శర్మ కాలక్షేపంకబుర్లు-తాంబూలం

DSCN0579

మంచుపొరలో గోదారి

తాంబూలం

తాంబూలం అనేది భారతీయ సంస్కృతిలో ఒక భాగం. దీని గురించి చాలా మంది చాలా చెప్పి ఉండచ్చు. నాకుతోచినది నేను చెబుదామని ప్రయత్నం. అమ్మ లలితాదేవి వేసుకున్నదే అసలు తాంబూలం, ఆ అమ్మ పెట్టిన తమ్మి (నమలుతున్న తములం నుంచి కొంత నాలుకతో మరొకరికి ఇవ్వడం, ఇది సాధారణంగా తల్లి పిల్లలకిచ్చేదే ) తిని అప్పటివరకు మూగ వాడుగా ఉన్న మూగశంకరులు ఐదు శతకాలు “మూగ పంచశతి” అమ్మమీద చెప్పి, తరవాత అమ్మ వరం కోరుకోమంటే, మళ్ళీ మూగవాణ్ణి చెయ్యమన్నారట, ఎందుకంటే అమ్మను కీర్తించిన నోటితో అన్యం పలకడం ఇష్టం లేక, అదీ అమ్మ తాంబూల మహిమ. తాంబూలం పూర్వకాలంలో మహారాజులిస్తే ఒక గొప్ప గౌరవంగా భాసించేది. తాంబూలం ఇచ్చేరంటే ఒక మంచి పని మొదలు పెట్టడానికి సూచన అని అర్ధం. అప్పటిరోజులలో కవులకు కావ్యాలు రాయడానికీ, వీరులకు యుద్ధానికి వెళ్ళడానికి తాంబూలం ఇచ్చేవారు. భారతీయ సంఘంలో తాంబూలమివ్వడం అంటే గౌరవించడమనీ అర్థం. భారతీయ వివాహాలలో ఇతరత్రా కూడా తాంబూలమివ్వడం గౌరవసూచకమే. వివాహంలో తాంబూలమే ప్రముఖపాత్ర వహిస్తుంది, మొదటినుంచీ. అందుకే పిల్ల పెళ్ళి కుదిర్చేనని చెప్పడానికి అగ్ని హోత్రావధానులు తాంబోలం ఇచ్చేసేను, ఇహ తానుకు చావండి అన్నాడు. అంటే మాటివ్వడాన్ని కూడా తాంబూలమివ్వడంగా పరిగణించారు. పెళ్ళిలో సదస్యంలో తాంబూలపు పళ్ళెం అందుకోవడమని ఉండేది, కవులు, కళాకారులు దానిని అందుకోడానికి తహ తహలాడేవారు. ఆ సభలో ఉన్న వారిలో అప్పుడు వారు ప్రదర్శించిన ప్రజ్ఞను బట్టి ఈ తాంబూలపు పళ్ళెం అందేది. స్త్రీల విషయం చూస్తే తాంబూలానిదే అగ్రస్థానం. పువ్వు తాంబూలం పండు తాంబూలమనే నోము కూడా ఉంది. ఏనోము నోచినా, ఏ వ్రతం చేసినా తాంబూలం తప్పని సరి. మరి పూజలో భగవంతునికీ తాంబూలమిస్తాం.

Z2

అడ కత్తెర

నేడు సుపారీ (తాంబూలం) ఇచ్చేరంటున్నారు, ఎందుకుట? మరెవరినో చంపమని, పాపం ఆ సుపారీ తీసుకున్నవాడు, చంపవలసినవారి దగ్గరకొచ్చి ఫలానావాడు, నిన్ను చంపమని సుపారీ ఇచ్చిపోయాడని చెబుతున్న రోజులు. నేటి కాలం లో దీన్ని కిళ్ళీ అంటున్నారు. ఉత్తరాది వారు ఈ కిళ్ళీ వేసి గోడలతో సహా చాలా చోట్లని ఖరాబు చేయడం కూడా తెలిసినదే.కిళ్ళీ లలో కుడా చాలా రకాలున్నాయి. ఉత్తరాది వారి కిళ్ళీలలో “రామ్ ప్యారీ” బాగుంటుందంటారు. ఉత్తరాదిన వేల రూపాయల ఖరీదయిన కిళ్ళీలు కూడా కడతారట. ఇవిగాక జరదా కిళ్ళీ కూడా బంగాళా ఆకుతో వేయడం దేశం మొత్తం మీద ఉంది. ఇందులో (జరదా)పొగాకు వాడుతారు. ఉత్తరాది వారు, దక్షణాన తమిళులు ఈ కిళ్ళీ, తాంబూలాలూ నములుతూనే ఉంటారు. మన తెనుగునాట అంత ఇబ్బంది కర పరిస్థితులు లేవుగాని, తాంబూలమే మరచిపోతున్నారు, నేడు.

