శర్మ కాలక్షేపంకబుర్లు-టపా రాయడం కష్టమా?

DSCN3061

టపా రాయడం కష్టమా?

“టపా రాయడం పెద్ద కష్టమని ఎవరన్నారు? రాసేదంతా కలిపి ఇరవైనిమిషాలపని, పేపర్ ప్రింటింగ్ లాగా, కీ బోర్డ్ మీద టపటప లాడించడమే.” అంటుండగా మా సత్తి బాబు వచ్చాడు. “ఏంటండి” అంటే చెప్పా.

“పంతులుగారు, చిక్కంతా ఎక్కడంటే, టపా రాయడానికి కావలసిన విషయం ఎన్నుకోడంలో ఉంది, అసలు   తిరకాసంతా.   టపా రాయడం మూడు రకాలు.1.మస్తకం నుంచి, 2.పుస్తకం నుంచి, 3.పుస్తక మస్తకాలనుంచి.

. మొదటిదయితే సమస్యలేదు. విషయం పూర్తిగా తెలిసినదేనా అయిఉండాలి లేదా అనుభవమేనా అయితే కొట్టిన పిండే, నల్లేరు మీద బండే. టపా పరుగెడుతుంది , నాట్యం చేస్తుంది, వయ్యారాలూ పోతుంది, వగలూ చూపగలదు. చదువరుల చేతిలో పడితే చప్పట్లే, ముచ్చట్లే, మనసుకి ఆనందమే. ఇందులో హాస్యం,వ్యగ్యం ఎక్కువ ఆదరణ పొందుతాయి. వీటికితోడు శృంగారమైతే అసలు సమస్యలేదు, పులగం మీదపప్పే!.

పుస్తకం నుంచి రాసేటపా. కొద్దిగా ఒళ్ళు దగ్గరపెట్టుకు రాయాలి. రచయిత రాసిన దానికి భిన్నంగా ఉండటం సహజం కాదు, మన కవిత్వం వారిదిలా చెప్పకూడదు. ఒక వేళ అది ఆ పుస్తకం మీద విమర్శ అయితే సమస్య లేదు, ఆ విషయం చెప్పాలి. పుస్తకం నుంచి సంగ్రహించుకున్నదయితే ఎక్కడనుంచి తెచ్చుకున్నదీ చెప్పాలి, అది సభ్యత. చెప్పకపొతే అది మన స్వంత కవిత్వం అనుకునే ప్రమాదం ఉంది. ఇదెప్పుడూ మంచిది కాదు. మనకి చేతనయినదే చెప్పాలి, తప్పేకావచ్చు, చెప్పినదానిలో తప్పున్నపుడు, మరొకరు సరిచేసినపుడు హుందాగా తప్పు ఒప్పుకుంటే బాగుంటుంది. వాదనకు దిగితే తప్పుగా ఉంటుంది. ఎదుటివారు చెప్పినదే తప్పయితే ఎందుకు తప్పో చెప్పాలి. లేకపోతే అభిప్రాయభేదాన్ని మన్నించాలి. వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయడం, నోటికొచ్చినట్లు మాటాడటం, మానుకోవాలి.అనవసరపు వాదనలు వ్యక్తి ప్రతిష్ఠ పెంచవు, సమయం పాడు తప్పించి. విషయం మీద చర్చ రసవత్తరంగా ఉంటుంది. నా వాదనే నెగ్గాలి అనుకోడం బహుశః మొండితనమనిపించుకుంటుందేమో

ఇహపోతే! పుస్తకం, మస్తకం కలగలిసేటపుడు మరికొంత జాగ్రత్త అవసరం. మనం వాడుకునేది ఎక్కడనుంచి తెచ్చుకున్నది చెప్పాలి. అది సమయానికి సందర్భానికి సరిపోయేదానిలా ఉండాలి. సందర్భం కానిది పట్టుకొచ్చి చెబితే, పేలవంగా ఉంటుంది. అది అవతలి రచయితను ఇబ్బందిపెట్టినట్లే అవుతుంది. మరో సంగతి నెట్ లో ఉన్న సమాచారమంతా నిజమనుకోడం కూడా పొరపాటే. అక్కడ, అది ఉంచినవారు కూడా మనలాటివారేనని గుర్తించాలి. ఎదుటివారు మనకంటే తెలివయినవారనుకున్నపుడు ఇబ్బందులుండవు. మనమే అందరికంటే 🙂 తెలివయినవారమనుకున్నపుడే 🙂 తేడా అంతా.

