శర్మ కాలక్షేపంకబుర్లు-……చల్లగా చెప్పాలి.

…….చల్లగా చెప్పాలి.

చావు కబురు చల్లగా చెప్పాలని నానుడి. ఇదేంటబ్బా అని అలోచిస్తే విషయం తోచలేదు కాని అనుభవంలోకి మాత్రం వచ్చింది.

కొన్నాళ్ళకితం రిటయిర్ అయినవాళ్ళని మళ్ళీ తీసుకుంటున్నాము, ఉద్యోగం రెండు సంవత్సరాలు సమయానికన్నారని, దరఖాస్తు పెట్టేనని చెప్పేను కదా. మళ్ళీ ఉద్యోగం వచ్చేసినంత, హోదా, హడావిడి చేసేను కదా. వాళ్ళ దగ్గరనుంచి సమాధానం రాకపోయేసరికి ఏమయిందో తెలుసుకోడం కోసం ఢిల్లీలో ఉండే మా అసోసియేషన్ సెక్రెటరీకి మెయిలిచ్చాను,ఇలా దరఖాస్తు చేశాను, సంగతి కనుక్కోమని. దానికతను సమాధానమిస్తూ వయసు అరవై ఐదు దాటిన వారిని తీసుకోడం లేదట అని చెప్పేరు. ఎందుకైనా మంచిది మీరు మాట్లాడండి అని మెయిల్ అడ్రస్ ఇచ్చారు. ఆ అడ్రస్ కి మెయిలిస్తే అది తీరుబడిగా తిరిగొచ్చింది, చేరక. మళ్ళీ మా మిత్రుడుని అడిగితే ఫోన్ నెంబరిచ్చారు, మెయిల్ అడ్రసు ఇచ్చారు. నేను కవిని కదా, మళ్ళీ ఫోన్ చేసి వినపడక బాధపడే కంటే ఊరుకుంటే మంచిదని ఈ నానుడి తలుచుకున్నా, “ఊరుకున్నంత ఉత్తమం బోడిగుండంత సుఖం లేదని” సరేలే మెయిలిద్దామని మళ్ళీ ఇచ్చా. …..చల్లగా చెప్పేరు, అరవై ఐదేళ్ళు దాటిన వాళ్ళని తీసుకోటం లేదని, ఇల్లాలికి చెప్పేను, అయితే చావు కబురు చల్లగా చెప్పేరనమాట అంది.

ఇలా జరుగుతుండగా అబ్బాయి వచ్చి “నాన్నా! స్థలాల బ్రోకరొకడు నన్ను చంపుతున్నాడు స్థలం కొనండి, చవకగా ఇప్పిస్తానని, మీరు ఒక సారి ఆ విషయం చూసి బాగుందని చెబితే కొందాం, లేదంటే మానేదా”మన్నాడు. బ్రోకర్ ని మీదగ్గరకి తీసుకొస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు.

