శర్మ కాలక్షేపంకబుర్లు-మండు వేసవిలో ప్రకృతి సిద్ధమయిన చల్లటి మంచినీళ్ళు.NATURAL FRIDGE.

మండు వేసవిలో ప్రకృతి సిద్ధమయిన చల్లటి మంచినీళ్ళు. NATURAL FRIDGE

ఎండలు మండిపోతున్నా,చల్లటి మంచినీళ్ళు తాగితే ప్రాణం లేచొస్తుంది. ఎలా అంటే, ‘కుండలో నీళ్ళు తాగండి, లేదా ఫ్రిజ్ లో నీళ్ళు తాగండి’ అన్నారొకరు. కొత్తకుండలో నీరు తీయన కోరిన మగవాడే తీయన అన్నారు సినీ కవి. కొత్తకుండలో నీళ్ళు తియ్యగానూ, చల్లగానూ ఉంటాయి కాని గొతు రాస్తుంది. రాయడమంటే ఒరుస్తుంది. పాత కుండలో నీళ్ళు చల్లగా ఉండవు, కొత్త కుండ చెమర్చినట్లు పాత కుండ చెమర్చదు కనక, నీళ్ళు చల్లగా ఉండవు.చెమర్చకుండా ఉండే కుండని ‘పన్ను’ అయిన కుండ అంటారు. ఇదీ ఉపయోగమే. దీనిలో మామిడి కాయ ఊటలాటివి పోసేవారు లెండి. ఇక ఫ్రిజ్! అమ్మో ఇదంటేనే భయం నాకు. ఎందుకంటే, వేసవి రోగాలకు పుట్టినిల్లు ఫ్రిజ్ అని నా నమ్మకం. నా ఇల్లాలు, అందుకే వారం కి ఒక సారి దీనిని శుభ్రం చేస్తూనే ఉంటుంది. అన్నట్టు ఏమయినా కరంటు ఉండాలిగా 🙂 ఇందులో పెట్టుకున్న నీళ్ళు తాగితె నాకు మాత్రం జ్వరం ఖాయంగా వచ్చేస్తుంది. మరి నాలాటి వాళ్ళు వేసవిలో వేడి నీళ్ళు తాగిబతకాలిసిందేనా అంటే ఎన్నటికీ కాదని చెప్పేరు మన పూర్వులు. ప్రకృతికి దగ్గరగా చల్లటి మంచినీళ్ళు లభ్యం ఇలా.

ఒక ఇత్తడి/రాగి బిందె తీసుకుని నిండా నీరుపోయండి. ఒక తెల్లటి దుప్పటి/ పంచ బరువు ఆపేదాన్ని తీసుకుని తడిపి, బిందెపై వేయండిమూతి బిగించండి, తాడుతో.  గుడ్డ తలం సమానంగా ఉండేందుకే,. బిందెను గచ్చుపై బోర్ల వేయండి, ఒక్క ఉదుటున. నీళ్ళెక్కడికీ పోవు,మూతికి బిగించిన తాడు విప్పేయండి.. ఇప్పుడు పంచె తాలూకు రెండు కొసలు ముడేయండి, దగ్గరగా. మిగిలిన కొసలు ముడెయ్యండి. దీనిని ఒక కొక్కేనికి తగిలించండి, బిందె కింద అంచు సమతలం లో ఉండేలా. వేడి గాలి వీస్తున్న చోట కూడా వేలాడతీయచ్చు. కాసేపుపోయాకా గ్లాసు పట్టుకెళ్ళి బిందె ఒకంచు లేపండి, రెండవ అంచున నీళ్ళు పట్టుకోండి. నీళ్ళు చల్లగా హాయిగా ఉంటాయ్. నీళ్ళు కారిపోవు. బిందెలో నీరు అయిపోయేదాకా వాడుకోవచ్చు. వేసవిలో ఇలా చల్లటినీళ్ళు రాత్రి పగలు వాడకానికి మా ఇంట్లో ఒక బిందె వేలాడ తీసి ఉంటుందిలా. ఎప్పుడు నీళ్ళయిపోతే అప్పుడు మళ్ళీ కట్టెయ్యడమే. ఇలా తిరగేసిన బిందెలో మంచినీళ్ళు వేసవిలో తాగటం మా ఇంట తరతరాలుగా వస్తున్నదే.ఉదయమే ఇలా కట్టేసుకుంటే మధ్యాహ్నానికి నీళ్ళు బలే చల్లగా ఉంటాయి.

