శర్మ కాలక్షేపంకబుర్లు-జాతస్య….

జాతస్య…

“జాతస్య మరణం ధృవం”.. పుట్టినవారు మరణింపకతప్పదు. ఇది అందరికి తెలిసిన సత్యమే, కాదనలేనిదీ, అందరమూ చెబుతాం, కాని మనదాకా వచ్చినపుడు మాత్రమే ఎక్కువ బాధగా ఉంటుంది. హిరణ్యకశిపుడు ఏమన్నాడు? చనిపోయిన సోదరుని గురించి తల్లీ అతని భార్యలు ఏడుస్తుంటే……యముడు బాలకుని రూపంలో ఇలా చెప్పేడు, నిత్యమూ అలా జరిగేదానికి ఏడవకూడదు, అన్నాడు.

మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్
జచ్చుచునుండ జూచెదరు చావక మానెడు భంగి నీ
చచ్చినవారి కేడ్చెదరు చావుకు నొల్లక డాగవచ్చునే;
యెచ్చట బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్.

ప్రపంచం లో వింత ఏమని? యక్షుని ప్రశ్న దానికి సమాధానంగా ధర్మరాజు చచ్చినవాళ్ళకోసం ఏడుస్తారు   తాము కూడా చనిపోతామని తెలిసి ఇదే వింత అంటాడు.మళ్ళీ హిరణ్య కశిపుడి దగ్గరకొద్దాం.

ఆ తరవాత తపస్సు చేసి వరం కోరేడు,హిరణ్య కశిపుడు

గాలిం గుంభిని నంబువుల నాకాశస్థలిన్ దిక్కులన్
రేలన్ ఘస్రములన్ దమః ప్రభల భూరి గ్రాహా రక్షో మృగ
వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమతాస్త్రశ
స్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ యిప్పింపవే

అని అడిగితే బ్రహ్మ గారు

అన్నా! కశ్యప పుత్ర! దుర్లభము లీ యర్ధంబు లె వ్వారికిన్
మున్నెవ్వారలు గోరరీ వరములన్ మోదించితిన్నీ యెడన్
నన్నున్ గోరినవెల్ల నిచ్చితి బ్రవీణత్వంబుతో బుద్ధి సం
ప్పన్నత్వంబున నుండుమీ సుమతివై భద్రైకశీలుండవై.. శ్రీ. భాగవతం స్కం.7…. 92

బ్రహ్మగారు ‘అబ్బాయి! ఇటువంటి వరాలు ఇదివరలో ఎవరూ కోరలేదు, నువ్వడిగినవరాలన్నీ ఇచ్చాను బుద్ధి కలిగి బతకరా’ అని చెప్పివెళ్ళేడు. హిరణ్యకశిపుడు ఇంతమంది నుంచి చావు రాకుండా అడిగేడు కాని జర,ఋజలను మరచాడా? లేక అప్పటికే వాటిని జయించారో తెలీదు. నేడు జర(ముసలితనం) ఋజ (వ్యాధి) వీటినుంచే మానవులకు మరణం సంభవిస్తోంది. రోగాలకి ముఖ్యకారణం, తీసుకునే ఆహారం లో విషాలు  ఉండడం. వీటిని తింటే కేన్సర్ లాటి వ్యాధులొస్తాయి, ఆహారపదార్ధాలను కల్తీ చేయద్దొని అందరూ మొత్తుకుంటున్నారు, కాని వినేవారే కనపడటం లేదు. పళ్ళు ముగెయ్యడం దగ్గరనుంచి పురుగు మందుల అవశేషాలదాకా అన్నీ కేన్సర్ కారకాలే.మందులతో సహా అన్నీ కల్తీయే.

