శర్మ కాలక్షేపంకబుర్లు-అర్థం (భావం)

  అర్థం(భావం)

అర్థం అంటే భావమనే అర్ధంలో చెప్పుకుందాం. ఒకరి మనసులో భావం వాక్కు ద్వారా వ్యక్తమై మరొకరి మనసుకు చేరి ఈ భావాన్ని అక్కడ అర్ధం చెయ్యడమే, దీనికి సాధనాలు వాక్కు, భాష. తిరకాసుగా చెప్పేనా? అర్ధం అయ్యేలా చెప్పలేకపోయానేమో! వాక్కు అర్ధం రెండూ ఒకటే అన్నారు, శివుడు పార్వతిలాగా. శివుడినుంచి పార్వతిని వేరుగా ఎలా చూడలేమో, సూర్యుడినుంచి కాంతిని వేరుగా ఎలా చూడలేమో వాక్కు నుంచి అర్ధాన్నీ అలాగే విడతీయలేము. శివునిది తాండవం అమ్మది లాస్యం. రెండూ ఆనంద కారకాలే. రెండూ పరస్పర పూరకాలు. అలా విడివడితేనే ప్రమాదం. అవి జరిగిన సంఘటనలూ ఉన్నాయి.వేదానికి స్వరం ఉంది, ఉదాత్త, అనుదాత్తాలు, ఇవి తప్పకూడదు, తప్పితే భావం మారిపోతుంది.

వేదాంగం కేనోపనిషత్ ఏంచెప్పిందో చూడండి.

ఓం ఆప్యాయంతు మమాంగాని, వాక్ ప్రాణ చక్షుః
శ్రోత్ర మథో బల మింద్రియాణి చ సర్వాణి , సర్వం
బ్రహ్మౌపనిషదం మాఽహం బ్రహ్మ నిరాకుర్యాం
మా మా బ్రహ్మ నిరాకరో దనిరాకరణమ స్త్వనిరా
కరణం మే ఽస్తు, తథాత్మని నిరతే య ఉపనిషత్స
ధర్మాస్తే మయి సన్తుతే మయి సన్తు.

నా అవయవములు శక్రివంతములు అగు గాక. నా వాక్కు, ప్రాణములు, కన్నులు, చెవి మొదలగు ఇంద్రియము లన్నియు శక్తివంతములు అగు గాక. సర్వము ఉపనిషత్ప్రతిపాదిత బ్రహ్మమే. నేను ఎన్నడు బ్రహ్మను నిరాకరింపకుండెదను గాక. బ్రహ్మము నన్ను నిరాకరింపకుండు గాక. నా నిరాకరణము బ్రహ్మమునందు లేకుండా ఉండు గాక. బ్రహ్మ నిరాకరణము నా యందు ఉండకుండు గాక. ఉపనిషత్తులలో తెలుపబడిన ధర్మములు నా యందు స్థిరపడు గాక.

ఒక యజ్ఞం జరుగుతూ ఉంది ఇంద్రుని సంహరించేవాడు పుట్టాలని, కాని హోత మంత్రం చెప్పడంలో తేడా మూలంగా ఇంద్రుని చే సంహరింపబడే కొడుకు కావాలని అర్ధం వస్తుంది, చెప్పడం లో, ఫలితమూ అలాగే ఉంటుంది. అలా కుంభకర్ణుడు నిర్దయ కోరుకోవాలనుకుని నిద్దర కోరుకున్నాడంటారు, పలుకు తేడా.పలుకుల తల్లి సరస్వతి, శంకరుని చెల్లెలు, ఆయనలాగే తెల్లగా ఉంటుంది,తెనుగు భాషలా, నలువ రాణి, ఆమెదయ ఉంటే సర్వమూ ఉన్నట్లే.
భావం వ్యక్తం చేయడానికి వాక్కు ముఖ్యం, వాక్కుకు భాష ముఖ్యం. భాషకి సంస్కృతి ముఖ్యం. మీనాన్న గారున్నారా అన్నది, మీ అమ్మ మొగుడుగారున్నారా అన్నది ఒకటే భావాన్నిస్తున్నా, భాషా సంస్కృతులు తేడాగా కనపడతాయి కొట్టొచ్చినట్లు. అందుకే మాటాడేటపుడు భాషకి ప్రాముఖ్యం ఇవ్వాలి. మొదటి మాట గౌరవాన్ని సూచిస్తే రెండవది మొరటుగా ఉంటుందికదా. మాట ఒకటే కాని సందర్భాన్ని బట్టి దాని అర్ధం మారిపోతుంది కదా! మాటకి నానార్ధాలుంటాయి. ఒకప్పుడు ప్రాణం పోసే మాట మరొకప్పుడు ప్రాణం తీస్తుంది.

