మరుస్తున్న కొన్ని కూరలు, పళ్ళు,చిరుతిళ్ళు
పై ఫోటో లోది నేతి బీరకాయ. ఇది వాడకం తక్కువే. దీనిని తెలగపిండితో కలుపుకుని వండుకుంటే బాగుంటుంది. పాలిచ్చేతల్లులకు మంచి ఆహారం. పిల్లలకు పాలు సమృద్ధిగా వుంటాయి.
వీటిని చెమ్మ చిక్కుళ్ళు అంటాం. వీటిని బాగాలేతగా ఉండగా బెల్లం తో కూర వండుకుంటే చాలా బాగుంటుంది. దీనిలో పీచు పదార్ధం ఎక్కువ, చిన్న ప్రేవులను శుభ్రం చేస్తుంది.ముదిరిన కాయలో గింజ ఒక్కొకటి ఒక అంగుళం పైన పొడవుంటుంది. మంచి మాంసకృత్తులనిస్తుంది. తీగ జాతికి చెందినది.
పై చిత్రంలో రాచ ఉసిరి కాయలు, రామాఫలం, మరొక పక్క వేరు శనగ కాయలు కనపడుతున్నాయి కదా. మధ్యలో రామాఫలం లో గింజలు తక్కువగా ఉంటాయి, పండు నిండా తీయని గుజ్జే. కొద్ది వాసన ఉంటుంది. మంచి పండు. సీతాఫలం లాటిదే, లక్ష్మణ ఫలం కూడా ఉంది, ఈ సారి దొరికితే పొటో తప్పక పెడతా. దీనిని గ్రామీణులు రాంబాళం పండు అంటారు. ఇది రామాఫలం.అల్లి పళ్ళు అని చిన్నవి నల్లగా ఉన్న పళ్ళు దొరుకుతాయి. అవి కూడా కనపడితే తప్పక చెబుతా.
మీరు చేమ చూసి ఉండచ్చు, తినీ ఉండచ్చు, వేయించుకుని ఉప్పూ కారం జల్లుకుని తింటే బాగా ఉంటుంది. చేమ నాకు బాగా ఇష్టం, నాఇల్లాలికి రామాఫలం ఇష్టం, ఇద్దరం కలిసి ఈ రెండిటినీ గయలో వదిలేశాం. చేమ ఆకులు చూసి ఉండరు. చేమ ఆకులు ఇలా పెద్దవిగా ఉంటాయి. వీటిని సన్నగా తరిగి పులుసుపెట్టుకుంటే చాలా బాగుంటుంది. మంచి ఆకు కూర.
ఇక్కడ లేత మామిడి కాయల్ని పిందెలను చూస్తున్నారు కదా! ఇందులో కాయలయితే పప్పులో వేసుకోడానికి బాగుంటాయి, బాగా ముదిరిన కాయ పప్పులోకి బాగోదు. ఇక పిందెలున్నాయి చూడండి, వీటిని సన్నగా తరిగి మెంతి కారం లో కలిపి వేసుకుంటే, పప్పుతో పాటు నంజుడికి బలేగా ఉంటాయి. ఈ లేత పిందెలు పులుపు ఉండవు కాని కొద్దిగా వగరు ఉంటుంది. ఆ వగరు ఒంటికి మంచిది, మరెలాగా వగరు తగలదు. ఈ పిందెలు మీకు దొరకడమే కష్టం లెండి. ఉసిరికాయ, చిన్నవి, రాచ ఉసిరి కాయలతో కూడా మెంతి బద్దలేసుకోవచ్చు.
వీటిని గుమ్మడి వడియాలంటారు. కలగలుపు పప్పు లోకి, పచ్చిపులుసు వడియాలు కలుపుకుని పచ్చిపులుసు చేసుకుంటే బాగుంటాయి. బూడిద గుమ్మడితో చేస్తారు, బూడిద గుమ్మడిని కూష్మాండం అంటారు, ఈ కూష్మాండ లేహ్యం జ్ఞాపక శక్తిని పెంచుతుంది.మరి వడియాలు కూడా అంతేగా. పళ్ళు లేని నా లాటివారికి ఇబ్బందే, నమలడం.
