శర్మ కాలక్షేపంకబుర్లు-అర్థం (సంపద)

 అర్థం ( సంపద)

అర్థం  అంటే ధనం, సంపద ఈ అర్ధంలో మాటాడుకుందాం.శంకరులు కనకధారా స్తవం చెప్పి బంగారు ఉసిరికాయలు కురిపించి పేదరాలి దరిద్రం వదిలించారు. మరి అదే శంకరులు “అర్ధమనర్దం” అనీ అన్నారు. ఇదేమి, విరుద్ధ భావాలు వెలిబుచ్చారనిపించచ్చు. కాని ఇక్కడ అర్ధం చేసుకోవలసినది, శంకరులు సంపద కూడబెట్టి నిలువ పెట్టడాన్ని నిరసించారు తప్పించి, సంపదను నిరసించలేదు. అదీకాక, ఏ వయసులో ఏది చేస్తారో చెప్పేరు,అంటే ఏంచెయ్యాలో చెప్పక చెప్పేరు. వయసులో, వృద్ధాప్యంలో కూడా ధనేషణ పోవడం లేదు, దానిని వదలుకో, “భజగోవిందం” అన్నారు.

సుమతీ శతకకారుడేమన్నాడు.

ఎప్పుడు సంపదగల్గిన
అప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్
తెప్పలుగ చెరువు నిండిన
కప్పలు పదివేలు చేరు కదరా సుమతీ!

సంపద కలిగితే బంధువులు పుట్టుకొస్తారు, కొత్త, కొత్త వారు. పుట్టుకొచ్చిన వారంతా చుట్టాలూ కాదు, ఇప్పుడు ముఖపుస్తకం లో లైకులుకొట్టిన వారు, జై కొట్టినవారు కష్టమొస్తే కనపడరు. కష్టమొచ్చినా, సుఖమొచ్చినా వదలని వారే అసలు బంధువులు, వారే ఆత్మ బంధువులు, సిరి, సంపద, మన ఖ్యాతి దేనినీ కోరరు, వారు.   చిత్రంగా మనం వారినే దూరం చేసుకుంటూ ఉంటాం. మన చుట్టూ చేరి జైకొట్టేవాళ్ళంతా, పొగిడేవాళ్ళంతా మనవాళ్ళు కాదు సుమా! గుర్తించండి. సంపద కలిగితే దానం చేయాలి, కనపడిన ప్రతివాడికి దానం చెయ్యకూడదు. అపాత్రదానం అసలు పనికిరాదన్నారు, భీష్ములు.  మరి ఎవరికి దానమివ్వాలి? మనం వెతుక్కుని అయినా వెళ్ళి దానమివ్వవలసినవారు సాత్వికులైన వారు, సత్వ గుణ ప్రధానులు, వారికిచ్చిన సంపద సత్వగుణ ప్రచోదనానికే వినియోగింపబడి, మనకు ఫలితం సిద్ధిస్తుందన్నారు.

డబ్బుకి మూడు స్థితులు, స్వానుభవం, దానం, నాశనం. స్వానుభవం మూలంగా ఇహంలో సుఖపడతామనుకుంటాం. దానం మూలంగా పరలోకంలో, మరుజన్మ లో కలిగినవారమవుతామని నమ్ముతాం.ఇక మూడవది నాశనం, ఇది ఎలా జరుగుతుంది? ప్రభువు పట్టుకుపోవడం, దొంగలు దోచుకుపోవడం, దాయాదులు ఊడపెరుక్కుపోవడం, కన్న బిడ్డలే దౌర్జన్యంగా పట్టుకుపోవడం జరుగుతుంది. అందుచేత ఆమొదటి రెండిటిలో మొదటిదానికి కొంత, రెండవదానికి కొంత సొమ్ము కేటాయించుకుని ఖర్చుచేసుకోవడం ఉత్తమం. డబ్బు పాపిష్టిది అంటారు, తప్పు, డబ్బు వినియోగించుకోవడం చేతకాని వారనేమాటది. డబ్బు సంపాదించి, తను అనుభవించక, ఇతరులకూ పెట్టని వాడు గడ్డిమేటి దగ్గర కుక్కలాటివాడు. గడ్డిమేటి దగ్గరున్న కుక్క తను తినదు, తినగలిగిన ఎద్దును తిననివ్వదు. నిష్ప్రయోజనం.