ఈ కేన్సర్ మహమ్మారి బారినపడి నా సోదర, సోదరీలు ఇద్దరు ఒక్క నాలుగురోజుల తేడాలో అసువులు బాసేరు. మొన్న పదకొండో తారీకు ఉదయం టపా వేసిన తరవాత అబ్బాయి పిలిచి ‘బాబయ్యా! నాన్న ఇకలేడు’ అని పిడుగులాటివార్త చెప్పేడు. మరి కొద్ది క్షణాల తరవాత ‘చిన్నత్త కూడా కాలం చేసింది, మొన్న ఎనిమిదవ తారీకు రాత్రి’ అని మరొక పిడుగుపడేసి బేర్ మన్నాడు.నాకు బుర్ర పని చేయడం మానేసింది. ‘అదేంటీ కోలుకుంటున్నారిద్దరూ’ అని చెప్పి ఈ వార్తలనుకున్నా, మెదడు మొద్దుబారిపోయింది. మళ్ళీ అబ్బాయే ‘బాబయ్యా! నువ్వు ముందుగా మన ఊరు చేరు, మేము ఇక్కడినుంచి వచ్చేటప్పటికి సాయంత్రం అవుతుందనుకుంటా’ అన్నాడు. అప్పుడు వాడిని కాస్త ఓదార్చి ‘కానున్నది కాకమానదు కనక కాలాన్ని అతిక్రమించలేమని’ చెప్పి ఇల్లాలితో బయలుదేరి వెళ్ళా. ఎండ మండిపోతూ ఉంది. ఆరోజంతా ఏండ బారినపడ్డాం. సాయంత్రాని కి అన్నయ్య పార్ధివ శరీరాన్నిఅంబులెన్స్ లోంచి దీంపుతోంటే, ఉద్వేగం కట్టలు తెంపుకుంది. నేనే ఉద్వేగపడితే! వివేకం హెచ్చరించింది, దిగమింగుకుని తరవాత కార్యక్రమాలకి చూస్తే ఆ రోజు కుదరదని తేలిపోయింది. శవ జాగరం చేసి మర్నాడు పాంచ భౌతిక దేహాన్ని పంచభూతాలలో కలిపేశాం. ఇహ, ఇది మొదలు గత పదిరోజల పైగా తిన్నచోట నిద్ర పోలేదు, నిద్రపోయిన చోట తినలేదన్నట్లు తిరిగాం. ఏండ వేడిమి 41డి  కి ఏరోజూ తగ్గిలేదు, ఆ పై మాటే. ఇలా తిరగడానికి అరవై కిలోమీటర్ల ప్రయాణానికి నాలుగు గoటలు సమయం, మూడు బస్సులు, ఆటో ఇలా ప్రయాణ సాధనాలు, కిక్కిరిసినవాటిలో ప్రయాణం. ఎందుకీ అవస్త అంటే, నేను చేసేది యేమీ ఉండదు, కాని పిల్లలికి కాస్త ఉపశమనం, ధైర్యం కోసమే నా ప్రయత్నం. ఈ ప్రయాణాలు ఎండవేడి మూలంగా నాకూ అనారోగ్యం, మందులు మిగడం, కష్టాలు పడి నిన్నటికి పిల్లల్ని ఆశిర్వదించి వచ్చేటప్పటికి తల ప్రాణం తోకకి వచ్చింది.

‘స్థితప్రజ్ఞత్వం సాధించాలనుకున్నారుగా ఎందుకు బాధపడ్డార’న్నారొకరు. కష్ట సుఖాలను సమానంగా తీసుకోమన్నారంటే కష్టానికి కుంగిపోవద్దు, సుఖానికి పొంగిపోవద్దని తప్పించి మానవ స్పందనలొద్దని కాదుకదా! తమ్మునిగా స్పందించి బాధపడ్డా, ధైర్యం తెచ్చుకుని కర్తవ్యం నెరవేర్చా, కష్టమయినా సరే, ఇదే అనుకుంటా స్థితప్రజ్ఞత్వం అంటే.

ఏదో ఒక రోజు అందరం పోవలసినవాళ్ళమే కాని ఈ కేన్సర్ భూతం లాటి వ్యాధులవల్ల చనిపోతె బాధగా ఉంటుంది కదా. ఎవరేనా సంయమనం కోల్పోతారు.”వ్యసనేషు మనుష్యాణాం భృశ భవతి దుఃఖితః” ఆపదలు ముసురుకొనివచ్చినపుడు మానవులు దుఃఖముతో కృంగిపోవుదురు-ఇది మానవ సహజ లక్షణము”. దీనినుంచి బయట పడక తప్పదు, పోయినవారితో పోము, పోకూడదు, మిగిలినవారికి ధైర్యం చెప్పి, జీవితం మీద ఆశ కలగ చేయాలి కదా!

