శర్మ కాలక్షేపంకబుర్లు-బెల్లంకొట్టిన రాయి.

DSCN2718

బెల్లంకొట్టిన రాయి.

బెల్లంకొట్టిన రాయిలా పలకవేం అనడం తెనుగునాట బాగా అలవాటు, మాటాడని వారినుద్దేశించి. దీని సంగతేంటీ అని చూస్తే,

బెల్లం అచ్చులుగా మూడంగుళాల మందంలో అడుగున్నర రెండడుగుల చదరంలో పోస్తారు, ఇది అలవాటు. బెల్లాన్ని కుందెలుగా కూడా పోస్తారు, ఇది అనకాపల్లి వైపువారి అలవాటు. ఇప్పుడు కేజి అచ్చులని కూడా పోస్తున్నారు. అవి కాక మరొకటి ఉంది అది బూరుగుపల్లి బెల్లం లేదా తాటిపాకబెల్లం అంటాం. దీన్ని కూడా రెండడుగుల చదరం లోనే పోస్తారు కాని పల్చగా ఒక అంగుళం దళసరిలో ఉంటుంది. చాలా గట్టిగా ఉంటుంది. విరవడం కష్టం. బెల్లాన్ని ముక్కలు గా కొట్టేందుకు ఒక కత్తి రాయి ఉపయోగిస్తారు. ఇప్పటికి పల్లెలలో బెల్లం కొట్టడానికి ఒక కత్తి అరకేజి రాయి కాని కేజిరాయి కాని పుచ్చుకుని కత్తిమీద కొట్టి ముక్కలు చేస్తారు.

మనం ఎంత ప్రశ్నించినా, బతిమాలినా, ప్రాధేయపడినా, బెదిరించినా, వేడుకున్నా, మాటాడనివారిని బెల్లం కొట్టిన రాయిలా పలకవేం అంటారు, తెనుగునాట. అసలు రాయి మాటాడుతుందా? మరి బెల్లం కొట్టిన రాయి అని ఎందుకంటున్నారు?

DSCN2684

బెల్లం తియ్యగా ఉంటుంది, కత్తి, రాయి ఉపయోగించి బెల్లాన్ని ముక్కలుగా చేసేటపుడు, బెల్లం కత్తికీ రాయికీ అంటుకుంటుంది, కాని కత్తి గాని రాయిగాని ఆ తీపిని అస్వాదించలేవు, నోరులేదు కనక మనసులేదు కనక, తీపిని ఆస్వాదించలేవు కనక, బెల్లం రుచి చెప్పలేవు. మాటాడటం లేదంటే అంటే ’నీకు మనసులేదు’ అని సున్నితంగా అడుగుతారనమాట. ఆహా! కోపంలో కూడా తెనుగువారు సభ్యత మరువరే! ’నీకు మాటాడాలని మనసులేదా?’ అని సున్నితంగానే అడిగారే! బెల్లం కొట్టిన రాళ్ళలా మాటాడకుండా ఉండకండి, మాటాడండి, కనీసం దెబ్బలాటకయినా నోరు విప్పండి. ఇలా అడిగారంటే మీ మీద ఎంత మమకారం లేకపోతే అడుగుతారు?మూగ కళ్ళకి ఊసులున్నాయన్నారు సినీకవి, అవి ఒక్కరితో మాత్రమే చెప్పుకునేవి. ’మనసు మూగదేకాని బాసుండది దానికి చెవులుండే మనసుకే ఇనిపిస్తుందా అది’అన్నారు. మనసు మూగదట, దానికో బాసుందట, దాన్ని చెవులున్న మనసుమాత్రమే వినగలదట. ఏం చిత్రం కవిది, అంటే అన్ని మనసులకీ చెవులుండవంటారు కవి. అందుకే చెవులున్న మనసున్నవారు మాటాడమంటారు.మాటాడితే మీ నోటి ముత్యాలేం రాలవు, అవి ఎదుటివారు ఏరుకోడానికి. మాట మనుష్యులని దగ్గరికి చేరుస్తుంది. మనసునోరు నొక్కేయకండి. ఆనందం పంచుకోడానికి అందరు సిద్ధమే, కష్టం పంచుకునేవారు కొందరే. ఇలా అడిగేవారు మీ మంచికోరేవారే, మరొకరెవరూ ఇలా అడగరు. మీతో మాటాడేవారితో, కావాలనుకునేవారికి దూరం కాకండీ! కొంతమందితోనయినా మాటాడటం మానేస్తే అది మీకు అలవాటయి, మీరు కొంత కాలానికి అందరితో మాటాడటం మరిచిపోతారు, అంతర్ముఖులయిపోతారు. మిగిలినవారూ మీతో మాటాడటం మానేస్తారని గుర్తించండి.మాట తీయదనం మరువకండి. మాట ఒక మనుష్యులకే భగవంతుడిచ్చిన వరం, దాన్ని వమ్ము చేయకండి. ఒక్క ముక్క చెప్పలేరూ?ఇటువంటి వారిని నోరు చేసుకునయినా మాటాడాలనిపిస్తుంది, కాని మనసు ఊరుకోదే, నోరుచేసుకోదే!

