శర్మ కాలక్షేపంకబుర్లు-మిథునం అద్భుతః (బాపు గారి స్వదస్తూరితో)

Courtesy you tube

mithunam         పై క్లిక్ చేసి కధ చదవండి.(బాపు గారి స్వదస్తూరితో)

Courtesy C.V.L.N.Ravi kumar

మిథునం అద్భుతః

“మిథునం సినిమా చూడు బాబాయ్” అన్నాడు, అబ్బాయి,ముంబాయి నుంచి. “ఏదిరా! చూదామని కూచుంటే కరంటు వాడికి కన్ను కుట్టిం”దంటే మర్నాడు బ్లాగ్ లో పెట్టేసేరు జిలేబి గారు. ఇల్లాలితో కలిసి చూశా, “సంబడమే, బానే ఉంది, మీ నిరవాకమే” అంది ఇల్లాలు. నిన్న అబ్బాయి పిలిచి “బాబాయ్! సినిమా చూశావా?” అన్నాడు. “చూశానయ్యా!” అంటే “ఎలా ఉంద”న్నాడు “అద్భుతః” అన్నా, గలగలా నవ్వేడు. అప్పుడన్నాడు “బాబాయ్! బాపూ గారు స్వహస్తాలతో రాసిన కధని స్కేన్ చేసి దాచుకున్నా,” అన్నాడు.నాకు ఆనందంతో నోట మాట రాలా. మన సంస్కృతిని తరవాత తరాలు జాగ్రత్తగానే చూస్తున్నాయని ఆనందమయ్యింది. “ఒరే అబ్బాయ్! నాకు పంపవురా” అన్నా. “చూసి పంపుతానేం” అన్నాడు. భోజనం చేస్తోంటే కోడలు సెల్ ఫోన్ తెచ్చి ఇచ్చింది, “బావగారి దగ్గరనుంచి” అని. “బాబాయ్! పంపేను చూడు” అన్నాడు. అక్కడినుంచి ప్రారంభమయ్యింది నా ఆరాటం. రెండు మెతుకులు కొరికి వెళ్ళబోతూంటే “ఎందుకంత కంగారూ! అదెక్కడికీ పారిపోదు కాని, ముందో రెండు ముద్దలు తినండి” అంది. అబ్బే లోపలికి పోనిదే. ఆత్రంగా కంప్యూటర్ దగ్గరకొచ్చి ఆన్ చేయగానే తాతా! అని ఒంటిపూట బడికి వెళ్ళొచ్చిన మనవరాలు కంప్యూటర్ ఆక్రమించింది. మనవరాలుని కాదనగలనా? అది నా బలహీనత. ఎప్పుడు ఖాళీ చేస్తుందా అని చూస్తూ కూచున్నా. ఎప్పుడో తెలియకుండానే కునుకు పట్టేసింది. మెలుకువొచ్చి చూస్తే, కరంటు ఉంది, కంప్యూటర్ కట్టేసింది, మనవరాలు. బాగుందనుకుని ముఖం కడుక్కొచ్చి కంప్యూటర్ ముందు కూచుంటే, చిటుక్కున కరంట్ పోయింది. ఏం చేయడానికీ తోచక మామిడి చెట్టు పనస చెట్టు మధ్య తిరుగుతుంటే “పందిరేద్దాం రమ్మ”ంది,ఇల్లాలు.  ఎండ కోసం, నిన్న మొదలెట్టిన తాటాకుల పందిరెయ్యడం అయ్యింది కాని కరంటు రాలేదు, ఒక కన్నటే పడేసి ఉంచినా. అమ్మయ్య ఆరు గంటలకి కరంటు వచ్చింది. కంప్యూటర్ ఆన్ చేస్తే ఏమీ లేదు, ఏదో అయిపోయింది, ఏం చేయాలి, “తగలేసే”వని తిడతాడేమో అబ్బాయని, బెరుకుతో కూచున్నా. అబ్బాయొచ్చాడు, రాగానే చేరేసింది వార్త ఇల్లాలు, అబ్బాయొచ్చి చూసి “ఏం పాడవదు నాన్నా! కంగారు పడకండి” అని విప్పి, తుడిచి ఏదో చేసి మొత్తానికి పని చేయించాడు. ఈ లోగా కరంటు పీకేశాడు మళ్ళీ. అరగంట తరవాతిచ్చాడు, ఆన్ చేస్తే మళ్ళీ మొదలికొచ్చింది. “చూడు నాయనా” అని తప్పుకున్నా. అబ్బాయి కట్టేసి “ఇందులో చిన్న బేటరీ ఉంటుంది అది పోయింది, తెచ్చివేస్తా, ఈలోగా స్నానం చేసి రండి” అని బయటికెళ్ళేడు బేటరీ తేవడానికి. స్నానం చేసివచ్చేటప్పటికి తెచ్చి వేశాడు. అమ్మయ్య! సమస్య తీరిందని చదవబోతే కరంటు మళ్ళీ పీకేశాడు. హతవిధీ! ఎందుకిలా జరుగుతోందనుకుంటే, “కొంత మందికే పోయింది కరంటు, ఎల్.ఐ గారికి ఫోన్ చేశాము, పంపుతామన్నారు” అంది, కోడలు నా బాధ చూడలేక. “సరిలేమ్మా” అని, రెండు మెతుకులు కొరికి కధ చదివేటప్పటికి ఇదిగో ఈ సమయమైంది,రాత్రి తొమ్మిది. మరి నిద్దరొచ్చేస్తుందికదా! మంచమెక్కేసేను.  “ఎందుకంత తాపత్రయం?” అంది ఇల్లాలు. దానికేం తెలుసు పిచ్చిది… బాపూ గారు చేతితో రాసిన కధ, భరణిగారు తీసిన సినిమా ఒక చోట పెట్టాలని నా తాపత్రయం.

