శాంతి.
( మహాత్ముని వర్ధంతి సందర్భంగా)
శాంతి,సహనం అనేవి నేడు బ్రహ్మ పదార్ధాలయిపోయాయి. వ్యక్తులలో శాంతిలేదు, కుటుంబంలో,సమాజంలో, దేశంలో, ప్రపంచ దేశాల మధ్య శాంతిలేదు. ఎందుచేత? వ్యక్తి నిర్మాణం, సహనం లేక. పునాదిలేని భవనం నిలబడదు. ఇప్పుడు జరుతున్నదదే. వ్యక్తికి కావలసిన ప్రాధమికమైన, సత్యం,ధర్మం, శౌచం, శీలం, తృప్తి, మొదలయినవి లోపిస్తున్నాయి.వివాహ, కుటుంబ వ్యవస్థలు పాడవుతున్నాయి. విద్యా వ్యవస్థకే చెద పట్టింది. రామాయణ,భారతాలు మత గ్రంధాలయిపోయాయి.వాటిని చిన్నప్పటి నుంచి బోధించవద్దంటున్నారు. విద్యాలయాలు ఇప్పుడు పూర్తిగా కొంతమంది వ్యక్తుల, మాదక ద్రవ్యాల అడ్డాగా మారిపోతున్నాయి. కొంతమంది చేరి చదువుకునేవారిని వ్యక్తి నిర్మాణం ఉన్న వారిని చెడగొట్టే రోజులైపోయాయి. వ్యక్తి నిర్మాణం లేకపోతే సరి అయిన కుటుంబ నిర్మాణం లేదు. అటువంటి కుటుంబాల నిర్మాణం లేని దేశంలో ఆశాంతే ఉంటుంది. ఇప్పుడు అన్ని దేశాల వారూ ఐహిక సుఖాలలో మునిగి తేలాలనే అనుకుంటున్నారు తప్పించి, మరొకటి కనపడటం లేదు. ఐహిక సుఖాలకి అంతులేదని తెలిసిన భారత దేశంలో కూడా ఇప్పుడు పశ్చిమ దేశాల సంస్కృతి పట్ల ఆకర్షణ పెరిగిపోయింది. విచిత్రమేమంటే ఆ దేశాల వారు శాంతి గురించి భారతదేశం వైపు చూస్తుంటే మనవారు వారి సంస్కృతికై వెంపర్లాడుతున్నట్లే ఉంది. వ్యక్తుల నిర్మాణం సరిగాలేని కుటుంబంలో అశాంతి తాండవిస్తుంది. అటువంటి వ్యక్తులు తమకు తాముగా అభ్యున్నతి పొందలేరు, కుటుంబాన్ని కూడా ఉన్నతికి తీసుకు పోలేరు. శీల నిర్మాణం ఉన్నతంగా ఉన్న ఆడ, మగ వ్యక్తులు ఎక్కడున్నా చెడిపోరు, వారిని మరొకరు చెడకొట్టలేరు కూడా. చిన్నప్పటి నుంచి క్రమశిక్షణలో పెరిగినవారు, జీవితం లో ఓడిపోరు, ఒకవేళ తాత్కాలికంగా కొన్ని అడ్డంకులు, ఎదురు దెబ్బలు తగిలినా, చివరకు జీవితంలో ఉన్నతినే సాధిస్తారు.త్యాగరాజు ఏమన్నారు “శాంతము లేక సౌఖ్యము లేదు సారస దళనయనా”మనవారు శాంతికే శాంతి కావాలన్నారు. వేదం లో శాంతి పాఠం ఉంది.