అర్ధం చతుర్విధ పురుషార్ధాలలో రెండవది. ధర్మ మార్గంలో అర్ధాన్ని సంపాదించాలి, దర్మమైన కోరికను, ఈ అర్ధంతో నెరవేర్చుకోవాలి, అప్పుడు కలిగేది అసలు సుఖం. కాని నేడు ఎలాగయినా సంపాదించడమే ధ్యేయంగా కనపడుతోంది. ఇలా సంపాదించడం మూలంగా మిగిలేది వ్యధ మాత్రమే.

ఒక చిన్న సంఘటన ఏభై ఏళ్ళనాటిది, టెలిఫోన్ ఆపరేటర్ గా ఉద్యోగంలో చేరిన తొలిరోజులు. ఆప్పుడు పి.ఎల్ 480 కింద అమెరికా నుంచి ఆహారధాన్యాలు దిగుమతి చేసుకుంటున్న రోజులు. ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకి కూడా బియ్యం తరలించాలంటే పర్మిట్ అవసరమయిన రోజులు. నేను ఉద్యోగం చేసే వూళ్ళో ఒక చెక్ పోస్ట్ ఉండేది. రాత్రిపూట తూగోజి నుంచి, అందునా నేను పని చేసే వూరునుంచి రోజూ పాతిక లారీల బియ్యం తరలేవి, పక్కనున్న విశాఖ జిల్లాకి.  కాని నాలుగు లారీలకే పర్మిట్ ఉండేది. మిగిలినవి చెక్ పోస్ట్ లో లంచమిచ్చి పంపేవారు. చెక్ పోస్టులో ఒక అధికారి, లారీకి ఆ రోజులలో వంద రూపాయల లంచంతో వదిలేసేవాడు. ఒక పర్మిట్ మీద నాలుగు లారీల సరకు తరలేది. ఈ చెక్ పోస్ట్ మా ఆఫీసుకు దగ్గరగా ఉండేది. రాత్రి పూట ప్రతి మిల్లునుంచి ఇతనికి ఫోన్ లూ వచ్చేవి. అలా విషయం, మాకు కొంత కాలానికి తెలిసింది. ఆరోజులలో ప్రొహిబిషన్ ఉండేది. మందు దొరకడమే కష్టంగా ఉండేది. ఇతనికి మాత్రం మిల్లర్లు మందు రోజూ పంపేవారు. ఇతనితో మా వాళ్ళకి పరిచయం పెరగడంతో మా వాళ్ళు కూడా మందులో పాల్గొనేవారు. ఇది అలవాటయి ఒక రొజు నేను ఉద్యోగం లో ఉండగా, మందు పంపేసేడు. వివరం తెలుసుకుని తెచ్చినవాని చేత తిరిగి వెనక్కి పంపేసి, నేను ఉండగా ఎప్పుడూ ఇలా పంపవద్దని చెప్పేను. నిజం చెప్పాలంటే అప్పటికి నాకు మందు అలవాటు ఉన్నది. అయినా ఎందుకో అతనిచ్చినది తాగాలనికాని, ఉద్యోగంలో ఉండగా తాగటం కాని ఇష్టం లేకపోయింది. ఆ పల్లెలో ఆ అర్ధరాత్రి నేను తాగినా పట్టుకునేవారూ లేరు, శిక్షించేవారూ లేరు. కాని నాకు తాగాలనిపించలేదు. ఇలా ఆ అధికారి సంపాదన రోజుకు 2500 ఉండేది, ఒక్కడే అనుభవించేవాడు కాదనుకుంటా, వాటాలుండేవి. ఆ రోజులలో బియ్యం బస్తా ఖరీదు 35 నుండి 50 ఉండేది. పక్క జిల్లాలో ఆ బియ్యంబస్తా120 నుంచి 150 అమ్మేది. నా జీతం 120 రూపాయలు. ఇలా అతను రెండు సంవత్సరాలు ఉద్యోగం అక్కడ చేసి మరొక చోటికి వెళ్ళిపోయాడు. నేనూ మరచాను.

