శర్మ కాలక్షేపంకబుర్లు-అన్నమయ్య కీర్తన-పరిశీలన.

మనుజుడై పుట్టి మనుజుని సేవించి

అనుదినమును దుఃఖమందనేలా ||

జుట్టెడు కడుపుకై చొరని చోట్లు జొచ్చి
పట్టెడు కూటికై బతిమాలి |
పుట్టిన చోటికే పొరలి మనసువెట్టి
వట్టి లంపటము వదలనేరడుగాన ||

అందరిలో పుట్టి అందరిలో చేరి
అందరి రూపములటు తానై |
అందమైన శ్రీ వేంకటాద్రీశు సేవించి
అందరాని పద మందెనటుగాన II

అన్నమయ్య కీర్తన-పరిశీలన.

అన్నమయ్య చిన్న కీర్తనలో గొప్ప జీవిత సత్యాలను, వేదాంత తత్వాన్ని చెప్పేరు. ఆవిష్కరించారు;మనిషి దుఃఖాన్ని జయించడానికి ఏంచేయాలో చెప్పక చెప్పేరు, ఏం చేస్తున్నాడో చెప్పేరు, ఎలా దిగజారిపోయి మరలా తిర్యగ్యోనులలో జన్మమందుతారో వివరించారు.

మనుజుడై పుట్టి అన్నారు అన్నమయ్య; దీనికి కారణం; “జీవులెనుబది నాల్గు లక్షలు; చావు పుట్టుకలిక్కడా! ఎవరు చేసిన పాపకర్మము లనుభవించేదక్కడా” అనే తత్వం మనం చిన్నప్పటినుంచి వింటున్నాం. జీవులలో మనిష్యునిగా పుట్టడం ఒక వరం; గొప్పదన్నారు శంకరులు వారి వివేక చూడామణిలో

“జంతూనాం నరజన్మ దుర్లభమతః పుంస్త్వం తతో విప్రతా
తస్మాద్వైదికధర్మపరతా విద్వత్వమస్మాత్పరమ్,
ఆత్మానాత్మవివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితిః
ముక్తిర్నో శతకోటి జన్మసుకృతైః పుణ్యైర్వినా లభ్యతే” …వివేక చూడామణి…2

“జీవులకు తొలుత మానవ జన్మము ప్రాప్తించుట దుర్లభము. దానికంటే ఆ జీవుడు పురుషుడగుటయు, దానికంటె బ్రాహ్మణుడగుటయు, దానికంటె వైదిక కర్మనాచరించువాడగుటయు, దానికంటె విద్య వివేకము కలవాడగుటయు మఱి దుర్లభము. ఇట్టి ఆత్మానాత్మ వివేకము,చక్కని యనుభూతి,బ్రహ్మాత్వ భావమును పొందుట యనునవియైనను నూరుకోట్ల జన్మలలో చేసుకున్న శుభకర్మల పరిపక్వ దశవలన కాని లభ్యము కావు.”

మనుష్యునిగా పుట్టడమే గొప్ప వరం. ఇందునుంచే మానవుడు మరలా ఊర్ధ్వగతికి కాని అధోగతికి కాని పోతాడు, తన కర్మల వలన. ముక్తికి సాధనం మానవ జన్మ, మరొక జన్మలో అది సాధ్యం కాదు. అందుకే అన్నమయ్య మనుజుడైపుట్టి అన్నారు. ఆ తరవాత మరొక మనుజుని సేవించడం; సేవిస్తూ దుఃఖం పొందనేలా, నిత్యమూ అని ప్రశ్నించారు; ఆ సేవ కూడా ఎందుకంటే.

జుట్టెడు పొట్టకై పట్టెడు కూటికై అంటే జానెడు పొట్టకోసం, పట్టెడు కూటికోసం, ఆ కూడు ఎలా ఉండాలంటే

“అత్రాహారార్థం కర్మ కుర్యాదనిన్ద్యం”….యోగ వాశి…నిర్వా.ప్రక….57
ఆహారము కొరకు దోషరహితమగు కర్మను చేయవలెను.

అహారం కోసం చేయకూడని పనులు, చేయకూడని చోట్లలో చేస్తూ, అనగా హింస, హత్యలు,మొదలైన పనులు చేస్తూ దిగజారిపోతున్నాడు, అది కూడా ఎందుకు పట్టెడు కూటి కన్నారు. పొట్టకూటి కోసమే నాడు అటువంటి పనులు చేసేరని నిరసించారు.

ఆ తరవాత పుట్టినచోటికె పొరలి మనసు పెట్టి అన్నారు.సున్నితమైన విషయాన్ని అశ్లీలం లేకుండా చెప్పేరు. మానవుడు తల్లి గర్భం నుండి యోని ద్వారా బయటకు వచ్చి మరొక స్త్రీలో అదే చోటుకోసం, స్పర్శా సుఖం కోసం మనసుపెట్టి పొరలుతున్నాడు, చేయకూడని పనులు చేస్తున్నాడు, మాన భంగాలు మొదలైనవి. సంసార లంపటాన్ని తలకెత్తుకుంటున్నాడు.

