శర్మ కాలక్షేపంకబుర్లు-“గౌరవం” (శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి వర్ధంతి.)

“గౌరవం”           (శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి వర్ధంతి. 25.02.1961)

నేడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వర్ధంతి. వీరు తెనుగునాట వచన కవిత్వంలో పేరుగాంచినవారు. వీరిగురించి పరిచయం చేయడమంటే సూర్యునికి దీపం చూపడం లాటిది, అందునా నాలాటివాడు. ఒక కవికి శిలావిగ్రహం వేయడం, ముఖ్యంగా తెనుగునాట ఒక విచిత్రమే.  ఉజ్జయినిలో కాళిదాసు విగ్రహం ఉంది, మరెక్కడయినా కవులకు శిలావిగ్రహాలున్నాయేమో తెలియదు.. వీరి శిలావిగ్రహం రాజమంద్రిలో కోటిపల్లి బస్ స్టాండు ఎదురుగా ఉంది,రెయిల్ రోడ్డు బ్రిడ్జ్ కి వెళ్ళేదారి పక్క. ఇదివరలో అక్కడొక పార్క్ ఉండేది, దానిలో కుర్చీలో కూచుని ఉన్న శ్రీకందుకూరి వీరేశలింగం గారి శిలావిగ్రహం ఉండేది. ఇప్పుడు వారి శిలావిగ్రహాన్నీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి శిలావిగ్రహాన్నీ వేరు చేస్తూ రోడ్డు వేశారు. శాస్త్రి గారి వర్ధంతి సందర్భంగా వారి” అనుభవాలూ-జ్ఞాపకాలూను” నుంచి ఒక సంఘటన మీకోసం, చదవండి.

“”ఈ గౌరవమర్యాదల సందర్భంలో మరో వుదాహరణ.
అదిన్నీ ఒక అగ్రహారం.
వందలమీద వుంది బ్రాహ్మణగడప అక్కడాను.
వేదవేదాంగాలు నేర్చినవారూ యజ్ఞయాగాలు చేసినవారూ డజన్లక్కడ.
కలతగొట్టు విద్వాంసులు మాత్రం గ్రోసులు.
ఏమివచ్చినా అక్కడ పెద్దలమాట పిన్నలు శిరసావహిస్తారు, పిన్నల చిలిపితనం పెద్దలుసహిస్తారు, చూడనట్టు నటిస్తూ.
వివాహాల సందర్భంలో పెళ్ళికొడుకులకూ పెళ్ళికూతుళ్ళకూ తప్ప ఆ వూరివీధుల్లో పాలకీలూ, ఇతర వాహనాలూ ఎక్కి తిరగడానికి వీల్లేదు, మరెవరికీ.
పండితులూ యజ్వలూ ఏయింటివా రాయింటి అరుగుల మీద కూచుని విద్యావ్యాసంగాలు చేసుకుంటూ వుంటారూ కనక,వారి యెడల వినయ విధేయతలు కనబరచడానికే యీ కట్టుబాటు.
ఇప్పుడంటే దేశం తెనుగుమీరిపోయింది; కాని,నాకు బాగా వయసు వచ్చాక గూడా పండితులంటే భయభక్తులు చూపిస్తూనే వుండేవారు జనులు.
ఆ అగ్రహారంలో కూడా అన్ని కులాలవారూ ఈ కట్టుబాటు మన్నించేవారిష్టాపూర్తిగా.
తహసీల్దార్లేకాదు, కలెక్టర్లున్నూ పాలకీలూ గుర్రాలూ దిగి పండితులకు దండాలు పెడుతూ కాలి నడకన వెళ్ళడమే ఆ వూరి సంప్రదాయం.
హిందువులుకాని అధికార్లున్నూ ఈ కట్టుబాటు మన్నించేవారు.
ఒకప్పుడు కొత్తగా వచ్చిన తహసీలుదారు మాత్రం “నాన్సె’న్నా డిదంతా.
కులానికి బ్రాహ్మడే మళ్ళీ ఆయన.
అజమాయిషీ పేరు చెప్పి ” యీ పెంకితనం వదలగొడదా”మనే వచ్చిన “వున్నాతాధికారి”తో పొలిమేర దగ్గరే విన్నవించుకున్నారు మున్సబుకరణాలీ సంగతి; కాని “షటప్”అన్నా డాయన.
ఊరిదగ్గరికి వచ్చేటప్పటికి,తమకీ సంగతి తెలుసు కనక,యెవరూ చెప్పకుండా బోయీలే దింపేశారు పాలకీ;కాని “జాగ్రత్త” అంటూ కళ్ళెర్రజేశాడాయన.
మళ్ళీ మళ్ళీ ఇటు విన్నపాలు అటు తిరస్కారాలూ జరిగిపోయాయి.
ఈ సంగతి అంచెనోళ్ళమీద వ్యాపించింది, అగ్రహారం అంతటా.
ఈలోపున బోయీలు పాలకీ ఎత్తుకున్నారు, “మమ్మల్నేం చెయ్యమంటా”రన్నట్టు చూస్తూ.
కూడా కూడా నడుస్తూనూ వున్నారు మున్సబుకరణాలు;”ఏమిదారి?” అని ఆలోచిస్తూ వున్నారు.
ఇంతలో వొక బ్రాహ్మణయువకుడు వచ్చి “యెప్పుడూ రానిప్రభువులు దయచేశా”రనివంగి దండాలున్నూ పెట్టి, లేతకొబ్బరిబొండం వొకటి నజరు పెట్టాడు.
అది చూసి “అగ్రహారం పాదాక్రాంతం”అవుతోందనుకున్నాడా “వున్నతాధికారి”
అనుకుని, అతి దర్జాగా ఆ బొండం అందుకుని, పక్కనిన్నీ పెట్టుకుని ” ఇప్పుడేమంటారు?” అన్నట్టు సగర్వంగా చూశాడు మున్సబుకరణాలకేసి.
చూశాడు- చూస్తూనే వున్నాడింకా- మరో యువకుడున్నూ వచ్చి లేత కొబ్బరిబొండం నజరు పెట్టాడు.”యెప్పుడూ రాని ప్రభువులు దయచేశా”రంటూనే.
పదిమంది-పాతికమంది-యాభైమంది-వందమందిన్నీ తెచ్చారు,నజరు పెట్టారు, లేతకొబ్బరి బొండాలే.
తెచ్చేవారు తెస్తూవుండగా,తెచ్చినవారు తామే పాలకీలో పేర్చసాగారు బొండాలు “వున్నతాధికారికి”దండాలు పెడుతూనూ,”ఎప్పుడూ రాని ప్రభువులు దయచేశా”రంటూనూ.
లోపలా చోటు చాలకపోగా,రెండేసిబొండాలు గుదిగుచ్చి తెచ్చినవారే పాలకీ దండెలకూ వూచలకూ వేళ్ళాడ వెయ్యసాగారు,నినాదం రెట్టిస్తూ.
తహసీలుదారు తెల్లబోయాడు.
“బాబోయ్, మొయ్యలే”మన్నారు బోయీలు.
అంటూనే ఆగిపోయారు.
ఆగి, పాలకీగూడా దింపెయ్యబోయారు; గాని ఫెళ్ళుమంటూ వొక దండె విరిగిపోయిం దీలోపునే.
రెండో దండె బోయీల చేతుల్లో వుండడంవల్ల యేటవాలు స్థితి యేర్పడి ముందుకి బేకారించి కొబ్బరిబొండాల్లో వుండ్రముక్క అయిపోయాడు “వున్నతాధికారి”
ఆయన మీదే సవారీ చేశాయి బొండాలు.
ఇది చాలదన్నట్టు ఎలాగో తప్పించుకుని లేవబోతున్న వున్నతాధికారి కడ్డంగా పేర్చసాగారు, యువకులు, బొండం గుదులు.
ఉడికిపోయాడు తహసీలుదారు.
మండిపోయాడు,స్వగతంగా.
చల్లబడిపోయాడు,చివరికి.
“మరి తరవాత ఏమిచేశాడ”ని కాదు,ప్రశ్న,బ్రాహ్మణజాతికి గౌరవా వహమేనా యిది?””.

