శర్మ కాలక్షేపంకబుర్లు-ఎందుకలా?

ఎందులా?

ఒక రోజూ ఉదయం లేవగానే దంత ధావనం దగ్గరనుంచి ఏపని చెయ్యాలన్నా బద్ధకంగా ఉంది. కాలకృత్యాలు తీర్చుకుని కూచుంటే “స్నానం చెయ్యండి” అని ఇల్లాలంటే “వస్తున్నా” అనడమే కాని కదలకపోవడం చూసి “లేవండి” అని మరో సారి అంటే లేచి స్నానం అయిందనిపిస్తే, పూజ దగ్గర కూచుంటే గానుగెద్దులాగా మంత్రం ఉన్నచోటునుంచి కదలదు, రోజూ చేసేదయినా, నోటికే వచ్చి ఉన్నదయినా. ఏదో అయిందనిపించి,నైవేద్యం పెట్టేసి, నమస్కారం పెట్టేసి లేచి రావడం జరిగింది. పోనీ నామ పారయణ చేదామనుకుంటే అదీ నడవలేదు, కొద్ది సేపు తరవాత ఆగిపోయింది, ఏదో తెలియని నిర్లిప్తత. ఆ తరవాత ఎవరు పలకరించినా మాటాడాలనిపించలేదు, పుస్తకం తీసి చదువుదామంటే పంక్తి ముందుకు నడవలేదు. కళ్ళు ఉన్న చోట ఆగిపోయాయి. పోనీ శరీరం విశ్రాంతి కోరుతోందేమో అనుకుంటే నిద్రా పట్టదు. అలాగని ఏదయినా సమస్యను మనసు ఆలోచిస్తోందా అనుకుంటే కొత్తగా వచ్చిన సమస్యా లేదు. పాత సమస్య కెలకవేయచ్చు, అదేనా ఉందేమో ననుకుంటే అదీ లేదు. “ఎవరిగురించయినా బెంగ పెట్టుకున్నానా?” అంటే “ఈ మధ్య ఒక నిర్ణయం తీసుకున్నా అమలు చేస్తున్నా కూడా ఎవరి గురించీ ఆలోచించటం లేదు, బెంగా లేదు, ఒకప్పుడు ఆదుర్దా పడేవాడిని, అదీ మానేశాను కదా, పోనీ టపా రాద్దామని మొదలెడితే అసలదీ నడవలేదు. కూచో బుద్ధి కాదు, నడవబుద్ధి, పడుకోబుద్ధి కాదు. ఏదో అశాంతి, కారణం మాత్రం కనపడదు.