ప్రకటనలు

22 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-జాతస్య….

 1. ఏదో ఒక రోజు అందరం పోవలసినవాళ్ళమే కాని ఈ కేన్సర్ భూతం లాటి వ్యాధులవల్ల చనిపోతె బాధగా ఉంటుంది కదా. ఎవరేనా సంయమనం కోల్పోతారు.”వ్యసనేషు మనుష్యాణాం భృశ భవతి దుఃఖితః” ఆపదలు ముసురుకొనివచ్చినపుడు మానవులు దుఃఖముతో కృంగిపోవుదురు-ఇది మానవ సహజ లక్షణము”. దీనినుంచి బయట పడక తప్పదు, పోయినవారితో పోము, పోకూడదు, మిగిలినవారికి ధైర్యం చెప్పి, జీవితం మీద ఆశ కలగ చేయాలి కదా!

 2. శర్మ గారు, just for a change.
  నాకు తెలియని ఈ సందేహం తీర్చండి.
  “రసకందాయంలో పడింది” అంటారు కదా. అంటే ఏమిటండి?

  • @మిత్రులు బోనగిరిగారు,
   Got the point, thank u
   జరుగుతున్న ఎదేని ఒక అంశంలో రసవత్తరమైన సన్ని వేశాన్ని రసకందాయం అంటాం. ఓ ఉదాహరణ చెప్పుకుంటే

   ఒక అత్తాకోడలూ రోజూ దెబ్బలాడుకుంటూ ఉంటారు వీధిన పడి, అటువంటి వారొకరోజు జుట్టూ జుట్టూ పట్టుకున్నారనుకోండి, అప్పుడు చూపరులు అనుకుంటారనమాట సంగతి ” మంచి రసకందాయంలో పడిందే” అని

   • శర్మ గారు, “రసకందాయం” అన్న పదానికి అర్థం ఏమిటన్నది నా సందేహం.

   • మిత్రులుబోనగిరి గారు,

    మీరడిగిన అనుమానానికి రవ్వా శ్రీహరి గారు నిఘంటువులో ఈ కింది అర్ధాలిచ్చారు.
    నెనరుంచాలి.
    పరాకాష్ఠ, రసపట్టు, కుతూహలము.

 3. పెద్దలందరికి నమస్కారం, పిన్నలకు దీవెనలు..

  నాకేమయినా అయి అందుకని టపా రాయటం లేదేమోనని మిత్రులు ఫణిబాబు గారు, శ్యామలరావుగారు సెల్ లో కనుక్కున్నారు. అలాగే డాక్టర్ మిత్రులు సుధాకర్ గారు నా ఆరోగ్యం గురించి వాకబు చేశారు. మరిద్దరు మనవరాళ్ళు మెయిలిచ్చారు. నేను సమాధానాలివ్వడానికి వీలుకుదిరిన చోట విషయం చెప్పాను, వీలుకుదరని వారికి తరువాత తెలియ చేశాను. మీ అందరి అభిమానానికి నా మనసు పులకించి మరిన్ని సంవత్సరాలు బతకాలనే కోరిక పుట్టింది, అందుకు మీ అందరికి ధన్యవాదాలు.

  ఈ విషయం చెప్పి మీ మనసులు బాధ పెట్టాలని లేదు కాని చెప్పకపోతే మీరు నా గురించి బాధ పడతారు కనక చెప్పేను.

  @అమ్మాయి శారద,
  ఈ విషయం లో మనం ప్రేక్షకులం మాత్రమే. నెనరుంచాలి.

  @శర్మ గారు, ధన్యవాదాలు.

  @జిలేబిగారు,
  నిజమే ఈ వైరాగ్యం నుంచి బయటపడాలి. నెనరుంచాలి.

  @మోహన్జీ,
  మన చేతులలో లేనపుడు కర్మ సిద్ధాంతం నమ్మడమే మంచిదనుకుంటా. వంశపరంపరగా కూడా ఈ వ్యాధి వస్తుందనుకుంటా.నెనరుంచాలి.

