మానసిక శక్తులు
జననం: జనవరి12
“ఒక అదర్శాన్ని తీసుకోండి! ఆ ఆదర్శమే జీవితంగా భావించండి,ధ్యానించండి,జీవనాడిగా చేసుకోండి. మీ మెదడు,కండరాలు, నరాలు,శరీరంలోని ప్రతి భాగాన్ని ఆ ఆదర్శంతో మమేకం చేయండి. ఇదే విజయ రహస్యం. మనం ధన్యత పొంది,ఇతరులను ధన్యులుగా, కృతార్ధులుగా చెయ్యాలంటే మనం అంతర్ముఖులమై, జీవిత రహస్యాన్ని ఛేదించాలి.
గొప్ప ప్రపంచ ప్రవక్తలు,సాధుపుంగవులు, సత్యదర్శులు అంతా చేసినదేమిటి? సామాన్య మానవాళి బహు జన్మలెత్తి సాధించే పరిపూర్ణత్వాన్ని, వీరు ఒక్క జీవిత కాలంలోనే సాధించారు. ఈ పరిపూర్ణత్వాన్ని సాధించడం తప్ప మరే ఇతర ఆలోచన వారికిలేదు;ఒక్క క్షణం కూడా వారు అన్యభావాలకు చోటివ్వలేదు;ఆ విధంగా వారికి చేరవలసిన గమ్యం చేరువైంది.ఏకాగ్రత అంటే గ్రాహక శక్తిని పెంచుకుని, తక్కువ కాలంలో విషయాలను ఆకళింపుచేసుకోవడం.
జ్ఞాన సంపాదనకిదే ఏకైక మార్గం.కాబట్టి ఏకాగ్రతా శక్తి ఎంత ఎక్కువగా ఉంటే ,అంత ఎక్కువగా విషయ జ్ఞానాన్ని ఆర్జించుకోవచ్చు. చెప్పులు తుడిచేవాడుకూడా ఏకాగ్రతతో పని చేస్తే, మరింతబాగా పాలీష్ చేయగలడు. ఏకాగ్రత ఉన్న వంటవాడు మరింత రుచిగా వంట చేస్తాడు. ధనార్జనలోగాని, దైవార్చనలోగాని లేక ఏ ఇతర కార్యాచరణ లోగాని ఏకాగ్రత ఎంత బలవత్తరంగా ఉంటుందో కార్యసిద్ది అంత బాగా సమకూరుతుంది. ఈ ఏకాగ్రత ద్వారానే సత్వరజస్తమో గుణాత్మకమైన మనస్సు జయింపబడి, ఆవల ఉన్న జ్ఞానకాంతి వెల్లువలా ప్రసరిస్తుంది.
ప్రపంచంలోని విషయ జ్ఞానమంతా మానసిక శక్తుల ఏకాగ్రత చేత కాకుండా దేనిచేత సాధించబడింది? ప్రపంచం తన రహస్యాలను బయలుపరచడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. అయితే ఎక్కడ తట్టాలో, ఆ రహస్యాలను ఎలా ఛేదించాలో మనకు తెలియాలి. ఆ ప్రయత్నానికి కావలసిన బలము, శక్తి ఏకాగ్రతతోనే సాధ్య పడతాయి. మనిషి మనస్సు యొక్క శక్తి అపారం. అది ఎంత ఏకాగ్రత నొందితే, అంత శక్తివంతం అవుతుంది, ఇదే మనసు మర్మం.
మనం కొత్తగా ఏ శక్తినీ సృష్టించలేము. కాని దిశా నిర్దేశం చేయగలం. మన అధీనంలోని మహత్తర శక్తులను నియంత్రించడం నేర్చుకోవాలి. సంకల్ప శక్తితో వాటిని తుఛ్ఛమైన ప్రాపంచిక సుఖాలకోసం కాకుండా ఆధ్యాత్మిక పురోభివృద్ధికి వినియోగించాలి. నీతికి, మతానికి పవిత్ర శీలమే పునాది రాయి అని విస్మరించ కూడదు.
మనం స్వతంత్రులమా? ఒక్క క్షణమైనా లేదా ఏ ఒక్క విషయం పైనైనా మనస్సు నిగ్రహించలేని మనం; స్వతంత్రులమని గొప్పలు చెప్పుకుంటాం! మనల్ని మనం సేఛ్ఛాజీవులుగా పరిగణించుకుంటాం’ ఆలోచించండి! నిగ్రహంలేని మనస్సు పతన దిశగా పయనింపచేసి వినాశానికి దారి తీస్తుంది. నిగ్రహించబడ్డ మనస్సు మనలను సంరక్షిస్తుంది;సర్వసతంత్రులను చేస్తుంది.మనుష్యులకు పశువులకు ఏకాగ్రతలోనే వ్యత్యాసం. ఏ పనిలో పొందిన విజయమైనా దీని పర్యవసానమే. ఏకాగ్రతలోని వ్యత్యాసమే మనిషికి, మనిషికి ఉన్న తేడాను నిర్ణయిస్తుంది.అధమ స్థితిలోని మానవుణ్ణి,ఉన్నత స్థితిలోని మానవుణ్ణి పోల్చండి. వారి ఏకాగ్రత లోని భేదమే వారి మధ్యనున్న అంతరానికి కారణం.
సామాన్య మానవుడు తన ఆలోచనా శక్తిని నూటికి తొంభై పాళ్ళు వృధా చేస్తున్నాడు. అందువల్ల అతడు తరచూ పొరపాట్లు చేస్తున్నాడు.సుశిక్షితుడైన మానవుడు ఎన్నటికీ తప్పు చెయ్యడు.
