శర్మ కాలక్షేపంకబుర్లు-విశ్వనాధకవిగారి జీవిత యాత్ర.

DSCN3124విశ్వనాధకవిగారి జీవిత యాత్ర.

పేరు:- విశ్వనాధం సత్యనారాయణ మూర్తి.

ఊరు:- అసలు పేరు వారణాశి విశ్వేశ్వరదేవర అగ్రహారం (పేరూరు శివారు)కాలక్రమంలో ఈ “విశ్వేశ్వరరాయ అగ్రహారం” గురించి కాటయ వేమారెడ్డి శాసనం లో ఈ ఊరి ప్రస్తావన ఉన్నది. అంతటి పురాతనమైనది. కాలక్రమంలో పేరూరుకు శివారయింది. కవిగారు శివభక్తులు. ఆ ఊరిలోని విశ్వేశ్వరుని కళ్యాణానికి తప్పించి మరెక్కడికి పదచలనం మానేశారు.

పుట్టిన తేది:- 23.03.1941

తల్లి తండ్రులు: అన్నపూర్ణ, సుబ్బారావు

కుటుంబం:- ఐదుగురు అన్నదమ్ములు, నలుగురు అక్క చెల్లెండ్రలో రెండవవారు. చాలా పెద్ద కుటుంబం.

పదవులు, బిరుదులు:- సెంట్రల్ యూనివెర్సిటీ హైదరాబాద్ వారు నాట్యంలో ప్రదానం చేసే పి.హె.డి కి పరీక్షాధికారులు. కాకినాడ సంగీత విద్వత్సభ వారు “సాహిత్య కళానిధి” అని బిరుదిచ్చారు.కవిగారికి ప్రచారం, సన్మానాలు అంటే  అసలు సరిపడదు.

జీవిత విశేషాలు:- ఏమయినా చెప్పండి అంటే “నాదొక జీవితం, దాన్లో విశేషాలు” అన్నారు నిరాశగా. వారే శతకంలో చెప్పుకున్నారు.

DSCN3148

కవిగారి ఇల్లు

కుప్పగ కూలిపోయినది గూడు,విపత్తునుపొందె జోడు,నా
ఉప్పును తిన్నవారె నను ఊరక నిందల పాలు సేయగా
ఇప్పటి దాక సాగినది ఈ బ్రతుకొంటరి పక్షివోలె, నీ
వెప్పుడు వెన్క నుంటివను నెక్కుడు నమ్మిక చాలురా శివా!

పుట్టినదొక్క పుత్రుడును ముప్పుకు నాకది రాకపోయె! చే
పట్టిన భార్య చేరె త్రిదివసంబును నాకిది కర్మమందువా?
నెట్టన నొక్కటడ్గెదను నీకును వెన్నున కిట్టి కర్మముల్
పట్టగనేమి కారణమొ? పాడిగ నాకిట తెల్పుదే శివా!

ఆలును బిడ్డలేని దీనుడను నా యారాట మే మందువా
వ్రాలం జొచ్చెను ప్రొద్దు నాకికను ఏ పంచన్ పరాధీనతన్
తూలంజేయుదొ? యంచు సొక్కెదను నెంతో భీతి నీ యిష్టమీ
కాలుంగేలును నీ యధీనము భవత్కారుణ్య మెట్లో శివా!

