శర్మ కాలక్షేపంకబుర్లు-బ్లాగ్ బేటీ

బ్లాగ్ బేటీ

పోతనగారు “కర్ణాట కిరాత కీచకులకమ్మ త్రిశుద్ధిగ నమ్ము” భారతీ అని సరస్వతీ దేవిని వేడుకున్నాడు. తను అనుకున్నట్లుగానే శ్రీరామచంద్రునకే అంకితమిచ్చాడు. బ్లాగుల్లో రాసే నాలాటివాడు, ఎవరికీ అంకితాలివ్వక్కరలేదు.  సాధారణంగా బ్లాగు రాసే నేను చికాకు, కోపం (ఎవరిమీదో తెలియదు), విసుగుతో బ్లాగు రాయడం మానేస్తానని బెదిరిస్తూ ఉంటే, పాపం కొంత మంది, వీడెక్కడ ఆరోగ్యం చెడకొట్టుకుంటాడో, ఈ పాపం మనకెందుకనుకుని నాలుగు కామెంట్లు టపటపా రాల్చేస్తే, మళ్ళీ కొంత కాలం ఆ కామెంట్ల ఆక్సిజన్ మీద బతికేస్తూ, మళ్ళీ బుర్ర తినెయ్యడం మొదలెడతాననమాట. 🙂  ఐతే బ్లాగు మూసేస్తానన్న మాటే వినపడింది, నాలాటి వారు కొందరు కూడా అనగా, కాని బ్లాగు తీసేస్తానన్న మాట మొన్ననే చూశా, ఒకరి బ్లాగులో, వారేమో ఇంగ్లీషులో రాశారది, నాకయితే అర్ధం అలా అయింది, మరి. బ్లాగ్ ప్రపంచంలో ఇది కొత్త మాటే అనుకుంటున్నా.

అసలు బ్లాగులు 2005,2006 సంవత్సరాలలో తెనుగులో మొదలెట్టేరని చెబుతున్నారు.నేను బ్లాగులలోకొచ్చినది 2011 సెప్టెంబర్లో. కొంచెం ఇంచుమించుగా ఇప్పుడు తెనుగులో బ్లాగులో రాస్తున్నవారంతా మొదటి తరం వారేనని నా ఊహ. బ్లాగు మూసెయ్యడానికి తీసెయ్యడానికి తేడా ఏంటీ అని అలోచిస్తే మూసెయ్యడమంటే రాయడం మానెయ్యడం. తీసెయ్యడమంటే మొత్తం బ్లాగునే డిలీట్ చెయ్యడం, కావలసినవేవో కొన్ని తీసేసుకుని, అంటే ఆ తరవాత ఆ బ్లాగు గురించిన సమాచారం ఏదీ దొరకదు. ఇంతకాలం రాసిన విషయాలన్నీ పోతాయి. రాసేవన్నీ అందరికీ నచ్చాలనే రాస్తారంతా. కాని లోకో భిన్న రుచిః, ఎవరికి నచ్చినవి వారు రాసుకుంటూ ఉంటారు, అవి నచ్చినవారు కొంతమంది చదువుతూ ఉంటారు, వ్యాఖ్యలూ పెడుతుంటారు. ఐతే ఎక్కువ మందికి ఇష్టమైనట్లుగా రాయడం అందరివల్లా అవుతుందా? కాదు కనక, ఈ నిస్పృహలో పడకూడదని నాఉద్దేశం. చెప్పడం ఏదయినా సులువే, ఆచరణ కష్టం. ఆ టపా చూసి వారికి ఒక సూచన చేశా, అక్కడికి నేనేదో పెద్ద తెలిసినవాడిలాగా 🙂 వారేమో బాగా చదువుకున్నవారు, సీనియర్ బ్లాగర్ కూడా, ఈ సలహా కూడా హనుమంతుని ముందు కుప్పిగంతుల లాటిదే. “హం తుం ఏక్ కమరేమే బంద్ హో ఔర్ చాబీ ఖో జాయ్! ఇలాగా చేద్దామనుకుంటున్నా నేనూ” అని. అంటే పాస్ వర్డ్ మార్చేసి మరిచిపోవడం. సాధ్యమా? ప్రయత్నించాలి. మరో పెళ్ళి కుదిరినపుడు ప్రియురాలేం చెబుతుంది “కృష్ణా నన్ను మరిచిపో” అనటం లేదూ? ఎన్ని సినిమాలలో ఈ డయలాగు ఎన్నేళ్ళు విన్నానూ! ఇప్పటికీ బుల్లితెర మీద రోజుకి ఒకసారేనా వింటూనే ఉన్నా. బ్లాగ్ ని తీసెయ్యడమంటే నాకు గబుక్కున గుర్తొచ్చినది భ్రూణ హత్య, అందులోనూ ఆడపిల్లను. ఇదేదో వారిని విమర్శించడానికి రాయలేదు సుమా! బ్లాగు తీసెయ్యాలన్నటువంటి ఆలోచనలూ వస్తాయి, ఇది సహజం కూడా, నాకూ వచ్చాయి కనక స్వానుభవం మీద చెబుతున్నా . మనం బ్లాగులను ఎవరికీ అంకితాలివ్వకరలేదు, కనక బాధ లేదు.