వీటిని చల్ల మెరపకాయలు లేదా ఊరు మెరపకాయలంటాం.వీటిని కూడా భోజనం లో చేర్చేరు మనవాళ్ళు. పప్పుతో బాగుంటాయి. కారం తినడం మంచిదన్నారు.వీటిని పుల్లటి చల్లలో నానబెట్టి ఎండబెట్టి మళ్ళీ నానబెట్టి తయారు చేస్తారు. వీటిని కొద్దిగా మజ్జిగలో చింతకాయలు తొక్కి వేసిన దానిలో కూడా వేసి తయారు చేస్తారు. అవి మాత్రం కొద్దిగా పులుపు కారంగా ఉంటయి. పూర్తిగా చల్లలో వేసినవి కమ్మగా ఉంటాయి.
వీటిని సగ్గుబియ్యం వడియాలంటారు. పెట్టుకోడం తేలికే. వేయిచుకుని తింటే చిరుతిండిగా బాగుంటాయి
పెట్టుకోలేమంటారా? కొన్ని ప్రయత్నం చేసి పెట్టుకోవచ్చు. మిగిలినవాటిని మీరు కోరితే పల్లెలనుంచి తెచ్చి అమ్మడానికి సిద్ధంగానే ఉంటారు, ప్రయత్నించండి. బాగుంటేనే కొంటామని చెప్పండి, చక్కగా తయారు చేసి తెస్తారు, మీకు ఉపయోగం, మరొకరికి పని కల్పించి, జీవనాధారం ఏర్పాటు చేసినవారవుతారు కదా!
జంక్ కంటే మంచిది,ఆలోచించండి 🙂
మరికొన్ని వంటకాల కోసం ఈ క్రింది లింకుని చూడండి.
http://www.samputi.com/launch.php?m=home&l=te
@లింక్ ఇచ్చినందుకు, వ్యాఖ్యకు
ధన్యవాదాలు.
చేమ మొక్క పెంచాను. ఆకులు చాలా అందంగా ఉన్నాయి. వాటితో కూర చెయ్యొచ్చని తెలియదు. ఈ సంవత్సం మళ్ళీ వేసి చూస్తాను బాబాయి గారు.
@జ్యోతిర్మయి,
చేమ ఆకులు, బాగా ముదిరినవి కాక కోసుకుని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా తరిగి వరి పిండితో తోట కూర పులుసులాగా పులుసు పెట్టుకుని వెల్లుల్లి పాయ ఇష్టమయితే వేసుకుని, పులుసుని చాలా సేపు మరగనిస్తే …అబ్బా…చెప్పలేనమ్మాయ్, చేయ్యి నాక్కోవలసిందే
నెనరుంచాలి.
ఉత్తరాదిలో మన బీరకాయలు వర్షాకాలంలోనే దొరుకుతాయి. మిగతా ఏడాదంతా నేతి బీరకాయలే దొరుకుతాయి. హిందీలొ వీటిని “నునువా” అంటారు. నాకైతే మన బీరకాయలే రుచిగా ఉంటాయి.
@బోనగిరి గారు,
ఈ కూరలన్నీ శిశిర ఋతువు, చైత్రమాసాలలో మాత్రమే దొరుకుతాయి, తరవాత దొరకవు ఇక్కడ.
నెనరుంచండి
నేతిబీరకాయ చక్రాజ్జ్లతో బజ్జీలు చేస్తా నేను.
@గోంగూర గారు,
మీ పేరే ఆంధ్ర మాత. స్వాగతం సు స్వాగతం. బజ్జీలు బహు పసందు
నెనరుంచండి
బూడిద గుమ్మడి ఒడియాలు చిన్నప్పుడు తినడమే!
ఇప్పుడు పెట్టి ఇచ్చేవారు లేరు.
