శర్మ కాలక్షేపంకబుర్లు-ఈ ఒక్కరోజూ వదిలేయండి ప్లీస్-అవలోకనం.

DSCN2098ఈ ఒక్కరోజూ వదిలేయండి ప్లీస్-అవలోకనం.

జ్యోతి గారి బ్లాగులో కధ ఈ ఒక్కరోజు ఒదిలేయండి ప్లీజ్ పై,  విమర్శ, అబ్బే అదినీవల్లకాని పని,సమీక్ష, చాలు చాలు ఎవరేనా నవ్విపోతారు, పరిశీలన, మరీ అంత బాగున్నట్లు లేదు మరో మాట చెప్పు, అవలోకన ఆ( ఇదేదో బాగున్నట్లుంది. చాలు ఆ పని చెయ్యమంది బుద్ధి.

కధ మూడు ముక్కల్లో భర్త, ఇద్దరు కాలేజి చదువుల పిల్లలున్న ఇల్లాలు, ముగ్గురికి చాకిరీ చేసి అలసిపోయింది, తనను తాను మరచీ పోయింది,ఇంతకాలమూ, ఇప్పుడు వారానికి ఒక రోజేనా తనకిష్టమైన పని చేసుకోవాలని అర్జీ. ఇంటిలోవారందరికి మరునాడు ఎవరి పని చేసుకోవాలని నోటిస్ ఇచ్చేసి, అప్పగింతలు పెట్టేసి,అందరూ తమ తమ పనులు చేసుకుంటామని మాటిచ్చిన తరవాత గడప దాటబోతూంటే,’వీలయితే మీతమ్ముడింటికి వెళ్ళు’ అని శ్రీ వారు ఫర్మాయిస్తే గడప దాటింది.

ఈ కధ చదివి నేను ఇలా అన్నా

ఆ భర్తని, పిల్లలని అంతగా తనపై ఆధారపడేలా చేసుకున్నదెవరంటారు? మొదటినుంచి ఎందుకు తన విషయం తను ఎందుకు పట్టించుకోలేదు? దానినే వారు ఈజ్ మెంటు హక్కుగా భావించారు.

