శర్మ కాలక్షేపంకబుర్లు- పనసకాయ దొరికినప్పుడే………….

పనసకాయ దొరికినప్పుడే….………

పనసకాయ దొరికినప్పుడే తద్దినం పెట్టమన్నారు అని నానుడి.. ఇదేంటో నాకు అర్ధంకాలేదు నిన్నటి దాకా. ఈ మధ్య భాగవతం మూలం చదువుతూ పోతనగారు దానిని ఎలా చెప్పేరని బేరీజు వేస్తూ చదువుతున్నా. అదుగో అలా ఈ సమస్యకి పరిష్కారం దొరికింది.

ఆయనే విషువే కుర్యాద్వ్యతీపాతే దినక్షయే
చంద్రాదిత్యోపరాగే చ ద్వాదశీశ్రవణేషుచ…భా…స్కం7..అధ్యా..14..శ్లో..20

తృతీయాయాం శుక్లపక్షే నవమ్యామథకార్తికే
చతుసృష్వప్యష్టకాసు హేమంతే శిశిరే తథా…భా…స్కం7..అధ్యా..14..శ్లో..21

మాఘేచ సితసప్తమ్యాం మఘారాకా సమాగమే
రాకయా చానుమత్యావా మాసర్’క్షాణి యుతాన్యపి..భా…స్కం7..అధ్యా..14..శ్లో..22

ద్వాదశ్యామనురాధా స్వాచ్ఛ్రవణస్తిస్ర ఉత్తరాః
తిసృ ష్వేకాదశీవాఽఽసు జన్మర్’క్షశ్రోణయోగయుక్..భా…స్కం7..అధ్యా.14..శ్లో..23

ఆయనాలు,విషువత్తులు,వ్యతీ పాతదినం,దిన క్షయం,చంద్ర,సూర్య గ్రహణాలు,ధనిష్ట, అనూరాధ నక్షత్రాలతో కూడిన ద్వాదశి,వైశాఖ శుక్ల తదియ, కార్తీక శుక్ల నవమి, హేమంత,శిశిర ఋతువులలో వచ్చే నాలుగు కృష్ణాష్టములు, మాఘ శుక్ల సప్తమి,మఖా నక్షత్రం తో కూడిన పూర్ణిమ, మాస నక్షత్రాలతో కూడిన శుక్ల చతుర్దశి,పూర్ణిమలు, అనూరాధ,శ్రవణం,ఉత్తర ఫల్గుణి,ఉత్తరాషాఢ,ఉత్తరాభాద్రలతో కూడిన ద్వాదశి,ఉత్తర ఫల్గుణి,ఉత్తరాషాఢ,ఉత్తరాభాద్ర, జన్మ నక్షత్రము,శ్రవణములతో కూడిన ఏకాదశి,ఈ దినములలో పితృశ్రార్ధము చేయవలెను.