ఇన్ద్రియాణి పతన్త్యర్థం భ్రష్టం గృధ్ర ఇవామిషమ్
తాని సంయమ్య మనసా యుక్తా అసీత తత్పరః….యోగ.వా.రత్నా…నిర్వాణప్రక…62

కిందపడిన మాంసపుముద్దపై గద్ద వాలినట్లు, ఇంద్రియములు దృశ్య విషయములపై బడుచున్నవి;కనుక విజ్ఞుడగువాడు ఆ ఇంద్రియములను మనస్సుచే నిగ్రహించి ఆత్మ తత్పరుడై ఉండవలెను.

జనులు ఇది మరిచిపోతున్నారు. వాడిన మాటలో కూడా ఎంత గొప్ప సంయమనమో చూడండి, పుట్టిన చోటికై అన్నారు కాని; పుట్టిన చోటనె అనలేదు, ఎందుకంటే అశ్లీలం ధ్వనిస్తుందని. ఈ స్పర్శా సుఖం కోసం సంసారమనే లంపటం వదలలేకున్నాడు, ప్రయత్న పూర్వకంగా కూడా.

అందరిలో పుట్టి, అందరిలో చేరి ఆందరి రూపములటుతానై అని చాలా పెద్ద విషాయాన్ని క్లుప్తంగా చెప్పేరు. మొన్ననే మనం ఒక టపాలో మనలో పరమాత్మ ఎక్కడున్నాడని వేదం చెప్పిందో చూశాం, జిలేబి గారి వివరణతో ఆస్ట్రోజోయెడ్ గారి సయిన్స్ తో కలిసిన వివరణతో, అందరిలో పుట్టి అన్నప్పుడు, జీవుడు పుడుతూనే పరమాత్మగా ఉన్నాడు సుమా! పుట్టాడా? కాదు పుట్టినట్లు భాసించాడు. మరి పుడుతున్నది నశిస్తున్నది ఏమిటి? దేహం, పుడుతోంది, నశిస్తోంది.జీవునిగా పరమాత్మ లోపలుంటే శివం లేకుంటే శవం కదా! జీవుడికి దేవుడికి తేడా లేదని చెప్పి అందరి రూపములటు తానై అన్న దానిలో

అనేకబాహూదరవక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనన్త రూపం

నాన్తం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప….భ్గ. గీత…11-16

విశ్వమే తనరూపంగా కలవాడయిన పరబ్రహ్మకు అనేక బాహువులు,ఉదరాలు,నోళ్ళు, నేత్రాలు కలిగి అంతం, మధ్య, మొదలు లేనివాడు.

అన్నది ఈ సృష్టి సమస్తము తానే అయివున్న అందమైన వెంకటేశునిగా ఉన్న పరమాత్మను సేవించి తరించవచ్చు అని చెప్పినదీ కీర్తన.

ఇన్ని వేదాంత రహస్యాలను చిన్న కీర్తనలో ఇమిడ్చి అన్నమయ్య మనకు అందించిన ఆణిముత్యం. నేను మొదటిసారిగా విని ఆనందంలో ములిగిపోయా. ఎన్ని సార్లు విన్నానో. దీనిని వ్యాఖ్య చేయమని అడిగేరు శివగారు, శారద గారిని, నేను, మీరు చెప్పండి, లేకపోతే నేను నా బ్లాగులో రాస్తానంటే వారు, ఇది అన్నమయ్య కీర్తన నాకేం పేటెంటు లేదన్నారు; కాని నేనడిగినది మర్యాదా పూర్వకం, లౌకికం మాత్రమే. వారి అనుమతికి ధన్యవాదాలు. నా వ్యాఖ్యలో పొరపాట్లుంటే సరిదిద్దమని మనవి.

ప్రకటనలు

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అన్నమయ్య కీర్తన-పరిశీలన.

 1. పరిగెట్టకుండా ముందర కాళ్ళ బంధం వేసే వాళ్ళు పరిగెత్తేటప్పుడు అడ్డుపడేవాళ్ళు దాటుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు గెలిచాకా వెంట తిరిగేవాళ్ళు ఎప్పుడూ తామే ఒప్పు అనుకుంటారు కానీ, నిజమైన పరుగు జీవితం మంచిగా సాగించడం అనుకోరు.
  నాలాంటివాళ్ళు పరిగెత్తితే ఎక్కడ ఒళ్ళు నెప్పులు వస్తాయోఅని పరిగెత్తడమే మానేస్తారు.

 2. శర్మ గారు,

  అందరాని శ్రీ వేంకటాద్రీశు ‘తానై’ అందరిలో పొరలి
  బతిమాలి కడుపుకై అనుదినము మనుజుని సేవించే !

  సేవించేది ఎవరు ? సేవ అందుకునేది ఎవరు ?

  అంతా విష్ణు మాయ గాకుంటే ?

  జిలేబి.

  • ఏదో తెలుసనుకుంటాం, అంతలో అనుమానం, మళ్ళీ మొదలు,అంతా విష్ణుమాయే.విష్ణుమాయని తెలుసుకోగలిగాం అంతే.. 🙂
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s