DSCN3360

DSCN3361

DSCN3362

DSCN3363

DSCN3364

గుడ్డ మూతేసిన బిందె తిరగదీస్తే నీళ్ళెందుకు కారిపోలేదు? బిందె పక్కకి వంచితే ఎందుకు నీళ్ళు కారుతున్నాయి? అసలు నీళ్ళెందుకు చల్లబడుతున్నాయి? మీకు తెలుసా తెలిస్తే చెప్పరూ!

ఇందులో సయిన్స్ సూత్రాలున్నాయిట 🙂 పిల్లలనడగండి, పిల్లల చేత ఈ ప్రయోగం చేయించండి.  సయిన్స్ సూత్రాలూ వాళ్ళు మరిచిపోతే ఒట్టు. చదువుకోని పల్లెటూరి వాళ్ళం కదండీ, మాకు సయిన్స్ తెలీదు, ప్రకృతికి దగ్గరగా బతకడమే తెలుసు,,,,,,

ప్రయత్నించి  సయిన్స్ సూత్రాలూ మాకు చెబుతారు కదూ చల్లటి మంచినీళ్ళు తాగి…

ప్రకటనలు

18 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మండు వేసవిలో ప్రకృతి సిద్ధమయిన చల్లటి మంచినీళ్ళు.NATURAL FRIDGE.

 1. తాతగారింట్లో చిన్న కూజాబిందెని ఇలాగే ఒక కిటికీకి వేలాడేసి వుంచేవారనే విషయం ఇదుగో ఇప్పుడు మీ పోస్ట్ చదువుతూంటే గుర్తు వస్తోంది.
  “బిందెని హటాతుగా తిరేగేస్తే గాలి లోపలికి వెళ్లి నీరు స్థానభ్రంశం అయ్యే సావకాశం లేక పోవడం వల్ల నీళ్ళు కారవు. అదే ఒక పక్కకి వొంచినప్పుడు గాలి లోనికి ప్రవేశించి నీటిని స్థానభ్రంశం చేస్తుంది కనక నీళ్ళు బయటికి వస్తాయి. ” ఇది తాతగారు మా చిన్ని బుర్రలకి అర్థం అయ్యేలాగ ఇచ్చిన వివరణ.
  మీ ధర్మమా అని ఇవాళ తాతగారిని మళ్ళీ గుర్తు చేసుకున్నాను. థాంక్సండీ శర్మగారూ!
  I wonder why my prevoius comment didn’t get published.

  • @సాహితిగారు,
   మీతాత గారింట్లో ఇలాగే కట్టేవారన్న సంగతి చెప్పి నన్ను సంతోషంలో ముంచారు. మీ తాత గారిని తలుచుకునేలా ఆఅచేయగలిగినందుకు ధన్యుడను. తాత గారు చెప్పినది నిజమేకదూ.

   సాహితిగారు, నా మీద నింద వేసేరు, మీలాటి అభిమాన పాఠకుల వ్యాఖ్యలను నిర్లక్ష్యం చేసేయగలవాడను కాదండి.మీ వ్యాఖ్య కోసం మొత్తం బ్లాగ్ వెదికేను. మీది ఒక వ్యాఖ్య 30.04.2013 న పాలకోసం.. టపాలో ఉందండి. మీ వ్యాఖ్యలను సదా స్వాగతించే…
   Searched in spam also no comment found from you. Thank u
   నెనరుంచాలి.

   • అయ్యో! నా వుద్దేశం అది కాదండీ! ఈ టెక్నాలజీ నాలాంటి వారితో అప్పుడప్పుడూ తమాషా ఆటలు ఆడుతూ వుంటుంది అంచేత ” ఏమైంది చెప్మా!!!!” అని పైకే ఆశ్చర్య పోయానంతే గానీ మిమ్మల్ని తప్పు పట్టాలని ఎంతమాత్రమూ కాదండీ
    పెద్దవారు మీ మనసు కష్ట పెట్టినందుకు క్షమించమని కోరుకుంటున్నాను.