దీనినే మరికొద్దిగా వివరిస్తే:-
పెళ్ళయిన మూడవరోజే, భర్తే శ్రీమన్నారాయణుడు అనుకుని చిటికెన వేలు పుచ్చుకుని నడచి వచ్చిన పడతి. ఓపలేకపోతున్న సమయంలో, కాఫీ వాసనకి డోకొస్తున్నా, “మీకు కాఫీ పెట్టుకోడం చేతకాదు, ఉండండి నే పెడతా” అని అడ్డు పడినది మొదటి సారి. పురిటికెళ్ళివస్తే తనకి జ్వరంగా ఉండగా పిల్లాడికి డైపర్ మార్చవలసివచ్చినపుడు, “నేను చేస్తాలే, నువు పడుకో” అన్న భర్తను, “చంటి వెధవ పాడు చేసుంటాడు, మీవల్లకాదులెండి” అని కళ్ళు తిరుగుతున్నా చాకరీకి అడ్డపడిన సంఘటన. పిల్లలకి నడక దగ్గరనుంచి అన్నీ నేర్పి, స్కూల్ నుంచి కాలేజీ కి వెళ్ళేదాకా కూడా వారికి కావలసినవి అన్నీ సమకూర్చి పెట్టిన తల్లి, “ఉండవే!, జడేసుకోడం రాదు, ఏళ్ళొచ్చేయి, టిఫిన్ తింటు ఉండు, నేను వెనక జడేస్తా” అని ఉదయం నుంచి పదే పదే లేపుతున్నా లేవక ఆఖరి నిమిషం లో కంగారు పడుతున్న కూతురికి చాకిరీ. ఇంక కొడుకు గారాలపట్టి,వంశోద్ధారకుడు, తనపని తను చేసుకున్నా కందిపోతాడేమోననే భయం, అతృత. శ్రీవారికి ఎప్పుడు ఏం తక్కువవుతుందోనని ముందుకుముందే అన్నీ సమకూర్చుకునే ఇల్లాలు. శలవు రోజు మరికొంత చాకిరీ పెంచుకునే జీతం లేని పని మనిషి. హాయిగా ఒక గంట, చిన్నప్పుడు నేర్చుకున్న వీణ వాయించుకుంటూ తన్మయత్వంలో ఉంటే శ్రీ వారు రాగానే ఒక్క ఉదుటున లేచి వీణ పక్కన పడేసిన పడతి. శ్రీ వారొస్తే వీణ వాయిస్తున్న ఇల్లాలిని చూసి నెమ్మదిగా, చప్పుడు చేయక, పక్క సోఫాలో చేరబడి ఆ కీర్తన పూర్తయిన తరవాత పొగడ్తగా చప్పట్లు చరిస్తే వచ్చే ఆనందం పోగొట్టుకున్న ఇల్లాలు. ఎన్నని చెప్పేది, ఎన్నని చెప్పేది, ప్రతి నిమిషం ఒక సంఘటన. ఇది ఎవరు చేసుకున్న తప్పు? పిల్లలికి నడక వచ్చేదాకా నడిచేటపుడు పట్టుకుంటాం, కాలేజీకి వెళ్ళే వయసులో పట్టుకోమేం?. అలాగే ఎవరు చేసుకోవలసిన పనిని వారు చేసుకునేటట్లు చేయనిదెవరు. బంధనాలు పెంచుకున్నదెవరు? పని పెంచుకున్నదెవరు? ఇదేమిటి? ప్రేమా? త్యాగమా? జంతువులలో చూడండి, తల్లి గర్భం నుండి బయటికి వచ్చిన ఒక గంటలో లేచి నిలుస్తుంది, కొద్దికాలం తల్లితో తిరుగుతుంది, ఆ తరవాత? మనం జంతువులం కాదు, నాగరికత తెలిసినవారం, కాని బంధనం పెంచుకుంటున్నాం. కట్టుకుంటున్నాం, విడుచుకోటం లేదు. మనకి కట్టే తప్పించి, విడుపు తెలియకపోయింది.మనం పట్టుకు ఎదుటివారిని వదిలిపెట్టమంటే ఎలా? వదలవలసినది పట్టుకున్నవారేకదా! కధ చివరగా శ్రీ వారు ’వీలయితె మీతమ్ముడింటికి వెళ్ళు’ ఈ మాట ఎగతాళీయా? తమ్ముడింటికి పోవడానికి కూడా ఇంత ఆర్భాటం కావాలా? ఏమో అర్ధం కాలా!

DSCN2079

సముద్రం దగ్గర అలలు ఆగిన తరవాత స్నానం ఎంత నిజమో సంసారంలో విశ్రాంతి కూడా అంతే నిజం. పనికి పని మధ్య, పని చేస్తూ విశ్రాంతి, పనిలోనే విశ్రాంతి, పని సద్దుబాటు చేయడం, ఎవరి పని వారు చేసుకునేలా చేయడమే విశ్రాంతి, ఇంటిలో ఉండగా పనులు చేసుకుంటున్న మధ్యలో మీకునచ్చిన పని చేసుకోడమే విశ్రాంతి. భర్త పిల్లలను అలా తయారు చేసి తనొక మర అయిపోతే, వారికి ఈజ్ మెంటు హక్కు వచ్చేసింది కదా!  క్షమించాలి! ఒక మాట తప్పక అడుగుతున్నా, ప్రకృతి మీకిచ్చిన శలవును కూడా ఎందుకు వాడుకోవటం లేదో చెప్పగలరా?

ఇక్కడ ఈజ్ మెంటు హక్కు గురించి చెప్పాలి. మీదే మీ ఇంటి పక్క కాళీ స్థలం, వెనక ఇంటి ఆయన కుటుంబం మెయిన్ రోడ్ కి దగ్గర దారి అని మీ స్థలం లోంచి తిరుగుతున్నారు, మీరు అడ్డు చెప్పలేదు, ఇలా ఒక ఇరవై సంవత్సరాలు నడిచింది, ఇప్పుడు మీరు గోడ కడదామనుకునే సరికి వెనకింటాయన అభ్యంతరం చెప్పేడు, ఆయనకు ఈజ్ మెంటు హక్కు ఉన్నదని. అతని మాట నిజమే, మీరు మొదటిలోనే అభ్యంతర పెట్టిఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. న్యాయం మీదే కావచ్చు కాని హక్కు అతనిది, చట్టం అలాగే చెబుతోంది.