సగ్గుబియ్యం వడియాలు, ఊరు మిరపకాయలు షాప్స్ లో దొరుకుతున్నాయి శర్మ గారు ఇక్కడ కూడా…
@శ్రీ గారు, ( జలతారు వెన్నెల)
మీకిప్పటికే పెసరట్ల బాకీ తీరలేదు, మరో బాకీ పెట్టను :). మీరీసారి వస్తే మీకు మొత్తం బాకీ తీర్చేసి అక్కడ మీకు దొరకని గుమ్మడి వడియాలిచ్చి పంపుతా 🙂 ఆడ పడుచుకి ఆ మాత్రం చెయ్యలేమా? 🙂
నెనరుంచండి
బాగుంది శర్మ గారూ, ఈ పోస్టు. ఫోటోలు కూడా! నిజానికి, ఆ ఫోటోలు లేకుండా ఈ పోస్టు సాధ్యం కాదు, అంటే అందగించదు. బాగుంది.
ధన్యవాదాలు!
@వెంకట్ గారు,
మీరు ఫోటో లు మెచ్చేరంటే ఆనందమే. “అందగించదు” ప్రయోగం బాగుంది.
నెనరుంచండి
ఒక్క చేమ ఆకు తప్ప మిగతా వన్నీ తిన్నాను. Dr MV Ramanarao గారూ, ఎవరన్నా మాలతీ చెందూర్ “వంటలూ పిండివంటలూ” పుస్తకం ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందో చెప్తారా? మా ఇంట్లోది మా ఆవిడ కాపరానికి వచ్చినప్పుడు తీసుకు వచ్చింది అవసాన దశలో ఉంది. బాబ్బాబు మా ఇంట్లో పాత వంటలు తిందామంటే సరీగ్గా కుదరటల్లేదు.
@రావు, లక్కరాజు గారు,
చామ ఆకులు చూశారుకదా! విశాఖ,విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో కూడా చామ పండుతుంది. ఆకులు చూశారు కదా, దొరికితే తోట కూర పులుసులా పులుసు పెట్టించండి బాగుంటుంది.
నెనరుంచండి
కష్టేఫలేశర్మగారు వర్ణించిన కూరగాయలు ,పండ్లు ,ఇప్పటికీ చాలా చోట్ల,చాలా యిళ్ళలో వాడుతూనే ఉన్నారు.internet లోను ,వంటల పుస్తకాల్లోను (మాలతీ చందూర్ గారు,ఇతరులు రచించినవి ) చూడవచ్చును.బీరకాయలూ, నేతిబీరకాయలూ వేరు .ఒకటి కాదు.అలాగే ,చిక్కుళ్ళూ,గోరుచిక్కుళ్ళూ,వేరు.కాకరకాయలూ,ఆగాకరకాయలూ వేరు.ఇవిగాక,ఒక్కొక్క ప్రాంతంలోనే ప్రత్యేకంగా లభ్యమయే కూరగాయలూ.పళ్ళూ.వంటలూ ఉన్నాయి.
@@రమణారావు గారు,
చాలా మంది వాడుతున్నారన్నారు, మంచిదే. నేను వంట ఎలా చేసుకోవాలో చెప్పటం లేదు, వయసయిపోయి ఛాదస్తం పెరిగిపోయి, ఏదో ఇలా రాసేసేను, 🙂
నెనరుంచండి
నిజమేనండి, జంక్ కంటే మంచిది,
బాగున్నాయి. చక్కగా ఫోటోలు కూడా వేసారు.
నేతి బీరకాయతో కూర వండుతారని తెలియదండి. మేము రోటి పచ్చడి ( మిక్సీ పచ్చడి ) చేస్తాం.
