శర్మ కాలక్షేపంకబుర్లు-నాటి సౌందర్య సాధనాలు

నాటి సౌందర్య సాధనాలు.

“ఇదేంటో తెలుసా?” “ప్రశ్నలేసి చంపుతున్నారు, పిల్లలిని, ,ప్రశ్నలేస్తే ఊరుకునేది లేదు , నేను చెప్పినట్లు చెప్పండి.” అంది ఇల్లాలు. అందుకే చెప్పేస్తున్నా!ఆవిడ చెప్పినట్లే
మనం తయారు చేసుకునేవి ఆరోగ్య సౌందర్య సాధనాలు.

“దీన్ని కాటుక వేయడం అంటారు. అదే కాజల్,సుర్మా వగైరా అనుకుంటా. నాకు తెనుగేకదా వచ్చు, అందుకనమాట. ఇప్పుడు కాటుక పెట్టుకుంటున్నారా? ఏమో తెలియదు, నాకు. “కాటుక కంటినీరు చనుకట్టుపయింబడ ఏల ఏడ్చెదో హాటకగర్భురాణి” అన్నారండి పోతనగారు.కలకంఠి కంట నీరొరిలికిన సిరి ఇంట నుండ నొల్లదు సిద్ధము సుమతీ అన్నాడు శతకకారుడు, ఆమాటేనా విందాం, ఇల్లాళ్ళ కాటుక కళ్ళనుండి నీరొలకకుండా చూసుకుందాం,అత్తగా, ఆడపడుచుగా, ఇల్లాలిగా, ఇదే మన ప్రతిజ్ఞ.   మీరు స్థిరంగా నిలిస్తే ప్రపంచంలోని ఏ శక్తీ మిమ్మల్ని కదల్చలేదని ఋగ్వేదం చెబుతోంది.   అటువంటి కాటుకను తయారు చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి ఆరో గ్యం,  తృప్తికి తృప్తి, ఆనందానికి ఆనందం కూడా. ఎలాగో చెబుతా వినండి,అదే చదవండి.

ఒక ఇత్తడి పళ్ళెం బాగా చింతపండేసి తోమాలి, బంగారపు రంగొస్తుంది పళ్ళెం లోపలా,బయటా కూడా. ( డిటర్జంట్లు వద్దు, వాటి అవశేషాలుంటాయి, ఎంత కడిగినా). నీళ్ళు ఉండనివ్వకండి. ఆ పళ్ళాన్ని ఎండలో ఆరబెట్టండి, తుడవద్దు, దాన్ని లోపల చేతితో కూడా తాకద్దు.ఒక కరక్కాయ తీసుకోండి, పచారీ కొట్లో దొరుకుతాయి. దానిని అరగతీయండి నీళ్ళు వేసి. మీకు అరగతీయడానికి ఏమీ దొరకదు కదూ, కొంచం గరుకు గచ్చు ఉన్న చోటు చూడండి, శుభ్రంగా కడగండి, డిటర్జెంట్లు వాడద్దు.అప్పుడు అక్కడ అరగ తీయండి. ఫోటో చూపినట్లు మూడు ఇటుకలు పెట్టండి, లేదా మరో ఎత్తయిన వస్తువులు నేలకి మూడంగుళాల ఎత్తులో ఉండేలా పెట్టండి. వాటిమధ్య ఒక మట్టి ప్రమిదలో, బాగా శుభ్రం చేసి, ఆముదం, అంతే నువ్వుల నూనె కలిపి పోయండి. దానిలో ఒక కొత్త గుడ్డముక్కను వత్తిలా చేసి నూనెలో తడిపి పెట్టండి.తెల్ల గుడ్డముక్క వాడండి, రంగు గుడ్డ వద్దు. ఇప్పుడు ఆ ఇటుకల మధ్య పెట్టిన ప్రమిదలోని వత్తిని వెలిగించండి. దానిపై ఇందాకా ఎండలో ఆరబెట్టిన ఇత్తడి పళ్ళెం, వేడి వేడిగా ఉన్నదానిలోపల ఈ కరక్కాయ గంధం రాయండి, పల్చగా , ఆ తరవాత ఫోటో లో చూపినట్లుగా బోర్లించండి, ఇటుకలపైన. ఈ వ్యవస్థని ఒక గాలి రాని గదిలో పెట్టి తలుపులేసేయండి. కొంత సేపటికి దీపం నూనె అయిపోవడంతో ఆరిపోతుంది. కాసేపాగి చల్లారిన తరవాత ఇత్తడి పళ్ళాన్ని జాగ్రత్తగా తీసి ఒక తెల్ల కాగితం మీద దుమ్ము లేకుండా చూసుకుని పదునైన చాకు, చెంచా, లేదా కొబ్బరాకు, తాటాకు తో పళ్ళెం లోపల పారిన మసిని నెమ్మదిగా కాగితం మీదకి చేర్చండి, జాగ్రత్తగా. ఒక మంచి సీసా కడిగి ఎండలో పెట్టినది ఉపయోగించండి, దానిలో పోయండి. కొద్దిగా ఆముదం చుక్క వేలికి రాసుకుని కాటుకలో ఆ వేలు ముంచి కాటుక పెట్టుకోవచ్చు. మరి దేనితోనూ పెట్టుకోవడం ఆరోగ్యకరం కాదని నా నమ్మకం. ఇది పెట్టుకుంటే కళ్ళు చల్లగా ఉంటాయి, కొయ్య కండలు పెరగవు. దృష్టి చక్కగా ఉంటుంది.చిన్న పిల్లలకి, మగ పిల్లలకి కూడా కాటుక పెట్టండి, జీవితంలో కంటి సమస్యలు తక్కువ వస్తాయి. మగ పిల్లలికి కాటుక పెడితే సభా పిరికితనం అంటారు, అది ఒట్టిదే.  ఇందులో పచ్చ కర్పూరంకూడా వేస్తారు, కాని కళ్ళు కాటుక పెట్టుకున్న వెంటనే మండుతాయి, మరి.”అని చెప్పింది.