  • @సాహితిగారు,
   వడ్లగింజలో బియ్యపుగింజ.నేను తప్పు చేసేనేమో అని అనుకున్నా 🙂 అవగాహన పొరపాటు తప్పించి మరేం కాదు కదా! ఇద్దరం, క్షమాపణలు, మన్నింపులు మరిచిపోదాం! ఏమంటారు, హాయిగా నవ్వేయండొకసారి, ఆరోగ్యానికి మంచిది కదా! 🙂
   నెనరుంచాలి.

 2. ఏమో నండీ, ఒక గుక్కెడు గ్లాసెడు నీళ్ళు తాగడానికి ఇంత కష్ట పడాలా !!
  జేకే !

  మీరు మళ్ళీ లోకం లో పడ్డారు ! అదే పది వేలు !

  ఇక ౨౫ మే నేల మీ దంపతులకు హార్దిక శుభాకాంక్షలు !! ఏక్ పర్ పచాస్ ! సరియైన దేనా కేల్కులేషన్ ?

  జిలేబి

  • @జిలేబిగారు,
   కష్టపడితేనే ఫలితం దక్కేది, ఆ ఫలితమే తియ్యగా వుంటుందని మీకూ తెలుసు :), నా చేత చెప్పించేరంతే.శుభ్రమైన ప్రకృతి సిద్ధమైన నీళ్ళు చల్లటివి వేసవిలో ఇలాగే దొరుకుతాయి.

   మీ అభిమానానికి ధన్యవాదాలు.కష్టం మరచిపోలేకపోయినా కర్తవ్యం నిర్వహించాలి కదండీ!

   మీరన్నది నిజమే! కోడళ్ళు పండగ చేద్దామన్నారు, మాకే ఉత్సాహంగా లేక వద్దన్నాం, ఈ సంవత్సరం వున్న పరిస్థితులలో పండగ చేసుకోలేదు. మీరు మరచిపోకుండా శుభాకాంక్షలు అందచేసి అభిమాన వర్షంలో తడిపేసేరు. మీ అభిమానానికి కృతజ్ఞత చెప్పుకుంటూ, మీలోని అమ్మకి సదా నమస్కారం చెప్పుకున్నాం, దంపతులం. మీ అభిమానం ఎల్లప్పుడూ మాపై ఇలాగే ఉండాలని కోరుకుంటూన్నాం.
   నెనరుంచాలి.

 3. మీ టపా, ముఖ్యం గా భారత దేశం లో ఉండే వారికి ఎంతో ఉపయుక్తం గా ఉంది !
  మీరు సూచించిన పధ్ధతి ఆకర్షణీయం గా ఉంది ! ఎందుకంటే , బిందె పైన కప్పే నూలు గుడ్డ, తమకు ఇష్టమైన డిజైన్ తో కప్ప వచ్చు!
  కానీ ఒక్క విషయం లో జాగ్రత్త వహించడం మంచిది: వేసవి లో చల్లని ప్రదేశాలలో ఉండాలని రెక్కలు ఉన్నవీ లేనివీ
  సూక్ష్మ కీటకాలు అనేకం, మనకు తెలిసీ , తెలియకుండా వివిధ ప్రదేశాలలో తిరిగి , బిందెల మీద ఉన్న బట్ట మీద కూడా వాల వచ్చు ! అప్పుడు అవి వివిధ రకాలైన ఇన్ఫెక్షన్ లకు దారితీసే ప్రమాదం ఉంది ! ( అదే నీరు కుండలో ఉంటే కేవలం ఒక మూత పెడితే సరిపోతుంది )
  శ్యామలరావు గారు ఈ పధ్ధతి లో నీరు ఒలక కుండా ఉండడానికీ , చల్ల గా ఉండడానికీ కూడా కారణాలను చక్కగా వివరించారు !
  కొత్త కుండ లో నీరు చల్లగా ఉండడానికీ ఇవే కారణాలు! కొత్త కుండలో అతి సూక్ష్మ మైన, అనేక వేల రంధ్రాలు ఉంటాయి వాటినుంచి , నీరు ఆవిరి అవుతూ కుండలో నీరు చల్ల గా ఉండడానికి తోడ్పడుతుంది.
  పాత కుండల్లో ఈ అతి సూక్ష్మ రంధ్రాలు క్రమేణా మూసుకుపోతాయి ! అప్పుడు అవి కేవలం బిందె లలాగానే నీటిని చల్ల బరచ లేవు !
  నిండు కుండ తొణకదు ” అనే నానుడి మనం వినే ఉంటాము కదా ! దానికి కారణం సర్ఫేస్ టెన్షన్ అనే నీటి భౌతిక ధర్మం ( ఈ కారణం వల్ల నే కొన్ని కీటకాలు కూడా నీటి మీద మునిగి పోకుండా నడుస్తూ ఉంటాయి ! )
  ” నిండు కుండ తొణకదు ” అనే నానుడి మీకు ప్రస్తుతం చక్కగా వర్తిస్తుంది కూడా ! మీరు క్రుంగి పోకుండా, టపాలు రాస్తున్నారు కదా ! అది చక్కటి పరిణామం !

