శర్మ కాలక్షేపంకబుర్లు-ఇది విన్నారా? నీలివార్తలు

DSCN2992ఇదివిన్నారా? నీలి వార్తలు

“ఇది విన్నారా?” నీలి వార్తలు చెప్పటానికి,సంభాషణకి, యీ మాట నాందీ ప్రస్తావన. ఈ నీలి వార్తలు చెప్పుకోడం మానవ దుర్లక్షణమేమో! ఇదొక మానసిక అవలక్షణమేమో కూడా. ఇందులో ఆడా మగా తేడా లేదు. నిజానికి ఇదొక మానసిక జాడ్యం. దీనికి కారణం అసూయ, ద్వేషం, మరీ చెప్పాలంటే అశక్త దుర్జనత్వం.

మొన్న ఒక మిత్రుడు ఫోన్ చేసి “ఇది విన్నారా? మనకి ఇవ్వవలసిన సొమ్ముకి ఆర్డర్ ఇచ్చేసేరట, డబ్బులెప్పుడొస్తాయంటారు? మీరు చెబుతారని చూస్తున్నాను, కరంటు ఉన్నంత సేపూ నెట్ లో ఉంటారట కదా, వెబ్ లో చూడలేదా?” అని. నాకు నిజంగానే ఆశ్చర్యం వేసింది, అతను చెప్పిన వార్తకి, నాగురించి నాకే చెప్పిన మాటకి కూడా. నేను సాధారణంగా నెట్ చూస్తాను కాని ఇంతలా, నాగురించిన ప్రచారం ఎలా జరిగిందబ్బా! ఇదేదో కుట్ర అనుకుంటూ,   ( విదేశీ కుట్రో, స్వదేశీ కుట్రో దర్యాప్తు చేసి కనుక్కోవాలి. 🙂  )  “ఉండండి, చూసి, ఆర్దర్ ఉంటే చదివి వినిపిస్తా” అని వెబ్ లో కెళితే ఏముంది, గాలి కబురు, అదీ “పని చేస్తున్నవారికి మీరడిగిన లాభం చేకూరిస్తే, ఆ లాభం మీకూ వర్తింప చేస్తా”మని చెప్పిన మాట. పని చేస్తున్నవారికే ఆ విషయం లో ఆర్డర్ ఇవ్వలేదు, కాదు, అసలు ఇవ్వాలా మానాలా అన్నదే తేలలేదు. నాకు నవ్వొచ్చింది, “ఆలు లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం” అంటే ఇదే కదూ అనిపించి, “మీకెవరు చెప్పేరు మిత్రమా” అంటే, “మరో మిత్రుడు చెప్పేడు” అన్నారు, “అతను వెబ్ లో చూసి చెప్పేడా” అంటే “కాదు, అతనికి ఎవరో చెప్పేరట ఢిల్లీ నుంచి, అది నాకు చెప్పేడు” అన్నారు. బలే నవ్వూ బాధా కూడా వచ్చేయి, ఏక కాలంలో. ఎందుకు ఇటువంటి నీలి వార్తలు చేరవేస్తారో, ప్రచారం చేస్తారో తెలియదు. ఇబ్బంది కాని వార్త చెప్పినా ఇబ్బంది ఉండక పోవచ్చు, కాని కొన్ని కొన్ని వార్తలు చాలా ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి, చెప్పేవారది గమనించరు కాని.

