శర్మ కాలక్షేపంకబుర్లు- గుర్రం గుడెక్కింది.

horse

గుర్రం గుడెక్కింది.

పాలకొల్లులో ఉద్యోగం చేస్తున్న రోజులు. పెద్ద సబ్ డివిజన్ ఆవడంచేత అక్కడ ఐదుగురు జే.యి లం వుండేవాళ్ళం. ఉదయమే వచ్చి ఎవరి సెక్షన్ లో పని వారు చూసుకుని, ఖచ్చితంగా పదకొండు గంటలకి అందరం ఒక చోట చేరేవాళ్ళం, టీ తాగడానికి కబుర్లు చెప్పుకోడానికి. నలుగురు చేరితే కబుర్లకి లోటేమి, అందునా ఒక ఆఫీసులో ఒక బాస్ కింద పని చేస్తున్నవాళ్ళకి, మేనేజ్ మెంట్ లో వున్నవాళ్ళకి. బాస్ గురించిన జోక్ లు కాని మా కింద పని చేసేవాళ్ళ గురించి కాని, లేదా ఆ రోజునాటి సమస్య గురించికాని, లేదా ఎవరి సెక్షన్ లో నయినా వచ్చిన సమస్య గురించి కాని కబుర్లుండేవి.కబుర్లు చెప్పుకుంటూ టీ బంక్ దగ్గరకి చేరేవాళ్ళం. ఒక రోజు ఒకరి సెక్షన్ లో అనుకోని ఊహించని, వింత సంఘటన జరిగింది. అది అతను చెప్పేడు, సమస్యకి పరిష్కారం కావాలని సలహా అడిగేడనమాట. ఎవరికి తోచినది వారు చెప్పేరు. మాలో ఒక జే.యి జానకిరామారావనే స్థానికుడు, హాస్యప్రియుడు, ’గుర్రం గుడెక్కింది’ అన్నాడు. దాని అర్ధం ఏమిటో ఎవరికి పాలుపోలేదు. ఇక ఉండలేక, నేనే అడిగాను దాని విశేషం చెప్పమని, అప్పుడు మా జానకిరావుడు ఇలా చెప్పేడు.

మన పెద్ద గోపురం చూశారు కదా! ( పాలకొల్లు లో పెద్ద గోపురం అంటే శివాలయమనీ చిన్న గోపురం అంటే విష్ణ్వాలయమనీ వాడుక. దీనిని దాసరిగారు సినిమాలలో కూడా చెప్పేరు)ఒకప్పుడు ఆ గుడి మీదకి గుర్రమెక్కిందట అన్నాడు. మరీ అన్యాయంగా, కేబేజీ పూలు మా చెవుల్లో పెట్టేస్తున్నావురా! వింటున్నామని అన్నా. కాదు నిజమే చెబుతున్నా. ఇటువంటి సంఘటన ఇక్కడ జరిగిందట, అని చెప్పుకొచ్చాడు.

“అది ఆంగ్లేయులు మనని పరిపాలిస్తున్న సమయం, ఒక పెద్ద అధికారి జమాబందీకి వచ్చేడట, గుర్రం మీద. ఆ రోజుల్లో ఎంత పెద్ద అధికారి అయినా ప్రయాణ సాధనం గుర్రమే. జమాబందీ అంటే భూమి శిస్తు గురించిన రెవిన్యూ లెక్కల పబ్లిక్ ఆడిట్ లాటిది. అందులో ప్రజలు కూడా పాల్గొని తమ సాధకబాధకాలు చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఇది సాగుతోందనుకుంటున్నాను. రైతులందరూ ఆ సంవత్సరం పంట చివరిలో, ఒక్క రోజులో పాడయిందనీ శిస్తు రెమిషన్ ఇవ్వాలని అడిగారట, స్థానికంగా ఉన్న మునసబు, కరణాలు కూడా రైతుల మాటకి తల ఊపారు, పంట పాడయిందనీ చెప్పేరు. ఇది విని విని అధికారికి చిరాకొచ్చింది. సంవత్సరం అంతా బాగున్న పంట ఒక్క రోజులో పురుగు నాకేసినట్లయిందా? అది కూడా మీ ఒక్క గ్రామం లోనే అయిందా? చుట్టు పక్కల ఏ గ్రామం లోనూ జరగనిది మీ ఊళ్ళో జరిగిందా? ఇది నన్ను నమ్మమంటారా? నమ్మను గాక నమ్మను, శిస్తు రెమిషన్ ఇవ్వనన్నాడు. ఇది విన్న రైతులూ, గ్రామధికారులూ విస్తుపోయారు, ఇంత మంది ఏక కంఠంతో నెత్తీ నోరూ కొట్టుకుని చెబుతున్న దానిని ఆ అధికారి విననందుకు, ఆ అధికారి కాదంటున్నందుకు.