మూడేళ్ళ తరవాత,నేను ఇంకా అక్కడే ఉద్యోగం చేస్తుండగా, ఒక రోజు బస్ స్టాండులో ఎవరో నన్ను పేరు పెట్టిపిలిచారు, పిలిచిన వ్యక్తి నా దగ్గరకొచ్చేడు, బక్క పలచని మనిషి, కళ్ళు పీక్కుపోయి బిచ్చగాడిలా ఉన్నాడు. తనని తను పరిచయం చేసుకుని, ఫలానా అని గుర్తుచేసేడు. అప్పుడు కాని గుర్తుపట్టలేకపోయా. “ఏంటి ఇలా అయ్యారు? ఏమయ్యిందని” ప్రశ్నల వర్షం కురిపించా. ఆయన మాటాడే స్థితిలో కూడా లేడు, నీరసంతో. ” భోజనం చేశారా?” అంటే మౌనంగా ఉండి పోయాడు, భోజన సమయం కాదు కనక, అతనిని పక్కనే ఉన్న హోటల్ కి తీసుకెళ్ళి టిపిన్ ఇప్పించా, నేను కూడా తిన్నా,కొద్దిగా, అతనికొకడికే ఇప్పిస్తే తినడని. ఆవురావురుమంటూ తిన్నాడు, మరొకటి, మరొకటి తెప్పించి, తినిపించా. నేను బిల్లిచ్చిన తరవాత బయటికొచ్చాం, ఖాళీ ప్రదేశం లో నిలబడితే చెప్పుకొచ్చాడు, “రెండురోజులయింది భోజనం చేసి, ఇక్కడి నుంచి వెళ్ళిన సంవత్సరం తరవాత భార్య అకారణంగా కాలం చేసింది, ఉద్యోగం చెట్టెక్కింది, లంచాల మూలంగా. కేస్ కి డబ్బులు ఖర్చు తప్పలేదు. సరిఅయిన ఆలనా పాలనా లేక కూతురు, ఎవరితోనో లేచిపోయింది,ఇంట్లో ఉన్న సొమ్ము,బంగారం తీసుకుని.  కొడుకు తాగుబోతయి, ఉన్న సొమ్ము లాక్కున్నాడు. ఇప్పుడు తిండికి గడవడమే కష్టంగా ఉంద”న్నాడు. “ఇలా ఎందుకొచ్చారంటే?”, “ఇక్కడవాళ్ళకి ఆ రోజులలో ఉపకారం చేసేను కదా! ఏమయినా సాయం చేయకపోతారా, అని, కొన్ని మిల్లులకెళితే ఒక్కళ్ళూ పలకరించలేదు, కనీసం కాఫీ కూడా ఇవ్వలేద”ని వాపోయాడు.అతను ఎక్కడికెళ్ళాలో కనుక్కుని టిక్కట్టు డబ్బులు చేతిలో పెట్టి పంపేసేను, అనేకంటే నేను పారిపోయాను అన్నది నిజం.  అంతకు మించి అతనికి సాయం చేయ బుద్ధి కాలేదు. తప్పు చేశానో ఏమో ఇప్పటికి తేల్చుకోలేను.