ప్రపంచంలోని పిరికి గుండెగల వ్యక్తుల నుండి మనం ఆశించే కార్యక్రమం ఏముంటుంది? బొత్తిగా శూన్యం. మహాసముద్రాన్ని దాటాలనుకుంటే నీకు వజ్ర సంకల్పం ఉండే తీరాలి. కొండలను పిండి చెయ్యగల శక్తిమంతుడవ్వాలి.
తలపులు మంచివైనా చెడ్డవైనా రెండూ శక్తిమంతమైనవే. అవి విశ్వమంతా వ్యాపించి ఉంటాయి. స్పందన శక్తి మాదిరి అవి శక్తిమంతాలు. కార్య రూపం దాల్చేదాకా ఆలోచన,ఆలోచనా రూపంలోనే ఉండిపోతుంది. ఉదాహరణకు తాడన రూపం లో చేతి నుంచి బయల్పడేవరకు, ఆ శక్తి అంతర్గతంగా ఉన్నట్లే కదా!
మంచిచెడు ఆలోచనల సముదాయమే మన మనస్సు. మనం పవిత్రులమై మంచి ఆలోచనలకు తగిన ఉపకరణాలుగా మారితే అవి మనలో ప్రవేశించి ఘనకార్యాలను సాధిస్తాయి. పవిత్రుడు చెడు తలపులకు దాసుడు కాడు.
భగవంతుడు కాలానుగుణంగా అవతరించడం మనకు తెలుసు. కారణజన్ముడైన అట్టి అవతారం, ఈ ధరిత్రిపై నిర్వహించవలసిన కార్యక్రమం ముందుగానే నిర్దేశింపబడుతుంది. తదనుగుణంగానే వారు వ్యవహరిస్తారు. వారి ప్రతిపలుకూ ఫిరంగి గుండు మాదిరి సూటిగా తగులుతుంది. శక్తి ప్రేరితంకాని పలుకులకు విలువేముంది? నువ్వు ఏ భాషలో మాట్లాడితేనేం?పదాలు ఎలా మారిస్తేనేం? ఛంధోబద్ధమైతేనేం? కాకపోతేనేం? అలంకారికమయితేనేం? లేకపోతేనేం? నువు ఇవ్వడానికి సందేశమేదైనాఉందా? లేదా? అనేదే ప్రశ్న. ఇవ్వడానికి నీవద్ద ఏమైనా ఉందా? ఉంటే దానిని ఇవ్వు, ఇవ్వడం, తీసుకోబడటమే కాని కేవలం వినటంకాదు.
నువ్వు ఏంచేసినా నీ మనస్సును, సర్వశక్తిని దానికోసం వినియోగించు. నేను ఒకసారి ఒక గొప్ప సన్యాసిని దర్శించాను. పూజాపురస్కారలలో ధ్యానంలో ఎంత శ్రద్ధ వహిస్తాడో, అంతే శ్రద్ధతో ఆయన తన ఇత్తడి పాత్రలను బంగారు పాత్రల మాదిరి నిగనిగలాడేట్లు తోముతాడు. శ్రద్ధ అంటే అలా ఉండాలి.
ఈ జీవితాన్ని కొనసాగిస్తూనే మనం పవిత్రతను ఎలా పొందగలం? పవిత్రతను సాధించడానికి మనమంతా అడవులలోకి, గుహలలోకి వెళ్ళాలా? అలా వెళ్ళడం వల్ల ఏం మేలు జరుగుతుంది? మనస్సే కనక మన అధీనంలో లేకపోతే మనం గుహలలోకి వెళ్ళి ఏకాంతవాసం చేసినా ప్రయోజనం లేదు. అక్కడా అదే మనస్సు మనలో రకరకాల అలజడులను సృష్టిస్తుంది. అన్ని రకాల భూతాలు మన మనస్సులో ఉండటం చేత మనం ఏకాంతానికై గుహాంతర్భాగంలోకి ఎళ్ళినా అక్కడా ఆ భూతాలే ప్రత్యక్షమౌతాయి. మన మనస్సే మన అధీనం లో ఉంటే మనం ఎక్కడకు వెళ్ళినా, ఎక్కడ ఉన్నా అక్కడే ఏకాంతం లభిస్తుంది.
ఈ ప్రపంచం మనకు కనబడే తీరు మన మానసిక పరిస్థితి మీద ఆధారపడిఉంటుంది. ఈ ప్రపంచం మన పట్ల ఎలాఉందని భావిస్తామో, ఆ భావాన్ని రూపొందించేది మన స్వకీయ మానసిక దృక్పధం మాత్రమే. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనపడుతుంది. వస్తువులను అందంగా కనుపింపచేసేవీ మన భావనలే. వస్తువులను అందవికారంగా కనుపింపచేసేవీ మన భావనలే. ఈ ప్రపంచమంతా మన మనస్సులో నిండి ఉంది. అందువల్ల సమ్యక్ దృష్టి అలవరచుకోండి.”
“శ్రద్ధావాన్ లభతే జ్ఞానమ్ “
స్వామి వివేకానంద జన్మదినం నేడు. ఆ సందర్భంగా వారి అమృతవాక్కులనుండి కొంత మీకోసం సమర్పించుకున్నా. టైపు చేయడంలో దోషాలు నావేనని మనవి.
Very Inspiring!
@వర్మ గారు,
స్వామి ఉపన్యాసాలలో మనం ఏరుకుని చదువుకుంటే గొప్ప స్ఫూర్తి పొందుతాం.
ధన్యవాదాలు.
స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా, చక్కటి విషయాలను తెలియజేసారు.
@అనూరాధగారు,
ఇది స్వామి ఇచ్చిన ఉపన్యాసాలలో ఒక చిన్ని భాగం, మీకినచ్చినందుకు
ధన్యవాదాలు.