ఆ రోజుల్లో అధికారులు రాకపోకలు అన్నీ గుర్రాల మీదనే చేసేవారు. ఈ అధికారి కూడా అలా గుర్రం మీదనే వచ్చిన వాడవటం చేత, సాయంత్రం మవడం చేత అధికారి రహదారి బంగళాలో మకాం చేసేడు, రాత్రికి. గ్రామ నవుకరు గుర్రానికి కావలసిన గడ్డి తెచ్చి వేసి వెళ్ళిపోయాడు. అధికారి ఉదయమే వెళ్ళవచ్చనుకుని భోజనం చేసి పడుకున్నాడు. అధికారి ఉదయమే లేచాడు, కాలకృత్యాలు తీర్చుకుని ఫలహారం చేసి బయలు దేరుదామనుకునేలోగా ప్రజలంతా హడావిడిగా గుడి దగ్గరకి పరుగెడుతున్నారు. ఏమయిదంటే చెప్పేవారు లేరు, అంతా కంగారుగా పరుగుపెట్టేవారే! ఇది అధికారి దృష్టికీ వచ్చింది. ప్రయాణానికి గుర్రాన్ని సిద్ధం చేయమని గ్రామ నవుకరుకు దొర చెప్పేడు. గ్రామ నవుకరు చేతులు నలుపుకుంటూ నిలబడ్డాడు తప్పించి ఏమీ చెప్పలేదు. ఈ లోగా కొంత మంది ప్రజలు అసలు గుర్రం గుడి ఎలా ఎక్కిందంటావని చర్చిస్తుంటే దొర ఏమని ప్రశ్నిస్తే, ఎవరిదో గుర్రం గుడి మీద ఉందని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు గ్రామ నవుకరు గుర్రం కనపడటం లేదని నోరు విప్పాడు.దొరకి అనుమానం వచ్చింది, గుడి దగ్గర కెళ్ళేడు. గుడి మీదనున్నది తన గుర్రమే! ఇప్పుడు ఆశ్చర్య పోవడం దొర వంతయ్యింది. ఈలోగా గ్రామధికారులు, ప్రజలు అంతా చేరేరు. అందరిని వేధిస్తున్న ప్రశ్న గుర్రం గుడి ఎక్కింది,ఎలా? దింపడం ఎలా?

horse-1

ఇక్కడ గుడిగురించి చెప్పాలి తెలియనివారి కోసం. పంచారామాల గుడులన్నీ ఒకలాగే ఉంటాయి.దీర్ఘ చత్రురస్రాకార స్థలం. తూర్పు పడమరలు పొడుగు, ఉత్తర, దక్షిణాలు వెడల్పు ఉంటాయి. అందులో పడమర భాగంలో శివాలయం ఉంటుంది. ప్రాకారంగోడకి ఆనుకుని లోపలికి డాబాలాగా పది పన్నెండు అడుగుల వెడల్పున ఉంటుంది.తూర్పు వైపు ప్రాకార మధ్యలో గోపురం ఉంటుంది. ఈ గోపురాన్ని చేరి ఈ డాబా లాటిది ఉంటుంది. ఇందులో పరివార దేవతలుంటారు. అదిగో అటువంటి పరివార దేవతలున్న డాబా మీద గుర్రం చక్కర్లు కొడుతోంది.