వారిగురించి వారి మాటల్లోనే చదవండి,’నా గురించికొంత-నా దేవుళ్ళగురించి సుంత’ లో

CB1CB2

ఇరవై సంవత్సరాల వయసులో తండ్రి చనిపోతే ఇంత పెద్ద సంసారాని గట్టుకు చేర్చేరు. కట్టుకున్నామె చికిత్స లేని రోగం పాలయి గతించారు, పుట్టిన ఒక బిడ్డా అదే రోగంతో కన్ను మూశాడు. “ఆస్టో పోరియోసిస్” నాటికి చికిత్స లేకపోయి ఉండచ్చు, లేదా చికిత్స చేయించగల స్తోమత లోపించీ ఉండచ్చు. అలా ముఫ్ఫయి దాటకుండానే ఒంటరి అయ్యారు. కుటుంబ బాధ్యతలు మోశారు. ఎన్నడూ నిరాశ కనపడనీయలేదు మాటలో కాని చేతలో కాని. మరొకరయితే ఏమో ఏం చేసేవారో ఊహించలేను.ఆర్ధిక స్తోమతూ అంతంత మాత్రమే, అందుకు ఈ కవితే నిదర్శనం.
వాసిగ కైతలందు నిను పట్టముగట్టు కవీంద్రులెప్పుడున్
కాసులు లేనివారగుట ఖాయము,సూటిగ జెప్పు నీదు సా
వాసము చేత నట్టి గతి వారికి పట్టేనొ! లేక వారి సా
వాసము చేత నీవు తిధి వారపు బాపడవైతివో శివా!

బేతవోలు రామబ్రహ్మంగారు ’అల్పజీవి-అర్ధనారి’ కి స్పందన రాస్తూ ” అల్పజీవి-అర్ధనారి” అనేది ఒక విలక్షణ శీర్షిక. విలక్షణత కవిగారికి పుట్టుకతో వచ్చిన లక్షణం. ఏ కవికైనా వేపకాయంత ఉంటుందన్నారు. అది లేకపోతే కవే కాడు. ఇందులో కవేమో అల్పజీవి, తన ఆరాధ్యదైవమేమో అర్ధనారి. కవిగారి ఒంటరితనం తెలిసినవారికి ఈ శీర్షికలోని రెండు దళాలూ చటుక్కున గుండెకు గుచ్చుకుంటాయి.” అన్నారు. ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారు ’అల్పజీవి-అర్ధనారి’ కి ఆప్తవాక్యం రాస్తూ సత్యనారాయణగారి వాక్కు కరుకైనది, ఈ కరుకుదనం “వాచిక్షురో నిశ్త స్తీక్షణ ధారః” అని భారత కవి, బ్రాహ్మణవాక్కు గురించి చేసిన వ్యాఖ్యకు సరిపోతుంది.” అన్నారు.

చిన్నతనంలోనే భార్యపోతే మళ్ళీ పెళ్ళి చేసుకోవచ్చుగదా, లోక సహజమే కదా అని ఒకరోజు అన్నా కవిగారితో, వారితో స్నేహం చిక్కబడ్డతరవాత, అందుకాయన “శర్మా! అది గడచిన సంగతి, మరొకవిషయం మాటాడుకుందా”మనేవారు తప్పించి, మరొకమాట లేదు. కవిగారు నిగర్వి, కష్టాన్ని గుండెలో పెట్టుకున్నారు తప్పించి విప్పి చెప్పలేదెవరికీ, పెదవులపై చిరునవ్వూ చెరగనీయలేదు, ఆశావాదమూ వదలలేదు,లోకంలో ముత్యాలు రెండు చోట్ల పుడతాయి, లోక క్షేమం కోసం వ్యవసాయం చేసే హాలికుని నుదుట, ప్రేమను పంచే మహాత్ముల మనసులో అంటారు కవి.  కవిగారు ధర్మ పక్షపాతి. ఆయన మాటలలోనే ’అల్పజీవి-అర్ధనారి’ లో సుభాషితం రాస్తూ ” 1990 జూలై నెలలో నేను కొంత అనారోగ్యానికి, అశాంతికి గురయ్యాను. నాస్తికత్వం కంటె రోగం లేదు. భక్తికి మించిన మందు లేదు….అని నమ్మినవాణ్ణి

“పుట్టినదాదిగా ఉసురుపోయెడిదాకను పొట్ట తిప్పలే!
పుట్టెడు బెంగలన్ బ్రతుకు ఫూడుకుపోయెను! కన్నతండ్రివే!
పట్టకపోయె మాదుగతి, పాపము పుణ్యమంచు పద్దులీ
పుట్టువు కోరి ఎవ్వరిట భోరున నేడ్చిరి మూర్ఖతన్ శివా! అంటూ నిర్వేదంలోంచి ఒక పద్యం తన్నుకొచ్చింది. అలా అలా శతకం పూర్తి చేశాను, ఆరోగ్యం కుదుటబడి శాంతి చిక్కింది.” అంటారు.