ఈ సందర్భంలో నన్ను గమనిస్తున్నట్లుంది, ఇల్లాలు ఒక కాఫీ గ్లాసు తను తెచ్చుకుని, దగ్గర కూచుని తాగుతూ మరొక గ్లాసుతో కాఫీ ఇచ్చి నెమ్మదిగా మొదలెట్టింది. “ఏమయింది? అలా ఉన్నారేం” తో ప్రారంభించింది. “ఏంలేదు” అంటే “మరి అలా కూచున్నారేం? హుషారుగాలేరు, ఏమయింది? ఏదయినా సమస్యా? అనారోగ్యమా?” అని ఒంటి మీద చెయ్యేసి చూసి “బానే ఉంది, ఏంటి ఇబ్బంది” అని ప్రశ్నించింది తరచి తరచి. “నాకయితే ఏ సమస్యా కనపడటంలేదు, కొత్తది కాని పాతది కాని. నా మనస్సూ ఏదీ ఆలోచించటం లేదు. సంకల్పమూ లేదు, వికల్పమూ లేదు” అన్నా. “మీకు తెలియకనే ఏదో విషయం మీద మీ మనస్సు లగ్నమైపోయి ఉంటుంది. కాని మీరు గుర్తించలేకపోతున్నారంతే”. “అదేం కాదనుకుంటానోయ్” అన్నా. “అందరం చెప్పేదే అది. ఎవరేమైనా అన్నారా? మీ మనసు బాధ పెట్టేరా? ఎవరితోనయినా దెబ్బలాడేరా? సాధారణంగా దెబ్బలాటకి వెళ్ళరే నాకు తెలిసి, ఎందుకు ఆలోచిస్తున్నారు. జరిగిపోయినదేదీ తిరిగిరాదు, జరగనున్నది మన చేతిలోనూ లేదు పూర్తిగా. మన మనసు మంచిదయితే మనకు మంచే జరుగుతుంది. ఒక వేళ మనకు వ్యతిరేకంగా ఏమయినా జరిగితే అది భగవంతుని కల్పన అలా ఉన్నదనుకుందాం. మనం కావాలని మనసా వాచా కర్మణా తప్పు చేయం కదా? ఒక వేళ మనకు తెలియక తప్పు జరిగిపోతే మనవల్ల, దానిని మనం వెనక్కు తీసుకోగలిగితే మంచిదే. తీసుకోలేకపోతే మనం చేయగలదీ ఉండదు. అలా జరగాల్సి ఉంది జరిగింది అంతే. కాసేపు పడుకోండి. లేదూ ఏదయినా మీకు ఉత్సాహం కలిగే పని చేయండి. మీకు నచ్చిన పుస్తకం చదువుకోండి” అని ఎన్నో చెప్పింది. “అవన్నీ ప్రయత్నం చేశా కాని ఎందుకో నిస్పృహ గా ఉందంటే”. “ఏమీ బాధ పడకండి దేని గురించీ ఆలోచించకండి” అని దగ్గర కూచుని చేతిలో చెయ్యి వేసి రాస్తూ “ఏదో బాధ, ఒక్కొకప్పుడు ఇలాగే బాధపెడుతుంది. మీరయితే ఏదో పద్యమో, ఏదో చెబుతారు, మరినేను చదువుకోలేదుగా మరి పద్యాలు రావు” అని ఓదార్పు మాటలు పలుకుతూ, “భర్తకు భార్య, భార్యకు భర్త సుఖ స్థానాలు. ఒకరిని ఒకరు అర్ధమూ చేసుకోవాలి, లాలించాలి, బుజ్జగించాలి, కోపగించాలి, అలగాలి, జీవితంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాం? ఎప్పుడూ కష్టాలకు బాధ పడలేదే, మనకు కష్టాలే చుట్టాలు కదా! ఎప్పుడూ ధైర్యం వదల లేదే! ఇప్పుడు మాత్రం ఎందుకు వదిలెయ్యాలి? ధైర్యంగా బతకడమే మనకు అలవాటు, మీరు పిరికివారు కాదు, మనకు పిరికితనం లేదు, ఎప్పుడు రాదు, రండి ఒక సారి అలా మొక్కల్లో తిరిగొద్దా”మని చెయ్యిపట్టుకు తీసుకుపోయింది.

కరణేషు మంత్రి అంటే ఇదేనా?

అసలు ఇలా ఎందుకు జరుగుతుందీ!

15 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఎందుకలా?

 1. మీ మనవరాలు తో సరదాగా కబుర్లు చెప్పండి తాత గారు అంతా మాములుగా అవుతుంది.
  మీ దగ్గరే కాదు మామ్మ గారి దగ్గర కూడా చాలా విషయాలు నేర్చుకోవాలి.

  • @అమ్మాయ్ కల్యాణి,
   తెనుగులో బాగా రాస్తున్నావమ్మా.
   నిజమేనమ్మా! కాని మనవరాలు బళ్ళోకెళ్ళిపోతుందే! అమ్మో! మీ మామ్మ చదువుకోలేదు కాని, చదువుకుని ఉంటే. నేర్చుకోవలసినవి చాలానే ఉన్నాయి మీ మామ్మగారి దగ్గర.
   ధన్యవాదాలు.

