శర్మ కాలక్షేపంకబుర్లు-మా విశ్వనాధ రచనలు

మా విశ్వనాధ రచనలు

మా విశ్వనాధగారికి మొదటినుంచీ కవితాధోరణి ఉన్నా, వీరి మొదటి రచన “తెలుగు సాహిత్యం నృత్యకళారీతులు” 1988-89 సంవత్సరం తెలుగు విశ్వవిద్యాలయంవారిచే ఉత్తమ బహుమతి పొందిన గ్రంధం. ఈ రచనని కీ.శే. నటరాజరామకృష్ణగారు ప్రచురించారు. అది మొదలు వీరు రచనలు చేస్తూవచ్చారు.

వీరి రచనలు

తెలుగు సాహిత్యం నృత్యకళారీతులు.
అలంకృతి
సంపూర్ణ హనుమత్ చరిత్రం
శివ మహాపురాణం
మువ్వగోపాల విలాసం, క్షేత్రయ్య పదాలగురించిన అముద్రిత రచన.
ఇవి కాక వీరు కొన్ని గ్రంధాలకు పీఠికలు కూడా రాశారు.నవజనార్దన పారిజాతం గ్రంధానికి రాసిన “తిలకం” కోన సీమలో వెల్లివిరిసిన “కలాప నర్తనం-అభినయ విద్య” “ఆంధ్ర నాట్యం-పుట్టుపూర్వోత్తరాలు” “వాత్సాయనుని కామశాస్త్రం-ఒక అద్భుత గ్రంధం” కధలు. ప్రసంగ వ్యాసాలు “శ్రీ కృష్ణుడు-చారిత్రిక దృక్పధము” “జాషువా కవిత్వం-మానవత”. ఇవి నా దృష్టికి వచ్చినవి. మరికొన్నీ ఉండచ్చు.

 

DSCN3130 DSCN3132

తెలుగు సాహిత్యం నృత్యకళాప్రస్తావన రచనలో తెనుగు సాహిత్యం లో కవులు వర్ణించిన అన్ని విధాలనృత్యాలగురించి అనగా పంచ భూతాల నృత్యం నుంచి,భూత -భేతాళ- పిశాచరాక్షస నృత్యాలవరకు, నృత్యం చేసేవారి పట్ల సమాజంలో ఉన్న నీచాభిప్రాయం నుంచి నృత్యానికి సంబంధించి లోకోక్తులు-జాతీయాలవరకు అన్నిటినీ స్పృశించారు. నిజానికి ఈ గ్రంధం తెనుగు నృత్యం కి పూర్తి అయిన దర్పణం. నిజానికి ఈ గ్రంధం గురించి మాటాడే అర్హత కూడా నాకు లేదు 😦

DSCN3139

అలంకృతి గ్రంధంలో శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారి పీఠికతో,అల్పజీవి-అర్ధనారి (శివ శతకం)ఒక కధ ప్రచురితం. ఈ రెండు పుస్తకాలు కవిగారు నాకు తమ ఆశీస్సులతో బహూకరించారు, అందులో శివ శతకం లో అన్ని పద్యాలు నన్ను విశేషంగా ఆకర్షించాయి.మచ్చుకి

“హత్తిన ప్రేమజూచుటకు అమ్మయు నాన్నయు నాకు కల్గగా
నెత్తఱినెంచి చూచినను ఎక్కువ నేనని” గౌరిపల్క;”నా
కత్తయు మామగారు కల” రంచును నవ్విన శూలి నేర్పుకున్
బిత్తరి చూపులన్ నిలిచి “నేర్పరులే” యను గౌరిగొల్చెదన్.

నన్ను ప్రేమగా చూసుకోడానికి నాకు అమ్మ, నాన్న ఉన్నరోచ్! నేను గొప్పదాని అందిట అమ్మ, అందుకు శంకరుడు నాకు అత్తగారు, మామగారు ఉన్నారోచ్ అన్నాడట, అందుకు అమ్మ బిత్తరపోయిందిట.( గౌరికి అత్త, మామలు లేరుకదా? స్వయంభువుడు కదా ) నేను తల్లి తండ్రులు లేనివాడను,స్వయ0భువును, నీవు తల్లి తండ్రులు కలిగినదానవు కనక ఎవరుగొప్ప అని శంకరుడడిగేడని కవిగారి చతురత. ఏంత చక్కని చమత్కారభావన. అలా బిత్తరచూపులతో నిలబడిన తల్లి అనుగ్రహించాలన్నారు కవి.