@అనూరాధ,
ఎలాగయినా బాగానే ఉంటుంది. కొన్ని, కొన్ని రకాలుగా వండుకుంటే బాగుంటుందని ప్రతీతి ఏర్పడింది. తోట కూర పచ్చడి చేసుకోవచ్చు, కాని గోంగూరకే ప్రసిద్ధి.వంకాయ గుత్తి వంకాయ కూరంటారు, అంటే తొడిమతో కాయను వండుకోవడం. మరే కాయ తొడిమతో వండం. అదీ సంగతి. ఇక్కడ గుత్తి అంటే తొడిమ crown అని అర్థం, తొడిమ కూడా నమిలి పారేస్తాం కదా, రుచిగా ఉంటుందేం!
నెనరుంచండి
అందరికీ తెలిసిన బీర కాయ ను సగానికి ( అడ్డం గా ) కొస్తే , అది నున్నగా ఉన్న వలయాకారం లో ఉండదు. అంటే కానీ నేతి బీరకాయ గుండ్రం గా కట్ అవుతుంది ! బీరకాయ ను పథ్యం గా తినమని ఎందుకు చెబుతారంటే , అది తేలిక గా జీర్ణ మవడమే కాకుండా , విటమిన్లు ఖనిజాలు కూడా ఉంటాయి !
ఇక వీటితో వంటలంటారా ? మీ ఓపికను బట్టి , ఇంటర్నెట్ లో అనేకం ఉన్నాయి !
@సుధాకర్ గారు,
రామా ఫలమే కాదు, లక్ష్మణ ఫలం కూడా ఉంది, ఇవన్నీ గోజిలలో బాగానే దొరుకుతాయి. మొత్తం తెనుగునాట దొరుకుతాయని నా అభిప్రాయం.చేమ ఆకుల పులుసు చిక్కగా వండుకుంటే బలే చక్కగా ఉంటుంది. చామ ఆకులు చూసి ఉండరు కదా! ఎక్కడేనా కనపడితే ఇది చామ కదూ అని గుర్తిస్తారని ఫోటో పెట్టేను.
నెనరుంచండి
సర్ రామాఫలం ఎక్కడ దొరకుతుంది? ఏ సీజన్ లో లభ్యమవుతుంది? కేన్సర్ చికిత్సకు అద్భుతంగా పని చేస్తుందని చదివాను. దయచేసి మిత్రులెవరైనా వివరాలు ఇస్తే రుణపడి ఉంటాను.
శ్రీధర్ పారుపల్లి గారు,
స్వాగతం.
సీతాఫలం, రామాఫలం, లక్ష్మణఫలం, హనుమఫలం ఇవన్నీ ఒకే కుటుంబానికి చెందినవి. రామా ఫలం లక్ష్మణ ఫలం కేన్సర్ ను తగ్గిస్తాయన్నారు అలాగే హనుమఫలం కూడా కేన్సర్ ను తగ్గిస్తుందన్నారు.
రామా ఫలం మా దగ్గర దొరుకుతుంది, మీరెక్కడో తెలియదు, ఇది వచ్చే కాలం జనవరి నుంచి ఏప్రిల్ వరకు, ఇప్పుడు దొరకదు, నేను రెండు నెలలుగా సంతకి వెళ్ళటం లేదు, మళ్ళీ ఆదివారం వెళతాను, కనపడితే >>>>? ఇక హనుమఫలం శ్రీకాకుళం ప్రాంతం లో దొరుకుతుంది, లక్ష్మణ ఫలం ఎక్కడ దొరికేది చెప్పలేను. కొద్ది కాలం తేడా లతో అన్నీ శీతా ఫలం దొరికే సమయంలో నే దొరుకుతాయి.
మరో మాట త్రిఫల చూర్ణం కేన్సర్ ను తగ్గిస్తోందని అమెరికా వారి ఉవాచ. మీకది దగ్గరలోని ఆయుర్వేద మందుల కొట్లో దొరుకుతుంది. ఎక్కువ చెబితే మన్నించండి.
ధన్యవాదాలు.
