శర్మ కాలక్షేపంకబుర్లు-టార్గెట్( లక్ష్యం )

DSCN3000లక్ష్యం (టార్గెట్)

“అమ్మయ్య! టార్గెట్ పూర్తయిందండీ” అన్నాడు మా సత్తిబాబు వస్తూనే. “చెల్లెమ్మా! ఒక ఒన్ బై టూ   కాఫీ రెండు కప్పులూ”, అని ఒక అరుపు కూడా అరిచి మరీ కూచున్నాడు. “ఏంటండి ’టార్గెట్’ అంటారు దీని కధాకమామిషూ చెప్పండి” అన్నాడు.

“టార్గెట్ అంటే లక్ష్యం, గురి అని అర్థాలు చెప్పేడు నిఘంటుకారుడు. దీని మీద ఒక చిన్న కధ ఉంది భారతంలో, చెప్పేసుకుందాం.ద్రోణాచార్యుడు పాండవులకు కౌరవులకు అస్త్రవిద్య నేర్పుతున్నారు. ఆ సందర్భం లో ఒక చిలుక బొమ్మ తయారు చేసి దానిని ఒక చెట్టు చివర కొమ్మ మీద ఉంచి వీరందరనీ తీసుకువెళ్ళి, ముందుగా ధర్మరాజును పిలిచి ఆ చిలుకను చూపించి, దాని కంటిలో బాణం దిగేలా కొట్టాలని చెప్పి, బాణం ఎక్కుపెట్టమని చెప్పి, ఇప్పుడు నీకు ఏం కనపడుతోందని అడిగేడు. ధర్మరాజు మీరంతా, చెట్టు, చిలకా అన్నీ కనపడుతున్నాయని చెప్పేడు.ద్రోణుడు ధర్మ రాజును తప్పుకోమని దుర్యోధనుడుని ఇదే ప్రశ్న వేస్తే ధర్మరాజు చెప్పిన సమాధానమే చెప్పేడు.ఇతనిని కూడా తప్పుకోమని మిగిలిన అందరిని అడిగితే, ఒక్కొకరు అదే సమాధానం చెప్పేరు. చివరికి అర్జునుని పిలిచి బాణం ఎక్కుపెట్టమని, మళ్ళీ అదే ప్రశ్న వేస్తే అర్జునుడు, గురుదేవా! నాకు అక్కడ చిలక కన్ను తప్పించి మరేమీ కనపడటం లేదంటే బాణం వదలమన్నారు. బాణం వదిలితే, అది తిన్నగా పోయి చిలుక కంటిలో మాత్రమే గుచ్చుకుంది. లక్ష్యం సాధించేవారికి ఆ లక్ష్యం తప్పించి మరేమీ కనపడకూడదని దీనిభావం. ’లక్ష్యం లేని చోట లక్ష్మి నిలువదని’ నానుడి.నువ్వేమంటావంటే మా సత్తిబాబు.

DSCN1588

“ఏముందండి, మార్చ్ నెలరాబోతోందంటే అందరికీ హాడావుడే! ఎవరిని పలకరించినా “తరవాత మాటాడతానేం! టార్గెట్ రీచ్ కాలేదండీ!, ఏమనుకోవద్దు,” ఇదేమాట వినపడుతోంది. ఇంతకీ దేనికీ టార్గెట్ అంటే, ఎవరికి?దేనికి?

ఒకప్పుడు జీవిత భీమా ఏజంట్లు మాత్రం మార్చ్ టార్గెట్ రీచ్ కాలేదు, ఒక పోలసీ చెయ్యండి అని వెంట పడేవారు. నేడో అందరికీ టార్గెట్ లే. బేంక్ మేనేజర్ లకి,టీచర్లకి,ఉద్యోగస్తులకి,పరిశోధకులకి, ఇక ప్రైవేటు సంస్థలయితే సేల్స్ వగైరా అయితే చెప్పనే అక్కర లేదు.పన్నులు వసూలు చేసేవారికి,బిల్లులు పాస్ చేసేవారికి, చివరికి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్లు ఇన్ని చెయ్యాలి, ఇంత సొమ్ము రాబట్టాలని టార్జెట్ ట. ప్రభుత్వ అభివృద్ధిలో టార్గెట్ ట. అది సాధించడానికి మార్గాలట.ఎందుకు ఈ రోజే ఆ అవస్థంటారా? ప్రతిదానికి సొమ్ముతో లంకె కదండీ! దానికోసం. ఈ రోజు ద్రవ్యవినిమయానికి ఆఖరురోజట,సంవత్సరంలో.