DSCN2984

టపా లో చెప్పే విషయాన్ని ఒక క్రమంలో కధ చెబుతున్నట్లుగా చెబితే, పాఠకుల మనసుకు చేరుతుంది.ఇది చెప్పేటప్పుడు హరికధలో పిట్టకధలలాగా సందర్భానుసారం, కొన్ని అనుభవాలు,సంఘటనలు చేర్చితే టపా పండుతుంది. సూపర్..కేక…అల్లరే అల్లరి. అశ్లీలాలు, ద్వందార్థాలు ఉండకపోవడం చాలా చాలా మంచిది. ఏది ఎంతవరకు చెప్పాలో, ఏది పాఠకుని ఊహకు వదిలేయాలో,ఏది దాచాలో, ఏది వివరించాలో తెలిసివుండాలి 🙂 హేళన,వ్యక్తిగత విమర్శలు లేకుండాలి, ఏదయినా ఒకటయినా మంచిమాటుంటే మంచిది. కవితలయితే భావమేంటో వ్యంగంగానో, సూచనగానో, సూటిగానో ఉండాలి. మనం రాసింది మనకే అర్థం కాకపోతే…. రాసినది చదవాలి. కాలుజారితే తీసుకోగలం, నోరుజారితే తీసుకోలేం. అసలు రాసేముందు ఎక్కువగా చదవటం అలవాటుచేసుకోవాలి. ‘గాడిద గంపెడు ఊక బొక్కిందని చదవటం కాదురా. ఆవు తిన్నట్లు చదవాలి, గుఱ్ఱంలా కాద’ని తిట్టేవారు చిన్నపుడు. అదేంటో ఇప్పటికి అర్థమయింది 🙂 . చదివిన విషయం మననం చేయాలి, జీవితానికి అన్వయించుకోవాలి. ఉచ్చారణ దోషాలు, వ్రాత దోషాలూ ఉండకూడదు, ఏదయినా ఒక ప్రాంతీయ ఏస రాసేటప్పుడు, హేళన పనికిరాదు,ఆ ఏస గురించి. చదివినవారు ఆనందించేలా ఉండాలి ఆ ఏస. ఇంత చేసినా మంచి అందమయిన ఆడపిల్ల చిత్రానికి బొట్టు కాటుక సరిగా దిద్దకపోతే అందంరాదు, అలాగే తలకట్టు (హెడింగ్) ఆకర్షణీయంగా లేకపోతే? అదనమాట సంగతి. ఇంతచేసినా కరంటు వారి దయ మనప్రాప్తి. చివరిగా  ఎదుటివారి గొప్పతనం మెచ్చుకుంటే తెనుగువాళ్ళం ఎందుకవుతాం? అందరూ మన బ్లొగ్ లో జే జే లు కొట్టాలి, మనం ఎవరి బ్లాగ్ లోనూ ఛచ్చినా నోరు విప్పం. ఆదండి సంగతి.

DSCN2936

పేపర్ కంపోస్ చేయడానికి సమయం పడుతుంది. ప్రింట్ చేయడానికి గంట చాలు, అదనమాట. ఇప్పుడు చెప్పండి టపా రాయడం కష్టమా? అందులోనూ రోజూ” అని ఆగాడు మా సత్తిబాబు, ఏకబిగిని ఉపన్యాసమిచ్చి. నా ఇల్లాలు మా సత్తిబాబు ఉపన్యాసం విని టీ ఇచ్చి చప్పట్లు కొట్టింది. “భేష్, భేష్” అంటూ,ఏంటో! అంతా విష్ణుమాయ

 

ప్రకటనలు

24 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-టపా రాయడం కష్టమా?

 1. చాలా ఆలశ్యం గా స్పందిస్తున్నాను. కాని,చక్కటి టపా. టపా రాయడం ఒక్కోసారి చాలా కష్టం అనిపిస్తుంది. ఒక్కోసారి తేలిక అనిపిస్తుంది. కాని విలువైన కొన్ని guidlines ఇచ్చారు. ధన్యవాదాలు శర్మ గారు.

  • @జలతారు వెన్నెలగారు,
   బాగా చదువుకున్నవారు, మేధావులు బ్లాగులలో ఉన్నారు, వారికి సూచనలిచ్చేటంత వాడినా? 🙂
   నెనరుంచాలి.

  • @కార్తీక్ రెడ్డి గారు,
   స్వాగతం. మీకూ ఈ మధ్యనే తగిలిందా ఈ దురద గొండి ? 🙂 పురోభివృద్ధిరస్తు
   నెనరుంచాలి.

 2. శర్మ గారూ,

  మీరూ, విష్ణు మాయ కి వచ్చేసేరూ …

  టపా బర బర గీకిన వచ్చును! దానికి ఇంతగా ఆలో ‘చించాలా’ ?

  అదిన్నూ ఓ రెండు పొద్దులు హారం సంకలిని లో ఉండి ఆ పై హుష్ కాకి అయి పోయె దానికి ….

  ‘గుప్పెడు కడుపు కై జోరవి కాని జొచ్చి… అన్నట్టు ఓ టపా రాయడానికి ఏమి కష్టాలు తిరుపతి దేవరా !
  అంతా విష్ణు మాయ కాకుంటేను !!

  చీర్స్
  జిలేబి.