ఏదో ఒకటి చెప్పండి అని పట్టుబట్టేను, అందుకువారు “పొట్టగడవడానికి రెండు రూపాయల రోజుకూలిగా కొత్తపేట తాలూకా ఆఫీస్ లో ఓటర్ లిస్టులు రాశాను. విశాఖపట్నం లో ఎ.పి.ఎస్.ఇ.బి లో టైపిస్టుగా చేరి సర్విస్ కిమిషన్ పాస్ అయ్యి హైదరాబాద్ చేరేను, ఆ తరవాత ముఫ్ఫై రూపాయల జీతమెక్కువని ఈ టెలిఫోన్ ఆపరేటర్ గా చేరేను. తరువాత విజయవాడ చేరి శ్రీ వీశ్వనాధవారిని కలిశాను. అక్కడ కొండపల్లి సీతారామయ్య సంగీత విద్వాసులు ఎ.ఐ.ఆర్ ద్వారా హనుమంతరాయ గ్రంధాలయంలో నెలకి ఒక రూపాయి సభ్యత్వం మీద టి.ఆర్.బాలసుబ్రహ్మణ్యం వగైరాల కచేరీలు వినేవాడిని. అప్పటినుంచి సంగీతం వదలలేదు. పుస్తకాలు కొనుక్కోవాలనే ఆశ, సొమ్మేదీ, అందుకు ఆ పుస్తకం వెల చూచుకుని దానికి తగినట్లుగా రోజుకు ఒక పూట భోజనం మానేసి కూడపెట్టిన సొమ్ముతో పదివేల గ్రంధాలు కొన్నాను. నేను చూచినంత మేర, నాకు ఆ ఇంటిలో కనపడిన మేర, పుస్తకాలే కనపడ్డాయి.

DSCN3149

DSCN3125

DSCN3122

ఉపసంహారం:- జీవిత కాలం కష్టాలలో బతికిన కవిగారు తల్లిని ఏరోజూ వదలిపెట్టలేదు. వీరి 65 వ ఏట తల్లిగారు కాలం చేసినది మొదలు చిన్నతమ్ముడు, మరదలు, ఇద్దరు వారి కుమారునికంటే ఎక్కువగా, కవిగారిని చూచుకుంటున్నారు. మేము వెళ్ళిన రోజు తల్లి లలిత నిజంగా అమ్మ లలితలాగే ఆదరించింది, మమ్మల్ని కూడా. కవిగారు అన్న మాట ” జీవితం ఎలా జరిగిందో కాని ముప్పుకు మాత్రం నా తల్లి లలితా దేవి నా మరదలు కాదు నా కూతురు రూపంలో నన్ను ఆదరిస్తూ వుందయ్యా” అన్నారు. వారిని శ్రీమాత ఆయుఆరోగ్య ఐశ్వర్యాలతో జీవింపచేయాలని అమ్మని ప్రార్ధిస్తూ ఈ సావకాశం నాకు అమ్మే కలగచేసిందని నమ్ముతూ, బావగారిని కన్న తండ్రిలా చూస్తున్న చిరంజీవి సౌభాగ్యవతి లలిత ను అమ్మ లలిత ఆయు,ఆరోగ్య,ఐశ్వర్య, సుఖ, శాంతులతో వర్ధిల్లచేయాలని కోరుతూ,
శలవు.

