శర్మ కాలక్షేపంకబుర్లు-వేసవి చిట్కాలు

DSCN1628

వేసవి చిట్కాలు.

అందరికి నమస్కారం,నా గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న తల్లులకు నమస్కారం. పిన్నలందరికి దీవెనలు.నా బ్లాగ్ కుటుంబ సభ్యులందరికి ఆత్మీయ పలకరింపు.

వారం నుంచి కనపడలేదని కంగారు పడ్డారు కదా! వనజ గారైతే మాస్టారూ ’ఎలా ఉన్నారని’ పోన్ చేసి మరీ అడిగేసేరు, ‘అందరూ మీరు కనపడటం లేదని కంగారు పడుతున్నారం’టే చెప్పేను, నా పరిస్థితి. కురుపేసింది నవ్వకండి, నిజమే అదీ ఎక్కడేసిందంటే సరిగా కుడి కాలి పిర్రకి కాలి మడతలో వేసింది. కూచోడానికి లేదు, నుంచోడానికి లేదు, కాలు పైకి పెట్టుకుని కూచోవాలి. ఇదీ అవస్థ. ఇక కంప్యూటర్ దగ్గర కూచోడమెలా? పోటు ధనారించి పొడిచేస్తుంటే. ఉయ్యాలే శరణ్యం, కాలు పైకి పెట్టుకు కూచోడానికి. అసలు కురుపెందుకేసిందీ? మంచి ప్రశ్న. సుగర్ ఎలా ఉందీ? బాబోయ్! సుగర్ ఎప్పుడూ అదుపులోనే ఉంటుంది అంటే, మరి ఇది ఎందుకేసిందీ?

వేసం కాలం వచ్చేసింది, మామిడి చెట్టు కాసేసింది, పనస చెట్టుకాసేసింది. మరింకేం, కావలసినంత. మామిడి పిందెల దగ్గరనుంచి వాడకమే కదా! వాటిని మెంతి బద్దలుగా తింటాం. ముద్ద పప్పులో బలే రుచిగా ఉంటుంది. కొద్దిగా పెరిగితే జీడి పిందెలు టెంక పట్టనిది, కొత్తపల్లి కొబ్బరి మామిడి చెట్టేమో అబ్బో పులుపే పులుపు, పచ్చి మిరపకాయలు మామిడికాయ ముక్కలతో ఉడికిస్తే ఆ పులుపు అంటుకుని వాటిని కూడా వదలకుండా తినెయ్యడమే, కందిపప్పులో వేసుకుని పప్పు గరిటజారుగా చేసుకుని ఇంగువపోపుతో తింటే స్వర్గానికి బెత్తెడే ఎడం, రుచిలో. దాని తరవాతది జీడి ఆవకాయ. కొత్త కారం ఆడించిన వెంటనే జీడిపిందెలు కోసి ట్రయల్ ఆవకాయ, కొత్త ఆవపిండితో పెట్టుకుంటే దాని రుచి చెప్పేరా? మరి ఈ నెల రోజులూ మామిడి కాయ పప్పు తప్పదు కదా! ఇక్కడికి మామిడి అయ్యింది. ఇక రెండవది పనసచెట్టు. ఇదీ కాసేసింది, దీని పిందెలే బాగుంటాయి కూరకి, పెద్దవయితే ముదిరితే పండు అయిపోతుంది, కూరకి పనికిరాదు. అందుకు వారానికి మూడు సార్లు పనసపొట్టు కూర, ఆవ పెట్టమంటే ఇల్లాలు వద్దని పెట్టలేదు, ఒక్క సారి కూడా. ఇప్పుడిక వేడి చేయడానికి లోటున్నదేమిటి? ఇలా దగ్గరగా మూడు వారాలనుంచి జరుగుతోంది కనక కురుపేసింది, అదీ రక్తపు గడ్డ. సలుపు చెప్పలేను. మొదటిలో అశ్రద్ధ, కొంత దానికి సాయపడింది. మరి ఈ సమయంలో వచ్చేవి తినమా? తింటాం. వేడి విరుగుడికి చిటకాలు.