  @శ్యామలరావు గారు,
  కార్పొరేట్ వైద్యం లో చాలా దగా జరుగుతోందండి. ఈ కేన్సర్ కారకాలని తెలిసి తెలియక వాడేస్తున్నారు. ప్రాణం మీదికి తెచ్చుకుంటున్నారు. నెనరుంచాలి.

  @చి.ధాత్రి
  దీర్ఘాయుష్మాన్భవ. చిన్న దానవయినా తాత గురించి పట్టించుకున్నందుకు మనసు నిండిపోయింది. నెనరుంచాలి.

  @krishna palakollu గారు,
  మంచి శ్లోకం గుర్తు చేశారు. నెనరుంచాలి.

  @చి.ఉష,
  దీర్ఘాయుష్మాభవ. నా గురించి పట్టించుకున్నందుకు ఆనందమనిపించింది.

  @మిత్రులు మాధవరావుగారు,
  ఆహార విహారాలలో చాలా మార్పులొస్తున్నాయి. మంచివి కానివి వదలిపెట్టమని నెత్తీ నోరూ కొట్టుకుంటున్నా, వినటం లేదండి, చివరికొచ్చాకా బాధ పడుతున్నారు. నెనరుంచాలి.

  @చి.చిన్ని
  బాధ పడాలి కాని అందులో కూరుకుపోకూడదు. నెనరుంచాలి.

  @అమ్మాయి అనూరాధ,
  ఇటువంటి విషయాలు చదివి మరిచిపోడం కాక వాటిలో విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిదని చెబుతాం. నెనరుంచాలి.

  @జలతారు వెన్నెల గారు,
  కర్తవ్యం నిర్వహణ దాకా ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు, ఇప్పుడు అదే పనిలో ఉన్నాను. నెనరుంచాలి.

 4. ఈ మధ్య మీరు బ్లాగ్ వ్రాయకపోతే బహుశా ఊరు వెళ్ళి ఉండవచ్చని అనుకున్నానండి. అయితే ఇలాంటి సంఘటనలను ఊహించలేదు. జరిగిన సంఘటనలు చాలా బాధాకరమైనవి. వ్యాఖ్య ఏ విధంగా వ్రాయాలో తెలియక ఆలస్యంగా వ్రాస్తున్నానండి.
  కొన్ని సంవత్సరాల క్రిందట కాన్సర్ వ్యాధి గురించి అరుదుగా వినేవాళ్ళం. ఈ రోజుల్లో వ్యాధి ఎక్కువమందిలో కనిపిస్తోంది.
  ఈ వ్యాధి పూర్వం కన్నా ఇప్పుడు పెరగటానికి గల కారణాలను కనుగొని తగిన జాగ్రత్తలు తీసుకోవటానికి ప్రభుత్వం, ప్రజలు గట్టిగా ఆలోచించవలసి ఉంది.

 5. శ్రీ శర్మగారికి, నమస్కారములు.

  తోబుట్టువులను పోగొట్టుకొని బాధతో నిండిన మీ మనస్సుకు సత్వరమే స్వాంతన కలగాలని కోరుకుంటూ, ఇప్పటికైనా ప్రజలు ఆరోగ్యంపట్ల, ఆహారంపట్ల ఎక్కువ శ్రద్ధ చూపగలరని ఆశిస్తూ,

  మే స్నేహశీలి,
  మాధవరావు.

 6. తాతగారు..
  మీరు ఇన్నిరోజులు కనపడకపోవటానికి కారణం ఇదా.మీ బాధఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. అర్థం చేసుకున్నాను.

 7. Sir
  So sorry to hear that, deepest condolences to the families.
  Hope God gives you & families the mental stability to overcome this.

  SATSANGATVÉ NISANGATVAM
  NISANGATVÉ NIRMOHATVAM
  NIRMOHATVÉ NIŠČALATATVAM
  NIŠČALATATVÉ DŽÍVANMUKTI

  -Krishna

 8. తాతగారు..
  మీరు ఇన్నిరోజులు కనపడకపోవటానికి కారణం ఇదా..:(
  ఇద్దరినీ ఒకేసారి పోగొట్టుకోవడం అంటే ఎంతో బాధ..కాని మీరు పంచుకున్న ఈ అనుభవం నాకు చాలా స్ఫుర్తినిచ్చింది తాతగారు.ముఖ్యంగా ఈ వాఖ్యాలు
  “కష్ట సుఖాలను సమానంగా తీసుకోమన్నారంటే కష్టానికి కుంగిపోవద్దు, సుఖానికి పొంగిపోవద్దని తప్పించి మానవ స్పందనలొద్దని కాదుకదా! తమ్మునిగా స్పందించి బాధపడ్డా, ధైర్యం తెచ్చుకుని కర్తవ్యం నెరవేర్చా, కష్టమయినా సరే, ఇదే అనుకుంటా స్థితప్రజ్ఞత్వం అంటే.”