DSCN2422

భార్యా భర్తల మధ్య తగవు రావడం సహజం, భేషజాలకి, పట్టింపులకి పోకండి, తప్పెవరిదయినా మీరే నోరు విప్పండి, ఒకడుగు ముందుకేస్తే వారు తమ తప్పు తెలుసుకుని రెండడుగులు ముందుకేస్తారు. బెల్లం కొట్టినరాయిలా, తడిసిపోయిన నులక మంచంలా బిగుసుకుపోకండి, మాటతో మీరిద్దరూ బాగా దగ్గరికి చేరుతారు,అప్పుడింకా ఆనందంగానూ ఉంటుంది, సమస్యకి పరిష్కారమూ దొరుకుతుంది. పంతాలకి పోతే…హక్కులు మాటాడుకుంటే మిగిలేది ముక్కలే, మనసు చెక్కలే. ఎవరిదగ్గర ఓడిపోతున్నారు? వారెవరు మీకు జీవితంకదా? ఆలోచించండి.హక్కులు మాటాడుకోడం తియ్యగా ఉంటుంది, పర్యవసానాలు బాధాకరంగా ఉంటాయి, మనసు మూగపోతుంది, బతుకు మోడువారిపోతుంది. పంతానికి మిగిలేది?… లొంగిపోయి బానిసలా జీవించమని చెప్పను. ఇరుపక్కలా అర్థిక స్వాతంత్ర్యం మాత్రమే సుఖాన్నివ్వదు.ఓడి గెలవండీ,గెలిచి ఓడిపోండి, తిరకాసుగాఉందా? అదే జీవితం, భార్యాభర్తలలో ఓటమి గెలుపులేదు, ఎప్పుడూ ఇద్దరూ గెలుస్తూనే ఉండాలి, అదీ రహస్యం.

ఇనుము విరిగెనేని ఇనుమారు ముమ్మారు కాల్చి అతుకవచ్చు క్రమముగాను
మనసు విరిగెనేని మరి అతుకగా రాదు విశ్వదాభిరామ వినురవేమ.

అర్థం చెప్పక్కరలేదనుకుంటా. మూడవ వ్యక్తిని మీ మధ్యకు రానివ్వకండి.మీ సమస్య మీరే తేల్చుకోగలరు.

మాటకు బ్రాణము సత్యము,
కోటకు బ్రాణంబు సుభటకోటి, ధరిత్రిన్
బోటికి బ్రాణము మానము
చీటికి బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ!

మాటాడే మాటలో సత్యం ఉండాలి, అప్పుడే ఆ మాటకి విలువ ప్రాణం ఉన్నట్లు. కోటకి మంచి భటుల సమూహం ప్రాణం, స్త్రీకి మానమే ప్రాణం, ఉత్తరానికి సంతకం ప్రాణం. ఆపై మీఇష్టం.

DSCN2558

ప్రకటనలు

16 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-బెల్లంకొట్టిన రాయి.

 1. మాటే మంత్రమూ ….! మనసే తంత్రమూ …!! అన్నాడొక సినీ కవి. మీ పోస్టు వల్ల సామెతకు అర్ధంతో పాటు మాట పరమార్ధమూ చెప్పారు. మీ కబుర్లు ఉబుసుపోక చెప్పేవి కాదండీ! కబుర్లకు అర్ధం చెప్పే అనుభవ పాఠాలు.

  • @మిత్రులు కొండలరావు గారు,
   మరీ పల్లెటూరివాడిని కదండీ! మీ అభిమానానికి కృతజ్ఞతలు
   నెనరుంచాలి.

 2. చక్కటి విషయాలను తెలియజేసారు. చిత్రాలు కూడా బాగున్నాయండి.