DSCN2926

ప్రకటనలు

26 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మిథునం అద్భుతః (బాపు గారి స్వదస్తూరితో)

  • @శర్మాజీ,
   స్వనామధేయులకు నమస్కారం, నా బ్లాగుకు స్వాగతం. టపాలో అక్కడే మిథునం అన్న ఇంగ్లీష్ అక్షరాలమీద నొక్కితే దొరుకుతుంది. అయినా మీకు మెయిల్లో పంపిచాను. మీకు అందిన సంగతితో మెయిల్ ఇప్పుడే చూశాను.
   ధన్యవాదాలు.

 1. మాస్టారూ… పీడీఎఫ్ లో కథ సగమే ఉంది కదా… మిగతా సగం ఎక్కడైనా అందుబాటులో ఉందా? రెండుసార్లు పుస్తకం పోగొట్టుకున్నాక… సాఫ్ట్ కాపీతో సరిపెట్టుకున్నా… నాకు ఈ ముక్క మాత్రమే దొరికింది… రెండో భాగం ఉందా? మీకు దొరికితే నాకేమైనా మెయిల్ చేయగలరా?

  • @ఫణీంద్రగారు,
   బహుకాల దర్శనం, అబ్బాయి ముంబై నుంచి సినిమా చూడు బాబాయ్ అంటే చూశా ప్రయత్నం మీద. కధ చదవలేదు అప్పటికీ. అబ్బాయ్, సినిమా చూశావా అని అడిగి బాపు గారు స్వహస్తాలతో రాసిన కధ దాచుకున్నానంటే పంపమన్నా.నేనూ మీలాగే చదివి రెండవ భాగం ఉందా అని అడిగేను,సశేషం చూసి, కధ ఇంతే అన్నాడు అబ్బాయి, అసలు రెండవ భాగం ఉందా?
   నెనరుంచాలి.

   • అయ్యా… రెండో భాగం ఉందా అన్నప్పుడు నా భావం మీ దగ్గరుందా అని. మీరు చూపిన భాగం సగమే. ఇంకా ఉంది. ఆ రచన శాయిగారు పది పుస్తకాలు కొనాల్సిందే అంటున్నారు తప్ప విడిగా ఒక్క పుస్తకం అమ్మడం లేదు. దాంతో కొనలేక ఆగాను. అదీ కథ.

   • @ఫణీంద్రగారు,
    అనివార్య కారణాలవల్ల జవాబివ్వడం ఆలస్యమయింది మన్నించాలి.
    తరువాయి భాగం ఉందని ఇప్పుడు మీ ద్వారా తెలిసింది, ఇక వేట మొదలెట్టాలి.
    నెనరుంచాలి.

 2. నమస్కారమండి.మిధునం సినిమా ఇది వరకే చూసాను కధ మాత్రం మీ పుణ్యమాని ఇప్పుడే చదివేను.ధన్యవాదములు. మీకు ఒక వినతి. మా అమ్మ కూడా ఎప్పుడూ రుణాను బంధ రూపేణా పశు, పత్ని, సుత, ఆలయం అంటూ వుండేది. మీరు కొంచెం దీన్నిగురించి వివరం గా చెప్తారా.

  • @హేమ మురళిగారు,
   కధ చదివేరు, సినిమా కూడా చూసేరు. అందరికీ ఎందుకునచ్చింది? ఆ వైవాహిక జీవన విధానం మీద మక్కువ కదా? attached detachment, detached attachment రెండూ ఒకటేనా? మీ ప్రశ్నకి వేరుగా జవాబిస్తా.
   నెనరుంచాలి.