Z3

అడ కత్తెర

తెనుగునాట దంపతులు తాంబూల చర్వణం ఒక మధుర ఘట్టం. భోజనం తరవాత భార్య తమలపాకులకు సున్నం రాసి, చిలకలుగా చుట్టి వేళ్ళకు తగిలించుకుంటె, శ్రీవారు భామతో సయ్యాటలాడుతూ, వేళ్ళు కొరుకుతూ, సుతారంగా పెదవి కొరుకుతూ, తాంబూలం సేవించడం ఒక కళ, ఒక మధురానుభూతి, సరస శృంగార క్రీడ. ఇంతటి తాంబూలనికి ఉన్న శక్తి ఏమంటే, తిన్న భోజనం జీర్ణం కావాడానికి ఉపయోగించడమే కాక, ఇది లేపన శక్తి కూడా కలిగిస్తుంది. స్త్రీలు పచ్చకర్పూరం తో కలిపిన తాంబూలం వేసుకుంటే మదనోద్దీపన బాగుంటుందంటారు, అలాగే మగవారికి కూడా చెప్పేరు. తాంబూలలో రకాలు.సభా తాంబూలమని ఉండేది. పెళ్ళి కుమార్తె తండ్రి, పెళ్ళి కుమారుడి తండ్రీ ముందు సభాపతికి తాంబూలమిచ్చి గౌరవించేవారు. ఆ తరవాత సదస్యులందరికి ఇరు పక్షాలవారూ తాంబూలం మిచ్చి గౌరవించేవారు. ఇప్పటికీ శుభలేఖలో “మదర్పిత చందన తాంబూలాది సత్కారాల”ని ఉంటుంది, పద ప్రయోగం. ఒక పెళ్ళికేకాదు అశుభకర్మలో కూడా తాంబూలంకి ప్రసక్తి ఉంది. ఆబ్దీక భోజనం తరవాత దక్షణ తాంబూలం ఇవ్వడం ఇప్పటికీ ఆచారమే. అపర కర్మలో కూడా తాంబూలపు ప్రసక్తి ఉంటుంది. ఈ తాంబూలం భార్యా భర్తలు వేసుకున్నపుడు ఎవరినోరు బాగాపండితే వారిపై ఎదుటివారికి అంత ప్రేమ ఉన్నట్లంటారు. ఆడపిల్లలు పెళ్ళి కాకముందు తాంబూలం వేసుకుని నోరు బాగా పండితే రాబోయేవాడికి ఈమెపై ప్రేమ ఎక్కువంటారు.

DSCN2490

అడ కత్తెర

ఇంత చరిత్ర ఉన్న తాంబూలం లో వాడేవి తమలపాకులు, వక్కలు, సున్నం ప్రాధమికంగా. ఇవి కాక వాడేవి చాలా ఉన్నయి, అవి చెప్పుకోడం మొదలెడితే అదో పెద్ద కధ. తామలపాకులలో రెండు రకాలు, చిన్నాకులు, బంగాళా ఆకులు. చిన్న ఆకులు లేతగా ఉన్నపుడు వాడుకుంటేనే బాగుంటాయి. తామలపాకుల కట్టని “మోద” అంటారు. ఒకో భార్యాభర్త ఒక మోద తామలపాకులు తాంబూలం గా సేవించినవారూ ఉండేవారు. తూగోజిలో తుని తమలపాకు ప్రసిద్ది, ఆకు చాలా పలచగా లేతగా కమ్మగా ఉంటుంది. పగోజిలో దొడ్డిపట్ల ఆకు ప్రసిద్ది. నేను రెండు ఆకులూ ఎరుగుదును బాగుంటాయి. బంగాళా ఆకులు మాత్రం ముదురు ఆకులు బాగుంటాయి, జరదా కిళ్ళీకి. ఇక వక్కల సంగతి, పచ్చి చెక్క, పండు చెక్క అంటారు. తయారు చేయనిది పచ్చి చెక్క, వండి తయారు చేసినది పండు చెక్క. ఉప్పు చెక్కని కూడా వాడుతారు. ఇక సున్నం అయితే ఇదివరలో ఇంటిలో ఉండేది, ఇప్పుడు తమలపాకులు వేసుకోడానికి సున్నం సెంట్ వేసి అమ్ముతున్నారు. ఈ తాంబూలపు సామాన్లు పెట్టుకోడానికి ఒక పెట్టి కూడా ఉండేది. పంక్తి భోజనాలు పూర్తయిన తరవాత సామూహికం గా కూచుని కబుర్లు చెప్పుకుంటూ ఆడవారు మగవారు సభతీర్చి, తాంబూలం సేవించడం నాడు పల్లెలలో ఒక గొప్ప సంగతిగా ఉండేది, అదొక అనుభూతి కూడా.