మర్నాడు బ్రోకర్ ని తీసుకొచ్చి “నాన్న గారితో విషయం మాట్లాడు, ఆయనెలా చెబితే అలా చేస్తానని” అప్పగించి వెళిపోయాడు. “ఎక్కడయ్యా స్థలాలు, రేటెంత?” అంటే “మిమ్మల్ని తీసుకువెళతానని” బండి మీద తీసుకెళ్ళి స్థలలాలు చూపించేడు. రేట్లు కూడా చదరపు గజం 1500 నుంచి 2000 దాకా చెప్పేడు. “తీసేసుకోండి, మళ్ళీ దొరకకపోవచ్చు” అంటూ ఊదరకొట్టేశాడు. “ఏ సంగతి చెప్పండి” అంటూ. దానికి “నేను చూసి సరే అంటే కాదయ్యా! అబ్బాయి చూడాలి, కోడలు చూడాలి వాళ్ళకి ఏరియా నచ్చాలి అప్పుడు మిగిలిన విషయాలు మాట్లాడుతా, ఇంతకీ దీనికి కావలసిన అన్ని అనుమతులూ ఉన్నాయా?” అంటే అవి “పట్టుకొస్తా”నని అన్నాడు. మర్నాడు ఏ విషయం చెప్పమని, రాత్రికి మా బావ మరిదికి పోన్ చేసి అడిగా. అతను నాకు “ఫలానా, పలానా అనుమతులు కావాలి, అవి ఉన్నాయో లేవో చూచుకుని అప్పుడు ముందుకెళ్ళు” అని సూచన చేశాడు. అబ్బాయిని కోడల్ని తీసుకుని స్థలం చూపించి మాటాడితే” బాగానే ” ఉందన్నారు.” మిగిలిన విషయాలు మీరు మాట్లాడండని” నాకు వదిలేశారు. మర్నాడు ఉదయమే బ్రోకర్ వచ్చి “యజమాని దగ్గరకెళ్ళి మాటాడి నిర్ణయం చేసేద్దామండి” అన్నాడు. “నువ్వు కంగారు పడకు, అసలు పంచాయతి అనుమతి ఉందో లేదో కనుక్కో, ఉంటే ఆ తరవాత కలక్టర్ అనుమతి కావాలి అది ఉందా? ఆ అనుమతికి డబ్బు కట్టాలి కట్టేరా? తెలుసుకు చెప్పు” అన్నా. “ఆగండి ఫోన్ చేసి కనుక్కుంటా” అని యజమానికి ఫోన్ చేసి కనుక్కుంటే ప్లాను ఉందంటాడే తప్పించి దానికి అనుమతి గురించి మాటాడడు. “ఆనుమతులు లేకపోతే రిజిస్ట్రేషన్ కాదయ్యా అంటే,”  మళ్ళీ కనుక్కుంటాని వెళిపోయాడు. మర్నాడు ఉదయం వచ్చాడు “ప్లాన్ ఉందండి అనుమతిలేదండి” అన్నాడు. “అనుమతి తెస్తారా అంటే, అయ్యా! అసలు ప్లాన్ వేసిన వాడు మరొకరికి అమ్మేశాడు, అతను మరికొంతమందికి అమ్మేశాడు. ఇప్పుడు అలా కొనుక్కున్న వారిలో ఒకరు అమ్ముతున్నారు, మీరుకొంటానంటే”, అన్నాడు. “రిజిస్టర్ కాని స్థలం ఎలాగయ్యా కొనడ”మంటే, “అతను పవర్ ఆఫ్ అటార్నీ రాసిస్తాడండి, మీరు బజాణా గా సొమ్ము కొంత ఇస్తే చాలండి” అన్నాడు, చల్లగా. ఇప్పుడు సంగతి అర్దమయిపోయింది. ఆ స్థలానికి ఇల్లు కట్టుకోడానికి తగిన అనుమతులు లేవు, అవి తెచ్చుకోడం ఒక్కడివల్ల కాదు. ఆ స్థలం కొనుక్కుంటే రిజిస్టర్ కాదు, ఊరకే కొంత సొమ్మిచ్చి దానిని వ్యాపారంగా మార్చేసి డబ్బులు మనం ఇచ్చినదానికంటే ఎక్కువ మరొక తెలివి తక్కువ వాడినుంచి వసూలు చేసుకోవాలనమాట. ఈ దగా వ్యాపారం నచ్చలేదు. వాడు చావు కబురు చల్లగా చెబితే నేనేం తక్కువ తిన్నానా? సరే రేపు చెబుతా రమ్మని, రాత్రికి అబ్బాయికి కోడలికి సంగతి వివరంగా చెబితే “సరే వాడి కబురు, వాడికి చల్లగా చెప్పెయ్య”మన్నారు. మర్నాడు ఉదయమే వచ్చిన వాడికి “అనుమతులు లేని స్థలం కొనడం దండగ, అనుమతులున్న స్థలాలుంటే చెప్పు” అని చావు కబురు చల్లగా చెప్పేసేను.

నెలంటే ముఫై రోజులుకి పదిరోజులు తక్కువో ఇరవైరోజులు ఎక్కువో ఉండచ్చని కొత్త భాష్యపు చావు కబురు చల్లగా వినిపించలేదూ?

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-……చల్లగా చెప్పాలి.

 1. తాత గారు,
  ఈ మధ్య జరుగుతున్న ఈ స్థలాల వ్యాపారం గురించి బాగా వ్రాశారు. కవి అంటే కనపడదు, వినపడదేనా?? 😀 😀

  • @చిన్ని గారు,
   స్థలాల విషయం లొ కొద్దిగానే రాశా ఇంకా చాలా కధ మిగిలిపోయింది. మరో సారి రాయాలి. కవి అంటే, జంధ్యాల చెప్పిన కవినే 🙂
   ధన్యవాదాలు.

   • @అమ్మాయ్ చిన్ని,
    మనవరాళ్ళు అప్పుడప్పుడు అలిగితే అందమే కాని, మరీ తాతని బాధపెట్టేలా ఉండకూడదు, నేను కవినని తెలుసుగా 🙂

 2. తాతగారు ఇలా పంట పొలాలు ఇళ్ళ స్థలాలుగా మార్చడం మనం ఒప్పుకోకండి, ఇప్పుకుంటే నా తరువాత తరానికి సంద్రంలో వరి సాగుచేయించే దుస్తుతి వస్తుంది.

  • @ గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు గారు,
   ఇప్పుడు పల్లెలలో కూడా పంట పొలాలన్నీ పూడ్చేసి ఇళ్ళ స్థలాలు చేసి అమ్మేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కాకపోయినా కొనేస్తున్నారు. ఇదంతా పెద్దల మాయాజాలం వివరంగా చెప్పాలంటే ఒక టపా అవుతుంది మరి. 🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s