శర్మ కాలక్షేపంకబుర్లు-రాజమంద్రి వేద సభ.

రాజమంద్రి వేదసభ

“రేపు ఉదయమే రాజమంద్రి వెళుతున్నానోయ్” అన్నా, ఇల్లాలితో. “రేపు కనుమ కదా?” అంది. “నిజమే! కాని వేద సభ జరుగుతోందిట, అన్నయ్యతో మాటాడేను, అటునుంచి వస్తున్నారు, నేనిటునుంచి వెళుతున్నా” అన్నా. “మీ ఇష్టం” అంది ఇల్లాలు. మరునాడు ఉదయమే బయలు దేరేను, అన్నయ్య దూరం నుంచయినా రాగలిగేరు, స్టేషన్ కి, నా బండి ఇరవైఏడు కిలోమీటర్ల దూరం ప్రయాణానికి రెండు గంటలు తీసుకుంది, అది మరీ ఎక్కువలా కనపడింది, కారణం, మనసేమో సభమీద ఉంది, గుబగుబలాడిపోతోంది, స్వామి దర్శనం చేయాలని, కనక, బండి దిగిన వెంటనే బయలుదేరి పి ఆండ్ టి కాలనీ ఎదురుగా ఉన్న లాల్ బహదూర్ రోడ్ లో ఉన్న ఒక భవంతి దగ్గర దిగేం, ఉరుకులూ పరుగులతో. భారతీతీర్ధ స్వామి అక్కడ దర్శనం ఇస్తున్నారని అబ్బాయి చెప్పగా, అందుకు ముందు ఇక్కడికి చేరేం. స్వామివారిని దర్శించాలంటే ఉన్న వేషం కుదరదు, చొక్కా విప్పేసి కొల్లేటి చాంతాడంత ఉన్న వరుసలో నిలబడ్డాం, ఇంతలో ఎవరో అన్నయ్యగారిని చూసి చెయ్యి పట్టుకు లాక్కుపోయి, మరొకరికి అప్పచెప్పేరు. వారు “ఇంతాలస్యం చేసేరేం?” అంటూ మరొకరిని పిలిచి “వీరికి స్వామి దర్శనం ఏర్పాటు చేయండని”, చెప్పేరు. వారు మమ్ములను తీసుకుని స్వామికి ఒక గజం దూరం లో వదిలేసేరు. ఏమిటిది చిత్రం, స్వామి దయ, కరుణ ఇలా ప్రసరించిందా? ఏడిచే బిడ్డని తల్లి అక్కున చేర్చుకున్నట్లు, స్వామి, వీడు నా దర్శనం కోసం తపిస్తున్నాడు, తొందరగా దర్శనమివ్వాలనుకున్నారు కాబోలు. మరి ఐదు నిమిషాలలో స్వామి ముందున్నా, ఏమో ఏం జరిగిందో తెలియదు, ఇహలోకపు భావనలన్నీ ఒక క్షణం వీడిపోయి తదేక దృష్టిలో ఉండిపోయా, పాదుకలకు నమస్కారం పెట్టుకుని, స్వామి అనుగ్రహించిన ప్రసాదం తీసుకుని బయట కొచ్చేం. దర్శనమవుతుందా? అనుకున్న దానినుంచి కనుమూసి తెరిచేలోగా దర్శనం చేసుకోవడం, బయటకు రావడం క్షణాలలో జరిగిపోతే, ఎంత ఆనందం. అప్పుడిక ఇహలోకంలోకొచ్చి, స్వామిని కెమేరాలో,  ప్రయత్నం చేసి ఇలా.

శ్రీశ్రీశ్రీ భారతీ తీర్ధస్వామి శృంగేరి పీఠాధిపతులు.

వేద పండితులలో ఒక భాగం.

శ్రీ విరించి వానప్రస్థాశ్రమం శ్రీ భారతీతీర్ధస్వామివారిచే చే ఆవిష్కరణ ఫలకం

శ్రీ విరించి వానప్రస్థాశ్రమం భవనం.

ఇప్పటిదాకా చుట్టూ ఏమున్నదీ చూడలేదు. అప్పుడు చూస్తే అది కొత్త భవనమని తెలిసింది. తీరాచూస్తే అది శ్రీ విరించి ఛారిటబుల్ ట్రస్టు వారు నిర్మించిన వానప్రస్థాశ్రమం. కొన్ని ఫోటో లు తీసుకోగా తెలిసింది స్వామికి శ్రీ దువ్వూరి రామకృష్ణారావు గారిచ్చిన దగ్గరగా నలభై సెంట్ల స్థలంలో ముప్పాతిక స్థలంలో శ్రీవిరించి ఛారిటబుల్ ట్రుస్ట్ వారు వానప్రస్థాశ్రమం కోసం భవనం నిర్మించారు. అద్భుతం, ఇంతకు మించి మాట దొరకలేదునాకు.