“ఈ” లోకం ఉన్నంత కాలం ఇవి ఉంటాయా? చేతనలో లేనివి ఏమవుతాయి?. వాటిని కొంత కాలం తరవాత హోస్ట్ కంపెనీ డిలీట్ చేస్తుందా? ఒక వేళ హటాత్తుగా ఒక వ్యక్తి కాలం చేస్తే, అతనికున్న ఈ మెయిల్ నుంచి బ్లాగులు వగైరాలు ఆ తరవాతేమవుతాయి? ఇది కూడా ఆలోచించాను. అందుకే ఒక ఏర్పాటు కూడా చేశా, దీని గురించి కూడా. ఇది మేధో హక్కులకు సంబంధించినది కనుక, వీటికి విలువ ఎంతవుంది, లేదు అనేదానికంటే, ఆ వ్యక్తిని, వ్యక్తిత్వాన్ని అతని రాతలలో ఎంతో కొంతవరకు అంచనా వేయచ్చు కనక వీటిని ఉంచుకోవడం అవసరంఆనే తలుస్తా. అదీగాక నచ్చినవాటిని కొన్ని “ఈ” పుస్తకం చేయించుకుని దాచుకుంటే ఆ తరవాత మనం చదువుకోవచ్చు, పాత డయరీలాగా. లేదూ మన కుటుంబం లో మనమంటే ఇష్టపడే వారు ఎవరేనా దీని భద్రపరచుకుని ముందు తరాలకూ అందించవచ్చు, పాత ఫోటోలలాగా. నేనయితే ఈ విషయంలో ఒక విల్లు కూడా రాశానంటే నవ్వద్దు, నిజం నమ్మండి. పాస్ వర్డ్ లు అన్నీ ఎప్పటికప్పుడు మారుస్తున్నా వాటిని కూడా విల్లు లో రోజువారీని మార్పు చేస్తాను, పాస్ వర్డ్ మార్చిన వెంఠనే. ఏమేమి నాకు సంబంధించినవీ, రాశాను, వాటిని ఎవరు స్వాధీనం చేసుకోవలసినదీ రాశాను. నా తదనంతరం నా బ్లాగులో నేను కాలం చేసిన రోజున, ఆ విషయం ప్రచురించమని కూడా రాశాను. ఇదేమి పిచ్చా అని అడగచ్చు, అవును ఇదో రకం పిచ్చే, నేను పిచ్చి వాణ్ణని ఒప్పుకుంటున్నా.