టెలికంలో జె.ఇ గా పని చేస్తున్న రోజులు, ఇలా క్రమశిక్షణ లేని, సత్య ధర్మాలు పట్టించుకోని ఒకతను నా దగ్గర ఆపరేటర్ గా పని చేశాడు. అతను రోజూ తాగి ఉండేవాడు, ఉద్యోగసమయంలో కూడా, నేను ఆవూరు బదిలీ మీద వెళ్ళేటప్పటికి. ఇతనిని ఎవరూ సరి దిద్దటానికి కూడా ప్రయత్నం చేసినట్లుగా కూడా లేదు, కారణం ఇతని నోటికి భయపడి, బూతులు మాట్లాడేవాడు తాగి ఉండి. నేను చేరిన తరవాత చూశాను ఉద్యోగ సమయం లో కూడా తాగి ఉండేవాడు. ఒక రోజు పిలిచి కూచో పెట్టి నెమ్మదిగా చెప్పాను, తాగటం మంచి అలవాటు కాదు, ఉద్యోగ సమయంలో తాగి ఉండద్దూ అని. విన్నాడు, తల ఊపేడు, బయటకి వెళ్ళి కార్మిక నాయకులతో చెప్పేడు, వారు నా మీదకి యుద్దానికి వచ్చేరు. అతని వ్యక్తిగత విషయాలలో కల్పించుకుంటూన్నానని, అతనికి క్షమాపణ చెప్పాలని పట్టు బట్టేరు. సరే క్షమాపణ చెప్పేను. అంతతో ఆ కధ ముగిసింది, కాని ఒక రోజు అతను తాగి ఉద్యోగం నిర్వహిస్తున్నపుడు ఈ కార్మిక నాయకులని, అతని తోటి ఉద్యోగులను పిలిచి చెప్పేను, “అతను తాగి ఉన్నాడు,పని కుంటు పడుతూంది, ఫిర్యాదులొస్తున్నాయి, ఇప్పుడు నేను పోలీస్ సాయం తీసుకుని అతనిని గవర్ణమెంట్ హాస్పిటల్ కి పంపి తాగి ఉన్నట్లు సర్టిఫికెట్ తీసుకుని ముందు సస్పెండ్ చేయిస్తున్నాను, మీరేం చేస్తారో చేసుకో వచ్చని” చెప్పి, పోలీస్ మిత్రుడైన ఎస్.ఐ కి చెప్పేను, కార్మిక నాయకుల ఎదురుగానే, పది నిమిషాలలో ఎస్.ఐ నాదగ్గరున్నాడు, మిగిలిన కార్యక్రమం చేసేందుకు సిద్ధమవుతుండగా నాయకులొచ్చి కాళ్ళు పట్టుకుని, అతనిని తీసుకువచ్చి, ఇలా చేస్తే అతని ఉద్యోగం పోతుందని, ఇక ఎప్పుడూ ఉద్యోగంలో ఉండగా తాగనని చెప్పించి, నాకు క్షమాపణ చెప్పించి, తామిదివరలో చేసింది తప్పేనని చెప్పి, అతనిని పంపించేసేరు. నేను ఎస్. ఐ మిత్రునికి సద్ది చెప్పుకుని పంపేసేను. అది మొదలు అతను ఉద్యోగ సమయంలో తాగేవాడు కాదు, కాని ఈ తాగటం కోసం ఉద్యోగం ఎగకొట్టేవాడు, అప్పులూ చేసేవాడు. దానితో జీతం వచ్చేది కాదు, అతని భార్య ఆఫీసుకు వచ్చి చెప్పుకుని ఏడ్చేది, ఫిర్యాదిమ్మంటే మాత్రం ఇచ్చేది కాదు.. నాకు ఇతనితో విసుగొచ్చి, పని కుంటుపడుతూండటంతో,ఎప్పుడు ఉద్యోగానికి వస్తాడో, ఎప్పుడు రాడో, తెలియని అనిశ్చిత పరిస్థితులకి విసిగిపోయాను. పగలూ రాత్రీ ఎదో సమయంలో ఉద్యోగం చేయాల్సిన ఉద్యోగం, అతనిది. అప్పటిదాక ఉద్యోగ ధర్మం నిర్వర్తించినతన్ని పంపేందుకు ఇతను రావలిసి ఉంటే చెడ్డ ఇబ్బందిగా ఉండేది. పాపం ఇబ్బంది పడుతూ అతని ఉద్యోగ సమయం కూడా, అప్పటిదాకా పని చేసిన వారు, చేసేవారు, ఎందుకంటే ప్రజలకి ఇవ్వవలసిన సేవలు ఆగిపోతాయి. కుదరదు, ఎవరో ఒకరు పని చేయవలసిందే. అయినా ఎప్పుడు ఫిర్యాదు చేసేవారు కాదు, మిగిలిన వారు, అతని మూలంగా ఇబ్బంది పడినా. కాని నాకు ఫోన్ చేసి ఫలానా వ్యక్తి డ్యూటికి రావాలి రాలేదని చెప్పినపుడు,తానతని ఉద్యోగం చేస్తున్నట్లూ చెప్పినపుడు, నీవు చేతకాని వాడివని నిందించినట్లుగా ఉండేది, నాకు మటుకు. ఇలా ఎగకొడుతున్నందుకు అతని దగ్గరనుంచి సంజాయిషీ కోరుతూ మెమో ఇచ్చాను. అతనేదేదో చెప్పుకొచ్చాడు, నా