సీతాఫలం లాగే రామాఫలం కూడా వైజాగ్,శ్రీకాకుళం ప్రాంతాల్లో
దొరుకుతుంది.హైదెరాబాద్ లో కూడా దొరుకుతుంది.వీటికి సీజన్ సీతాకాలంలోబాగా
దొరుకుతాయి.ఐతే రామాఫలం సీతాఫలం (custard apple) అంత రుచిగా ఉండదు.
2014-06-23 19:50 GMT-07:00 “కష్టేఫలే” :
> kastephale commented: “శ్రీధర్ పారుపల్లి గారు, స్వాగతం. సీతాఫలం,
> రామాఫలం, లక్ష్మణఫలం, హనుమఫలం ఇవన్నీ ఒకే కుటుంబానికి à”
>
మిత్రులు రమణా రావు గారు,
మా దగ్గర రామా ఫలం ఏప్రియల్ నెల దాకా దొరుకుతోంది.
ధన్యవాదాలు.
SridharjI,
Pl see this post.
http://ayurbless.blogspot.in/2014/05/blog-post_8761.html
నోరూరించారు!
అన్నట్లు ఊరుమిరపకాయలలో మరొక వెరైటీ. కొన్నిసార్లు మా అమ్మగారు పెట్టారు. మనం మాగాయకోసం మామిడి చెక్కులను బరువు క్రిందపెట్టి రసం ఓడ్చుతాం కదా. ఆ రసం మహోపులుపు. దానిలోమిరపకాయలు ఊరబెట్టి చేసారు. రుచిలో అద్బుతంగా ఉంటాయి – అమోఘమైన మామిడి సువాసనతో. తప్పక ప్రయత్నించండి.
ఊరుమిరపకాయలు పెట్టే వారు చాలా మంది మిరపకాయలను మధ్యకు చీరి పెడతారు. మా అమ్మగారు మిరపకాయలకు దబ్బనం లేదా కంఠానీతో రంద్రాలు చేసి పెట్టే వారు. అలా చేయటం వలన మిరపకాయలు పీలికలలాగా రాకుండా బాగా ఉంటాయి చూడటానికి.
@శ్యామలరావు గారు,
ఇదివరలో మేమూ అలాగే చిల్లులు పెట్టేవాళ్ళం, ఓపిక నశించి, చాకుతో, కట్టిపీటని, మధ్యలో చీరుతున్నాం. మీరు చెప్పినదానిని మామిడి కాయ “ఊట” అంటారు. దీనిలో వేసుకుంటే బహు పసందుగా ఉంటాయి. కాని ఆ మామిడి ముక్కలు ఉపయోగం తక్కువని మానేశారు, మావాళ్ళు. ఆమ్ చూర్ చేసుకోవచ్చు ఆ ముక్కలతో
నెనరుంచండి
ఒక ప్రశ్న నేతి బీరకాయలు మామూలు బీరకాయలు వేరా?
జ్వరం వచ్చినా కొంచం అస్వస్తత అయినా బీరకాయలే, మీరు అన్నీ చెప్పేస్తున్నారు, నేటి తరానికి ఎలా కొనుక్కోవాలో తెలియదు(అంటే నాలాంటి వాళ్ళకు).
ఈ విషయాలు కూడా తెలిపితే బాగుంటుంది, లేకపోతే బాగారాని కూరలు తింటాము తాతగారు.
బీరకాయలు ముదిరి పొతే కూర చేదుగా ఉంటుంది, బెంగళూరు టమోటాలు పులుపు ఉండవు,
@ప్రసాద్,
నేతి బీర కాయ నున్నగా ఉంటుంది, మామూలు కాయ గొగ్గులతో ఉంటుంది. చేదు ముదిరినందుకు కాదు. ముదిరిన కాయ పచ్చడికి బాగుంటుంది. మారీ ముదిరిపోయి ఎండిపోతే గింజలు తీసేసి పై తొక్క తీసేసి దాన్ని నీటిలో వేసి కొద్దిగా మెత్త పడిన తరవాత (సహజ) natural scrub ఒళ్ళు తోముకోడానికి వాడే వాళ్ళం 🙂 బీరకాయ తేలికగా జీర్ణమవుతుంది, బీరుకాయ కాదు బాబూ 🙂
నెనరుంచండి
ఈ బీర పీచుని ఇక్కడ అమెరికాలో ‘లుఫా scrub ‘ అని $15-20 కి ఒక ‘హెల్త్ ఫుడ్’ దుకాణంలో అమ్ముతుంటే నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు. మనం వదిలేస్తున్నవి ఇక్కడ ‘natural లివింగ్’ క్రింద ప్రమోట్ చేస్తున్నారు, బాగా ధరలు పెంచి.