పిల్లి అంటే బిడాలంలా ఉంది, మీరు చెప్పింది, అంటారా ఆగండి! ఆయనాలు అంటే మకర సంక్రాంతి, కర్కాటక సంక్రాంతి దినాలు, విషువత్తులు అంటే రాత్రి పగలు సమానంగా ఉండే సంక్రాంతులు మేష, తులా సంక్రాంతులనమాట, వ్యతీ పాతం అంటే ఆదివారం అమావాస్య కలసివచ్చిన రోజు. దిన క్షయం సూర్యోదయం తరవాత వచ్చిన తిధి మరునాడు సూర్యోదయానికి ముందే అంతమయ్యే రోజు. గ్రహణాల రోజేంటండీ అంటే గ్రహణం అయిపోయిన తరవాత జరపచ్చు, వైశాఖ శుక్ల తదియ అదే అక్షయ తదియ, ఇప్పుడు బంగారం కొనుక్కుంటున్న రోజు, ఆ రోజు ఉదక కుంభ దానం, పితృ అర్చన చేయాలన్నారు, కార్తీక శుక్ల నవమి దీనిని అక్షయ నవమి అంటారు, హేమంత, శిశిర ఋతువులలో అనగా మార్గశీర్షం,పుష్యం, మాఘం, ఫాల్గుణమాసాలలో వచ్చే అమావాస్య ముందు అష్టమి దినాలు, మిగిలినవి తెలిసినవే కదా, అన్నట్లు మరచా మాస నక్షత్రాలతో కూడిన శుక్ల చతుర్దశి, పూర్ణిమలంటే, చిత్త,విశాఖ,జ్యేష్ట,పూర్వాషాడ, ఉత్తరాషాడ, శ్రవణం, పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర,అశ్విని, కృత్తిక,మృగశీర్ష,పుష్యమి, మఖ, పూర్వ ఉత్తర ఫల్గుణి నక్షత్రాలు కలసివచ్చిన శుక్ల చతుర్దశి, పూర్ణిమ రోజులు. ఇప్పుడు చెప్పినవి కాక ఆశ్వయుజమాసం లో పూర్ణిమ వెళ్ళిన మరురోజునుంచి అమావాస్య దాకా పదిహేనురోజులు పితృఅర్చన చేయమన్నారు. దీనినే పితృ పక్షం అని కూడా అంటారు. ఈ రోజులలో చేసే దానం విశేషఫలితాన్నిస్తుందని భాగవతం చెబుతోంది, ఆ రోజులలో పితృఅర్చన కూడా చేయమంటోంది.

మరి పనస కాయకి దీనికి లింక్ ఏంటండి అని కదా అనుమానం. పనసకాయ ఉత్తరాయణం లో మాత్రమే దొరుకుతుంది, సదా పనసకాయ ఎప్పుడూ దొరుకుతుందనుకోండి. పనసకాయ కూర అందునా ఆవ పెట్టిన కూర, నెయ్యి వేసుకుని తినాలని, ఆ రుచేవేరని అనుభవజ్ఞులు చెబుతున్నారు. మనం తినేవే పితృదేవతలకీ పెట్టాలట, మరందుకు పనసకాయ దొరికినపుడు కూర వండుకుంటాంకదా! పనిలో పని తద్దినం కూడా పెట్టేయ్యమన్నారు. ఉత్తరాయణం లో చేసే కర్మ విశేషఫలితమిస్తుందని చెప్పడమే దీని ముఖ్యోద్దేశంగా కనపడుతోంది.

ఆ వాళ్ళు తినొచ్చేరా! ఇదంతా కొంతమంది బతుకు తెరువుకు చెబుతున్న మాటనుకుంటే…….

సమయం వచ్చినపుడే దానిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పడానికి కూడా ఈ నానుడి వాడుతున్నాం.

ప్రకటనలు

13 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- పనసకాయ దొరికినప్పుడే………….

  • @ఆర్కాట్ వేంకట రమణ గారు,
   నా బ్లాగుకు స్వాగతం. మీరడిగిన ప్రశ్న అర్ధం కాలేదు. దయవుంచి వివరంగా అడగగలరు.
   దయ ఉంచండి.

  • వేంకటరమణగారూ, మీరు “హేమపాత్రాన్నం” అంటే యేమిటో వివరించమని అడిగారు. కాని “హేమపాత్రాన్నం” అనే మాట నాకు యీ టపాలో కనిపించలేదు. హేమం అంటే‌ బంగారం. పాత్ర అంటే గిన్నె. అన్నం‌ అన్న మాటకు అర్థం తెలిసిందే – ఇది సంస్కృతపదమైనా తెలుగ్వారికి నిత్యవ్యవహారంలోని మాటే. హేమపాత్రాన్నం అనే సమాసం యొక్క అర్థం బంగారు గిన్నెలోని అన్నం అని.

 1. శర్మ గారూ ,
  వేదాంత ధోరణి అంటే ఏమిటో వివరం గా తెలుప గలరు. వేదాంతం అనే పేరు ఎందుకు వచ్చింది ? వేదాంత ధోరణికీ , వేదాల చివర చెప్ప బడిన దానికీ ఏమైనా సంబంధం ఉందా ? సంసార సుఖాలు అనుభవిస్తూ కూడా వేదాంత ధోరణి తో జీవితం గడపడం సాధ్యమేనా ? అయితే అది ఎట్లా ?
  చాలా ప్రశ్నలు అడుగుతున్నాను కదా !? మీకు ఉషశ్రీ గారితో ఉన్న పరిచయం మననం చేసుకుని , పై ప్రశ్నలకు , ఒక టపాలో గానీ , వరుసగా గానీ మీరు చక్కగా, ధర్మ సూక్ష్మాలు తెలుప గలరనే నమ్మకం తో అడుగుతున్నాను !