ఆ తరవాత స్వామి అన్న ప్రసాదం తీసుకు వెళ్ళమని మరొకరు చెప్పేరు. ఓహ్! పరమానందం, స్వామి ప్రసాదమేమో అద్భుతమైన రుచితో ఉంది. మరొక సారి స్వామికి మనసులోనే నమస్కారం చేసుకుని తదుపరి కార్యక్రమం గురించి తెలుసుకుంటే మూడు గంటలకి బ్రహ్మశ్రీ చాగంటి వారి ప్రవచనం, ఆ తరవాత పండితుల శాస్త్ర పరిచయం, తదుపరి స్వామి అనుగ్రహభాషణం అన్నారు. మూడుకి ఆర్ట్స్ కాలేజిలో వేసిన బ్రహ్మాండమైన పందిరిలో సమయానికి శ్రీ చాగంటి వారి ప్రవచనం ప్రారంభమయింది. వారేం చెప్పేరు అనేలోగా రెండు గంటలు నిమిషాల్లా గడిచి, “స్వామి విచ్చేస్తున్నారు నేను ముగిస్తున్నా”నన్నారు. స్వామి దర్శనమిచ్చారు. చతుర్వేది శ్రీ తాతాచార్యుల వారి అద్యక్షతన జరిగిన సభలో తర్కం,వ్యాకరణం, మీమాంస మొదలైన శాస్త్రాల పరిచయం ఒక్కొకరూ చేశారు. మీమాంస శ్రీ చిర్రావూరి శ్రీరామ శర్మ గారు చేశారు, బహురమ్యంగా.

శ్రీ విశ్వనాధ గోపాలకృష్ణ శాస్త్రి ఘనాపాఠీ గారు

శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు

శ్రీ చిర్రావూరి శ్రీరామ శర్మ గారు.

ఆ తర్వాత స్వామి అనుగ్రహభాషణం చేశారు.వారు చెప్పినది సంక్షిప్తంగా నాకు అర్ధమయినది, అందరూ వేదం చదవలేరు, అర్ధమూ కాదు, ఉదాహరణకి,రెండు వాక్యాలు తీసుకోండి సత్యం వద, ధర్మం చర ఇది వేదం చెప్పింది. ఇవి అర్ధం కావాలంటే హరిశ్చంద్రోపాఖ్యానం చదవండి, రామాయణం చదవండి అన్నారు. అయ్యో! ఒక్క శాస్త్రమయినా చదువుకోలేదే జీవితమంతా భుక్తికోసమే సరిపోయింది, ముక్తికి మార్గం లేదా అనుకుంటూ మధనపడుతున్న నాకు స్వామి వారి మాటలు అమృతపు చినుకులైనవి కదా! ఆ తర్వాత తిరుపతి దేవస్థానం వారు వేదపండితులను శ్రీ సూక్తం చెప్పమన్నారు, స్వామి యజుర్వేదులను మాత్రం పరాయతం చెప్పమన్నారు. స్వామి అజ్ఞతో వారు పరాయతం చెప్పడంతో సభ ముగిసింది.

వేద సభఅన్నారు కదా, అని అనుమానం. నిజమే వేద సభ 14 వ తేదీ మకర సంక్రమణం రోజు ఉదయమే జరిగిపోయిందిట. ఆ తరవాత శ్రీ చిర్రావూరి శ్రీరామ శర్మగారి అష్టావధానమూ జరిగిందిట. సమాచారలోపం మూలంగా ఆ రోజు వెళ్ళలేదు, వాటిలో పాల్గొనలేకపోయాను. అయినా బాధ లేదు. స్వామిని దర్శించాను, అనుగ్రహభాషణం విన్నానుకదా! ధన్యుడను.

చివరిమాట , తిరుమల తిరుపతి దేవస్థానం వారు వేద సభ జరపాలనుకున్నారట, ఎక్కడ జరపాలంటే, సాంస్కృతిక రాజధాని రాజమంద్రిలో జరపమన్నారట శ్రీ శ్రీ శ్రీ భారతీతీర్ధస్వామి. ఇంకేం శ్రీ విశ్వనాధ గోపాలకృష్ణ ఘనాపాఠీ గారి మీద భారం పెట్టేసేరట. దక్షణ భారతదేశంలోని రెండు వేలమంది వేదపండితులు సభకు ఆహ్వానించబడ్డారు. దివ్యంగా అలా మొదలయింది, ప్రతి ఆరునెలలకి ఒక చోట వేద సభ జరుపుతారట, ఇకపై.