శర్మ కాలక్షేపంకబుర్లు-కొన్ని/ కొని తినేవి

Coutesy you tube

కొన్ని/కొని తినేవి

ఈ మధ్య నీ బ్లాగు చూడాలంటే భయమేస్తోంది తాతా! అని ఒక మనవరాలు మెయిలిచ్చింది.మరో మనవరాలు ఒక టపా చదివి ఏడుపొచ్చింది తాతా! అంది. మరొక మనవరాలు మాటాడటమే మానేసింది 🙂 కోపమో, అలకో,లేకపోతే ఊపిరి పీల్చుకునే ఖాళీ కూడా లేదు తాతగారూ! అనో చెబుతుంది లెండి, తరవాతెప్పుడో! ఒకమ్మాయయితే బాబాయ్ సరదా సరదాగా కబుర్లు చెప్పేవాడివి, ఒక్క సారిగా ఇలా వైరాగ్యంలోకి వెళ్ళిపోయావని ఫిర్యాదు కూడా చేసింది. వయసు కదమ్మా! ఇప్పుడు ఆలోచనలు అలాగే ఉండాలి, అది సహజం. ఎప్పుడూ వెలుగే ఉండదు అలాగని ఎప్పుడూ చీకటీ ఉండదు, కాని చీకటిలో వెలుగు కోసం తాపత్రయ పడటమే జీవితంమరో రెండు టపాలు కొద్దిగా బరువుగా ఉండచ్చు మీకు 🙂 భయపడకండి.   కాని మీ కోసం మళ్ళీ వెనక్కి వస్తున్నా.ఇదిగో వీటిని చూడండి మరి.

కర్ర పెండలం

ఇది చాలా మందికి తెలియకపోవచ్చు, మీరంతాపట్నవాసం వాళ్ళు కదా! కాని దీని తాలూకు మాత్రం వాడుతూ ఉంటారు, ఎప్పుడూ. 🙂 దీనినే కర్ర పెండలం అంటారు, పెండలం అని మరొకటి ఉంది. ఇది అది కాదు. ఈ కర్ర పెండలం దుంప రూపం లో పండుతుంది. దీనితో సగ్గుబియ్యం తయారు చేస్తారు. ఇప్పుడు తెలిసిందా, మీరు వాడే సగ్గు బియ్యం కాని నూడుల్స్, అప్పడాలు వగైరాలన్నీ దీనితోనే తయారు చేస్తారు. ఈ కర్ర పెండలం లో ఎక్కువగా పిండి పదార్ధమే ఎక్కువగా ఉంటుంది. మేము పల్లెటూరి వాళ్ళం కదా! ఇలా దుంప కాల్చుకుని పైనున్న తొక్క ఒలుచుకుని తినేస్తాం. కమ్మహా! ఉంటుంది. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. దీనిని ప్రధాన ఆహారంగా కూడా తీసుకుంటారు, కొంతమంది. గిరి జనుల ఆహారాల్లో ఇది కూడా ఒకటి.

bobbarlu

బొబ్బర్లు courtesy google

వీటిని చూశారా! వీటిని బొబ్బర్లు అంటాం. ఉత్తరాది వారు వీటిని రాజ్ మా అని పిలుస్తారు. ఇది కూడా నాగరికులు ఎక్కువా వాడరు, దానికి ఒక కారణం ఉంది. వీటిని తిన్నప్పుడు అపానావాయువు ఎక్కువగా వెలువడుతుంది.అందుకు వాడకం తక్కువ. కాని ఇది ఇది మంచి పోషక పదార్ధం. దీనిలో మాంసకృత్తులు ఎక్కువ, బలమైన ఆహారం. పల్లెలలో వాడకం ఎక్కువగానే ఉంటుంది. ఉత్తరాది వారు రాజ్ మా ఎక్కువగానే వాడుతారు.పరోటా, రోటీ తో ఈ రాజ్ మాతో చేసిన పప్పు తీసుకుంటారు. బలేగా ఉంటుంది, కొంతకాలం నేనూ తిన్నా, ఒకప్పుడు ఉత్తరాదిని ఉన్నాలెండి, అప్పుడనమాట.దీని పిండితో అప్పడాలు కూడా తయారు చేస్తారు.