ఇది కధని కాని కధకురాలిని గాని కించ పరచడానికి చేసిన ప్రక్రియ కాదని మనవి, పొరపాటుగా ఎవరికేనా బాధ కలగచేసివుంటే క్షంతవ్యుడిని. మనకు కావలసినది డిటాచ్డ్ అటాచ్ మెంట్, దాని సాధిద్దాం.

DSCN2934

ప్రకటనలు

12 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఈ ఒక్కరోజూ వదిలేయండి ప్లీస్-అవలోకనం.

 1. శర్మ గారు,

  జిలేబీ రౌండు రౌండు పాకం రుచి జీడి పప్పు కేమి తెలియునని బ్లాగ్వెత !

  చీర్స్
  జిలేబి.

 2. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగై పోతున్న ఈ రోజుల్లో,
  ఉద్యోగ రీత్యా జిల్లా, రాష్ట్రం, దేశం వీడి ఊరికి ఎంతో దూరంలో,
  వెళ్లి స్థిరం లేని ఉద్యోగాలు చేసుకొనే ఈ రోజుల్లో,
  “ఆడుతూ, పాడుతూ పనిచేస్తుంటే అలుపు సోలుపేమున్నది!
  ఇద్దరమొక్కటై చేయి కలిపితే ” – అనే యుగళ గీతం ఇప్పటి పరిస్థితులకు
  సరి పోయే పాట . ఇది పనిమంతులు,సోమరి పోతులకు ముందే తెలియ పరచాలి.
  ఉమ్మడిగా ఉండే వాళ్ళు కూడా పని విభాజించుకొని హాయిగా ఉండగలగాలి.

  • @మోహన్జీ,
   మీరు చెప్పిన పాట ఇల్లరికం లోదనుకుంటా. ఆ పాట రాక, రాయక ముందునుంచీ మెమిద్దరం కష్టం లో సుఖంలో అలాగే బతికేం, బతుకుతున్నాం, బతుకుతాం. అంతా తామే చేయాలనే ఒక రకమైన తాపత్రయం లో ఈ బాధలు వస్తాయి.
   నెనరుంచాలి.