DSCN1542

ఇటువంటివే కాదు మరి చాలా రకాల వార్తలు, అభూత కల్పనలు, ప్రచారం చెయ్యడం చెప్పుకోవడం, ఏమీ లేనిచోట నీరు పండించడం, చిలవలు పలవలుగా వార్తను, కధలు కధలుగా, కధనాలుగా మిగతావారికి చెప్పడం, తాము ప్రత్యక్షంగా చూసినట్లు, ఎదుటి వారిలో కొంతమందిని కించపరచే, వారి శీలం మీద కూడా చర్చ చేసే సంఘటనలు నేడే కాదు, నాడు కూడా సమాజం లో కనపడుతూనే వచ్చాయి. నాటి పక్కింటి పిన్నిగారు, ఎదురింటి వదినగారి నుంచి, “ఇది విన్నావా వదినా! పక్కింటి కామేశ్వరి ఎవరితోనో లేచిపోయిందిట, తల్లీ తండ్రీ ప్రజలకి ముఖం చూపలేక ఊరొదిలిపోయారట.” నిజమైతే, ఆ అమ్మాయి ప్రేమ వివాహం చేసుకున్నమాట సత్యం, ఆ తల్లి తండ్రులు వియ్యాలవారింటికి వెళ్ళినది నిజం. కాని బయటికొచ్చేటప్పటికి వార్త రూపే మారిపోయింది. రాజుగారి నోట్లోంచి తాడి చెట్టు పడిందన్నట్లు. ఒక పిట్ట కధ, చిన్నది, చెప్పుకుందాం. ఒక రాజు గారు ఉదయమే పళ్ళు తోముకుంటూ ఉంటే నాలిక గీసుకునే తాటాకు ముక్క ( ఇప్పటికీ పల్లెలలో ఉదయం పళ్ళు తోముకోడానికి వేపపుల్ల, నాలిక గీసుకోడానికి తాటాకు ముక్క ఉపయోగించే వారున్నారు ) జారి పడిపోయే సరికి మరొక ముక్క తెచ్చి ఇచ్చిందట, పరిచారిక. ఇది వార్తగా బయలు దేరి రకరకాల మార్గాలలో, రకరకాలుగా రూపాంతరం చెంది, ఆఖరుకి, ‘రాజుగారి నోట్లోంచి తాడిచెట్టు పడిందిట’ అయి ఊరుకుంది.  రచ్చ బండ కబుర్లయితే, “ఎంకన్నా! సుబ్బారావు ఐ.పి పెట్టేడట, నిన్న కోర్ట్ లో పిటీషన్ వేసేట్ట” నిజం, సుబ్బారావు నిన్న కోర్ట్ కి వెళ్ళిన మాట నిజమే కాని, ఐ.పి కి కాదు, నోటు బాకీ వసూలుకు దావా కోసం. పట్నాలలో ఆఫీసులలో సమస్యలు పరిష్కారాలతో పాటుగా నీలి వార్తల ప్రచారం కూడా జీవితం లో ఒక భాగమయి కూచుంది. “ప్రమోషన్ లిస్ట్ పెట్టేరట, నీకు వచ్చిందా?” సూతోవాచా! “ఏమో ఎవరూ అనలేదు, నాకొచ్చిందో లేదో తెలీదు” అంటే, “ఆ సరోజకి ఇచ్చేసేరట, మరో మంచి సెక్షన్ కి కూడా వేసేరట, ఇదంతా ఎవరి చలవంటావ్?” “ఏమో” అంటే “నీకు మాత్రం తెలియదా, ఊరికే నాచేతనిపిస్తావు కాని, పైన ఉన్నాడుగా ఆవిడకి కావలసినవాడు,అన్ని విధాలా, ఆయనే చేయించాడట.” తీరా చూస్తే ఏంటి సంగతంటే, ప్రమోషన్ లిస్ట్ లో ఉన్నవారివి రహస్య నివేదికలు పంపమన్నారట. ఇది నిత్యం జరిగేదే. అసలు దానికి చిలవలూ పలవలూ. “అదేంటే, సత్యవతీ! నీ పక్క సీటు రోజా  మొగుణ్ణి వదిలేసిందిట.మరెవణ్ణో పెట్టుకుందిట.” నిజం, “పాపం, రోజా  బతుకే అన్యాయమైపోయింది, పిల్లలతో.. మగడు తాగుబోతు, పని లేదు, ఉద్యోగం లేదు, ఇదేమో సంపాదించి పట్టుకెళ్ళిన దానిమీద అధికారం చెలాయిస్తాడు. అక్కడికీ నోరు మూసుకునే ఊరుకుంది, చాలా కాలం. అదిగో! అదే శృతి మించి ఇప్పుడు రాగం లో పడి, ఈ డబ్బులు పట్టుకెళ్ళి తాగడమే కాకుండా, నా పెళ్ళాం, నాతో కాపరం చేయటం లేదని రంకు కట్టి , టామ్, టాం చేసి, తను ఇంటినుంచి పట్టుకుపోయిన డబ్బులతో, ముండతో కులుకుతున్నాడు, ఇద్దరు పిల్లల తండ్రి, బాధ్యత మరచి, భరించలేక బయటికి పొమ్మన లేక పొమ్మంది. ఇదెవరికి తెలుసు? ఎంతమందికి చెప్పుకోగలదు?” అంటే “నీదో పిచ్చి మొహం, ‘కుడుము చేతిలో పెడితే పండుగనుకుంటా’వ”ని ఒక సర్టిఫికటు. ఇటువంటి వార్తలు మానసిక దుర్బలత్వమే. నాగరికత పెరిగిందనుకున్న చోట ఇది ఇంకా విశ్వరూపం చూపుతూ ఉంది, అనేక రకాలుగా, అనేక కోణాలలో.రాజకీయనాయకులు,సినీ తారలపట్ల వీటిది విశ్వరూపమే!. నేడు వార్తా పత్రికలు గాని, టి.వీ లు గాని చూస్తే కనపడేవన్నీ ఎక్కువగా సంచలన వార్తలే. ఆడ మగ పని చేసే ఆఫీసులలో ఈ నీలి వార్తలకు కొదవ ఉండదు. దీనిలో ఆడవారికి మగవారికి మధ్య పోటి ఉంటుందేమో కూడా అనే రీతిలో ఉంటాయి చెప్పేవార్తలు కూడా.