 3. మిథునం మొత్తానికి చూసేసారన మాట.
  ఈ కథ గురించి నాకు బ్లాగ్స్ లోకి వచ్చేవరకు తెలియదు. అంతకు ముందు శ్రీ రమణ గారు రాసిన “బంగారు మురుగు” కథ మాత్రం నేను తానా వారు ప్రచురించిన ఒక కథల సంపుటి లో చదివాను. ఆ కథ మనసుకి హత్తుకు పోయింది.తరువాత ఒక పాత బ్లాగర్ ఒకరు నాకు బాపు దస్తూరితో ఉన్న ఈ “మిథునం” కథ నాకు PDF పంపారు. అప్పుడు చదివాను. తరువాత సినిమా చూసాను. భరణి గారు చేసిన ఈ ప్రయత్నం తప్పకుండా అందరం హర్షించాల్సినదే!

  • @జలతారు వెన్నెలగారు,
   దేనికదే. మీమాటే నా మాట.అసలు సినిమా ఎక్కడేనా చూసి దగ్గరగా నలభయి ఏళ్ళయిందంటే నమ్ముతారా? మొన్న మిథునం చూశా, సతీ సమేతంగా, అదీ సంగతి
   నెనరుంచాలి.

  • @వర్మ గారు,
   ఇప్పుడు కధ చదివి ఉంటారు. బ్లాగుతో పాటు పెట్టినవాటిని చదవటం మనవారికి అలవాటులేదు. చిత్రంగా ఈ కధ మాత్రం అందరూ చదివారు. అది బాపు రమణల గొప్పతనం.
   నెనరుంచాలి.

 4. కొన్ని రోజుల క్రితం ఈ పుస్తకం kinige లో కొన్నాను, మొదలు పెట్టి వదలకుండా చదివాను. మరి చిత్రం చూడాలి

 5. నెనరులండీ శర్మ గారు,

  ఆ కథ బాపు గారి దస్తూరి తో అందించినందుకు !

  సొ, సినెమా చూసేసేరన్న మాట మరి ? అయితే సినిమా గురించి రివ్యు – మీ అభిప్రాయ టపా కాలక్షేపం ఎప్పుడు రాయ బోతారు మరి ?

  థాంక్ గాడ్, మిథునం లో సినిమా లో ‘కరెంటు కట్టు’ ప్రాబ్లెం ఎపిసోడ్ లేదు !

  ఇక మలయాళం చిత్రం – ఒరు చెరు పున్ చిరి (ఒక సన్నగవు?) లో మొదటి పది నిమిషాల లో నె కరెంటు పోతుందాయే !
  మరి కొంత సారూప్యతః !

  మీరు తప్పక చూడాలి యు ట్యూబ్ లింకు ఇక్కడ (మొదటి భాగం అదే కోవ లో మరు భాగాలు కూడా ఉన్నయి!) – అంగ్రేజీ లో సబ్ టైటిల్ కూడా ఉన్నది !

  చీర్స్
  జిలేబి.

  • @జిలేబిగారు,
   మీరు చాలా శ్రమ తీసుకున్నారు. మీకు కృతజ్ఞత తెలుపుకుంటున్నా. నిజానికి మిథునం సినిమా ముందుచూసి కధ తరవాత చదివేను. ఒకప్పుడు ఫణి బాబు గారు లింక్ ఇచ్చేరు, సరిగా వినలేకపోయా. శ్రీ రమణ గారు పాట్లా బంగారం ఇచ్చారు, దానిని వస్తువుగా చేసుకోడం లో నేర్పు మిగిలినవారిదే, ఎవరిష్టంవారిది. ఎవరికున్న ఇబ్బందులు వారికుంటాయి కదా! రాజును చూసిన కళ్ళ మొగుణ్ణి చూస్తే మొత్త బుద్ధయిందని ఒక నానుడి. ఇదీ అంతే, దేనికదే.మీరిచ్చిన లింక్ చూశాను అద్భుతః, నా ఇల్లాలన్న మాట ’సంబడం అంతా మీ నిరవాకమే” అన్న మాట నిజం.
   నెనరుంచాలి.

 6. మిధునం చక్కటి కధ. ఈ కధను కొన్ని సంవత్సరాల క్రితం ఒక వారపత్రికలో ప్రచురించారండి. అప్పుడు ఆ కధ ఉన్న పేజీలను కత్తిరించి పెట్టాను. ఇప్పటికి ఉన్నాయి.

  ఈ కధను సినిమాగా తీయటం వలన కధలోని పాత్రలు కళ్ళెదుట కనిపిస్తున్నాయి.

  పసుపు పచ్చ పువ్వులు ఎంతో బాగున్నాయి.

 7. తాతగారు నిజంగా అద్భుతః ..:)
  బాపూగారి దస్తూరి కథకి ధన్యవాదాలు..
  కధ,సినిమా ఒక నెల రోజుల నించి మార్చి మార్చి చూస్తూనే ఉన్నా,చదువుతూనే ఉన్నా .అమ్మా నాన్నలకి చూపిస్తూనే ఉన్నా .అంత నచ్చింది..కాని బాపూ గారి దస్తూరి చదవలేదు ..:)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s