ప్రకటనలు

13 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-విశ్వనాధకవిగారి జీవిత యాత్ర.

 1. ” తన కంఠమున దాచె హాలాహలం , తలనుండి కురిపించె గంగా జలం ” అన్న రీతి గా, వ్యక్తి గతం గానూ , ఆర్ధికం గానూ ఎన్నో ఒడి దుడుకుల కొనర్చి కూడా ,
  మొక్క వోని దీక్ష తో , సాహిత్య పోషణా , సాహిత్య సేవా చేస్తున్న సత్యనారాయణ మూర్తి గారు, ఆదర్శ ప్రాయులూ , ధన్యులూ కూడా !
  చక్కటి పరిచయం టపా రాసినందుకు, మీకు మా కృతఙ్ఞతలు !

  • @సుధాకర్ జీ,
   నిజంగానే వారు హాలాహలం మింగి అమృతం పంచారు. తన బాధ శివునికే నివేదించారు. వారు నాకు మిత్రులయినందుకు నా జన్మ ధన్యమయిందని భావిస్తాను. పుస్తకాల భద్రత గురించిన ఆలోచన చెబుతాను.
   ధన్యవాదాలు.

 2. * వారు సేకరించిన గ్రంధాలు అందరికి ఎంతో ఉపయోగపడతాయి.
  * కష్టాలను నిబ్బరంగా తట్టుకుని , దైవభక్తితో జీవితాన్ని పండించుకుంటున్న మహానుభావుల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
  * వారి బంధువులు కూడా ఎంతో గొప్పవారు.

  • @అమ్మాయి అనూరాధ,
   వారు జీవితకాలం కష్టాలలో గడిపినా ఎప్పుడూ నిర్వేదం చెందలేదు. పుస్తకాలు జాగ్రత్త పెట్టడానికి ప్రయత్నం చేస్తాను
   ధన్యవాదాలు.

 3. మంచి పరిచయం

  పుస్తకాల విషయానికి వస్తే, అన్ని పుస్తకాలు ఒక్కరి వద్ద కలెక్షన్ గా ఉండండం గొప్ప విషయం. భాండా గారమే అనుకోవాలి. రాబోయే తరం వారు వాటిని భద్రం గా కాపాడు కొంటా రను కొంటాను కాలగతి లో పుస్తకాలు మాయమై పోకుండా, ఏవైనా విశేషణ మైన పుస్తకాలు కుంటే వాటిని స్కాన్ చేసి పీడీఎఫ్ లో పెడితే మరి కొంత కాలానికి అవి ఉంటా యేమో మరి

  జిలేబి

  • జిలేబీగారూ, రాబోయే తరం కవిగారి పుస్తకాలను భద్రం గా కాపాడు కొంటా రనుకోవవటం అత్యాశే కావచ్చును. శ్రీసర్వేపల్లి రాధాకృష్ణయ్యగారి పుస్తకాలు ఆయన అనంతరం రోడ్డున పడ్దాయని విన్నాను. పైగా ఆయన కుమారుడు గోపాల్ గారు లైబ్రరీసైన్స్‌లో నిష్ణాతుడనీ విన్నాను. ఈ నా వివరాలు వినికిడి జ్ఞానం మాత్రమే అని వివరణ తప్పక ఇచ్చుకోవాలి నేను. ఒకప్పుడు శ్రీస్థానంవారి స్వదస్తూరీతో రిమార్క్లులు ఉన్న విప్రనారాయణ నాటకం ముద్రితప్రతి ఒకటి నావద్దకు చేరింది. దానిని నేను పరిరక్షించుకోలేకపోవటం నాకు యిప్పటికీ‌ బాధ కలిగిస్తుంది. అలాగే భారతి స్వర్ణోత్సవసంచిక నాకు ఒక మిరపకాయల బండి వాడి దగ్గర దొరికింది! దానిని ఒక మిత్రుడు చదివి యిస్తానని తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి యివ్వలేదు – ఆయన జాడా తెలియదు. పుస్తకం వనితా విత్తం పరహస్తగతం గతః అధవా పునరాయాతు జీర్ణా భ్రష్టాచ స్వల్పశః అని అన్నారు కదా. చెప్ప వచ్చేదేమిటంటే పుస్తకాలు ఒకరు సేకరించినా (కుటుంబం) వాటి పట్ల శ్రధ్ధ వహించక పోవచ్చును అని.