DSCN1573
నాటి రోజులలో రాత్రి పగలు పనిచేసే ఆఫీసు అంటే టెలిపోన్ ఎక్ఛ్ంజి మాత్రమే. అందులోనూ ఆ రోజులలో, అంటే మేము ఆపరేటర్లుగా వచ్చేకాలానికి, అంటే ఏభయి ఏళ్ళకితం, ఈ ఉద్యోగం ఆడవారిది మాత్రమే అనే అభిప్రాయం ఉండేది, అది నిజం కూడా. మేము వచ్చిన తరవాత కొత్త తరంలో మగవారు కూడా రావడం తో పగలు రాత్రి స్త్రీ, పురుషులు కలసి పని చేయవలసివచ్చేది. ఇంకేం నీలి వార్తలుకి కొదవలేదు. వ్యాపింప చేసేవారికి కొదవలేదు. కొన్ని కొన్ని వార్తలయితే వినడానికి కూడా జుగుప్స కలిగించేవి. కొంతమంది మీద నీలి వార్తలు తరవాతి కాలం లో నిజమయిన సంఘటనలూ ఉండేవి. నిజానికి ఆ రోజులలో మాకు పిల్లనివ్వడానికి వచ్చేవారుండే వారు కాదంటే అబద్ధం కాదు. ఒక మిత్రుడికి పిల్ల నివ్వడానికి వచ్చినాయన చెప్పాపెట్టకుండా పారిపోయాడు. నేను వెనకపడి అతనిని ఒప్పించి పెళ్ళి చేయించేటప్పటికి తల ప్రాణం తోకకి వచ్చిందంటే నమ్మండి. ఆ తరవాతి కాలం లో ఆ అమ్మాయి, నాటి పెళ్ళికూతురు,’ అన్నయ్యగారు, మీ బావ బుద్ధిమంతుడేనండి’ అనేది, నవ్వుతూ.

ఇటువంటి వార్తలు చెప్పేవాడి కంటే వినేవాడి చెవులు తెగకొయ్యమన్నాడు వేమన తాత, పద్యం గుర్తులేదు.కొండెములు చెప్పేవాణ్ణి నమ్మదంటాడు.

నా ఛాదస్తం కాని ఇది నడుస్తూనే ఉంటుంది……..మానవ మనస్తత్వం ఛస్తే మారదుగాక మారదు.

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఇది విన్నారా? నీలివార్తలు

 1. నీలి వార్తలు టైటిల్ బాగుందండి. కాలేజి లో చదువుకునే రోజుల్లో ఈ నీలి వార్తలు ఎక్కువగా ఉండేవి.ఇక ఆ తరువాత, అంతర్జాలం లో మనకు తెలియంది ఏముంది? చక్కగా బొలెడన్ని నీలి వార్తలు చదువుకోడానికి.:)) టెలిపోన్ ఎక్ఛ్ంజి ఆపరేటర్ల గురించి నీలి వార్తలు ఆ రోజుల్లో నేను కూడా కొన్ని నాన్నగారి ద్వారా వినేదాన్ని. మొత్తానికి నీలివార్తల మీద టపా రాయాలని ఇడియా మీకు రావడం మాత్రం భలే బాగుంది.

  • @జలతారు వెన్నెలగారు,
   అనివార్య కారణాలవల్ల జవాబివ్వడం ఆలస్యమైంది, మన్నించాలి.
   కాలేజి రోజుల నీలివార్తలు, గోడల ఖరాబులు, చెత్త రాతలగురించి రాయడం ఇష్టం లేక వదిలేశాను.ఆ రోజుల్లో మా ముందు గొప్పగా పొగిడి వెనక చెడ్డగా చెప్పుకునేవారు, ఇది నేను ఎరుగుదును. ఈ మధ్య ఒక నీలి వార్త నన్ను బాధ పెట్టింది, అందుకే ఈ టపా పుట్టింది.
   నెనరుంచాలి.