అసలు గుర్రం గుడి ఎలా ఎక్కిందంటారు? మీకేమయినా తెలిస్తే చెప్పండి గుర్రం గుడెలా ఎక్కిందో! ఎలా దించాలో!!
మీరు చెప్పలేకపోతే రేపటి టపాలో వివరం.

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- గుర్రం గుడెక్కింది.

  1. ఇందులో పెద్ద రహస్యమేముంది?శర్మగారు రాసినట్లు ఆ వూరి వాళ్ళే గుర్రాన్ని గుడిపైకెక్కించి ,ఆఫీసరుని లొంగదీసుకొనిఉంటారు.

  2. శర్మ గారూ ,

    నమస్తే .

    ఒక్క రోజులో పాడయిందనీ శిస్తు రెమిషన్ ఇవ్వాలని అడిగారట, స్థానికంగా ఉన్న మునసబు, కరణాలు కూడా రైతుల మాటకి తల ఊపారు, పంట పాడయిందనీ చెప్పేరు. ఇది విని విని అధికారికి చిరాకొచ్చింది. సంవత్సరం అంతా బాగున్న పంట ఒక్క రోజులో పురుగు నాకేసినట్లయిందా? అది కూడా మీ ఒక్క గ్రామం లోనే అయిందా? చుట్టు పక్కల ఏ గ్రామం లోనూ జరగనిది మీ ఊళ్ళో జరిగిందా? ఇది నన్ను నమ్మమంటారా? నమ్మను గాక నమ్మను, శిస్తు రెమిషన్ ఇవ్వనన్నాడు.

    అందుకని రైతులు రౌతులై గుఱ్ఱాన్ని గుడి ఎక్కించి , ఇంతవరకు ఏ ఊళ్ళో ఏ గుఱ్ఱం గుడి ఎక్కలేదు , ఇది కూడా మా ఒక్క ఊళ్ళోనే జరిగింది , మరి మీరు నమ్ముతారా ? అన్న ప్రశ్న వేస్తున్నట్లుగా కాకుండా వేశారని నేను అనుకొంటున్నాను . అపుడు ఆ పెద్ద అధికారి శిస్తు రెమిషన్ కి అంగీకరించి వుంటాడని భావిస్తున్నా . ఎపుడైనా , ఎవడైనా చెప్పింది , వినక , నమ్మక వున్నప్పుడు ఈ సామెత వాడిని దారికి తీసుకు రావటానికి బాగ ఉపయోగించవచ్చు .

    వివరంగా

  3. అక్కడేమో ఎస్ చందూ గారు సౌగంధిక అంటూ సస్పెన్స్ పెట్టి ఆతురత తో వచ్చే టపా కోసం నిరీక్షించ మంటున్నారు, ఇక్కడేమో మీరు గుర్రాన్ని గుడి ఎక్కించి వేచి చూడుడు అంటున్నారు !

    అబ్బా, ఇట్లా బ్లాగు లోకం సస్పెన్సు లోకమై పోతూంటే గెట్లాస్మీ ??

    గుడి గుర్రం క్రిందికి వచ్చిందేమో అని నా అనుమానం !

    జిలేబి

    • @జిలేబీ గారు,
      గుప్పిట మూసి ఉంచితే రహస్యం. ఏదయినా మూసి ఉంచితేనే బాగుంటుందండి, బహిరంగ ప్రదర్శన బాగోదు కదండీ 🙂
      నిజం కదూ! గ్లాసులో సగం నీళ్ళున్నాయంటే సగం గ్లాసు ఖాళీ కదా! అలాగే గుర్రం గుడి మీదుంటే గుడికిందున్నట్లేగా 🙂
      దయ ఉంచండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s