  • @సుధాకర్ గారు,
   మీరు చెప్పిన జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాలి. బిందెలో నీరయిపోయిన తరవాత ఇదివరలో వాడిన వస్త్రం మార్చాలి, మరో కొత్తది వాడాలి. ఇలా ప్రతివాటికీ కొన్ని జాగ్రత్తలు అవసరమే. ఇది ఖర్చులేని సుఖమయిన ప్రకృతి సిద్ధమైనది. వీలున్నవారు వాడుకోవాలనేదే కోరిక. మీ అభిమానానికి నా మనసు పులకించింది, మానసికంగా చాలా ధృడంగానే ఉన్నా.
   నెనరుంచాలి.

 4. చాలా బాగుందండి. చక్కటి విషయాన్ని తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు.

  టపా చదివిన తరువాత ఆగలేక, ఒక గ్లాసులో నీళ్ళుపోసి దానికి కర్చీఫ్ చుట్టి గ్లాసును తిరగేసి చూశాను.
  ఆశ్చర్యంగా నీరు క్రింద పడలేదు. గ్లాసును కొద్దిగా పక్కకు వంచితే నీరు క్రిందకు వస్తోంది. భలే ఉంది.

  ఈ విషయాల గురించి తాడిగడప శ్యామలరావు గారు చక్కగా వ్రాసారు.

  నిజమే, నీటికి బాగా గాలి తగిలే‌టట్లు చేస్తే నీరు త్వరగా చల్లబడుతుంది.
  ఉదా….మొక్కలకు చల్లటి నీరు కోసం వాటర్ బాటిల్ లో నీరు పట్టి మూతపెడితే నీరు త్వరగా చల్లబడదు. ఆరు బయట ఉంచిన బకెట్లో నీరు త్వరగా చల్లబడుతుంది.

  • @అమ్మాయ్ అనూరాధ,
   ఒక పెద్ద బిందె కట్టి చూడండి నీళ్ళు ఎంత చల్లగా ఉంటాయో! నీచేత ఒక ప్రయోగం నా టపా చేయించిందంటే ఉపయోగపడినట్లే. ఇలా ఎక్కువ మంది ఉపయోగించుకోవాలని నాకోరిక.
   నెనరుంచాలి.

 5. శర్మగారూ, నాకు చేతయినంత వరకు దీనిలోని విజ్ఞానశాస్త్రవిషయాలను గురించి చెబుతాను.

  తలక్రిందులుగా వ్రేలాడదీసిన బిందెలో నీరుంది. కాని ఆ నీరు క్రిందికి జరిపోకుండా బిందెకు వాసెన గట్టిన పంచె ఆపుతోంది. చిత్రంగా ఉంది కదా? కాని దీనికి ఒక కారణం ఉంది. అదే గాలికి గల ఊర్ద్వపీడనం. భూమ్యాకర్షణవల్ల నీరు క్రిందికి పడటానికి గాను పంచె మీద అధఃపీడనం కలిగిస్తున్నా దానికి విరుగుడుగా గాలి ఆ పంచె గుడ్దమీద కలిగించిన ఊర్ద్వపీడనం కారణంగా నీరు క్రిందికి పడదు. అయితే దీనికీ‌పరిమితి ఉంది. ఒక పెద్ద డేగిశాతో ప్రయత్నిస్తే గాలి నీటిని పడకుండా ఆపలేదు.

