శర్మ కాలక్షేపంకబుర్లు-జగడం.

జగడం.

“జగడమెందుకొస్తుంది జంగమయ్యా అంటే బిచ్చం తేవే బొచ్చుముండా” అన్నాడట. ఇది రాయలసీమ నానుడి, ఎక్కువగా తిరుపతి ప్రాంతం వారు మాటాడే మాటల్లో దొర్లుతుంది.ఇక్కడ తెనుగునాట పాతకాలపు ప్రజల ఆచార వ్యవహారాలు చెప్పాలి. భర్తలేని స్త్రీని విధవ అని ముండ అని కూడా అంటారు, తెనుగులో. పూర్వకాలం భర్త లేని స్త్రీ జుట్టు ఉంచుకునేది కాదు,బొట్టూ పెట్టుకునేది కాదు, పువ్వులు ముడిచేవారు కాదు.. కొంత మంది కాలంతో మారి జుట్టు ఉంచుకోవడం ప్రారంభించారు. అదిగో అలాగ ఆక్షేపించాడనమాట, జుట్టు ఉంచుకున్న విధవరాలిని , సంప్రదాయం తప్పి జుట్టు ఉంచుకున్నందుకు. దాంతో జగడమొచ్చింది. తగువు రావడానికి కారణాలే ఉండక్కరలేకపోతున్నాయి, నేటి రోజులలో. “నారాయణా” అంటే బూతుమాటయిపోతూ ఉంది.ఎలాగా మొదలెట్టేం కనక కొన్ని సంగతులు కూడా ముచ్చటించేసుకుందాం.పూర్వం తెనుగునాట మగవారు పంచె కట్టు, కంటి మెడ లాల్చీ పైన కండువా. ఈ కండువా వేసుకున్న స్థానాన్ని బట్టి అతని విషయం చెప్పకనే తెలిసేది. కండువా ఎడమ భుజం మీద వేసుకుంటే భార్య ఉన్నవాడనీ, కుడి భుజం మీద ఉంటే భార్య లేనివాడనీ తెలిసేది. తలపై సిగ ఉండేవి. ఆడ పిల్లలికి పెళ్ళి అయిన తరవాత మెడలో మంగళ సూత్రాలూ, కాళ్ళకి మట్టెలు, పాపిట కుంకుమ బొట్టు ఉండేవి,జడ లేక కొప్పు పెట్టేవారు, పువ్వులు ముడిచేవారు. భర్త లేని వారిని విధవ అంటే భార్య లేనివారిని విధురుడు  అనేవారు. ముండ అంటే తెనుగులో మరొక అర్ధం కూడా ఉంది, అనధికార భార్య, అని. అందుకు జంగమయ్య చెప్పిన నానుడి కి తగువొచ్చిందనమాట, తగువెలా వస్తుందీ, అన్న ప్రశ్నకి సమాధానం చెప్పినా.. తగువు రావడానికి కారణాలే అక్కరలేదనుకున్నాం కదా అదెలాగో చూదాం.