నిందాస్తుతి చూడండి.
“నాతి చరామి” యంచపుడు నాగకుమారిని నమ్మబల్కి, యా
నాతికి అర్థదేహమును నమ్మిక చిక్కుటకై యొసంగి, యా
నీతిని తప్పి గంగమను నెత్తిన పెట్టిన నీదు మాయ నే
రీతిగా చెప్పవలె! బలే! తెలివన్న నీదెరా! శివా!

నేటి సమాజాన్ని తూర్పారబట్టినది

బారుకు,బీరుకున్,మరియు భంగుకు, క్లబ్బుకు,కల్లునీళ్ళకున్
ఫారిను బూతు ఫిల్ములకు,బ్రాకెట్ ఆటకు నైటు క్లబ్బుకున్
ఊరి బజారు ముండలకు,ఓట్లకు నోట్లను ఖర్చుపెట్టు ఈ
మోరకులైన వారలను మూడవ కంటను చూడరా శివా!

పరిహాసం

వాసిగ కైతలందు నిను పట్టముగట్టు కవీంద్రులెప్పుడున్
కాసులు లేనివారగుట ఖాయము,సూటిగ జెప్పు నీదు సా
వాసము చేత నట్టి గతి వారికి పట్టేనొ! లేక వారి సా
వాసము చేత నీవు తిధి వారపు బాపడవైతివో శివా!

ఎన్నని చెప్పను ఒక్కొ పద్యం ఒక ఆణిముత్యం. ఇలా ఈ శతకంలో భక్తి, వేదాంతం, గురించిన పద్యాలున్నాయి, సమకాలీన కుళ్ళును నిప్పులతో కడిగేశారు. నాకయితే మొత్తం శతకమే పెట్టేయాలని ఉంది, కాని కవి గారిని అనుమతి అడగలేదు కనక ఆ పని చేయలేకపోతున్నా. “పలుకా దారుణాఖండ శస్త్రతుల్యము మనమా వెన్నసమాన “మని భారతంలో చెప్పినట్టు కవిగారి వాక్కుంటుంది.

DSCN3150

సంపూర్ణ హనుమత్ చరిత్ర గురించి వారు చెప్పినది విని నాకు ఆశ్చరమే కలిగింది. మొత్తం గ్రంధం వచనం లో రాశారు, దానిని ప్రచురణకు ప్రయత్నిస్తుంటే ఒక మిత్రుడు తాను ప్రచురిస్తానన్నరట. మరొక మిత్రుడు దానిని తన ఖర్చుపై రామకృష్ణ మిషన్ వారి చే ప్రచురింపచేస్తానని వారినడిగితే కావ్యం చూడకనే దానిని తామే ప్రచురిస్తామని రామకృష్ణ మిషన్ నిర్వాహకులు తెలిపి ప్రచురించారట. ఇప్పుడు నాల్గవ ప్రచురణలో ఉన్నదని తెలిపారు. ఆ గ్రంధం వారు స్వదస్తూరితో రాసుకున్న వాటి ఫోటో లు చూడండి.

DSCN3152

DSCN3129

శివ మహాపురాణం ప్రస్తుతం రామకృష్ణ మిషన్ వారు ప్రచురణ చేపట్టినట్లు చెప్పేరు.

DSCN3159

DSCN3162

మువ్వగోపాల పదాలకు పద్యరూపం కల్పించి క్షేత్రయ్యను సంపూర్తిగా పరిచయం చేసే గ్రంధం తయారు చేసేరు. చేతి వ్రాత పని పూర్తి అయింది, ప్రచురణకు సిద్ధంగా ఉంది.

కొన్ని గ్రంధాలకి పీఠికలు రాశారు.దానికి గాను ఆ కవిగారు శ్రీ విశ్వనాధ గురించి రాసిన పద్యం ఇంగ్లీష్ లో

I lovingly dedicate this testament of love, a long poem

Transcreation of my sanskrit original ‘PRIYA SANTWANAM’

Which at this day and time I cherish as my love exemplum

To my bosom friend SATYANARAYANA MURTY VISWANADHAM

The doyen of discourse speaks on everything under the sun

At any rate, he’s not of the class of common run

The patron has been for thrice ten years exerting his sweet swing and sway

But for him this poem would never have seen the light of the day.