ఈ నేతి బీరకాయలు ఇక్కడ కొరియన్ మరియు చైనీస్ దుకాణాలలో కూడా దొరుకుతాయి. కాని వాటికి ఆంధ్రలో నేతి బీరకాయల రుచి ఉండదేన్డుకో మరి!
మీరు చెప్పిన చెమ్మ చిక్కుల్లని మా అమ్మ తమ్మ కాయలు అని తెలకపిండి తో చేసినట్లు గుర్తు. అప్పుడు ఇవన్ని నాకు ‘కంట్రీ ఫుడ్’ అన్నట్లు అనిపించేది. కాని ఇంత దూరం వచ్హాక వాటి విలువ తెలుస్తోంది. ఇవన్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.!
@శకుంతలగారు,
నిజమే! దూరాన ఉన్నారు కనక ఇక్కడికి దగ్గరలో ఉన్నారు, మనసు ద్వారా, అదే మనసు చిత్రం, లేనిది కావాలని కోరుతుంది. వీటిని మళ్ళీ తలుచుకున్నారు.చెమ్మలని తమ్మ కాయలని కూడా అంటామ్. తెలకపిండితో, ఊరికనే బెల్లం తో కూర వండుకుంటే బాగుంటుంది. సంతసం.
నెనరుంచాలి.
శర్మ గారూ,
నేతి బీరకాయ పప్పు ( కరివేపాకు , ఇంగువ తిరగ మోత, అదే తాలింపు పెట్టినది ! ) చాలా కమ్మగా ఉంటుంది ! పేరులో ఉన్నా , నిజం గా నెయ్యి ఉండదు కనుక ఆరోగ్యానికి కూడా మంచిదే ! చెమ్మ చిక్కుళ్ళ కూర,మామిడి కాయ పప్పు , కూడా కమ్మ గా ఉంటాయి, చేమ ఆకులు , రామా ఫలం నేను ఎప్పుడూ తినలేదు !
ముద్ద పప్పు, అన్నం లో కమ్మని నెయ్యి వేసుకుని, వాటితో వేయించిన చల్ల మిరపకాయలు తింటే, ఆ రుచి ! ఆహా ! ఏమి ( తెలుగు ) రుచి !
ఇక సగ్గు బియ్యం వడియాలంటారా , అవి అన్నం లో తినడానికి వేయించినా , అన్నం కంటే ముందే ‘ కరిగి ‘ పోతూ ఉంటాయి నోట్లో !
మీరు ఇట్లాంటి వంటల గురించి, ఇక ముందు , వ్రాసేటప్పుడు , కాస్త ఆ యా కూరలు వండుకునే విధానం కూడా వివరం గా రాస్తే, ఆ వంటలను కూడా అంతర్జాలం లో నిక్షిప్తం చేసిన పుణ్యం దక్కుతుంది మీకు ! చాలా వెబ్ సైట్లు ఉన్నా కూడా , వంటలు , ప్రదేశాల బట్టీ మారుతూ ఉంటాయి కూడా కదండీ !
@సుధాకర్ గారు,
నిజానికి వీటిని చెబితేనే అందరికి తెలిసినవే, పెద్ద గొప్పగా మళ్ళీ చెప్పాలా అంటారేమోనని భయపడుతూ చెప్పేను, ఇకముందు మీ అభిమతం గుర్తులో ఉంచుకుంటా.
నెనరుంచండి