DSCN2491

అడ కత్తెర

.అప్పటివారు జీవితాన్ని అనుభవించారు. ఇప్పుడంటే వక్కపొడి వాడుతున్నాం కాని నాటిరోజులలో పల్చటిచెక్కలు తెచ్చుకునేవాళ్ళం ఏరుకుని, పల్చటి చెక్కబాగుంటుంది. ఈ వక్కలను కత్తిరించుకోడానికి ఒక సాధనం ఉండేది అదే మీరు చూస్తున్న సాధనం, దీని పేరు అడకత్తెర. దీనిని ఇత్తడితో చేసేవారు. అది కూడా ఆడమగబొమ్మల రూపంలో ఉండేవి. వక్కని ఈ రెంటి మధ్యపెట్టి రెండు కాళ్ళు పట్టుకుని వత్తితే చెక్క ముక్కలయ్యేది. ఈ అడకత్తెర చూస్తే కూడా భారతీయ తత్వం బోధపడుతుంది. స్త్రీ పురుషుల బొమ్మల తల దగ్గర కాని హృదయం దగ్గర కాని శీల ఉంటుంది. భార్యాభర్తల మధ్యకు వెళ్ళిన వాని పని అడకత్తెరలో పోక చెక్క చందమన్నారందుకే. అంటే భార్యా భర్తలు ఆలోచనలో ఒకలా ఉంటారనీ,ఉండాలనీ, శారీరికంగా కలుస్తూ విడిపోతూ ఉంటారనీ, మధ్యలో ఎవరయినా కల్పించుకుంటే వారి పని పోక చెక్కలా అవుతుందనీ, చెప్పక చెప్పేరు, ఈ అడ కత్తెర ద్వారా కూడా. ఇప్పుడు పరిశీలించండి, అన్వయం కుదురుతుంది..

 

16 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-తాంబూలం

  • అమ్మాయి జ్యోతిర్మయి,
   చాలా కాలం తరవాత కనిపించావు, ఎల్లరున్ కుశలమే కదా!

   ఇదెప్పటి టపా అమ్మా! రెండేళ్ళయియుండ్లా!

   మదర్పిత చందన తాంబూలాది సత్కారాలంటున్నావు, శుభకార్యం తలపెట్టేవా ఏంటి?
   శుభమస్తు.
   ధన్యవాదాలు.

 1. మీ బ్లాగ్ ని గత రెండు నెలలుగా చదువుతున్నాను. చదివినప్పుడల్లా మనసు నిండుతుంది అంటే అతిశయం కాదు. ఇప్పటి ‘ఫాస్ట్ లైఫ్’ లో మీ వ్యాసాలు వేసవిలో చల్ల గాలి లాంటివి.

  అడ కత్తెర, అడకత్తెరలో పోకచెక్కలకి అర్ధం తెలిసింది. ధన్యవాదాలు.

  • @శకుంతల గారు,
   నా బ్లాగుకు స్వాగతం. మీరు పెట్టిన పరీక్షలో నెగ్గేననమాట.
   అడకత్తెర నేనెరిగుండగా బాగా వాడేవారు, కాల క్రమేణా అంతరించింది, ఇప్పుడు అడకత్తెరలో పోకచెక్కగురించి తెలుసుకున్నారు కదా!
   ధన్యవాదాలు.

 2. పండిత శ్రేష్టులకి అగ్ర తాంబూలం.
  ఇలాంటి విషయాలు చెపుతున్నందుకు ధన్యవాదములు

  అడకత్తెర చిత్రం చూడటం ఇదే మొదటి సారి. అడకత్తెరలో పోక చెక్క ఎందుకు అంటారో ఇప్పుడ తెలిసింది . 🙂

  • @వనజ గారు,
   మీరూ అడకత్తెర గురించి చెప్పలేకపోతే ఆశ్చర్యమనిపించింది. కొత్త బిరుదులిచ్చేస్తున్నారా? అడకత్తెరలో పోక చెక్క తెలిసింది కదా, అమలు చేసేయండి 🙂
   ధన్యవాదాలు.

 3. తెలియని ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నాను – మీ పోస్ట్స్ ద్వారా.
  చాలా చక్కగా వివరిస్తున్నారు. ధన్యవాదాలు సర్!

 4. అడకత్తెరలో పోక చెక్క అంటే ఇదా? నేను ఇప్పటివరకూ అడకత్తెరనే చూడలేదు. ఇదే మొదటిసారి. ధన్యవాదాలు తాత గారూ. మీ బ్లాగు కొస్తేనే విషయాల వెల్లువ 🙂

  • @అమ్మాయ్ ధాత్రి,
   తాంబూలం వేసుకుంటూ భార్యభర్త చెప్పుకునే కబుర్లు ఇంకా బాగుంటాయి. 🙂
   ధన్యవాదాలు.

 5. శర్మ గారు,

  ఇచ్చామండీ మీ కాలక్షేపానికి, కాల నిక్షేప టపా కంటెంట్ కి కామెంటు తాంబూలం కా ‘మింటు’ !

  చీర్స్
  జిలేబి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s