నిన్న ఫోటో తీసుకోడానికి రాజమంద్రి వెళ్ళి ఫోటో తీసుకుంటూ ఉంటే, నాకు ఆనందం కలిగించిన సంగతేమంటే, ఈ రిక్షా కార్మికులు, శాస్త్రి గారి గురించి చెబుతూ, “వీరికి ’కధక చక్రవర్తి’ అని బిరుదు ఉందండి, మళ్ళీ ఈ బిరుదును మొన్న తణికెళ్ళ భరణి గారికి ఇచ్చారండి,” అని చెబుతూంటే, ఇందులో ఒకరు శాస్త్రి గారు నివాసం ఉండివున్న ఇల్లు కూడా చెబుతూంటే మహదానందమయింది.

యాదృఛ్ఛికంగా ఇది నా  400 వ టపా.
ఈ బ్లాగుని  e పుస్తకం చేయాలనుకుంటున్నాను.
స్వస్తి

ప్రకటనలు

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-“గౌరవం” (శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి వర్ధంతి.)

 1. * మీరు మరెన్నో టపాల ద్వారా చక్కని విషయాలను తెలియజేయాలని కోరుకుంటున్నానండి.
  * నాకు కూడా బ్లాగుని e పుస్తకం చేయాలని ఉంది కానీ, ఎలా చేస్తారో తెలియదు.
  * బ్లాగుని e పుస్తకం చేయటం ఎలాగో తెలియజేస్తారా ? ( మీకు అభ్యంతరం లేకపోతే . )

 2. అన్నీ యాదృచ్చికములే అయినా కారణ వశాత్తు అన్నమాట !

  కొబ్బరి బొండాంలతో కూడా బోల్తా కొట్టించ వచ్చన్న మాట ఇలా !

  శుభం శర్మ గారు, మీ ‘ఈ’ – పుస్తకమునకై ఎదురు చూస్తూ….

  జిలేబి.

  • @జిలేబి గారు,
   నిజానికి మొన్నటి మీ టపాయే ౪౦౦ వది. ఇది 401 కాని నేను రాసినవి లెక్కేసుకుని ఇది 400 టపా అన్నాననమాట.
   గౌరవం ఇవ్వడం తెలియనివారికి ఎలా పాసిటివ్ గా బుద్ధి చెప్పచ్చో తెలిపే సంఘటన ఇది.
   ఈ బుక్ కోసం ప్రయత్నం చేస్తున్నా.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s