  • @జిలేబి జీ,
   మీరు చెప్పింది నిజమే, దీనిగురించి ఇంత ఆలో’చించా’లా అని ఆలో’చించ’లేదు, మంచి సూచన అమలు పరచడానికి ప్రయత్నం. అంతా విష్ణుమాయే కదండీ! తెలియక కొట్టుకుంటారు, అంతా ఏదో స్వంతంగా చేసేసేమనుకుని. 🙂
   నెనరుంచాలి.

 3. శర్మ గారూ , ఓ మంచి టపా ఎవరైనా రాయడానికి అవసరమయే గొప్ప సూచనలిచ్చారు మీ టపాలో ! మరి మీ పాండిత్య మస్తకాన్ని కూడా ఇస్తారా ఇతర బ్లాగర్లకు ?!
  నేను అత్యాశ కు పోతున్నా కానీ , మీరు ఆరోగ్యం గా ఉండి , తరచూ మీ బ్లాగులో టపాలు రాస్తుంటే , అదే పది వేలు !

  • @సుధాకర్ జీ,
   నేను నిత్య విద్యార్ధిని, ఉబుసుపోక రాసిందే అది. నందో రాజా భవిష్యతిః, ఏం జరుగనుందో, అమ్మ దయ, మీ అభిమానానికి కృతజ్ఞుడిని. మీరుండగా నా ఆరోగ్యానికి భయమెందుకూ 🙂
   నెనరుంచాలి.

 4. టపా వ్రాయడం కష్టమేనండి.
  ఏదో వ్రాద్దామనుకోవడం, తరువాత మనం వ్రాస్తే ఊరికి ఉపకారమా, వ్రాయకపోతే దేశానికి నష్టమా, అని బద్ధకించడం మామూలే.
  బద్ధకాన్ని దాటుకుని టపా వ్రాయడం కష్టమే.

  • @మిత్రులు బోనగిరిగారు,
   నిజంగా మీ మాటలెంత నచ్చేశాయో! మనం వ్రాస్తే ఊరికి ఉపకారమా! లేకపోతే దేశానికి నష్టమా అని అలోచించడం మొదలెట్టానండి. ఇప్పుడు కొంత బాగుంది, జ్వరం తగ్గు ముఖం పడుతోంది. 🙂
   నెనరుంచాలి.

   • అయ్యో! నా ఉద్దేశం అది కాదండి.
    నా బద్ధకాన్ని సమర్ధించుకుంటూ అన్న మాటలవి.
    మీలాంటి పెద్దలు వ్రాసే అనుభవాలు మాకు ఎంతో ఉపయోగం.
    మీ ఆరోగ్యం సహకరించినప్పుడల్లా వ్రాస్తూనే ఉండండి.

   • @మిత్రులు బోనగిరిగారు,
    మీరు చెప్పినది అక్షరాల నిజమయినపుడు కాదంటే ఎలా? నిజం ఒప్పుకోవలసిందే! మీ మంచిమాటకి ధన్యవాదాలు.
    నెనరుంచాలి.

  • @వనజగారు,
   నిజంగానే కాలక్షేపం, కాఫీ రేట్లు అన్యాయం గా పెరిగిపోయాయండి. 🙂 టీ కి పెరగలేదని కాదు.
   నెనరుంచాలి.

 5. అంతర్జాలం లో నేనొక వ్రాయని భాస్కరుణ్ణి.
  మీ వ్రాతలు నా లాంటి వాణ్ని ప్రేరేపిస్తూ ఉన్నాయి.
  శుభాభివందనలు

  • @మోహన్జీ,
   ఈ అంతర్జాలంలో వ్రాయడం ఒక వ్యసనం వదలడం కష్టంగా ఉంటుంది. అమ్మ పై భారం వేసి ముక్కు మూసుకుని గెంతెయ్యండి, ఆ పైన అమ్మ ఉంది, చూసుకుంటుంది. అమ్మయ్య! ఒకళ్ళకయినా ఈ దురద అంటిస్తే నాకు తగ్గుతుందేమో ! 🙂
   నెనరుంచాలి.

 6. అబ్బే, మీకస్సలు కష్టం కాదు. చాలా మంచి సూచనలు బాబాయ్ గారు. మామిడికాయలు, మిరపకాయలు, మందారాలు చాలా బాగున్నాయి.

  • @అమ్మాయ్ జయ,
   టపా పుల్లగా ప్రారభమయి కారంగా మారింది కదా 🙂 పెరట్లో మామిడి చెట్టు, దొడ్డిలోని మిరపమొక్కలు కాసేయిలా.
   నెనరుంచాలి.

 7. శర్మ గారూ ,

  నమస్తే .

  మీరు యిచ్చట ఉదహరించిన సూచనలను అవసరమైన వారు ఉపయోగించుకొనిన యెడల ,
  యింకా మంచి రచనలు చేయగలరు .
  మీరు ద్రోణాచార్యులవంటివారు . కనపడని శిష్యులు చాలామంది ఉంటారు అనుకొంటున్నా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s