DSCN1714

తృష్ణ గారి బ్లాగ్ ’రుచి’లో చూశాను, బ్లాగులో కొన్ని వేసవి పానీయాలు,సబ్జా గింజలు,బార్లీ నీళ్ళు, సగ్గు జావ, చోడి జావ, వగైరా అన్నీ చూశానుకాని ఒక చిట్కా నాకోసం వదిలేశారు, మరి పల్లెటూరి వాడిని కదండీ, చిట్కా చూసి నవ్వకండి. అదే ఇది. చిట్టుడుకు నీళ్ళు. అవేంటి అంటారా? చెబుతున్నా. కుక్కర్లొచ్చాకా అన్నం వండుకోడమే మరిచిపోయాం కదా! పాత కాలానికెళదాం, నీళ్ళు ఎసరు పెట్టి బాగా మరగనివ్వాలి, అప్పటికే బియ్యం బాగా కడిగి ఉంచాలి, నీళ్ళు ఓడిపోవాలి, బియ్యంనుంచి. నీళ్ళు కళపెళా మరుగుతుండగా బియ్యం ఎసట్లో పొయ్యాలి, ఒక్క ఉడుకు రాగానే పైనున్న నీళ్ళు తీసుకుని మరొక పాత్రలో జాగ్రత్త చేసుకోవాలి. చిక్కబడిపోతే అది గంజి. ఈ నీటిలో కొద్దిగా ఉప్పు వేసుకుని కొద్ది కొద్దిగా తాగుతుంటే ఉడుకు తగలదు. ఈ చిట్టుడుకునీళ్ళు బాగా చిన్న పిల్లలకి కూడా పట్టించవచ్చు. బాగా పని చేస్తాయి. మరి ఆ తరవాత, తీసిన నీటిని భర్తీ చేస్తే, అన్నం ఉడికితే గంజి వారుస్తాం కదా! దానినీ పారబోయకూడదు. దీనిని జాగ్రత్తగా పట్టుకుని ఉంచుకుని కొద్దిగా మజ్జిగ కాని, నీరుగాని పోసుకుని ఎండవేళ తాగితే మంచి బలవర్ధకం. వేసవి కాలం మాలాటి పిల్లలు భోజనం చేయలేరు, ఉడుకు మూలంగా తిన బుద్ధికాదు, నీరసం వచ్చేస్తూ ఉంటుంది, గ్లూకోస్ లు వగైరాలిచ్చినా సుఖం ఉండదు. అప్పుడు ఇటువంటి గంజి కొద్దిగా ఉప్పువేసి ఇచ్చి చూడండి బలే పని చేస్తుంది. వేడి చేయనివ్వదు, నీరసం రానివ్వదు, పిల్లలకు కూడా ఇవ్వవచ్చు.

DSCN1715

మందులు వాడాను, చిట్కాలూ వాడాను, వారంలో కూచోగలుగుతున్నా, కొద్దిగా ఉంది, అదీ తగ్గిపోతుంది.  ఇన్ని తెలిసి మీకెందుకు చేసింది వేడి, కురుపేసేదాకా అంటారా? మా పెద్ద దిక్కు, మనవరాలు రసజ్ఞ నిరుడు చిట్టుడుకు నీళ్ళు తాగు తాతా అని చెప్పి గుర్తుచేసింది, నిరుడు తాగేను బాగానే ఉన్నా! ఈ సంవత్సరం మరిచిపోయా! రసజ్ఞ కి చెప్పకండీ, చెప్పేరనుకోండి ఈ సంగతి వాళ్ళ అమ్మమ్మ చేత నాకు క్లాసు పీకించేస్తుంది 🙂 మళ్ళీ కలుద్దాం, ఏం చేస్తోందో పిచ్చి పిల్ల, అక్కడా ఎండలు మండిపోతున్నాయి.

18 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-వేసవి చిట్కాలు

 1. మీరు చెప్పిన ఫలాలలో పుచ్చకాయ ( కర్బూజా ) , ఇంకా ద్రాక్ష లను చాలా తక్కువ గా తినాలి మీరు ! మిగతా పళ్ళు కూడా మితం గా తినాలి ! ముఖ్యం గా , మీరు పళ్ళ రసాలలో పంచదార కలప కూడదు !
  ఇంకో విషయం , రాగి పాత్రల విషయం అనుకోలేదు కదా ! రాగులు అంటే !

  • @సుధాకర్జీ,
   రాగులు అనేవి చిరు ధాన్యాలు,వాడతాము, రాగి పాత్రలే వాడతాం మంచి నీరు నిలవచేసుకోడానికి, రోజూ ఎప్పుడూ రాగి చెంబులో నీళ్ళే తాగడం అలవాటు. మీరు చెప్పిన విషయాలు దృష్టిలో పెట్టుకున్నాం. మొన్నటి మీ టపా సుగర్ గురించి చాలా అవసరమయింది, ఆ రోజే, అడిగినట్లు గా దాని గురించే టపా రాశారు. ధన్యవాదాలు
   నెనరుంచాలి.

 2. తాతగారూ..మీ బాధ ఉపశమించినందుకు ఊరటగా ఉంది..
  ఎన్నో మంచి విషయాలు మాకు పంచుతున్నారు ..మీ బ్లాగు ఒక్కరోజు చదవకపోయినా ఏదో బెంగ..:(
  కుడుపు నిండుగా చిట్టుడుకు నీళ్ళు తాగేసి,ఈ వేసవిలో చలచల్లగా టపాలు రాసేయండి తాతగారు.