మా ఇంటికి ఎదురుగా ఒక పెద్ద భవనం కట్టేసేరు. అందులో కొత్తగా 24 కుటుంబాలు చేరిపోయాయి, గత సంవత్సర కాలంగా. మానవుడికి చెత్త పోగుచేసుకోవడం కూడా ఒక దురలవాటు. దానిని ఎక్కడ పడితే అక్కడ పోసెయ్యడమూ అలవాటే. ఈ భవనం రాక ముందు మా పరిసరాల్లో చెత్త కనపడేది కాదు. ఈ భవనం లో కి జనం చేరిన తరవాత మా పక్క ఖాళీ స్థలం లో ప్లాస్టిక్ కవర్లు, అట్ట పెట్టెలు, నానా రకాల చెత్త పోసెయ్యడం ప్రారంభించారు. అందరికి ఓపికగా చెప్పేము, ఆ స్థలం మాది అందులో చెత్త పోయద్దని. ఒకావిడ చాల తెలివిగా “ఖాళీ గా ఉందికదండీ” అంది, “మీ గుమ్మ ముందూ ఖాళీ గానే ఉంది అక్కడ పోసుకోవచ్చుగా, చెత్త,” అని ఇల్లాలంటే, మళ్ళీ మాటాడలేదు. కొంత కాల మానేశారు, మళ్ళీ మొదలు పెట్టేరు, దీనికి కధానాయకురాలు మా ఇంటి కి ఎదురుగా ఉన్న ఇంటిలో ఉన్నావిడే. ఆవిడకి మొక్కలంటే చికాకు,గుమ్మం ముందు రాలిన మామిడాకులు తుడుచుకోవడానికి ఆవిడకి బద్ధకం, సాధారణం గా మేమే తీసేస్తూ ఉంటాం రోజూ. మీ ఇంటినిండా మొక్కలే, పాములొస్తాయి,చెట్ల ఆకులు తుడుచుకోడం కష్టంగా ఉంది, అందుకు చెట్లు కొట్టించెయ్యమని ఉచిత సలహా ఇచ్చి చూచిందట, ఇల్లాలికి. సరే దానికావిడ సమాధానం కూడా ఇచ్చింది. ఈ ఎదురింటావిడ చెత్త మళ్ళీ పోయ్యడం మొదలెట్టింది, మమ్మల్ని ఎలాగయినా ఇబ్బంది పెట్టాలని. ఆవిణ్ణి చూసి అందరూ పోసేస్తున్నారు. ఒక రోజు నేనూ ఇల్లాలూ కలిసి చెత్తంతా ఒక చోటికి పోగుపెట్టి దానికి నిప్పు పెట్టేము. పొగ భవనం వైపుకి వెళ్ళింది, గాలి అటు ఉండటం మూలంగా. అపార్ట్మెంట్ల లో వారంతా వచ్చేసేరు, “మీరిలా మంట పెడితే పొగతో బాధ పడుతున్నా”మని దెబ్బలాటకొచ్చారు.” మీరంతా, మా స్థలం లో పోసిన చెత్త మంట పెట్టేము, మీ వైపు పొగ రావాలని మేమనుకోలేదు, గాలి అటువేస్తోంది, పొగ అటువచ్చింది, దానికి మా బాధ్యత లేద”న్నాం. “మీరు మంట పెట్టకూడద”న్నారు. “మా స్థలంలో మీరు చెత్తపోయక పోతే, మంట పెట్టే సమస్య లేదు. ఆర్పేస్తాం, చెత్త ఎత్తిస్తారా” అన్నాం. ఒకరూ సమాధానం చెప్పలేదు, మంట అలాగే కొనసాగించాం, “ఇక ముందూ ఇలాగే మంట పెద్డతాం, విసిగిపోయా చెప్పి, చెప్పి. మీరింకా అలాగే చెత్తపోస్తే మీ గుమ్మందగ్గరే మంట పెడతా”మని చెప్పేసేం కూడా, దగ్గు కుంటూ పోయారు, తప్పించి చెత్త పోయమన్న మాట ఒక్కరూ చెప్పలేదు. ఆహా, ఏమి వింత?పక్కవారికి ఇబ్బంది కలగచేస్తున్నామేమో అనే స్పృహ కూడా చచ్చిపోతూంది.

ఇదేమి అలవాటోగాని ప్రతి ఒకరూ చేతులూచుకుంటూ వెళతారు మార్కెటుకి. కూరల దగ్గరనుంచి నూనెతో సహా అన్ని సరుకులూ పేకింగ్ లో తెచ్చుకుంటారు. వాడేసిన వాటిని ఒక చోట భద్రపరచి చెత్త బండికి ఇవ్వరు, ఇలా వీధులలొ పోస్తారు, నీరు నిలవున్న చెత్తలో దోమలు కూడా పెరుగుతాయి, మమ్మలినేకాదు, మిమ్మలినీ కుడతాయని చెప్పినా వినిపించుకోరెందుకో తెలియదు. ఇలా చెప్పిన మమ్మల్ని పిచ్చి వాళ్ళలా చూస్తున్నారు, అపార్ట్మెంట్ లో ఉన్నవారంతా. అభిప్రాయభేదాలు, జగడాలుగా, ఆపై సిగపట్లుగా మారిపోతున్నాయి.

16 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-జగడం.