DSCN1694

ఈ టార్గెట్ లలో బలే చిత్రాలు, విచిత్రాలు. ఐతే ఈ మధ్య కొత్తగా బేంక్ వారికి ఒక కొత్త బెడద వచ్చి పడింది. ఇదివరలో డిపాజిట్లకి వెనకపడి ఒక్క పదిహేనురోజులకి వెయ్యండి డిపాజిట్, ఏప్రిల్ ఒకటిన తీసుకోండి అని వెనకపడే వారు. ఒకవేళ సొమ్ములేదంటే ఉన్న డిపాజిట్ కేన్సిల్ చేసి దానినే కొత్తగా వేసి టార్గెట్ పూర్తి చేసేవారు. ఈ మధ్య వీరికి కొత్త చిక్కే వచ్చి పడింది. రైతులకి అప్పులివ్వాలి, ఈ సంవత్సరం ఒక బ్రాంచ్ లో రెండుకోట్లు అప్పులివ్వాలి, అది లక్ష్యం, కాని దీనికో తిరకాసు, ఏమంటే ఇచ్చిన అప్పును మేనేజర్ మార్చ్ 31 నాటికి వసూలు చేయాలి, అతనిదే బాధ్యత, ఇదీ టార్గెట్టే. అసలు కధ ముందే అంటే అప్పు ఇచ్చే ముందే జరిగిపోతూ ఉంది. రైతుకి అప్పు ఇవ్వాలంటే అతనికి భూమి ఉండాలి, ఆ కాగితాలు పట్టుకెళ్ళి బేంక్ మేనేజర్ కి ఇస్తే ఆయన భూమి ఉన్న వారికి అప్పు ఇస్తారు. ఇలా కాగితాలు పట్టుకెళ్ళిన వారు అప్పు తీసుకుని మార్చ్ 31 కి కట్టేస్తే, వారికి వడ్డి 6% అవుతుంది. ఆ తరవాతెప్పుడో 3% వారికి తిరిగి ఇవ్వడం జరుగుతుందట. కాగితాలు పట్టుకెళ్ళినవారికి నిరభ్యంతరంగా అప్పు ఇచ్చేస్తున్నారు,వారు అప్పు తీసుకుని సొమ్ము పట్టుకుపోయి మార్చ్ కి కట్టేస్తున్నారు. అంతా చక్కగా టార్గెట్ ప్రకారం, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జరిగిపోతూ ఉంది. ప్రభుత్వం ఇన్ని వేల కోట్లు రైతులకి అప్పులిచ్చేం, అని చెప్పుకుంటూ ఉంది. నిజమే కాని అసలు వ్యవసాయం చేసేవారికి అప్పు పుట్టటం లేదు 🙂  కారణం వారికి భూమి లేదుకనక. మరి ఈ అప్పు పట్టుకెళ్ళినవారు? ఎవరూ వ్యవసాయం చెయ్యరు. అంతా అప్పు పట్టుకుపోయి, దానిని 36% వడ్డికి తిప్పుకుంటారు. 6% వడ్డీతో బేంక్ కి కట్టేస్తారు. వ్యవసాయానికి అప్పు ఇచ్చినట్లూ ఉంది, కావలసినవారికి ఉపకారం చేసి, ఓట్ బేంక్ తయారు చేసుకున్నట్లూ ఉంది కదా. ’ఒగిచినట్లూ ఉండాలి వాత పెట్టినట్లూ ఉండాలని’ అత్తగారు ఏడుగురు కోడళ్ళూ, భోజనాల కధ లాగా.వ్యవసాయానికి అప్పు ఇవ్వడమూ జరిగింది వసూలు చెయ్యడమూ జరిగింది, కాని నిజానికి అవసరమైనవారికి అప్పు చేరలేదు 🙂 టార్గెట్ లీలలు ఇన్నన్ని కావయా…అన్నాడు.”

DSCN2989

ఎవరికో ఋణం తీర్చలేకపోతున్నా!

అసలు మీ టార్గెట్ ఏంటండి అన్నాడు. సంవత్సరంన్నర ముందు సత్వగుణం లో అమ్మను చేరుకోవాలని తాపత్రయపడేవాడిని, సేవించుకునేవాడిని, స్మరించుకునేవాడిని, అను నిత్యం. ఇదుగో ఇలా రజో గుణ ప్రధానంగా మిగిలిపోతున్నా. అందుకు మళ్ళీ టార్గెట్ పట్టుకోడానికే…..
స్వస్తి.

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-టార్గెట్( లక్ష్యం )

 1. లక్ష్య సాధన ఒక అంతు ఎరగని కార్యం.
  జీవితం లో లక్ష్యం లేక పోతే జీవితం లేదు.
  ఒక లక్ష్యం సాధిస్తే మరొక లక్ష్యం వైపు
  అలుపు లేకుండా ముందుకు సాగాలి.
  మీరేమంటారు ?

  • @మోహన్జీ,
   అనివార్య కారణాలవల్ల జవాబివ్వడం ఆలస్యమైంది, మన్నించాలి.
   నిజమే, లక్ష్యం ఉండాలి, దాని గురించి పరిశ్రమ చేయాలి.అదే సమయం లో కొన్ని ముఖ్యమైన వాటినీ విస్మరించరాదు. ప్రహ్లాదుడు ఏం చేసేడు…పానీయంబులు ద్రావుచున్ కుడుచుచున్, భాషించుచున్….అన్నీ చేస్తూనే లక్ష్యం మీద మనసుపెట్టేడు. అదే మనకు ఒరవడి కదా!
   నెనరుంచాలి.

 2. బాగా వ్రాసారు.
  నిజమేనండి. మోక్షాన్ని సాధించటం మానవజన్మ యొక్క అసలు లక్ష్యం అని పెద్దలు తెలియజేశారు.

  ఎంతో అద్భుతమైన వీడియోను చూపించారు. కృతజ్ఞతలండి.

  • @అనూరాధ గారు,
   అనివార్య కారణాలవల్ల జవాబివ్వడం ఆలస్యమైంది, మన్నించాలి.
   నిజమే, మానవ జీవన లక్ష్యం అదేనన్న సంగతే మరుస్తున్నాం.
   నెనరుంచాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s