  పంతాలకి పోతే…హక్కులు మాటాడుకుంటే మిగిలేది ముక్కలే, మనసు చెక్కలే. ఎవరిదగ్గర ఓడిపోతున్నారు? వారెవరు మీకు జీవితంకదా? ఆలోచించండి.హక్కులు మాటాడుకోడం తియ్యగా ఉంటుంది, పర్యవసానాలు బాధాకరంగా ఉంటాయి, మనసు మూగపోతుంది, బతుకు మోడువారిపోతుంది. పంతానికి మిగిలేది?… అని బాగా వ్రాసారు.

  • @అనూరాధ,
   భార్యాభర్తల మధ్య తగదా వస్తుంది, రావాలి కూడా 🙂 అయితే దానిని మాటతో పరిష్కరించుకోవాలి తప్ప పంతాలకు పోతే మిగిలేది వ్యధ.
   నెనరుంచాలి.

 3. చాలా చక్కని విషయాలు విలువైన విషయాలు చెప్పారు మాస్టారూ ! మాటాడక మౌనం వహించడం కూడా తగదు కదా కొన్ని సందర్భాలలో . బెల్లం కొట్టిన రాయిలో ఇంత తీయని వివరణ ని అంత తీయగా చెప్పడంలో మీకు మీరే సాటి

  జిలేబీ గారన్నట్లు మంచిమాటలతో కోలాటం ఆడించేశారు ధన్యవాదములు

  మీరు భారత భాగవత రామాయణ గ్రంధాలు చదవడం మానేసి బ్లాగ్ వ్యసనం లో పడటం మాలాంటి వారందరికీ అదృష్టం . ఎన్ని విలువైన విషయాలు . రోజుకొక కాలమ్ చదివినట్లు ఉంది . మీరు మంచి కాలమిస్ట్ అండీ!!

  • @వనజగారు,
   అందరితో మాటాడుతూ కావలసినవారితో మాత్రమే మాటాడటం మానేస్తే దాన్నేమంటారు చెప్పండి,అదే బెల్లం కొట్టిన రాయి. మీ అభిమాన వర్షంలో మళ్ళీ తడిపేశారు 🙂 మరో కొత్త బిరుదిచ్చినట్లుంది కాలమిస్టా 🙂 బాగున్నట్టుందండీ, ఇదివరకు వెంకట్.బి.రావుగారు హిందూ పేపర్ తో పోల్చారు 🙂
   నెనరుంచాలి,

  • @జిలేబీ గారు,
   అది వేంకటాపతి ఆలయం దగ్గర తీసినదికదా! నాగొప్పలేదు అది వేంకటాపతి గొప్ప తప్పించి 🙂 జీవిత కోలాటం కూడా రిథమిక్ గానే ఉండాలి కదండీ!
   నెనరుంచాలి,

 4. బెల్లం కొట్టిన రాయి తో మొదలు పెట్టి,
  బెడిసి కొట్టే భార్యా భర్తల సంబంధాల తో దానిని ముడి పెట్టడం,
  మీకే చెల్లింది శర్మ గారూ !
  మీ టపాను చదివిన వారంతా,
  మీ వాక్కు పాటించి,
  బెల్లం కొట్టిన రాయి లా కాక,
  ‘తీయగా’ సంసారం గడుపుతారని ఆశిద్దాం !

  • @సుధాకర్ జీ,
   అలా ముడేసుకుని అలోచించుకుంటే అవన్నీ జీవితానికి ఉపయోగపడతాయి, లేకపోతే నానుడులుగా మిగిలిపోతాయి కదా!మీ అభిమానానికి కృతజ్ఞుడను,ఒక్కరికి ఉపయోగపడినా ఆనందమే కదండీ!
   నెనరుంచాలి.

 5. శర్మ గారూ ,
  నమస్తే .

  మానవుల మనుగడకు వలసిన ముఖ్యమైన విషయాల్ని చాలా చక్కగా సెలవిచ్చారు .
  చాలామందికి కామానికి శృంగారానికి తేడా తెలియదు , కామాకి , ఫుల్ స్టాప్ కి
  తేడా తెలియనట్లు .

  మీరన్నట్లు హక్కులు గొప్పగానే ఉంటాయి , జీవితాల్ని ముక్కలు చేస్తాయి .
  కొన్నాళ్ళు మౌనంగా మాట్లాడకుండా ఉంటే , ఆ తర్వాత మాట్లాడాలని ఉన్నా ,
  మనుషులు పక్కనే ఉన్నా నాలిక మఱచిపోతుంది అన్నది నిజమేనండి .

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s