వాము ఆకు

ఇదిగో దీనిని చూశారా! ఇది వాము ఆకు అంటారు. ఇది అమ్మకానికి రావడం తక్కువే, దీనితో పచ్చడి చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ ఆకుతో బజ్జీలు కూడా వేసుకోవచ్చు, బలే కమ్మహా ఉంటాయి,కొద్ది కారంగా కూడా, బజ్జీలు, వేడి వేడిగా తినాలి 🙂

ఉల్లి కోళ్ళు

ఉల్లికోళ్ళు.

ఉల్లికోళ్ళు; కొంతమంది పల్లెలో పుట్టి పెరిగిన వారు చూసివుంటారు కాని, పట్నవాసం వారికి తెలియకపోవచ్చును. ఇవి నీరుల్లి పాతినపుడు మొక్క పైకి వస్తుంది కదా; అదనమాట. వీటిని కూరగానూ, పులుసుగానూ అదేనండీ సూప్ గానూ కూడా వాడుతారు, బలేగా ఉంటుంది పులుసు.దీనికి  గుమ్మడి వడియాలు తోడుంటే ఆ మజాయే వేరు.  పట్నం వారికి దొరికితే వండుకు చూడండి.

గోగుపువ్వులు

గోంగూర గురించి తెలియని వారుండరు; కాని గోగు పూల గురించి తెలిసినవారు తక్కువమంది ఉంటారు. పల్లెటూరి వారికయితే; తప్పకతెలిసే ఉంటుంది కూడా. గోంగూరలో రెండు రకాలున్నాయి. పుల్లగోంగూర, ధనాస గోంగూర అని. ఇందులో కూడా పుల్లగోంగూరని కొంతమంది ఇష్టపడితే మరి కొందరు ధనాస కూరని ఇష్టపడతారు. ఈ మొక్కలు పెద్దవయిపోయి పూస్తాయి. పువ్వులు ఎర్రగా నెత్తురు ముద్దలలా ఉంటాయి. ఈ పూలను కోసుకుని పైన ఎర్రగా ఉన్న వాటిని, డిప్పల్ని ఒలుచుకుని పచ్చడి చేసుకుని తింటే బలేగా ఉంటుంది.ఇందులో నువు పప్పు కూడా వేసుకుంటే రుచి స్వర్గానికి బెత్తెడే దూరం. ఇవి కూడా పుల్లగానే ఉంటాయి. దీనిని ఆంధ్ర మాత అని అంటారు. అసలు గోంగూరని ఇష్టపడని తెనుగువాడు ఉండడని నా నమ్మకం.

మాఘ పున్నమి చంద్రుడు.

కొరివి కారం. అబ్బో ఇది కూడా చాలా గొప్పగా ఉండే పచ్చడే. నిలువకు కూడా పెట్టుకుంటారు. గుంటూరు మిరప పళ్ళు పచ్చడి చేసుకుని నిలవపెడతారు.దీనిలో చింతపండు కలిపి పచ్చడి చేస్తారు, పోపు వేస్తారు, జొన్నన్నంలో కొరివికారం కలుపుకుని నువ్వులనూనెతో తింటే బలే రుచి. దీనికి తోడు గడ్డ పెరుగుంటే ఆహా! ఏమి రుచి అనరా మైమరచి.

ప్రకటనలు

14 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కొన్ని/ కొని తినేవి

 1. * వంటల స్పెషల్ టపా బాగుందండి.