   • శాయమలీయం గారూ,

    అంతే అంతే ! కాలగతి లో అన్ని ‘ఆకాషిక్ ‘ రికార్డ్స్ లో కి వెళ్లి పోవాల్సిందే మరి !(ఆ పై ఎవరైనా ‘రిచ’ నించి దాన్ని మళ్ళీ బయటకి లాగాలి !)

    మా ఏపీ ప్రెస్ అకాడమీ వారి పుణ్యమా అని, కొద్దో గొప్పో పాత సంకలనాలు ఇక్కడ చూడొచ్చు. కొన్ని పీ డీ ఎఫ్ లు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉదాహరణ కి 1930 ప్రాంతపు ఆంధ్ర పత్రిక !! గట్రా !!

    http://www.pressacademy.ap.gov.in/archives.asp

    చీర్స్
    జిలేబి

   • కాకినాడ లో ఈ రిసెర్చ్ సెంటర్ ఉన్నది (ఎంత దాక బ్యూరోక్రసీ కోరల్లో ఉందో తెలీదు ) ప్రయత్నించి చూడండి ఏమన్నా వాళ్ళు డిజిటైజ్ చేయ గలరా అని ? (పుస్తకం ఇచ్చెయ్యండి అంటారేమో తెలీదు ! ఇస్తే ఏమవుతుందో తెలీదు. ఎందుకంటే కొంత కాలం మునుపు దాక వీళ్ళు ఆన్ లైన్ లో డౌన్లోడ్ చేసుకోనిచ్చే వారు – పాత పత్రికల్ని . ఈ మధ్య వెబ్ సైటు ఈ ఫెసిలిటీ ని హాంఫట్ గావించి నట్టు ఉన్నది ( రహస్య రిసెర్చ్ ఏమైనా గావిస్తున్నారేమో బ్యూరోక్రసీ కోరల్లో చిక్కి !!)

    http://www.pressacademy.ap.gov.in/Library.asp

    జిలేబి

  • @జిలేబి గారు/శ్యామలరావుగారు,
   పుస్తకాల గురించిన సూచన మంచిదే. జీవితమంతా ధారపోసి పుస్తకాలు సేకరించారు. అసలు ఇటువంటి భద్రపరిచే సాధనం ఉంటుందని వారికి తెలుసనుకోను. ఈ సూచన చేస్తే మళ్ళీ ఎక్కడ ఇబ్బంది పడతారోనని భయం. సూచనగా ఈ లోకంలో భద్రపరచే సాధనమున్నట్లు చెబుతాను. ఆర్ధికంగా వారివల్ల కాకపోవచ్చు. మరొక సంగతి ఇటువంటి అలభ్య గ్రంధాలను తిరుపతి వేంకన్న బాబు తీసుకుని ప్రచురిస్తున్నారు కూడా. కవిగారివద్ద జాయప సేనాని రచన నాట్యశాస్త్ర గ్రంధం ఉందన్నారు. తిరుపతి సూచన చేసి చూస్తాను. వారి తరవాత వారు వాటిని భద్రపరచలేరు, భద్రపరచరు కూడా, వాటి విలువ తెలియక, తెలిసినా ఆర్ధిక ఇబ్బందుల మూలంగా. ఏమయినా వాటిని భద్ర పరచే సాధనం చూస్తాను, అవసరమయితే మీ సహాయం కోరతాను.

   As far as my knowledge goes he is not aware of the possibility of saving in e book.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s