  • @సుధాకర్జీ
   కాలక్షేపం కబుర్లు చెప్పుకుని బతికేస్తున్నా! మీరేమో వేదాంతం అంటున్నారు. నా జీవిత అనుభవం రాస్తా.
   దయ ఉంచండి.

   • సందేహ నివృత్తి కోసమే అడుగుతున్నానండీ !
    ఆచరణలో సున్నా మార్కులు వస్తాయేమో !

  • ఉపనిషత్తులు వేదమహావృక్షానికి చిగుళ్ళవంటివి. అవి బ్రహ్మజిజ్ఞాసను గురించిన సమాచారంతో నిండి ఉంటాయి. ఇవి అనేకానేకం. శ్రీశంకరులు కొన్ని ముఖ్యమయిన ఉపనిషత్తులకు భాష్యం చెప్పినారు. ఉపనిషత్తులు వేదశాఖలకు చివరన ఉండేవి కాబట్టి వాటికి వేదాంతాలని సమాహారంగా అవి ప్రతిపాదించే బ్రహ్మజ్ఞానానికి వేదాంతం‌ అనీ పేరు.

   మీ రెండవ ప్రశ్న దగ్గరకు వస్తాను. ఒకానొక ముని శ్రీనారదులవారిని అయ్యా, సాంసారికజీవనంలో ఉంటూ వేదాంతిగా ఉండటం‌ అసాద్యం కదా అని ప్రశ్నిస్తే ఆయన అవునూ కాకపోతే వనాలకుపోయి తపస్సు చేసుకొనే‌ మహామునులు వెఱ్ఱులు కారు గదా అని సమాధానపరచారట. మరియొక ఋషి నారదులవారితో అయ్యా సాంసారికజీవనంలో ఉంటూ వేదాంతిగా ఉండటం‌అసాద్యమా అని ప్రశ్నిస్తే ఆయన నవ్వి అదేమిటయ్యా యెందుకని అసాధ్యం, జనకాదులు గృహస్థులై కూడా మహా వేదాంతులై విదేహులని పేరు తెచ్చుకున్నారు కదా అన్నారట. ఈ‌ రెండు రకాల జవాబులేమిటని మరొకరు నారదులవారిని అడిగితే వారు అన్నమాట యేమిటంటే, నాయనా, దేహధారి యొక్క స్థితిని పట్టి యెలాగు ప్రశ్న వచ్చిందో‌ జవాబూ అలాగే వారి యొక్క సంస్కారవికాసానికీ విశ్వాసానికి అనుకూలంగా పురోభివృధ్ధికరంగా వస్తుంది సుమా అని. పిండితార్థం యేమిటంటే, అభ్యాసవైరాగ్యాల యొక్క పరిణామం యెంత ఉన్నదీ అన్నదానిని బట్టి దేహి సంసారిగా ఉంటూ బ్రహ్మజిజ్ఞాస చేయగలగటం‌ ఉంటుంది.

   • కృతఙ్ఞతలు శ్యామల రావు గారూ ,
    మరి బ్రహ్మ జ్ఞానం అంటే ఏమిటి ?
    ( దానికి ,ఎన్నో ఏళ్ళు తపస్సు చేయాలని మాత్రం శెలవీయకండి ! )

   • సుధాకర్‌గారూ బ్రహ్మ జ్ఞానం అంటే ఏమిటన్న ప్రశ్నకు జవాబు చెప్పటం సులభం కాదు. గుడ్డివాడికి పాలు యెలాగుంటాయీ అన్న ప్రశ్నకు సమాధానం యెంత చెప్పినా అది అతడికి అనుభవంలోనికి రాదు కదా? మామిడిపండు తీపిని గురించి అవి యెరుగని వ్యక్తికి యెంతవర్ణించినా ఆ మాధుర్యం అతడికి అనుభవం లోనికి రాదు కదా.