 2. కరంటు ఉన్నంత సేపూ నెట్ లో ఉంటారట కదా, …….. నా గురించి ఇలాగే పుకార్లు పుట్టిస్తున్నారండి.

  • @అనూరాధ,
   ఈపాడు అలవాటును మరల్చుకోలేరేమో! ఇది వ్యక్తుల సంస్కారం మీద ఆధారపడిఉంటుంది.
   నెనరుంచాలి.

   • * బ్లాగ్ ప్రారంభించకముందు ఇరుగుపొరుగువారితో కొంచెంసేపు మాట్లాడటానికి నాకు సమయం ఉండేది. ఇప్పుడు ఇంటిపని, బ్లాగ్స్ చూడటం…వీటితో ఇతరులతో మాట్లాడటానికి ఎక్కువసమయం కుదరటం లేదు.
    * నా గురించి మా చుట్టుప్రక్కల వాళ్ళు ఏమనుకుంటారంటే , నేను నలుగురితో కలుపుగోలుగా మాట్లాడనని అనుకుంటున్నారట.
    * కొందరు నాతో ఏమంటారంటే , మీకు పనిమనిషి కూడా లేదు కదా ! మీకు ఎప్పుడూ ఇంట్లో పనితోనే సరిపోతుంది…. అందరితో మాట్లాడటానికి మీకు సమయం ఎక్కడుంటుందిలెండి…. అని సానుభూతి చూపిస్తారు.
    * నాకు సమయం సరిపోవటం లేదన్నది నిజమే…. అయినా కూడా వీలైనంతవరకు ఇరుగుపొరుగుతో మాట్లాడుతూనే ఉంటాను.
    * ఏంటో, అందరితో కలుపుగోలుగా ఉంటే కొన్ని సమస్యలు. కలుపుగోలుగా లేకపోయినా తప్పుపడతారు. చిత్రమైనదీ లోకం అనిపిస్తుందండి.

  • @అనూరాధ గారు,
   అనివార్య కారణాలవల్ల జవాబివ్వడం ఆలస్యమైంది, మన్నించాలి.
   ఈ ప్రపంచం, మనుషులూ, అన్నీ చిత్రమైనవే, మనమూ ఆ చిత్రం లో ఒక భాగం, కొన్ని తప్పవు, తప్పించుకోలేం. తామరాకు మీద నీటి బొట్టులా ఉన్నా నేటిరోజు గడవటం లేదు, మీరన్నమాట నిజం.
   నెనరుంచాలి.

 3. >>>>>ఇటువంటి వార్తలు చెప్పేవాడి కంటే వినేవాడి చెవులు తెగకొయ్యమన్నాడు వేమన తాత.<<<<< ఇదిమాత్రం అక్షర సత్యం బాబాయ్ గారు.

  టేబిల్ రోజా పూలు చాలా బాగున్నాయి. మిగతావి బొన్సాయ్ చెట్లా! ఈ ఫొటోలెక్కడివో చెప్పండి….

  • @జయగారు,
   అటువంటి సంభాషణని మొదటే ఖండిస్తే సమస్యలు రావు.
   టేబుల్ రోజాలు ఊళ్ళో ఒకరింటి దగ్గర చూసి ముచ్చటపడి ఫోటో తీశా. వాళ్ళు నన్ను వింతగా చూశారనుకోండి. అవును అవి బోన్సాయ్ మొక్కలే. వీటిని నా బ్లాగులో ఫోటో లన్ని కడియం లో నర్సరీలలో తీసినవే.
   నెనరుంచాలి.

 4. నీలాకాశం అన్నా , నీలి వార్తలన్నా , నీలి చిత్రాలన్నా ఎంతో మందికి యిష్టం అన్నది సర్వజనితమే.

  పబ్లిక్ మీద సెటైర్లు వేయటం బహు సరదా , చాలామందికి అదోరకం దురదలెండి . దురద అంటం కంటే కండూతి అనటమే బాగుంటుంది. ఈ కండూతి ఎంత గోకినా దురద ఆగదు , సరదా తీరదు.( అటువంటి వాళ్ళను ఈ పనులు మానుకోండి అని చెప్పినా మానుకోలేరు ).

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s