ఈ భారత దేశంలో జన్మించినందుకు గర్విస్తా, గోదావరీ తీరాన జన్మించడం గొప్ప అదృష్టమని తలుస్తాను. మళ్ళీ పుడతాను, నాకు నమ్మకమే, మళ్ళీ ఈ గడ్డ మీదే పుడతా, గోదావరీ తీరానే పుడతా, నాకైతే పూర్తి నమ్మకం. జంతూనాం నర జన్మ దుర్లభం అన్నారు శంకరులు.మానవునిగా పుట్టడం అదృష్టం, ఆ తరవాత పురుషుడిగా పుట్టడం మరొక అదృష్టమన్నారు. ఆ తరవాత సత్వగుణ ప్రధానుడై పుట్టడం మరో అదృష్టం, భూమి పై, భరత వర్షంలో, భరత ఖండంలో, మేరువు దక్షణ భాగంలో గంగా గోదావరీ మధ్య గోదావరి తీరాన మళ్ళీ మరో తెలివైన తల్లి కడుపున పుట్టాలని నాకోరిక, వింతగా ఉందా? వింత, ఆశ్చర్యం, పడక్కర లేదు. తప్పక, మళ్ళీ ఇక్కడే, మరో తెలివయిన తల్లి కడుపున పుడతా. ఈ జన్మ తల్లికి నమస్కారం, మరు జన్మ తల్లికి కూడా ఇప్పుడే నమస్కారం, ఈ జన్మలోనే. ఆ తల్లి సంస్కారం కావాలని, రావాలని నా కోరిక. మరు జన్మలో పది మందికి అనగా సమాజానికి ఉపయోగపడే పనులు చేయగల తెలివితేటలిచ్చే తల్లి కడుపున జన్మించాలని కోరిక. అదేంటి తల్లి తెలిఅయినదయితే చాలా? అవును, అవును, అవును వక్కాణించి చెబుతున్నా తెలివయిన తల్లి బిడ్డ తెలివయినవాడే అవాలి, అవుతాడని నా నమ్మకం, నేనలాగే పుడతా, ఏ మనవారలు కడుపునయినా పుడతానేమో! 🙂 మళ్ళీ, మళ్ళీ ఆరు సార్లు ఇక్కడే, ఆ తరవాతే సాయుజ్యం. నేడు భారతదేశానికి కావలసినది తెలివయిన, ధైర్య శాలులైన తల్లులు, పిరికి వాళ్ళు మాత్రం కాదు. ఇది నేను నమ్మిన నిజం.అందుకని ఆడపిల్లలను అశ్రద్ధ చేయద్దు, బ్లాగ్ కూడా కుమార్తెతో సమానమయినదే.

నా బ్లాగ్ బేటీని  అనాధలా మాత్రం వదిలెయ్యను.

ప్రకటనలు

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-బ్లాగ్ బేటీ

 1. ‘బాలా’ కుమారి
  బ్లాగు హమారీ !
  వాహ్ వాహ్ బేటీ
  బడే మియా బాత్ !

  మా బ్లాగు ‘భ్రమణం’ ‘మది’ భ్రమణం !
  మా బ్లాగు తిరుపుర ‘గోదారి సుందరి !

  జిలేబి.

 2. బ్లాగుల ప్రాముఖ్యత గురించి అందరూ ఆలోచించే విధంగా వ్రాశారు.

  మీరు మరెన్నో చక్కని టపాలను అందించాలని, అందిస్తారని ఆశిస్తున్నానండి.

 3. మీరు వ్రసినది మాకు అర్ధం అయినట్టు మేము మా Blog లో ఉంచుతాం, నేను మొట్టమొదట తెలుగులో ౨౦౦౫ లో వ్రాసాను. కానీ అది ఇప్పుడు తీసేసాను ఎందుకంటే అప్పట్లో చిత్రాలు పిచ్చితో వాటి గురించి వ్రాద్దాం అని మాత్రమే మొదలు పెట్టాను తరువాత అర్ధం అయ్యింది మనకి చిత్ర ప్రపంచం అబద్దాలు అని.

  • @అబ్బాయి ప్రసాదు,
   బ్లాగు తీసేయడం పొరపాటని గుర్తించేరు కదా! అప్పటి మీ మానసిక స్థితిని మీరు ఇప్పుడు ఆ బ్లాగు లో చూసుకుని నవ్వుకునేవారు, ఉండి ఉంటే.. మీ పాత టపాలే చదవండి, ఒకోసారి ఇది నేనే రాశానా అన్నంత అద్భుతంగాను, కొన్ని ఇదేంటీ ఇంత చెత్తగా రాశానూ అని కూడా అనిపిస్తాయి. ప్రయత్నించి చూడండి.
   ధన్యవాదాలు

   • మీరు అన్నది నిజమే, నేను వ్రాసిన టపా రెండు సార్లు చదివితే రెండు విభిన్న అనుభవాలు, మూడవ సారి చదివితే తీసెయ్యాలా నాల్గవసారి చదివినప్పుడు నేను తప్ప ఇంకెవరూ చదవట్లేదు అని అభిప్రాయం, ఐదవసారి చదివితే అందరికీ పనికి వస్తుంది, ఆరవసారి చదివితే అందరికీ తెలిసినదే వ్రాసాను అనే అభిప్రాయం ఇంకొక్క సారి చదివే సమయం లేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s