 3. శర్మగారూ, నమస్కారం.
  మీరు సరిగ్గా చెప్పారు. డిటాచ్డ్ అటాచ్మెంట్.
  కాని అది సాధించడం అంత సులభసాధ్యమని అనుకోను.
  మీరు కథను చాలా చక్కగా అవలోకించారు. ఒక కథ మనను ఆలోచింప చేసిందంటే ఆ రచయిత(త్రి) కృషికి ఫలితం దక్కిందనే అనుకోవచ్చు.
  మీ మాటను కాదనడం కాదుకానీ.. నా భావం కూడా వ్యక్తపరచాలనుకొంటున్నాను. సహృదయంతో స్వీకరిస్తారని ఆశిస్తున్నాను.
  ఈ కథలో కథాకాలాన్ని గమనిస్తే పిల్లలు కాలేజీ చదువులకొచ్చేరంటే వారిద్దరి వివాహం జరిగి కనీసం ముఫ్ఫై సంవత్సరాలయివుంటుంది. ముఫ్ఫై సంవత్సరాల క్రితం పెళ్ళి అయిన ఆడపిల్లలకీ, ఇప్పటి రోజుల్లో పెళ్ళయిన ఆడపిల్లలకి సామ్యం తక్కువ. ఈ రోజుల్లో ఆడపిల్లలకున్న ప్రపంచఙ్ఞానం అప్పుడుండేది కాదు. పెళ్ళయేవరకూ తండ్రితోనూ, అన్నదమ్ములతోనూ తప్ప బయటకెక్కడికీ వెళ్ళని అమ్మాయి మీరన్నట్టే భర్తే శ్రీమన్నారాయణుడనుకుంటూ అతని చిటికెనవేలు పట్టుకుని వస్తుంది.
  (దయచేసి గమనించండి. మగవాళ్ళందరూ దుర్మార్గులని అనడం కాదు కాని మీరన్నట్టు వారిలో ఆ ఈజ్ నెస్ రావడానికి గల కారణాలు చెప్పడమే నా ఉద్దేశ్యం).
  ఆకాలంలో మగవాడికి సంసారం కాక ఉద్యోగం చేసే బాధ్యత కూడా ఉండేది కనుక ఉద్యోగానికీ, సంసారానికీ మధ్య సమన్వయం చేసుకునేవాడు. ఆడవారికి ఉద్యోగమంటూ వేరే ఉండేది కాదుకనుక (ఈ కథలో లాగ) ఇల్లే లోకంగా, పిల్లలే ప్రపంచంగా ఉండేవారు. దానికి ముఖ్య కారణం తల్లీతండ్రి అలా చెప్పి అత్తారింటికి పంపించడమే.
  సత్యవతిగారు రాసిన కథలో ఈగ ఇల్లలుక్కుంటూ పేరు మర్చిపోయినట్టు ఇల్లాలు అలా ఇంటిలో గుడుగుడుగుంచంగా తిరుగుతూ అదే లోకమనుకునేది. కాని కొంతమందిలో తను కేవలం భార్య, తల్లే కాదు ఒక మనిషి కూడా అన్న ఙ్ఞానం కొన్నాళ్ళకి కలిగేది. అది ఎంతకాలం అనేది వారి వారి ఆలోచనాసరళిని బట్టి ఉంటుంది. కొందరికి పెళ్ళైన కొత్తలోనే రావచ్చు.. మరికొందరికి ఈ కథలో లాగ ముఫ్ఫైయేళ్ళకి రావొచ్చు. కొందరికి వచ్చినా బయటపడే ధైర్యం లేకపోయి కూడా ఉండొచ్చు.
  అలాగ పెళ్ళైన ముఫ్ఫైయేళ్ళకి తనకంటూ కొంత సమయం కేటాయించుకోవాలనుకోవడమే ఈ కథలో ముఖ్యమైన విషయం.
  మీరన్నట్టు డిటాచ్డ్ అటాచ్ మెంట్ సాధించడానికే ఆ ఇల్లాలు వారానికి ఒక్కరోజు ఆమెని వదిలేయమంది. నిజంగా డిటాచ్మెంట్ అయితే ఇంట్లోంచే వెళ్ళిపోను. ఆ ఇల్లాలికి భర్తా, పిల్లలూ అంటే ప్రేమే తప్పితే వేరే భావమేమీ లేదు. కాని ఆమె గురించి కూడా కాస్త ఆలోచించుకుంది కనుకే కేవలం వారంలో ఒక్కరోజు మాత్రమే వదిలేయమంది. మిగిలిన ఆరురోజులూ అటాచ్డ్ గానే ఉంది.
  మీరన్నట్టే డిటాచ్డ్ అటాచ్ మెంట్ గా ఉండడానికే ఈ కథలో ఇల్లాలు చేసిన ప్రయత్నం అని నేనకుంటున్నాను.
  నా భావాలు మిమ్మల్ని నొప్పిస్తే క్ష్యంతవ్యురాలను.

  • @లలిత గారు,
   నా అభిప్రాయం నేను చెప్పేను, మీ అభిప్రాయం మీరు చెప్పేరు, ఇందులో బాధ పడవలసినదేం లేదు, తప్పుగా అనుకోవలసినదీ లేదు.
   కధ గురించి, ఆ ఇల్లాలు అన్నీ తనే చేయాలనే భ్రమలో ఉండిపోయింది, పాపం. కుటుంబ సభ్యులు దానిని అలుసుగా తీసుకున్నారు. కలిగిన కుటుంబం గా తోస్తోంది, ముగ్గురికోసం ఆమె అంత బాధపడి తన ఇష్టాలు చెప్పలేకపోవడం, తనకంటూ సమయం వెచ్చించుకోలేకపోవడం, తనకు కావలసిన పుస్తకం కూడా చూడలేకపోవడంలాటివి చిత్రంగా కనిపిస్తాయి.ఈ detached attachment దీనిని మేము చాలా కాలంగా అమలు చేస్తున్నాం, పెద్ద కష్టమేం కాదు.
   నెనరుంచాలి.