  * ఉడికించిన కర్రపెండలం బలవర్ధకమైన ఆహారం. మామూలు పెండలం కూర కూడా బాగుంటుంది.
  * మేము ఉత్తరాది టూర్ వెళ్ళినప్పుడు చూశాము. అక్కడ రాజ్మా చావల్ అని అమ్ముతున్నారు .ఉత్తరాది వారు ఎక్కువగా రాజ్మా మరియు పెసలు, శనగలు వంటివి కూరగా చేసి చపాతీలతో తింటారు.
  * కొంతకాలం క్రిందట మేము శిరిడి వెళ్ళినప్పుడు అక్కడ సాయి సంస్థాన్ వారి ఉచితభోజనంలో చపాతీలతో పాటు పెసలతో వండిన వేడివేడి కూర ఇచ్చారు. చాలా బాగుంది.

  * మా పెద్దవాళ్ళు వారి చిన్నతనంలో అల్పాహారంగా, ఉడికించిన పెసలు, బొబ్బర్లు వంటివి తినేవారట. ఇవన్నీ తిని కష్టపడి పనిచేసుకోవటం వల్ల అప్పటి వాళ్ళు ఆరోగ్యంగా, పుష్టిగా ఉండేవారు.
  * ఈ రోజుల్లో ఎక్కువమందికి శారీరిక శ్రమ తగ్గిపోవటం వల్ల , పిల్లలకు కూడా ఇలాంటివి తిని హరాయించుకునే శక్తి తగ్గిపోయింది.
  * ఇప్పటి పిల్లల ఆహారం న్యూడిల్స్, బ్రెడ్ , …వంటివి.

  * వాము ఆకులతో చేసే శనగపిండి బజ్జీల వల్ల అజీర్ణం రాదని అంటారు.
  * నేను గోగుపువ్వుల పచ్చడి ఎప్పుడూ చేయలేదండి. ఎప్పుడైనా చేయటానికి ప్రయత్నిస్తాను.
  * ఉల్లికాడలను ఇప్పుడు పట్నాలలో కూడా అమ్ముతున్నారు.. కారట్, కాప్సికం, పచ్చిబఠాణి వేసి చేసే ఫ్రైడ్ రైస్ లో ఈ ఉల్లికాడలను వేస్తారు.

  • @అమ్మాయి అనూరాధ,
   నా మనవరాలొకరు గోగుపూల పచ్చడి బలే చేస్తుంది, తనకి ఎంతిష్టమో, నాలా.ప్రయత్నించండి.ఉల్లికోళ్ళ పులుసు స్పెషల్ చేసుకు చూడండి.మనం తింటే పిల్లలూ తింటారు. మేము ఇప్పటికి దొడ్డిలో ఉల్లికోళ్ళు , వాము ఆకు, కరివేపాకు, బూడిద గుమ్మడి, గుమ్మడి కాయిస్తాం. మామిడి, పనస చెప్పక్కరలేదు, మనవరాలి కోసం ఎదురు చూస్తున్నా,కొత్తపల్లి కొబ్బరి ఆవకాయ, పండు పెట్టాలని తనకి, ఏమో ఎప్పుడొస్తుందో
   ధన్యవాదాలు

 2. తాతగారు మంచి హెల్దీ అండ్ దేశి ఫూడ్స్ గురించి మళ్లీ అందరికి గుర్తుచేసారు బాగుందండి. దానితో పాటు మీరు పెట్టిన ఈ పాట నేను చిన్నప్పుడు radio లో లలితసంగీతంలో విన్నాను అప్పటిలో నాకు చాలా నచ్చిన పాట ఇది . మళ్లీ వినిపించినందుకు ధన్యవాదాలు

  • @అమ్మాయి శారద విభావరి,
   మరో మనవరాలికి స్వాగతం,ఆలిండియా రేడియోకి శ్రీ పాలగుమ్మి వారి నజరానా, ఈ పాట. మొదటగా వరహాలు అనేవారు పాడేరు, అది దొరకలేదు, నాకు చాలా ఇష్టమయినపాట, మనవరాళ్ళకీ ఈష్టం కదా అందుకు పెట్టేను. ఆ పాట దొరికితే మీ బ్లాగులో పెట్టమ్మాయి.
   ధన్యవాదాలు