అతను అలా అధర్మంగా సంపాదించిన సొమ్ము అతనికి అక్కరకొచ్చిందా? కనీసం కుటుంబమేనా బాగుందా? చెప్పండి, ఇది సినిమా కధలా అనిపించలేదూ, కాని నిజం.

ప్రకటనలు

7 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అర్థం (సంపద)

 1. పింగుబ్యాకు: శర్మ కాలక్షేపంకబుర్లు-ఆడాళ్ళొస్తున్నారు, జాగ్రత! | బ్లాగిల్లు : తెలుగు బ్లాగులు

 2. శ్రీ శర్మగారికి, నమస్కారములు.

  మీ స్వీయ అనుభవంతో చక్కగా విషయాన్ని తెలిపారు. `….. చిన్న వయసు, తప్పు చేయకూడదని చెప్పే జ్నానం లేకపోవటం … తప్పు చేసానేమోనన్న భావన ఇప్పటికీ … ‘ : ఊహూ! మీరు తప్పు చేయలేదు. ఈరోజే ఒక పత్రిక లో చదివాను: మనిషికి బాధలు, కష్టాలు అవసరమేనని. ఎందుకంటే, తప్పుచేసినవాడు, దాని ఫలితాన్ని, పైన చెప్పినట్లుగా, అనుభవించాక, నిజాన్ని తెలుసుకొని, పునీతుడు అవుతాడు. ఆ అవకాశం భగవంతుడు ప్రతి ఒక్కరికీ ఇస్తాడుట! ఒకవేళ, మీరే, ఆకాలంలో, అతనిని వారించివుంటే, అతను మీ మాటను వినివుండవచ్చును లేదా వినకపోవచ్చును, లేదా మిమ్మల్ని తప్పించుకొని మసిలేవాడు. అప్పుడు అతనికి `పునీతమయ్యే’ అవకాశం తప్పి పోయి వుండేది.

  మీ స్నేహశీలి,
  మాధవరావు.

  • @మిత్రులు మాధవరావు గారు,

   చిన్నతనం, ఆలోచన పరిపక్వత రాని వయసు, తప్పు చేయకూడదని తెలుసు, అంతే. అతని యోగం అలా ఉంది, దానికి నేను కర్తను కాననుకుని సరిపెట్టుకున్నా, ఇప్పటికి తప్పు చేసేనేమో అనిపించినా,ఆ తరవాత,. మీ సవివర వ్యాఖ్యకి ధన్యవాదాలు.

 3. అర్ధం చతుర్విధ పురుషార్ధాలలో రెండవది. ధర్మ మార్గంలో అర్ధాన్ని సంపాదించాలి, దర్మమైన కోరికను, ఈ అర్ధంతో నెరవేర్చుకోవాలి, అప్పుడు కలిగేది అసలు సుఖం. కాని నేడు ఎలాగయినా సంపాదించడమే ధ్యేయంగా కనపడుతోంది. ఇలా సంపాదించడం మూలంగా మిగిలేది వ్యధ మాత్రమే………చక్కగా చెప్పారండి.

  • @అమ్మాయ్ అనూరాధ,
   సంపాదించెయ్యాలనే అనుకుంటున్నారు కాని ధర్మం ఆలోచించడం లేదు. అది కావాలి నేడు, దాన్ని బతకనిచ్చేలా లేదు.

   ధన్యవాదాలు

 4. తాతగారు, మీరు అతను లంచం తీసుకున్నప్పుడు వారించి ఉంటే బాగుండేది. ఇక అన్నదానం ఎప్పటికీ శ్రేష్ఠమే కాబట్టి మీరు బాధ పడకండి.

  • @అబ్బాయ్ ప్రసాదు,
   నాదా వయసు ఇరవై. తప్పు చేయకూడదని తెలుసుకాని తప్పుని నిరోధించాలని తెలియని వయసు, ఇంత పరిపక్వత అప్పుడు లేదుగా, అందుకు జరగలేదు.

   ధన్యవాదాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s