శర్మ కాలక్షేపంకబుర్లు-మరోసౌందర్య సాధనం.

DSCN1560

మరో సౌందర్య సాధనం.

మొన్న నెలవారీ పచారీ సామాన్లు తెచ్చాడు, కొట్టు కుర్రాడు. మా ఊళ్ళో ఒక సౌకర్యం, షాపుకి ఫోన్ చేసి జాబితా చెప్పేస్తే సరుకులు ఇంటికి పంపేస్తాడు. డబ్బులు వెంటనే ఇచ్చెయ్యచ్చు, లేదా తరవాత పట్టుకెళ్తాడు, బాగోని సరుకు తిప్పి ఇచ్చేస్తే తీసుకుంటాడు. మా ఇంటిలో మా చిన్న కోడలు కేషియరు,ఇల్లాలు ఫైనాన్సు, హోం మినిస్టర్, చివరికి బిల్లు ఒక సారి నా దగ్గరికొస్తుంది, ఊరికే చూడటానికే. అలా జాబితా చూస్తుండగా సబ్బులు ఆరింటికి రెండు వందలకి రెండు రూపాయలు తగ్గి ఉంది. ఇల్లాలొస్తే ” సబ్బు ఒక్కొకటి ముఫై మూడు రూపాయలా?” అన్నా. “అవును మీరు చూడక తెలియటం లేదు, డబ్బులు సంచీలోనూ,సరుకులు జేబులోనూ తెచ్చుకునే రోజులొచ్చాయి,” అంది. “సబ్బులు మళ్ళీ నెల నుంచి ఆరు సరిపోవు. మన బాత్ రూంలో ఒకటి పిల్లల బాత్ రూంలో ఒకటి సబ్బులుంటాయి కదా మరి, వేసవి కాలం ఒకటికి పది సార్లు స్నానాలుంటాయి,” అంది. “అది సరే కాని మనం ఇది వరలో అంటే చిన్నప్పుడు సున్నిపిండి వాడేవాళ్ళం కదూ” అంటే, “నిజమే ఇప్పుడెవరు వాడుతున్నారు, అసలు సున్నిపిండి చేసుకునే సమయం, ఆలోచనా లేదు”  అంది. సున్ని పిండి ఎలా తయారు చేస్తారంటే, ఇలా చెప్పింది.

DSCN1583

సున్ని పిండి ఒక ఆరోగ్య సౌందర్య సాధనం. దీనిలో ముఖ్యంగా శనగపిండి, పెసరపిండి వాడుతాం. వీటికి తోడు, కచ్చూరాలని, బజారులో దొరుకుతాయి, వాటిని, వట్టి వేళ్ళు దొరుకుతాయి, వాటిని కలిపి దంచుకుని, దీనికి కొద్దిగా షీకాయిపొడుం కాని, కుంకుడు కాయ పొడుం కాని కలిపివాడుకుంటాం. దీనిని నిత్యమూ వాడుకోవచ్చు. ఒళ్ళు రుద్దుకుని నీళ్ళు పోసుకుంటే చర్మం నిగనిగ లాడుతుంది. తలంటు పోసుకున్నపుడు దీనిని జుట్టుకు పట్టించి రుద్దుకుంటే బాగుంటుంది.సున్నిపిండి కలిపేటపుడు కొద్దిగా మందార ఆకులు కూడా కలిపిన కుంకుడు కాయ రసంతో రుద్దు కుంటే తొందరగా వదులుతుంది జిడ్డు. తలంటు పోసుకునే ముందు ఒంటికి నూని రాసుకుని ఆ తరవాత తడిసిన సున్నిపిండి రాసుకుని కొద్దిగా ఆరిన తరవాత నల్చేస్తే ఒంటినున్న మట్టి పోతుంది. నూనెకి మెత్త పడి పిండితో వచ్చేస్తుంది. ఒళ్ళు మాగిళ్ళు కట్టడం అంటారు, అనగా, చాలా మెత్తటి మట్టి శరీరం మీద చెమటతో కలిసి పేతుకుపోతుంది, నల్లగా, ఇది పోవాలంటే,   సబ్బు వల్ల కాదు. ఈ మట్టి మూలంగా ఫంగస్ ఏర్పడి చర్మ వ్యాధులు కూడా రావచ్చు. అందుకు నూని రాసుకుని ఆపై సున్నిపిండితో నలిస్తే మట్టిపోతుంది. మగవారికి, అందునా ఒంటినిండా రోమాలున్నవారికి నల్చుకోవడం యాతనే. అందుకు వారు నూని రాసుకుని కొద్దిసేపు తర్వాత ఈ సున్నిపిండితో రుద్దుకుంటే చాలా బాగుంటుంది. నెలకి అయ్యే ఖర్చు బహుశః వంద రూపాయలు కావచ్చునేమో ఇలా చేసుకుంటే. ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం, మరి సౌందర్య సాధనం కూడా. సమయం లేదంటారా! ఒళ్ళు మీదే మీ ఇష్టం.

DSCN1584

ప్రకటనలు

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మరోసౌందర్య సాధనం.

 1. తాతగారు,సున్నిపిండి తయారి చెప్పినందుకు ధన్యవాదాలు..:)
  సున్నిఫిండి వాడుతున్నా కానీ అశ్విని వారిది..
  ప్రయత్నించి చూస్తాను ఈ పద్ధతి..:)

  • @ధాత్రి,
   మా మంచి మనవరాలు కదా! సున్నిపిండి వాడుతున్నావా? ముసలమ్మవని ఎవరూ ఎగతాళీ చెయ్యలేదా? 🙂 ఎవరేమనుకున్నా నువ్వు చేస్తున్న పనికి నా పూర్తి మద్దతు, స్వంతంగా తయారు చేసుకో ఇంకా బాగుంటుంది కదా!
   ధన్యవాదాలు.