  తాతయ్యా,బామ్మ ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

 9. కాన్సర్ చుట్టూ ఉన్న వాతావరణ ప్రభావం వల్ల,
  జన్యు క్రమం వల్ల కూడా వస్తుంది.
  కర్మ సిద్ధాంతం ఇక్కడ బాగా సరి పోతుంది.

 10. శర్మగారు,

  కొన్ని దినాలుగా మీరు బ్లాగుప్రపంచంలో దర్శన మీయటం లేదేమిటా అని ఆశ్చర్యపోయాను. ఈ‌ రోజు మిమ్మల్ని దూరవాణిద్వారా పలకరించాలనున్నాను (మీ నంబరు నాదగ్గర ఉన్నట్లు జ్ఞాపకం). ఇంతలో యీ టపా మీ నుండి. కాన్సరు వ్యాధికి ఇర్వురు తోబుట్టువులను కోల్పోవటం, అదీ ఒకేసారిగా అనేది చాలా బాధాకరం.

  [ నా తోబుట్టు వొకామె, పరమ సాత్వికురాలైన అమ్మాయి పరమపదించింది కొన్నేళ్ల క్రిందట. సంతానసాఫల్యతకోసం ఆమెకు హార్మోన్లతో వైద్యం చేయటం వలన కేన్సరు సోకిందని నాకు గట్టి అనుమానం. అందరూ మంచివారే, అమాయకత్వం అంతే. అల్లరి పడటం వలన ప్రయోజనం యేముంటుంది నా చెల్లెలి ఆత్మను క్షోభపెట్టటం వినా అని ఊరకున్నాను. తలపుకు వచ్చినప్పుడల్లా చాలా బాదగా ఉంటుంది. ]

  గాలీ నేలా నీరూతో‌సహా సర్వం కలుషితం చేసుకుంటున్న మానవులు తమ జీవితాలను తామే దుఃఖమయం చేసుకుంటున్నారు. అంతే.

 11. వారి ఆత్మల శాంతి కోసం , సద్గతి కోసం
  ప్రార్ధిస్తూ , మిమ్మలిని మీరు సాంత్వన పరుచు కొండని ,
  కోరు కుంటున్నాను , please take care !

 12. జాతస్యే న ఆల్రెడీ మరణం ధ్రువం.

  Condolensces to the bereaved family membeers.

  శ్మశాన వైరాగ్యం నించి మీరు అతి త్వరలో బయటకు వస్తారని ఆశిస్తూ

  జిలేబి

 13. శర్మ గారూ ,

  మీ టపా చూసి ( బ్లాగ్ ద్వారా సంభాషించి ) చాలా రోజులైంది . ఏమిటి కారణం ? అని ఎన్నో మార్లు తలుచుకున్నాను . కాని యిప్పుడు ఈ టపా చదివిన తర్వాత అర్ధమైంది విషయం చాలా చాలా బాధాకరమైనదే .

  పోయిన వాళ్ళతో మనమూ పోలేము కదా ! అన్నది అక్షరాలలోనే కాక ఆచరణలో కూడా నిజమేనండి .
  మీలాంటి పెద్దలకు ,మాలంటి చిన్నవారు ఓదాచుకోండి అని చెప్పటం పధ్ధతి కాదు అనుకుంటున్నాను .

 14. బాబాయి గారూ,
  మీ బాధ అర్థం చేసుకున్నాను. తోబుట్టువులిద్దర్నీ ఒకేసారి కోల్పోవడం చాలా దురదృష్టం!
  వారి ఆత్మ శాంతికోసం భగవంతుణ్ణి ప్రార్థించడం తప్ప ఇంకేమీ చేయలేని నిస్సహాయులం.
  శారద

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s