మీద కూడా అభియోగాలు మోపాడు. నేను విసిగి నీ కర్మకి నేను కర్తని కాను, “నిన్ను బాగుచేయాలనే, నా ప్రయత్నం వ్యర్ధమనుకుని,” అతనికి ఒక సలహా లాటి ఉత్తరం ఇచ్చేశా, అందులో “నీవు ఇలా తాగుడు అలవాటుకు బానిస కావడం మూలంగా నీకెలా ఉందో తెలియదు కాని, ఆఫీసులో నాకు అశాంతిగా ఉంది,నీ తోటి ఉద్యోగులకి అశాంతిగా ఉంది, నీకుటుంబానికి అశాంతి గా ఉందని, నిన్ను వెనకేసుకొచ్చిన నాయకులు కూడా చెప్పేరు నాతో, నీవు నీ కుటుంబానికీ, దేశానికీ కూడా ఉపయోగపడలేకపోతున్నావని గుర్తించు” అని. ఈ లేఖ కాపీ ఆఫీసర్ గారికి పంపేను. ఆయన చూసి ఉంటారు, ఒక సందర్భం లో “మీరు అతని వ్యక్తిగత విషయాలలో కలగచేసుకున్నట్లవుతుందేమో ఆలోచించండి” అన్నారు. దానికి నేను “రూల్ ప్రకారంగా నేను అతని వ్యక్తి గత విషయం లో కలగ చేసుకో కూడదు, కాని అతను ఎవరికీ ఉపయోగపడక, ఆఖరికి తనకు తాను ఉపయోగపడకపోతున్నాడని ఒక ఆఫీసర్ గా అతని ప్రవర్తన మార్చుకోమని సలహా ఇచ్చాను తప్పించి మరేమీ కాద”న్నా. ఆ ప్రసంగం అలా ముగిసింది, ఆ తరవాత చాలా తక్కువ సమయంలో, అక్కడినుండి నేను అక్కడి నుంచి మరొక చోటికి బదిలీ మీద వెళ్ళేను. సంవత్సర కాలం తరవాత ఒక రోజు ఎవరో తెలిసిన వారితో మాటాడుతోంటే ఇతని మరణ వార్త తెలిసింది, నేను వెళ్ళిపోయిన తరవాత అతను మామూలయిపోయాడుట, రాత్రి పగలు తేడా లేక తాగి ఉండేవాడట, దానితో తెలియని తెగులు పట్టుకుని, వైద్యం చేయించుకోవడం అశ్రద్ధ చేసి, చనిపోయాడట, భార్య, ముగ్గురు పిల్లలున్న కుటుంబాన్ని ముఫై ఏళ్ళ వయసులో రోడ్డున పడేసి. అయ్యో! ఒక వ్యక్తి ఇలా అయ్యాడే అని విచారించాను, అతనిని మార్చలేకపోయిన నా అశక్తతని నిందించుకున్నా.
పువ్వుల చిత్రాలు బాగున్నాయండి.
……………………
మనకెందుకులే అని ఊరుకోకుండా మీ ప్రయత్నం మీరు చేసారండి. మంచి చెబుతుంటే వినకపోతే అది వారి ఖర్మ.
@అనూరాధ గారు,
అక్కడ ఉద్యోగ ధర్మం, రెండు పని కుంటుపడుతుండటం నేను కలగచేసుకోవలసి వచ్చిందనమాట.
పువ్వుల చిత్రాలు కడియం తోతలలో తీసినవి, చాలా ఉన్నాయి టపాతో పెడుతున్నా. నచ్చినందుకు సంతసం.
“తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు
తవిలి మృగతృష్ణలో నీరుద్రావవచ్చు
తిరిగి కుందేటికొమ్ము సాధింపవచ్చు
చేరి మూర్ఖుల మనసు రంజింపలేము!”
తెలిసినదే కదా తాత గారు.:(
ఫలితం ఏదైనా మీ బాధ్యతాయుతప్రయత్నం హర్షనీయం..ఆచరణీయం.:))
అలాగే ఫోటోలు బాగున్నాయి..:))
@అమ్మాయి ధాత్రి,
అక్కడ ఉద్యోగ ధర్మమే కాక మానవుడిగా కూడా స్పందించా, ఉడుకు రక్తం, అప్పటి నా వయసు నలభై,ఫోటో లు మొన్న కడియం వెళ్ళినపుడు తీసినవి చాలా ఉన్నాయి, అన్నీ ఒక సారి పెట్టలేక రోజూ పెడుతున్నా, నచ్చినందుకు ఆనందం
అందరినీ మనం మార్చడానికి కూర్చుంటే మనం ఉధ్యోగం మానెయ్యాలి కదా తాతగారు, ఈ విషయం గురించి త్వరలో ఒక టపా పెడతాను.
@అబ్బాయ్ ప్రసాదు,
నిన్నంత పేరుతో పిలవడం కష్టంగా ఉందయ్యా! అందుకు ప్రసాదు అంటున్నా కోపగించుకోవుకదూ!మనం అందరిని మార్చలేము, అందుకు పూనుకోవడం కూడా తప్పే, అయితే ఒక్కకప్పుడు మనకు తెలియకుండానే ఆ పనిలో పడిపోతాం, అదే చిక్కు.