  • @అమ్మాయి ధాత్రి,
   కులాసగా ఉన్నారు కదా? అమ్మమ్మ చిట్టుడుకునీళ్ళు ఇచ్చేస్తోంది, తాగేస్తునాను, టపాలు రాస్తున్నాగా! కరంటే మూడురోజులనుంచి పగలంతా తీసేస్తున్నాడు.ముందేమో అమ్మ ఇష్టమే.
   నెనరుంచాలి.

 3. మొన్ననే వనజ గారి బ్లాగు ద్వారా మీ గురించిన విశేషాలు చదివాను. ఆరోగ్యం కుదుటపడ్డందుకు సంతోషం. మీ కబుర్లు మీకు కాలక్షేపమైనా మీ అనుభవాలు ఇప్పటివారికి చాలా అవసరమనిపిస్తున్నాయండీ. మీరూ పల్లెటూరినుండే బ్లాగు వ్రాస్తున్నారా? ఈ కబురు మరీ ఆనందాన్నిస్తున్నది.

  • @మిత్రులు కొండలరావుగారు,
   నా బ్లాగుకు స్వాగతం. మనకు ఇదివరకే పరిచయమున్నా,మీరు నా బ్లాగుకు రావడం మొదటి సారనుకుంటా.ఆ అనుభవాలు ఇప్పటివారికి అవసరమే అంటే మొదలుపెట్టా, గురువుగారు శ్రీభమిడిపాటి ఫణిబాబుగారి ప్రోత్సాహంతో, రాయకుండా ఉండలేని వ్యసనమైపోయింది. పల్లెలో పుట్టి పల్లెలలో ఉద్యోగం చేసి పల్లెలోనే బతుకుతున్న మట్టి మనిషిని. నా బ్లాగు నేను పల్లెనుంచే రాస్తున్నా. నా కంప్యూటర్ పరిజ్ఞానం వగైరా గురించి రాస్తే చేట భరతమే( చాటు భారతం అలవాటులో అలా అనేస్తాం),మీ అభిమానానికి కృతజ్ఞతలు.
   నెనరుంచాలి.

 4. మీ ఆరోగ్యం కుదుట పడుతున్నందుకు సంతోషం శర్మ గారూ ! వనజ గారు మీ దర్శనాన్ని బ్లాగులో వివరించారు !
  బాగుంది. మీరు ఓ మహర్షి లా కనిపించారు ఫోటోలో ! మీ ఆరోగ్యం గురించి తీసుకునే జాగ్రత్తల విషయం లో రాజీ పడకండి !
  చిట్టుడుకు నీళ్ళు చాలా ఆరోగ్యకరమైనవి ! విటమిన్లు ఖనిజాలు ఉండడమే కాకుండా తేలిక గా జీర్ణమవుతుంది కూడా !
  ఆంధ్ర దేశం లోని కొన్ని ప్రాంతాలలో రాగులతో చేసిన అంబలి కూడా తాగుతారు, అది కూడా చాలా ఆరోగ్యకారి !

  • @సుధాకర్జీ
   ఆరోగ్యం విషయం లో ఎప్పుడూ రాజీ లేదండి.మీ అభిమానవర్షం లో తడిపేశారు, జలుబుచేస్తే మీదే బాధ్యత 🙂 చిట్టుడుకు నీళ్ళు తీసుకుంటాము, రాగితో పదార్ధాలు చేసుకుని రోజూ వాడటం అలవాటే. ఏ కాలం లో దొరికే అన్ని పళ్ళు, ప్రస్తుతం, కమలా, నిమ్మ, దానిమ్మ, కేరట్, బీట్ రూట్, ద్రాక్ష, పుచ్చకాయ, ఇలా కనపడిన అన్ని పళ్ళూ తెచ్చుకుని వాటన్నిటినీ రసం తీసుకుని కొద్దిగా ఉప్పు, పంచదార చేర్చి, ఇంట్లో అందరమూ ఉదయ ఫలహారం తో తీసుకోవడం అలవాటు. మధ్యాహ్నం ఎండ సమయం లో చిట్టుడుకునీళ్ళు కాని, కొద్దిగా గంజి పలచగా తీసుకోవడం ఇంటిల్లపాదికీ అలవాటే. మీ అభిమానానికి మరొక మారు కృతజ్ఞత తెలుపుకుంటున్నాం.
   నెనరుంచాలి

 5. “కష్టే ఫలి ” అన్న బ్లాగు ని బట్టే మీ వయసు , అనుభం తెలిసిపోతున్నాయి .ఈ మధ్య మన బ్ళాగుల ఆత్మీయురాలు మిమ్మల్ని దర్శించినట్లు వ్రాసిన ఆ అనుభవం , నాకూ అనుభూతమైనంతగా ఆనందం చెందాను. ఏ మాత్రం అవకాశం లభించినా మిమ్మల్ని ఓ మారు దర్శించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను .
  ఇంక మీ వేసవి చిట్కాలు చాలా మంచివే. మికు వీలుంటే మీ మొబిలె నంబర్ నాకు మెయిల్ చేయండి . మిమ్మల్ని స్వయంగా కలుసుకొనేంతవరకు దూరవాణి ద్వారా దగ్గరవుదామనుకుంటున్నాను.