ఈ కాటుక కొంతమంది చేతిని బాగా పారుతుందంటారు. పదేళ్ళు వచ్చేదాకా అమ్మ నాకు కాటుక పెట్టేది, చిన్నప్పుడు, నా చేత దీపం వెలిగింపచేసి, పళ్ళెం బోర్లించమనేది, దీనికోసం నేనెక్కడున్నా పిలిచేవారు, అందరూ.నా చేతిన కాటుక బాగా పారుతుందని నమ్మకం.ఇప్పుడు ఇల్లాలు పిలవటం లేదు. ఒక ఇంట్లో అత్తా కోడళ్ళ చేతిన ఒకలా పారదంటారు, మరి మా ఇంట్లో మాత్రం ఇద్దరి చేతినా ఒకలాగే పారుతుంది, అదేంటో!

మరోసారి మరొక సౌందర్య సాధనం.

ప్రకటనలు

22 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-నాటి సౌందర్య సాధనాలు

 1. మా అమ్మమ్మ ఇలా తయారు చేసేది. ఆముదం నూనె దీపం గురించి తెలుసు. నువ్వుల నూనె కూడా కలుపుతారని తెలియదు. కరక్కాయ గంధం సంగతి కూడాతెలియదు. ఆసక్తికరమైన విషయం. ధన్యవాదాలు.

 2. తాతగారు నాకు బాగా కాటుక రావలంటే మీరు ఎక్కడ దొరుకుతారు ఇత్తడి పాత్ర మీ చేత్తో బోర్లించడానికి..:)
  భలే నచ్చేసింది ఈ కాటుక నాకు..

 3. ఫోటో చాలా బాగా తీసారు. కొన్ని సంవత్సరాలకి ముందు మా పెద్దవాళ్ళు తయారు చేసేవారు. ఇప్పుడు చాలామందికి కాటుక ఇంటిలో చేసేవారనే తెలియదు. ఇలాంటి టపాలు ముందు తరపు లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి(ఇప్పటికి కూడా కొంతమంది కొనసాగిస్తున్నారనుకోండి). బాగుంది.

 4. ఈ కాటుక మా అమ్మమ్మ తయరు చేసేవాళ్ళండీ.. చాలా బాగుండేది.
  కాటుక తయారు చేసేటప్పుడు మాటలు వినపడకూడదు, చీకటి గదిలో తయారు చేయాలి అని ఎవరినీ దగ్గరికి వెళ్ళనిచ్చేది కాదు..

  మంచి సౌందర్యసాధనం గురించి మళ్ళీ గుర్తు చేశారు ధన్యవాదములు..

  • @రాజి గారు,
   చీకటి గదిలో మారు మూల వేసేవారు, ఆ గదిలో మాటాడేవారు కాదు, ఎందుకంటే దీపం వెలిగించిన తరవాత అక్కడ ఏమాత్రం ప్రకంపనలున్నా దీప శిఖ పక్కలకి పోతుంది. కాటుక అంతా ఒక చోట బొడ్డులా రాదు. అందుకు మాటాడేవారు కాదు.మీరూ మళ్ళీ వెయ్యండి.
   ధన్యవాదాలు

   • అబ్బే, బులుసు గారు,

    శర్మ గారి ఉవాచ, అది కలకంఠి కనుదోయి కి పతీశ్వరులు తయారు చేసి ఇవ్వవలెనని , తద్వారా వారి కి సేవ చేయు భాగ్యము పతి పుంగవులు కలుగ జేసుకోవాలనీ ను !

    జిలేబి.

  • @మిత్రులు బులుసు సుబ్రహ్మణ్యం గారు,
   పాపం ఇల్లాలు కష్టపడుతోంటే సాయం చేదాం. ఆవిడ బాగుంటేనే కదండీ మన ఆటలు సాగేది. కళ్ళు మనవే కనక కొద్దిగా కష్టపడాకతప్పదు మరి. కాకపోయినా ఇందులో అంత కష్టం ఏముందో. 🙂
   మిత్రులు బోనగిరిగారు,
   చాలా కాలం తరవాత కలిశారు,
   జిలేబిగారు,
   మీకే నాఓటు. 🙂
   అందరికి ధన్యవాదాలు.

 5. తాతగారు ఇప్పుడు జనాలు patent లేకపోతె ఉపయోగించారు అని జిలేబీ గారి అభిప్రాయంలా ఉంది, అది నిజం కాదు అని నిరూపిద్దాం.

 6. శర్మ గారు,

  ఈ సౌందర్య సాధన పధ్ధతి కి పేటెంటు రైటు లేకుంటే వెంటనే పేటెంటు చేసెయ్యండి!

  అమెరికా వాళ్ళు చాలా మంది బ్లాగ్ లోకం లో ఉన్నారు! వాళ్ళు దీనికి పేటెంటు లాగిస్తే, మళ్ళీ మనకు బాస్మతీ లా, ప్రాబ్లం వచ్చేస్తుంది. !

  జిలేబి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s