  1. చెత్త సంగతి బాగా చెప్పారు. ఇంగ్లండు లో చెత్త సంగతి :
    ఇక్కడ పెద్ద పెద్ద ప్లాస్టిక్ పీపాలలో చెత్త వేసి ఉంచితే , వారం లో ఒక రోజు ఒక పెద్ద లారీ లో ఆ చెత్తను పోసుకుని వెళుతూ ఉంటారు.వంట ఇంటి తొక్కులు , సీసాలూ , ప్లాస్టిక్ కవర్లు, ఇంకా న్యూస్ పేపర్లు లాంటివే లారీ లో తీసుకు పోవడానికి అర్హమైనవి. తోట లో చెత్త ఇంకో లారీ ఇంకో రోజు వస్తుంది.ఇక పెద్ద పెద్ద పాడయి పోయి ఉపయోగం లేని సామాను ను కారు లో రెండు మైళ్ళ దూరం లో ఒక ప్రత్యెక మైన స్థలం లో మనమే పారేయాలి. అక్కడి కి వెళితే చాంతాడంత క్యూ ఉంటుంది. అక్కడ ఇట్లాంటి చెత్త సామానును రీ సైక్లింగ్ కు పంపిస్తారు, మళ్ళీ వేరు చేసి.
    బంగ్లాదేశ్ లో ప్రపంచం లో ఉన్న ఒక ఓడ రేవు ను ప్రపంచం లోనే ఉన్న అతి పెద్ద చెత్త కుండీ ఉంది. ఈ ” చెత్త కుండీ ” ఓడ రేవు లో ప్రపంచం లో ని నలు మూలలనుంచీ పాడై పోయిన పడవలనూ , ఓడలనూ ఇక్కడ పడేస్తారు ! ఎందుకంటే , బంగ్లాదేశ్ లో ప్రజల కు అది జీవనాధారం, అదే విదేశాలలో అనారోగ్య హేతువు ( ఈ పడవలనూ , ఓడలనూ కరిగించే సమయం లో విడుదల విష వాయువులు , అనేక అనారోగ్యాలను కలిగిస్తాయి , పాశ్చాత్యులకు !? )
    పర్యావరణ కాలుష్యం ఈ చెత్త వల్ల కలిగే దీర్ఘ కాలిక పర్యవసానం అయితే , తాత్కాలికం గా కలిగే పరిణామం , చెత్త పేరుకు పొతే , అక్కడ దోమలు చేరడానికీ , ఈగలు చేరడానికీ , తద్వారా , వివిధ అంటు వ్యాధులనూ , మలేరియానూ , ఈ రోజుల్లో వస్తున్న డెంగూ ఫివర్ను కూడా కలిగించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి భారత దేశ ఉష్నోగ్రతలకు !
    ఇట్లాంటి శాస్త్రీయ మైన అవగాహన ఉండడం వల్లనే , ఇట్లాంటి చెత్త విషయాలను కూడా , అభివృద్ధి చెందిన దేశం అయిన ఇంగ్లండు కూడా ” చెత్త ” గా తీసి పారేయకుండా , సీరియస్ గా చెత్తను జాగ్రత్తగా పారవేసే బాధ్యతా, తగ్గించే బాధ్యతా ప్రజల మీద పెట్టింది. కొన్ని నగరాలలో , ఎక్కడ పడితే అక్కడ కనీసం చాక్లెట్ ర్యాపర్ పడేసినా , జుర్మానా కట్టాల్సిందే !

    మీ పరిసరాలలో చెత్త నిర్మూలనా కార్యం లో, మీ పొరుగు వారు ” కళ్ళు తెరుచు కుంటా రనీ ” , మీరు , ” విజయం చెందుతారనీ ( ?! ) ” కూడా ఆశిస్తున్నా !

    • @మిత్రులు సుధాకర్ గారు,
      విదేశాలలో చెత్త పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో, మీ వ్యాఖ్య తరవాత తెలిసింది, మన దేశం లో “చెబితే వినడు, కొడితే ఏడుస్తాడు” అన్నట్లు ఉంటుంది.
      ధన్యవాదాలు.

  2. వాళ్ళ అపార్ట్ మెంట్ కి ‘హెచ్ ఓ ఏ’ నో ఏదో ఉంటుంది కద బాబాయి గారు వాళ్ళతో మాట్లాడి చూడకపోయారా…ఇంకో సలహా ఆ అపార్ట్ మెంట్ లో పిల్లల్ని పిలిచి చెత్త వలన పెరిగే సమస్యలు చెప్తే (కొంచెం ఎక్కువ మోతాదులో) ఏమైనా మార్పు ఉంటుందేమో…నిన్న తెలుగు తరగతిలో పిల్లల్ని మన భారతీయ సినిమా గురించి అడిగితే వారు చెప్పిన సమాధానాలు విని వారి పరిణితి చూసి ఆశ్చర్యపోయాము. పెద్దల తల దించుకోవలసిన సమాధానాలు చెప్పారు. త్వరలో వాటి గురించో టపా పెడతాను.

    • @అమ్మాయ్ జ్యోతి,
      మన స్వతంత్ర భారత దేశంలో అలా పిల్లలని చేరదీసి చెపితే మరో కేసవుతుంది తల్లీ. చూదాం.