 4. తాతగారు, నా చిన్నప్పటి నుంచీ నేను మా నాన్నగారిని అమ్మని చూసి నేర్చుకున్నవి చాలా ఉన్నాయి,
  మీరు అన్నారు కదా ప్రకృతి ఇచ్చిన సెలవు అని, ఆ సెలవు దినాలలో నాన్నగారు అన్నం వండేవారు, అలాగని మామూలు రోజులలో ఖాళీగా కూర్చునేవారు కాదు, కుదిరితే కూరలు తరిగేవారు, నానబెట్టిన మినప్పప్పు పొట్టు తీసేవారు, మేము కూడా చేసే వాళ్ళం కానీ సగం పని(ఎందుకంటే ఎంత తీసినా చివరి దగ్గర పొట్టు తియ్యాలి అంటే కొంచం చిన్నప్పుడు కష్టం కదా), పిండి రుబ్బేవాళ్ళం. ఇక ఆవకాయ/మాగాయి పెట్టేటప్పుడు కారం అమ్మ దగ్గరుండి ఆడించేది, ఇక ముక్కలు నాన్నగారు తరిగేవారు, మేము చిన్నచిన్న పనులే చేసేవాళ్ళం ఎలాంటివి అంటే నూనే తేవడం, కడిగిన జాడీలు గుడ్డతో తుడవటం లాంటివి, కుదిరితే నూనే మా చేత తెప్పించేవారు.
  ఇక కొన్నిసార్లు మేము ఎక్కడ ఆకలితో ఉండిపోతాము అని అమ్మ చక్కవడలు, చగోడీలు జంతికలు లాంటివి చేసేది. ఇక మమ్మల్ని వంట దగ్గరకు అంతగా రానిచ్చేది కాదు, ఎందుకంటే అమ్మ జంతికలు వేయిస్తున్నప్పుడు జంతికలు పేలేవి అలా పేలితే మాకు ఎక్కడ బాధ కలుగుతుందో అని, ఓకటేమిటి అమ్మ చాలా చేస్తుంది, మరి మేము సాయం చెయ్యమా! అంటే నా దగ్గర సమాధానం లేదు, చేసాము అనడానికి సాక్ష్యం లేదు. ఇక వాళ్ళు ఎదో కొందరి ఇళ్ళలో జరిగినవి చూపించి అందరు మగాళ్ళు ఇలాంటివాళ్ళే అని ఆరవడం సహజం.

  ఇక నేను మహా బద్దకస్తుడిని, బధ్ధకం నుంచీ బయట పడటానికి ఇలా వంటరి జీవితం గడుపుతున్నాను, అయినా బద్దకం నుంచీ బయటపడలేకపొతున్నాను, ఎందుకంటే డబ్బుతో ఆహారం దొరుకుతుంది అనే మూర్ఖశిఖామణిని కాబట్టి.

  • @ప్రసాద్,
   అమ్మ, భార్య, వదిన ఎవరైనా సరే మన ఇంటి మనుషులు, మనవాళ్ళు అయినపుడు, వారికి అందరం సాయం చేయాలిసిందే. ఇంటి పని వారి ఒక్కరి ముఖాన్న రాసిపెట్టలేదు దేవుడు.పట్టుకోవడమే తప్పించి విడుచుకోవడం తెలియకపోతేనే ఈ బాధలు.
   నెనరుంచాలి.

 5. శర్మగారు, జ్యోతిగారి పోస్టును వదిలేయండి. కొందరు మహిళా బ్లాగరులు మహిళల శక్తిసామర్థ్యాలను మరింత పెంపొందించే పోస్టులు వేస్తే జ్యోతిగారు మాత్రం ఎక్కువగా ఇలాంటివాటినే ఇష్టపడుతుంటారు.. అదో తుత్తి అనుకుంటా!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s