I give this small gift to you, my friend! And you in turn

Give me the incredible joy-I now enjoy

Which may it my heart ever churn

And make me laugh and lisp all my life like a boy

PRBHANJANA SWAMY

మా విశ్వనాధ వారి జీవిత చరిత్ర మరొక టపాలో

DSCN2486

ప్రకటనలు

7 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మా విశ్వనాధ రచనలు

 1. ఇరవై సంవత్సరాల వయసులో తండ్రి చనిపోతే ఇంత పెద్ద సంసారాని గట్టుకు చేర్చేరు. కట్టుకున్నామె చికిత్స లేని రోగం పాలయి గతించారు, పుట్టిన ఒక బిడ్డా అదే రోగంతో కన్ను మూశాడు. “ఆస్టో పోరియోసిస్” నాటికి చికిత్స లేకపోయి ఉండచ్చు, లేదా చికిత్స చేయించగల స్తోమత లోపించీ ఉండచ్చు. అలా ముఫ్ఫయి దాటకుండానే ఒంటరి అయ్యారు. కుటుంబ బాధ్యతలు మోశారు. ఎన్నడూ నిరాశ కనపడనీయలేదు మాటలో కాని చేతలో కాని. మరొకరయితే ఏమో ఏం చేసేవారో ఊహించలేను.ఆర్ధిక స్తోమతూ అంతంత మాత్రమే, అందుకు ఈ కవితే నిదర్శనం. వాసిగ కైతలందు నిను పట్టముగట్టు కవీంద్రులెప్పుడున్ కాసులు లేనివారగుట ఖాయము,సూటిగ జెప్పు నీదు సా వాసము చేత నట్టి గతి వారికి పట్టేనొ! లేక వారి సా వాసము చేత నీవు తిధి వారపు బాపడవైతివో శివా!

 2. శర్మ గారు ,

  నమస్తే ,

  ఉన్నది ఉన్నట్లు చెప్పగలిగినవారు రచయితలు మాత్రమేనని , సమాజాన్ని ఏ మాత్రమైనా మారుతుందంటే , దానిక్కారణం రచయితలే , రచయిత్రులే ( వారి రచనల ద్వారా )నని గట్తిగా తెలియవస్తోంది . ఇది ముమ్మాటికీ నిజమే , నూటికి నూరు పాళ్ళు కాదు కోటి పాళ్ళు నిజమే నని అర్ధం చేసుకోవచ్చు .

  • @శర్మగారు,
   కవియః నిరంకుశః అన్నారు. వారు అలా నిజాలు చెబుతుండబట్టి అయినా కొంత సమాజం నడుస్తోంది కుంటుతూ అయినా.
   నెనరుంచాలి.

  • @రుక్మిణీ దేవిగారు,
   కవిగారిని పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తాను.
   నెనరుంచాలి.

 3. బాగుందండీ విశ్వనాధ టపోర్వశీయం !!

  వారినీ పంచ దశ లోకానికి లాక్కోచ్చేయ్యండి మరి !

  శ్రీ కృష్ణుడు-చారిత్రిక దృక్పధము” వ్యాసాన్ని టపా కరించ గలరు (కాపీ రైటు గట్రా సమస్యలు లేకుంటే !) కాదూ కుదరదంటా రా, విశ్వనాధ వారికీ పంచ దశ లోక విహారం గావించండి ! ఆ పై విశ్వం వారి నాదాన్ని వింటుంది కంటుంది !!

  శుభాకాంక్షలతో ( దూర వాణి చలవ !)

  జిలేబి

  • @జిలేబిగారు,
   వారికి పంచదశలోకంతో పరిచయం లేదు, వారికి రాత కంటే నోటితో చెప్పుకుంటూ వెళ్ళిపోవడం బాగా అలవాటు, అదొక గంగా ఝరి. ప్రభంజన స్వామిగారన్నట్లు కవిగారు భూమి మీదున్న ఏ విషయం గురించయినా మాటాడ గలరు. మీరడిగిన వ్యాసం గురించి కవిగారిని అడుగుతా. దొరికితే బ్లాగ్ లో పెట్టేస్తా. అంతకంటే అదృష్టం ఉండదు కదా. కవిగారి జీవితయాత్ర త్వరలోనే బ్లాగ్లో, వారిని ఈ మాధ్యమానికి తీసుకురాలేని అశక్తుడిని మన్నించాలి.
   నెనరుంచాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s