  వయసు పులుసు తీస్తుంది అన్నారు,క్లాస్ గా . వాస్తమే మరి వయసు ఉసురు కూడా తీస్తుంది అని అంతరార్ధం కదా !

  మీ శర్మ జీ ఎస్

  • @శర్మ గారు,
   మీ అభిమానానికి అవాక్కయ్యాను, ఆనందంతో. మీరందించే స్నేహ హస్తాని అందుకుంటా.మీరు సకుటుంబంగా మా ఇంటికి రావాలని అభ్యర్ధన.
   నెనరుంచాలి

 6. * చక్కటి విషయాలను తెలియజేసారు. మీకు అనారోగ్యం తగ్గినందుకు సంతోషంగా ఉందండి.
  * చిట్టుడుకు నీళ్ళు చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు కుక్కర్ల వల్ల అవన్నీ మర్చిపోయాం.

  * మజ్జిగలో కలిపిన రాగుల జావను కొందరు పిల్లలు ఇష్టంగా త్రాగరు. రాగుల జావలో పాలు + బోర్నవిటా లేక హార్లిక్స్ వంటివి కలిపి వేడిగా ఇస్తే పిల్లలు ఇష్టంగా త్రాగుతారు.
  * రాగులజావ తయారు చేసేటప్పుడు కారట్, కాప్సికం , ఉల్లికాడలు వంటివి కొద్దిగా నేతిలో లేక వెన్నలో వేయించి, అతి కొద్దిగా మిరియాల పొడి వేసి వేడిగా సూప్ లా కాచి ఇస్తే పిల్లలు , పెద్దవాళ్ళు ఇష్టంగా త్రాగుతారు..

  • @అనూరాధ,
   భగవంతుడు ఏ కాలానికి తగిన ఆహారం ఆ కాలం లో దొరికేటట్లుగా చేశాడు. ప్రకృతికి దగ్గరగా బతికితే ఇబ్బందులు తక్కువుంటాయి. వచ్చినా విడిపోతాయి. అమీ అభిమానానికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం, యావత్తు కుటుంబ సభ్యులమూ.

 7. తర్వాణీ అంటారు కదండీ తాతగారు, మా పూజారిగారు ఒక కుండలో దాస్తారు, చిన్నప్పుడు అమ్మ నాన్నా మమ్మల్ని తీసుకు రమ్మని చెప్పేవారు.
  ఇక ఆ రుచి ఎక్కేది కాదు, తాగే వాళ్ళం కాదు. మా చేత తాగించడానికి అమ్మ చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు.

 8. ఈ పోస్ట్ లో చాలా క్రొత్త పదాలు చూసాను. చిన్నప్పుడు విన్న పదాలు . చాలా సంతోషం వేసింది.

  “చిట్టుడుకు నీళ్ళు ” హాట్ ఫేవరేట్ అండీ ! రసజ్ఞ ని అడిగినట్లు చెప్పండి మాస్టారూ !

  ఇంతకీ జిలేబీ గారు వచ్చారంటారా? రాలేదంటారా? ఏమో ! కలయో వైష్ణవ మాయో !!??

  • @వనజగారు,
   కుక్కరొదిలేసి వేసవికాలం చిట్టుడుకు నీళ్ళు తాగుదాం. వడ దెబ్బనుండి కాపాడుకుందాం.జిలేబి గారు వచ్చారాంటారా? సాకార దర్శనం ఇచ్చేరోజు, తప్పని సరిగా దర్శనమిస్తారని నమ్మిక, అప్పటి దాకా నిరాకార దర్శనమిచ్చి ఆశీర్వదిస్తూంటే ఆ తల్లికి నమస్కారం. ఆనందః.విష్ణు మాయ దాట తరమా? మీ అభిమాన వర్షం లో తడిసి ముద్దయ్యాము మా కుటుంబ సభ్యులమంతా. అదంతా అమ్మ దయని నమ్ముతాం.
   నెనరుంచాలి.

  • @జలతారు వెన్నెలగారు,
   మీ అందరి అభిమానమే మళ్ళీ కూచో పెట్టేసింది, ఒక వారం లోనే.ఇప్పుడు కురుపు పూర్తిగా తగ్గినట్లే.
   మీ అభిమానానికి కృతజ్ఞత.
   నెనరుంచాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s