 2. అబ్బా,

  ఇంత ఆలోచించాలా? ఓ పెగ్గుడు మందు కొట్టి నిద్దురోతే మర్నాడు అంతా మామూలు అయిపోతాది! (ఆకాశ రామన్న గారి ‘అవిడియా’ కొంత పొడిగింపు మాత్రమే ! ఇందులో జిలేబీ ప్రమేయము ఏమీ లేదు !)

  జిలేబి.

  • @జిలేబి గారు,
   కొంతమందిలో మీరు చెప్పినది కూడా నిజమే. ఈ పరిస్థితినుంచి బయట పడటానికి, వారి వారి సంస్కృతిని బట్టి ఉంటుంది, ప్రతిక్రియ.
   నేను అలా చేస్తే తిన్నగా స్వర్గానికి చీటీయే 🙂
   ధన్యవాదాలు.

  • @వర్మ గారు,
   ఈ స్థితి నుంచి బయట పడటానికి తప్పించి తరవాత కారణాలు వెతుక్కోనక్కర లేదు.
   ధన్యవాదాలు.

 3. * కొన్నిసార్లు , ఇలా నిర్లిప్తంగా అనిపించటం అనేది అందరికీ ఎదురయ్యే సమస్యేనండి.. దాని గురించి ఎక్కువగా వర్రీ అవకూడదు. నిదానంగా అన్నీ సర్దుకుంటాయి.

  * అయితే, కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు కూడా ఇలా చిరాకుగా అనిపిస్తుంది. మీ ఇరుగుపొరుగు వాళ్ళు ఇంటి ముందు చెత్త పోస్తున్నారన్నారు. ఆ సమస్య వల్ల మీ మనస్సు చికాకుగా అయి ఉంటుంది. ఇలాంటి ఇరుగుపొరుగు వాళ్ళతో చాలా ఇబ్బందిగా ఉంటుంది.

  * మేడం చక్కటి విషయాలను తెలియజేసారు.

  • @అనూరాధ గారు,
   కంగారు పడవలసినది కాదు. ఇలా ఎక్కువ కాలం మాత్రం ఉండకూడదు.కారణాలు తెలియవు, ఇలా అవడానికి, మనమటుకు.
   మేడం గారు చదువుకోని మనస్తత్వశాస్త్రవేత్త 🙂 చదువుకుని ఉంటే ఎలా ఉండేదో 🙂
   ధన్యవాదాలు.

   • సర్ ! నన్ను గారు అని సంబోధించవద్దండి. ఈ విషయం ఎప్పటినుంచో చెబుదామనుకుంటున్నాను.

 4. పెద్ద మెదడు లోని రసాయనిక మార్పులు,
  ఒకొక్కసారి ఇలాగే ఇబ్బందికి గురి చేస్తాయి.
  దానికి మీశ్రీ మతి గారి చిట్కా సరిగ్గా సరిపోయి ఉండాలి.
  మీ రచన నా మనస్సులో హత్తుకుంది
  ధన్యవాదాలు.

  • @మోహన్జీ,
   మీరు చెప్పినది నిజం, నా విషయంలో అదే జరిగింది. కాసేపు మొక్కలలో కబుర్లు చెప్పుకుంటూ తిరిగితే మామూలయ్యా!మీరు బాగానే ఊహించారు.
   ధన్యవాదాలు.

  • @అబ్బాయ్ ప్రసాదు,
   ఇది అలా వదిలేయక్కరలేదు, తొందరగానే మరల మామూలు కావచ్చు,అది వ్యక్తి సంస్కృతిని బట్టి ఉంటుంది, ఒక్కొకరికి ఒక్కొకలా.
   ధన్యవాదాలు.

 5. మనసు hang అయినపుడు మనకు ఇష్టమయిన వంటలు ఏమిటి అని ఆలోచించాలి .అపుడు ఎదో ఒక వంటకం మీద మనసు focus అవుతుంది .దానిని అర్జెంటు గా తినాలి .కొన్ని సార్లు ఎదో ఒక హోటల్ లో వంటకం గాని చిరు తిండి గాని అవోచు .తినిన తరువాత system(mind) restart అవుతుంది .

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s