కొంతమంది చూడండి ఏ విషయం చెప్పినా అందంగా హత్తుకునేలా అర్ధమయ్యేలా చెబుతారు, ద్రాక్షా పాకం. కొంత మందికి భావం ఉంటుంది కాని వాక్కు ద్వారా దానిని సరిగా వెలిబుచ్చలేరు, ఎంత తెలివయినవారయినా, నారికేళపాకం. కొంతమంది పుట్టుకతోనే బోధకులు, కొంతమంది దాన్ని సాధించుకోగలరు. కొంత మందికి సాధన ద్వారా కూడా ఇది సాధ్యం కాదు, వారెంత గొప్పవారయినా, తెలివయినవారయినా. కొంత మంది విషయం చెబుతారు, గంటల కొద్దీ ఉపన్యాసమూ ఇస్తారు, కాని వారు చెప్పదలచుకున్నదేమో బ్రహ్మ పదార్ధమే,నాలాగనమాట. :). కొంతమంది మాటాడితే నాగ స్వరానికి నాగుపాము తల ఊచినట్లు వింటాం. అదే మరొకరు చెబితే కర్ణ కఠోరంగా ఉంటుంది కదా.! ఇది భావాన్ని వ్యక్తం చెయ్యడంలో తేడా. దీనినే శంకరాభరణం సినిమాలో శంకరశాస్త్రి పాత్ర చేత” అమ్మ” అన్న మాట పలికేతీరులో అర్ద్రత ఉంటుందనిపిస్తారు, దర్శకులు. ఒకరు మాటాడితే బాధ పడతాం, మరొకరు మాటాడకపోతే బాధపడతాం, నా స్వానుభవం. కొంతమంది ఉన్నపదాలనే విరిచి గొప్ప అర్ధం సాధిస్తారు, మా జిలేబి గారిలాగా, ఇది అందరికీ సాధ్యమా. మరికొందరు మాటలతో ఆడుకుంటారు, వినోదమూ పంచుతారు, అంత తియ్యగా ఉంటాయా పలుకులు, వినాలి మరి. వాటినుంచి తప్పించుకోవాలనుకుంటాం కాని సాధ్యంకాదే, మనసు అటే లాక్కు పోతుంది 🙂 మా బ్లాగ్లోకపు ఉక్కు మహిళ వనజగారు,  దుడ్డు కర్ర తీసుకుని ఉతికితేనే బాగుంటుంది, మరెవరేనా కర్ర తీసుకుని వెంట పడగలరా చెప్పండి. వారి మాట పదును, విషయం ఎంత సూటిగా చేరతాయి.

కనులు కనులను దోచాయంటే ప్రేమయేనని అర్ధం, తుమ్మెద పువ్వును దోచిందంటే పండగేనని అర్ధం అన్నారో సినీకవి.  అవునంటే కాదనిలే కాదంటె అవుననిలే ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే అన్నారు సినీకవి. నిజమే నేమో, కవి ఆడువారి మాట మీద శ్లేష ప్రయోగించారు కదా. ఆడువారంటే స్త్రీలని, మాటాడేవారిని అర్ధం చెప్పచ్చు. 😉 రాజకీయ నాయకులు ఒక మాట చెప్పి ఆ తరవాత ఆబ్బే నేనలా అనలా అనడం చూసేవారం. ఈ మధ్య కాలంలో మీడియా వారు ప్రతిమాటా రికార్డ్ చేస్తుండటాన కుదరక అబ్బే నా మాటల భావం అది కాదు సుమా అంటున్నారు. ఇంకా కావాలంటే అసలవి నా మాటలే కాదు, మరెవరో నాలా మిమిక్రీ చేసేరని కూడా చెబుతున్నారు, లేదా వాయిస్ టెస్టులో రిపోర్ట్ తేడాగా రావాలని గొంతుపోగొట్టుకుంటున్నారు కూడా. ఒక సంగతి మరిచిపోకూడదు, సత్యం ఎప్పుడూ జయిస్తుంది, కొద్ది ఆలస్యంగానయినా. ఈ రోజులలో ఈ సంఘటనలే ఎక్కువగా కనపడుతున్నాయి.

ప్రకటనలు

18 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అర్థం (భావం)

 1. వాక్కు గురించి బాగా చెప్పారు. ఇలాంటి విషయం పై నేను నాకు తోచినట్లుగా వ్రాశాను ఈ మధ్య.
  http://anaganagaokurradu.blogspot.co.uk/2013/01/blog-post.html
  అన్నట్లు, కనులు కనులను ‘దోచాయ్’ అంటే రెండు టీ లని అర్ధం అని సరదాగా పాడుకునేవాళ్ళం…
  ధన్యవాదాలు.

  • @మోహన్జీ,
   అర్ధం అంటే సగం, అర్థం అంటే ధనం, భావం అని అర్థం కదా! కాని వీటి ప్రయోగం నేటి కాలం లో అర్ధం గానే ఉంది, సామాన్యంగా, అందుకు అలా ఉపయోగించాననమాట. మీరు చెప్పినది నిజమే.
   ధన్యవాదాలు

 2. నిజమేనండి. లోకంలో ఎన్నో రకాల భావాలు.
  ఆ భావాలను వ్యక్తం చేసే విధానాలూ ఎన్నో రకాలు.
  ………………………..
  తోటలోని పువ్వులు, కాయల చిత్రాలు బాగున్నాయండి.
  ( నిన్నటి పోస్ట్ లో ప్రచురించిన గులాబీలు కూడా బాగున్నాయి. )

  • @అమ్మాయి అనూరాధ,
   వాక్కు అర్థం రెండూ పార్వతి పరమేశ్వరులు, విడతీయలేనివి, ఫోటో లు నచ్చినందుకు
   ధన్యవాదాలు

 3. మాస్టారూ.. వాక్కు యొక్క శక్తి గురించి మాటలో విశేషం గురించి “అర్ధం” అయ్యేలా బాగా చెప్పారు.

  ధన్యవాదములు.

  జిలేబీ గారు.. కష్టేఫలే మాస్టారు .”ఉట్టి పడే” సారంటారా? నేనయితే “ఉట్టి కొట్టే” సారంటాను.:)

  • @జిలేబిగారు,
   మరందుకే చెప్పింది, మీకే చాతనవును పదాల్ని అలా విరవడం. నారదాయనమః అన్నారా? అదేం కుదరదు లెండి మా బ్లాగ్లోకపు ఉక్కు మహిళ వనజగారి దగ్గర 🙂
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s