    అద్వైత సిథ్థాంతం ప్రకారం ఉన్నది ఒకే ఒకటి దానికి బ్రహ్మము అని సంజ్ఞ. అదే ప్రపంచంగా కనిపిస్తోంది. ప్రకృతిలో సర్వమూ బ్రహ్మము యొక్క అంశయే. చక్కెర నీటిలో అన్ని బిందువులలోనూ‌ చక్కర ఉన్నట్లే బ్రహ్మం అన్నిటా నిండి ఉంది. నిజానికి సర్వమూ‌ బ్రహ్మమే‌ కాబట్టి ప్రతివ్యక్తీ కూడా బ్రహ్మమే. కాని ఆ సంగతి అనుభవంలో‌ఉండదు. దానికి అవిద్య (తెలియలేక పోవటం) కారణం అని చెబుతారు. తానే‌ బ్రహ్మము అన్న సంగతిని అనుభవంలోనికి తెచ్చుకునే సాధనకు అవసరమైన విద్యయే వేదాంతం. తానే‌ బ్రహ్మము అని తెలిసిన వాడికి ఇక యే బంధమూ లేదు – అతడు ముక్తుడు అని పిలువబడుతాడు. ఇంతకీ ముక్తి అంటే అవిద్య నుండి విముక్తి సాథించి బ్రహ్మముగా నిలచి పోవటం. ఇంతకంటే క్లుప్తీకరించటం నా వల్లకాదు. స్వస్తిరస్తు.

   • చక్కగా వివరించారు, కృతజ్ఞతలండీ !
    ” అహం బ్రహ్మస్మి ” అన్న నానుడి విన్నట్టు గుర్తు !

 2. శర్మ గారూ ,

  నమస్తే ,

  భాగవతంలో వివరించారని , పితృ శ్రాధ్ధాలు పెట్టాలని కొన్ని దినములను తెలియచేశారు . వ్చనిపోయేవాళ్ళు ఆ దినములను చూసుకొని చనిపోరు కదా ! మరి వీళ్ళందరకు ఎప్పుడు ఆబ్దికం పెట్టాలి . వీళ్ళకు కూడా భాగవతంలో వివరించినట్లు ఆబ్దికములు పెట్టేటట్లైతే , ఆ సమయంలో కర్మలబ్రహ్మ గారు వచ్చి ఆ శ్రాధ్ధ కర్మలు చేయించి , 13 వ రోజున మాసికమని , ఇకనుంచి మాసం మాసం ఈ తిధినాడు మాసికాలు పెట్టాలని , మొదటి సంవత్సరం ముగిసే సరికి ఏడూడని , మీ వాళ్ళు పోయిన తిధి యిది అని , యిక ఈ ప్రతి సంవత్సరం ఈ మాసంలో , ఈ తిధి నాడు పెట్టాలని సూచించటం దేనికి ? సెలవీయగలరు .

  • ఆర్యా, పితృతిథులయందు ఆబ్దికం (సంవత్సరానికొక సారి) చేయటం విథి. పైన వివరించబడినవి విశేషతిథులు – వాటియందు పితృదేవతలకు తర్పణం విడవటం అనేది విశేషవిథి అనగా ప్రీతిపూర్వకంగా అదనంగా చేయవలసిన తిథివిశేషాలు అని.

  • @శర్మాజీ, శ్యామలరావుగారు,
   శ్యామల రావు గారు నా పని తేలిక చేసేరు. వారికి ధన్యవాదాలు. తిథి రోజు విధిగా ఆబ్దికం పెట్టాలి. ఇవి అదనం గా పెట్టతగ్గ రోజులు. ఇన్ని రోజులలో ఒక రోజయినా వెతుక్కుంటే దొరక్కపోతుందా? ఈ రోజు అమావాస్య పితృ తర్పణం చెయ్యచ్చు, అసలు మనసుండాలి.
   దయ ఉంచండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s