 3. ఉల్లికోళ్ళు తప్ప,మిగిలిన రుచులన్నీ నోరూరించేసాయి తాతగారు..:)
  ఉల్లికోళ్ళు చుడ్డమే కాని ఎప్పుడూ రుచి చూడలేదు మరీ..:(
  ఘుమఘుమల టపా..:)

  • అమ్మాయి ధాత్రి,
   ఉల్లికోళ్ళ పులుసు బాగుంటుందమ్మయి, కాని కూడా తినడానికి వడియాలు నమలాలంటే పళ్ళులేవు కదా! ప్రయత్నించి చూడు దొరికితే బాగుంటాయి,
   మలద్వారం గుండా పోయే వాయువును అపాన వాయువు అంటారు.అజీర్తి వల్ల వచ్చేది నిజం.వాము ఆకు పచ్చడి బజ్జీలు తింటే అజీర్తి గాయబ్
   ధన్యవాదాలు

 4. తాతగారు మీరు ఇవన్నీ చెబుతూ ఉంటే మేము మా పెరట్లో పెంచిన వంగడాలు గుర్తుకు వస్తున్నాయి, ఎక్కువగా పుల్ల గోంగూర, బచ్చలి, అప్పుడప్పుడు మిరప ఇంకొన్ని రోజులు బెండకాయలు – దొండకాయలు ప్రయత్నించాం గానీ కుదరలేదు మా పెదనాన్నగారి ఇంట్లో ఉంటే కోసుకోవడం తప్ప ఇక కాకరకాయలు పోట్లకాయలు బూడిద గుమ్మడి కాయలు పెద్ద గుమ్మడి కాయలు(ఇది సాధారణంగా ౩ లేదా ౪ కేజీలు తూగుతుంది)
  ఇక ఇవే కాదు ఇంట్లో కొన్ని కొబ్బరి చెట్లు కొన్ని సీతాఫలం చెట్లు, కరివేపాకు మొక్క అన్నీ పెంచేవాళ్ళం. ఏమిటో మీరు చెబుతున్న ఇవన్నీ చూస్తుంటే ఉధ్యోగం మానేసి మళ్ళీ ఆ జీవితం లోకి వెళ్ళాలి అనిపిస్తుంది 🙂

  • @అబ్బాయి ప్రసాదు,
   కాస్త ఉల్లాసపరచే టపా రాయాలనుకున్నా, ఎదురుగా మొన్న సంతలో కొన్న కర్రపెండలం కనపడింది, దొడ్డిలో వాము ఆకు ఉంది ఉల్లికోళ్ళు కనపడ్డాయి,బొబ్బర పిండితో అట్లు వేస్తూంది అమ్మమ్మ ఇంకెందుకూ ఆలస్యమని వాడుతున్నవే ఒక టపా గిలికేసి మీ మీదకి తోలేసేను, అదీ సంగతి.బచ్చలి పాదు ఎండిపోతే పీకేసేము, బూడిద గుమ్మడి ఒకటే కాయ కాసి పాదు పోయింది, దోసపాదు ఇప్పుడే కాస్తోంది, మామిడి, పనస కాసేయి. ఎవరికి ఎంత ప్రాప్తమో, ఎవరికోసమో ఎదురు చూపు.
   ధన్యవాదాలు

 5. ఆహా ! నోరూరించే టపా!
  భోజనప్రియులను ఊరించే టపా!
  పచ్చళ్ళ రాయుళ్ళకు వచ్చే అల్సర్ ను,
  ఆంధ్రా అల్సర్ అని అందుకే అంటారు మరి!

  • @జిలేబిగారు,
   మనవరాళ్ళు బాధపడుతుంటే, వాళ్ళకి నా మనసులో మాట ఇలా చెప్పాలని, వెతికి పాతది మంచి పాట శ్రీపాలగుమ్మి విశ్వనాధంగారిది తెచ్చిపెట్టా. ఇది మొదటగా వరహాలు అనే ఆమె పాడేరు ఆలిండియా రేడియోకోసం అది దొరకలేదు. ఇది వేదవతి ప్రభాకర్ పాడేరు.
   ధన్యవాదాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s