 2. బాగుందండి పోస్ట్..
  ఇప్పుడు మార్కెట్ లో అన్ని ఫేస్ వాష్లు, ఫేస్ స్క్రబ్ లు…వాటి ధరలు ఆకాశానికి అంటుకుంటున్నాయి. అయినా
  భలే అమ్ముడుపోతున్నాయి. మొఖానికి ఒక ఫేస్ వాష్, మిగతా శరీరానికి బోడి వాష్. శరీరానికి వాడేవి మొఖానికి వాడరు. ఇవే కాక రక రకాల క్రీములు. ఉదయం రాసుకునే బోడి క్రీం, రాత్రి రాసుకునే బాడి క్రీం వేరు, వేరు. ఇవికాక, చర్మం ముడతలు పడకుండా క్రీం, మొటిమలు రాకుండా క్రీం, ఎన్నో ఎన్నో….. ఆ సున్నిపిండి , శెనగపిండి, పెసరపిండి, మందార ఆకులు కూడా కలిపిన కుంకుడు కాయ రసం ఇవన్నీ చరిత్రగా మిగిలిపోతాయండి ఇంకొన్ని సంవత్సరాలలో..

  • @జలతారు వెన్నెలగారు,
   కంపెనీలు తయారు చేస్తున్నాయని కొంటున్నాము అని మనం, కొంటున్నారని తయారు చేస్తున్నామని వారు అంటారు, సొమ్ము చేసుకునే సాధనం 🙂 కాల చక్రం మళ్ళీ పైనుంచి కిందికి వస్తుంది చూడండి.నాకు నమ్మకమే 🙂 స్క్రబ్ అంటే గుర్తొచ్చింది, ముదిరిన బీరకాయలో గింజలు తీసి పై పెంకు తీసేసి లోపల ఉన్న దానిని చేతిలో పట్టే ముక్కలుగా చేసుకుని నీటిలో పడేసి ఉంచుకుని ప్రకృతి సిద్ధమయిన స్క్రబ్ వాడే వాళ్ళం, ఇప్పుడు మేమూ మానేశాం చెప్పద్దూ, మంచి విషయం గుర్తు చేశారు.
   ధన్యవాదాలు.

 3. బాగుందండి. చక్కటి విషయాలను తెలియజేశారు. సున్నిపిండి ఒంటికి చాలా మంచిది. పూర్వం పెద్దవాళ్ళు కూడా సున్నిపిండి ఉపయోగించేవారు.

  చంటి పిల్లలకు సున్నిపిండితో నలుగుపెట్టి, స్నానం చేయించి సాంబ్రాణి పొగ వేస్తే చాలాసేపు ఆదమరిచి హాయిగా నిద్రపోతారు. ఇందువల్ల పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు.

  . అయితే ఈ రోజుల్లో నలుగుపెడితే దద్దుర్లు వస్తాయని పిల్లలకు నలుగుపెట్టవద్దని కొందరు వైద్యులు చెబుతున్నారు. పూర్వం అయితే నలుగుపెడితేనే దద్దుర్లు రావటం వంటివి జరిగేవి కావు. ఇప్పటి నలుగుపిండిలో కల్తీ వల్ల ఇలా జరుగుతుందేమో ?

  ఈ రోజుల్లో నలుగుపెట్టేంత ఓపిక అందరికీ ఉండటం లేదు.. చిన్నపిల్లలకు కూడా రకరకాల క్రీములు, సబ్బులు వచ్చేశాయి. బోలెడు డబ్బు పెట్టి రకరకాల సబ్బులు కొనుక్కుని వాడుకోవటాన్నే ఈ రోజుల్లో చాలామంది ఇష్టపడుతున్నారు.

  బాత్రూంస్ ఎక్కువ శుభ్రం చేసుకోవాలని కూడా కొందరు నూనెతో మసాజ్, సున్నిపిండి వాడకాన్ని మానేశారేమో ? అనిపిస్తుంది.

  ఏమైనా కొంచెం ఓపిక చేసుకుని వారానికి ఒకసారైనా సున్నిపిండితో నలుగు పెట్టుకుంటే ఎంతో మంచిది. సున్నిపిండి సహజసిద్దమైన సౌందర్యసాధనం కదా !

  టపాలోని చిత్రాలు చాలా బాగున్నాయండి.

  • @అనూరాధ,
   వైద్యులు చెబుతున్నదానిలో తప్పులేదు. రసాయనిక అవశేషాలు ఉండిపోయిన వాటిని నలగుపిండికి ఉపయోగిస్తే దద్దుర్లు రావా? నల్గుపిండే కదా అని నొక్కులు, నూకలు, పొట్టు కలిపి నలుగుపిండి తయారు చేస్తున్న సంఘటనలు చూస్తున్నాం కదా. శరీరం మనది ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకున్నపుడు కొంత ఖర్చు తప్పదు. సబ్బులకు ఖర్చు పెట్టటం లేదా?. బాత్ రూం శుభ్రం చేసుకోవాలని ఒంటి మీద మట్టి పేరబెట్టుకోడాన్ని ఏమంటారు? సహజమైన వానితో తయారు చేసుకుంటే శ్రద్ధగా, ఫలితాలు బాగుంటాయి కదా, మన ఆరోగ్యమూ బాగుంటుంది.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s