  పంచె అన్నది ఒక రేకు లాంటి వస్తువు కాదుకదా? అది భూతద్దంలో‌చూస్తే ఒక వలలాగా కనిపిస్తుంది దారాల అల్లికతో. మరి దాని ఖాళీల్లోంచి నీరు క్రిందికి పడిపోవాలి కదా? కాని యెందుకు పడదు? దీనికి కారణం తలతన్యత. దారపుపోగులమధ్య ఉన్న చిన్న చిన్న రంద్రాల్లో చిక్కిన నీటిబిందువులను చుట్టూ ఉన్న దారపు పోగులు యీ తలతన్యత అనే‌ శక్తి కారణంగా బంధించి ఉంచుతాయి. పోగులమధ్య మరీ‌ హెచ్చు యెడం ఉండి రంద్రాలు పెద్దపెద్దవిగా ఉంటే ఇది సాధ్యపడదు.

  ఇదంతా సరే కానీ నీరెలా చల్లబడుతోందీ‌ అని సందేహం. మట్టి కుండలోని నీరెలా చల్లబడుతుందో‌ అలాగే. పంచెలోని దారపు పోగుల మధ్య రంద్రాలలో చిక్కిన నీటి బిందువులు మెల్లగా ఆవిరవుతూ గాలిలో‌ కలుస్తాయి. అలా నీరు ఆవిరవ్వలంటే ఆ ప్రక్రియకు కొంత శక్తి అవుసరం. నీటిని మరగిస్తే ఆవిరవుతోందంటే దానికి మనం ఇంధనం మండించి ఉష్ణశక్తిని అందిస్తున్నాం కాబట్టి ఆవిరవటం జరుగుతుంది. కాని ఇక్కడ మనం బయటినుండి శక్తిని అందించటం లేదు కదా ఆవిరవటానికి. కాబట్టి నీటిబిందువులు తమలో అంతర్గతంగా ఉన్న ఉష్ణశక్తినే (దీన్నే latenet heat అంటాం) వాడుకుని ఆవిరవుతాయి. కొంత ఉష్ణశక్తి కోల్పోవటం వలన నీటి బిందువులు చల్లబడతాయి. అప్పుడు చుట్టుపక్కల ఉండే నీటిబిందువులూ చల్లబడతాయి వీటితో ఉష్ణశక్తిని పంచుకోవటం వలన. ఇలా క్రమంగా నీరంతా చల్లబడుతుంది.

  ఈ‌ పైన వ్రాసిన శాస్త్రీయవివరణలో యేమన్నా దిద్దుబాట్లు అవసరమైతే విజ్ఞులు సూచించగలరు.

  కొన్నేళ్ళ క్రిందట గట్టి కాన్వాసుగుడ్డతో చేసిన నీటి సంచులు అమ్మే వారు. వాటిలో నీరుపోసి బాగా గాలి తగిలే‌టట్లు చేస్తే నీరు బ్రహ్మాండంగా చల్లబడిపోయేది. ఇప్పుడెందుకో అవి యెక్కడా కనబడటం లేదు.

  • @మిత్రులు శ్యామలరావు గారు,
   మిమ్మల్ని చాలా కష్టపెట్టేసేను, క్షంతవ్యుడను.నాకు తెలిసి మీరుఅ చెప్పినది నూటికి నూరు పాళ్ళు నిజం. సయిన్స్ ను మనవారు జీవితానికి ఉపయోగించుకున్నారు. కాన్వాస్ గుడ్డ సంచులు మరి కొన్ని అటువంటి వాటిని ఫ్రిజ్ లు వచ్చి పీకనొక్కేశాయి.మళ్ళీ ప్రకృతికి దగ్గరగా బతికే రోజొస్తుందని ఆశ
   నెనరుంచాలి.

 6. good one. అందరికీ ఉపయోగకరమైన పోస్టు. science అంతా ప్రక్రుతిలోనే ఉంది శర్మగారూ. ప్రక్రుతిలో ఉన్నదానినే కనుక్కుంటారు.

  • @మిత్రులు కొండలరావు గారు,
   ప్రకృతిలోనే అంతా ఉంది. దానికి దగ్గరగా బతికితే బతుకు సుఖం లేకపోతే……ఇటువంటి వాటితో మన పూర్వీకులు బతుకు పండించుకున్నారు, మనం ఎండబెట్టుకుంటున్నాం,
   నెనరుంచాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s