  3. ఎవరికీ వారు తమ ఇల్లు శుభ్రంగా ఉంటె చాలు అనుకోవడం వల్లనే ఈ చెత్త సమస్యలు వస్తూ ఉంటాయి. బుర్రలు డస్ట్ బిన్ మాదిరి అయినప్పుడు డస్ట్ బిన్ లు వాళ్ళకి గుర్తుకు రావు .. అంతే ! ఇలాంటి వారు మారరు.

  4. శర్మ గారు,

    ఓ చిట్కా చెబ్తాను ఈ సమస్య కి – ప్రయత్నించి చూడుడు! ఆల్ ది బెస్ట్!

    ఆ ఖాళీ స్థలం లో ఓ గుడి కట్టేయ్యండి. (చిన్న స్థల మైనా ఫర్లేదు, ఓ వినాయుకుడో, గాకుంటే ముక్కూ మొగం తెలీని ఏ స్వామీ గారి విగ్రహమో అయినా ఫర్లేదు, పెట్టి అక్కడ ఓ చెట్టు కొమ్మ పెట్టెయ్యండి. ఆ పై చెత్తా చెదారం జాన్తా నాయ్ !
    వరుసగా, ఓ ఇరవై ఒక్క రోజులు కర్పూరం వెలిగించి సాంబ్రాణీ పొగ పెట్టండి.

    మీ తక్దీర్ బాగుంటే, అక్కడ వెలిసిన స్వామీ వారి మహాత్మ్యం ఎక్కువై, మరో ప్రసిద్ధ తీర్థమై వెలిగినా వెలిగి పోవచ్చు. అంతా విష్ణు మాయ మీద ఆధార పడి ఉండును.

    (దేవుళ్ళు ఈ మాట వింటే, జిలేబీ ఇట్లా కూడా మమ్మల్ని ఉద్దరిస్తా ఉండావా అని మురిసి పోతారుస్మీ )

    జిలేబి.

    • @జిలేబి గారు,
      సలహా బాగుంది కాని, కన్నుపోయేటంత కాటుక పెట్టుకున్నట్లవుతుందేమో!
      ధన్యవాదాలు.

  5. జగడం గురించి చక్కగా వ్రాసారండి.

    మీరన్నట్లు, ఈ రోజుల్లో చాలామందిలో ……… పక్కవారికి ఇబ్బంది కలగచేస్తున్నామేమో అనే స్పృహ కూడా చచ్చిపోతూంది…….. అభిప్రాయభేదాలు, జగడాలుగా, ఆపై సిగపట్లుగా మారిపోతున్నాయి.

    మీ ఇంటి చుట్టుపక్కల గొప్ప సందడిగా …. ఉన్నట్లుంది. మీ ఎదురింటి వాళ్ళు చెత్త పొయ్యటం ఆపేస్తారో లేదో ? తరువాత ఏం జరుగుతుందో ? తరువాయి విషయాలను కూడా తెలియజేస్తారని ఆశిస్తూ…
    .
    ( మీ ఎదురింటి వారికి మీ బ్లాగ్ సంగతి తెలిస్తే చెత్త పొయ్యటం ఆపేస్తారేమోనండి .. )

    • @అనూరాధ గారు,
      ఇలా అరుస్తాం, కొన్నాళ్ళు మానేస్తారు, తరవాత మళ్ళీ మామూలే, వాళ్ళకి, మాకూ కూడా అలవాటయిపోయిందండి,స్వంత ఇల్లు ఎక్కడికిపొగలం? ఎంతయినా పొరుగువారు కదా, ఇంతకు మించి ఏం చేయడానికి మనసు అంగీకరించదు.ఇదే చాలా మొండి పని.
      ధన్యవాదాలు.

  6. ఏమో తాతగారు, మీ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ఏదీ తిరిగి ఉపయోగించలేని స్థితికి వచ్చేసాము కదా.

    • @ గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు గారు,
      ఈ పరిస్థితి ప్రమాదకరమని గుర్తించకపోతే, ఆచరణలోకి తెచ్చుకొకపోతే కష్టమే.
      ధన్యవాదాలు.

  7. మన దగ్గర ఉన్న దరిద్రమే ఇది.
    మార్పు మార్పు అని పెద్ద ఆందోళనలు చేస్తారు, కాని చిన్న చిన్న ఇలాంటి మార్పులే పెద్ద మార్పు కి దారితీస్తాయని తెలియదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s