహజం, వాటిని పట్టుకుని అవి ప్రవేశ పెట్టినప్పుడు వార్తా పత్రికలూ పొగుడుతూ వ్రాస్తాయి కదా, ఆ వార్తలు కూడా ఇప్పుడు వ్యర్ధ పదార్ధాలలో చేరాయి.

 5. మరీ మీరు చెప్తున్నంత అన్యాయంగా లేదండీ. ప్రభుత్వం ఈ పథకం మొదలెట్టినప్పుడు రమ్మంటే ఒఖ్ఖళ్ళూ రాలేదు. ఇప్పుడేమో ఆధార్ లేకపోతే పనులవ్వవని బెదిరించేసరికి నిద్రలేచారు. ఈ తిప్పలేవీ పడకుండా మా ” ఆధార్” కార్డులొచ్చేసి ఆరు నెలలయింది. మరి దీనికేం చెప్తారు? ప్రతీదానికీ ప్రభుత్వాన్నే తిడితే ఎలాగట?
  ప్రతీదీ టైముకే చేసికోవాలని చెప్పే “ప్రవచనాలు” పాటిస్తే, ఇంత హడావిడి ఉండేది కాదు కదా ?

  • @మిత్రులు ఫణిబాబు గారు,
   తిట్టలేదండి, మా గోడు చెప్పుకున్నాం. 🙂
   ఇప్పుడు ఆధార్ వివరాలివ్వాలని తిరుగుతున్న ఈ వేల మంది సంవత్సరంన్నర కితం ఎర్రటి ఎండలో నిలబడి వివరాలిచ్చి, ఎదురుచూసి, కార్డ్ కోసం,నెట్ లో చూసుకుని, విసుగుచెంది బాబోయ్ మాకు కార్డ్ రాలేదు మహాప్రభో అని గోల చేస్తే ఇప్పుడు మళ్ళీ హింస పెట్టి వివరాలు తీసుకుంటున్నారనమాట. తూగోజి పైలట్ ప్రాజక్ట్ అండి, దాని బతుకే ఇలా ఉందే అని బాధండి

 6. ఆథార్ నంబర్ కూ గ్యాస్కూ, రేషన్కూ , చదువుల రీయింబస్ మెంటుకూ , ఉచిత వైద్యానికీ , హెల్త్ కార్డులకూ …. వగైరా వగైరా అన్నింటికీ లింకులు పెట్టేస్తారు . తస్మాత్ జాగ్రత !

  • మిత్రులు రాజారావు గారు,
   ఎప్పుడో పెట్టేసేరండి లింకులు, ఆధార్ లేకపోతే గేస్ ఇవ్వమనారు ముందు, తరవాతేమనుకున్నారో, ఆధార్కి మీరిచ్చిన రశీదు చూపమన్నారు, పాపం విద్యార్ధులది మరీ దారుణం, వాళ్ళకి ఉపకారవేతనాలన్నీ వెతలే అవుతున్నాయి.

  • @అనూరాధగారు,
   మనం ఇలా అనుకోడమే, జగతి దాని పని అది చేసుకుపోతూ ఉంటుంది, చట్టం దాని పని అది చేసుకుపోతుందన్నట్లు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s